Menu

విద్యా (బాగ్చీ) + విద్యా (బాలన్) = నేషనల్ అవార్డ్… అదీ “కహానీ”

గుప్పిట మూసి వుంచితే మిస్టరీ. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం థ్రిల్లర్. కాని ఇలాంటి కథల్లో ఒక చిక్కు వుంది. గుప్పిట తెరవగానే అప్పటిదాకా థ్రిల్ కి గురైన ప్రేక్షకులే “ఓస్ ఇంతేనా” అంటూ పెదవి విరిచేస్తారు. లేదా పొరపాటున ఎక్కడైనా Loose Ends దొరికిపోతే “నాకర్థమై పోయిందోచ్” అంటూ అరిచేస్తారు. అలా దొరికీ దొరక్కుండా, విప్పీ విప్పకుండా అనుక్షణం Thrill Ride ఇవ్వగలిగిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యం, ఆద్యంతం కట్టిపడేసే Top Class థ్రిల్లర్/మిస్టరీ సినిమా “కహానీ”

మిస్టరీ సినిమాకి కథ ఎంత ముఖ్యమో కథనం కూడా అంతే ముఖ్యం. నిజానికి కథనమే అన్నింటికన్నా ముఖ్యం. ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న దర్శకుడు సుజోయ్ ఘోష్ కథమీద, కథనం మీద పూర్తి కసరత్తు చేసి, కష్టపడిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంత కష్టపడి చేసిన కథకి విద్యాబాలన్ లాంటి నటి తోడైతే ఇక ఆ సినిమా స్థాయి ఎలా వుంటుందో చెప్పే పనేముంది. నిన్నా మొన్నటి “డర్టీ” విద్య ఇప్పుడు విద్య బాగ్చీ అనే ఏడు నెలల గర్బిణిగా కొత్త అవతారం ఎత్తింది. మొన్నీమధ్యే గత సంవత్సరానికిగాను జాతీయ అవార్డు అందుకున్న ఈమె ఈ సంవత్సరానికి కూడా అవార్డు రిజర్వ్ చేసేసుకున్నట్లే కనిపిస్తోంది. అంత అద్భుతంగా వుంది ఆమె నటన.

మిస్టరీ సినిమాకు ప్రాణం కథే కాబట్టి ఆ వివరాలు చెప్పడం సబబు కాదేమొ. అయినా ఇప్పటికే ట్రైలర్ ద్వారా అందరికీ తెలిసిన కథ మళ్ళీ మీ ముందు ప్రస్తావిస్తాను. విద్యా బాగ్చీ అనే ఏడు నెలల గర్భిణి “అదృశ్యం” అయిపోయిన భర్త కోసం వెతుక్కుంటూ లండన్ నుంచి దసరా సంబరాలలో వున్న కోలకతా నగరానికి వస్తుంది. అక్కడ పోలీసులతో మొదలైన ఆమె అన్వేషణ ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో, నవరాