Menu

థ్రీ (3)

కొలవెరి డి” పాటతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాగా కూడా గత కొన్నాళ్ళుగా అందరినోటా వినిపిస్తోన్న “3(థ్రీ)” సినిమా గత వారం విడుదలైంది.

’3’ సినిమా పేరుకు తగ్గట్టుగానే రామ్ (ధనుష్) మరియు జనని (శృతి హాసన్) అనే యువజంట జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ అంశాల కలబోతే ఈ సినిమా కథ. మొదటి దశ లో రామ్ ఇంటర్మీడియట్ చదువుతుండగా జనని ని చూసి ఇష్టపడి ఆమె వెంటపడడం, చివరికి ఆమె కూడా ఇతనంటే ఇష్టపడటంతో ముగుస్తుంది. రెండో దశలో రామ్-జననిలు పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఇంట్లో వారిని ఒప్పించడం, చివరికి పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది. ఈ కథ ఎన్ని సార్లు తీసినా, చెప్పే విధానం బావుంటే ప్రేక్షకులు ఎన్ని సార్లైనా చూడడానికి సిద్ధమే. కానీ ఈ సినిమాలో కీలకమైన మూడో దశ లోనే అంతా తారుమారైపోయింది; దర్శకుడు ఏడిపించాలనుకున్న చోట ప్రేక్షకులు నవ్వుకోవడం, నవ్వించాలనుకున్న చోట ఏడవడం జరిగి చివరికి నవ్వులపాలైంది.

మొదటి సీన్లోనే రామ్ చనిపోవడం చూపించేసి, అక్కడ్నుంచి సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాగుతుంది. ఇక్కడే సినిమాలో పెద్ద తప్పు జరిగిపోయింది. ఒక వ్యక్తి చనిపోయాడు; అతని భార్యకు అతనెందుకు చనిపోయాడో కారణాలు తెలుసుకోవాలనుకుంటుంది. ఇలాంటి కథ ఎన్నుకున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కథ ఎక్కడ మొదలుపెట్టాలో తెలిసుండాలి. లేదంటే ’నిన్న రాత్రి ఏం జరిగింది?” అని అడిగిన ప్రశ్నకు, “1980 లో ఒక అర్థ రాత్రి పూట, హోరున వర్షం కురుస్తుండగా నేను పుట్టాను” అనే దగ్గర కథ మొదలైతే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టే. రాం చనిపోయిన కారణాలు తెలుసుకోవడానికి జనని చేసే ప్రయత్నాల్లో సినిమా లో సగానికి పైగా జ్ఞాపకాలు నెమరువేసుకోవడంలోనే సరిపోతుంది. నిజానికి ఈ జ్ఞాపకాలకు సంబంధించిన సన్నివేశాల్లో ధనుష్, శృతి హాసన్ లు ఇంటర్మీడీయట్ విద్యార్థులుగా కనబర్చిన నటన కానీ, ఈ సన్నివేశాలు రూపొందించడంలో ఐశ్వర్య చూపించిన ప్రతిభ కానీ మెచ్చుకోదగ్గవే! కానీ సినిమా సగానికి పైగా అయిపోయినప్పటికీ అసలు ఈ సినిమా దేని గురించో తెలియక అసహనంగా కదుల్తున్న ప్రేక్షకులకు, కథ అనుకోకుండా యూ టర్న్ తీసుకోవడం ద్వారా,ఇంటర్వెల్ తర్వాత దారి మరిచిపోయి ఇంకో హాల్లో కి వచ్చామా అనుకునేలా చేస్తుంది. అంతే కాదు సంచలనం సృష్టించిన ’కొలవెరి డీ’ పాట కోసం ఆతృతగా వేచి చూసిన ప్రేక్షకులకు, ఆ పాట కూడా రాంగ్ టైం లో వచ్చి చిరాకు తెప్పిస్తుంది.

కథా పరంగా చూస్తే ’3′ సినిమాలో పెద్ద లోపమేదీ లేదనే చెప్పాలి. గతంలో మణిరత్నం తీసిన ’సఖి’ సినిమాలానే ఈ సినిమా ప్రథమార్థం సాగుతుంది. అలాగే ఈ సినిమా ద్వితీయార్థం అంగ్ల సినిమా అయిన ’బ్యూటిఫుల్ మైండ్’ మరియు మళయాళ సినిమా ’తన్మాత్ర’ ని గుర్తు చేస్తాయి. ’3′ లో ఎంచుకున్న కథతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి; అవి ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకున్నాయి. అయితే ఈ సినిమాలో జరిగిన తప్పల్లా స్క్రీన్ ప్లే లోనే ఉంది. ముందే చెప్పుకున్నట్టు ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ కలిగిన ఒక భార్యా భర్త; ఇంతలో భర్తకు తీవ్రమైన జబ్బు సోకింది.ఈ విషయం భార్యకు చెప్పలేక తనలో తనే కుమిలిపోయే భర్త, అతనెందుకు అలా బాధపడుతున్నాడో అర్థం చేసుకోలేని భార్య ల మధ్య వచ్చిన కథగానో లేక పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకుని, కొన్నాళ్ళు సుఖంగా ఉండి, మధ్యలో మనస్పర్థలు ఏర్పడి విడిపోయే వరకూ వచ్చి చివరకు తల్లిదండ్రులను ఒప్పించడమే కాకుండా తమ జీవితాన్నీ చక్కదిద్దుకోవడమనే కథగానైనా సరే ’3′ సినిమాని ప్రేక్షకులు ఆదరించి ఉండేవాళ్లేమో! కానీ అటూ ఇటూ కాకుండా కథ అది సగం-ఇది సగం అవడంతో మొత్తానికే మోసం జరిగింది. ఇది వరకు వచ్చిన మరో తమిళ్ సినిమా 180 లోనూ దర్శకుడు దాదాపు ఇదే తప్పు చేయడం అటు ఇటు కాని కథతో ప్రేక్షకులను కన్విన్స్ చెయ్యలేకపోయాడు.

గత పది సంవత్సరాలుగా విషాద ప్రేమ కథలు సృష్టించడంలో తమిల్ వాళ్లు బాగా ముదిరిపోయారు. కానీ అలాంటి విషాద ప్రేమ కథల్లో సైతం ద్వితీయార్థంలో జరగబోయే విషాదానికి ప్రథమార్థంలో ఎంతో కొంత పునాదులు వేసి, ప్రేక్షకులను ఎంతో కొంత సిద్ధం చేసిన సినిమాలే విజయవంతమయ్యాయి. అంతే కానీ అప్పటివరకూ బాగా నడిచిన ప్రేమ కథ లో విషాదం పుట్టించడానికి హీరోకో హీరోయిన్ కో దేవుని అదృశ్య హస్తం ద్వారా ఏదో మాయరోగం కలిగించడం చేస్తే ప్రేక్షకులు క్షమించరనేది ’3′ సినిమా చూసి తెలుసుకోవచ్చు.

ఏదేమైనప్పటికీ గత మూడు నాలుగు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, తెలుగు, తమిళ్, హిందీ తో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడ్డ కారణంగా ఈ సినిమాకున్న బిజినిస్ పొటన్షియల్ చాలా పెద్దది. కనీసం ఆ విషయం గ్రహించైనా ఈ సినిమాని ఒక యావరేజ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తీసున్నా భారీ హిట్ అవడానికి అవకాశం ఉండేది. ముఖ్యంగా ’కొలవెరి డీ’ పాట ద్వారా ఇదేదో ’కంటెంపరరీ’ ప్రేమ కథా చిత్రమనే భావన ప్రేక్షకుల్లో ముందే కలిగించారు. అలాంటప్పుడు అందరి అంచనాలకు భిన్నంగా రొమాంటిక్ కామెడీ గా మొదలైన సినిమా ని ట్రాజెడీగా మార్చి నవ్వులపాలయ్యారు; ట్రాజెడీ సినిమాలో ప్రేక్షకులకు ఫ్రీ గా కామెడీ చేసి నవ్వుకుంటున్నారు.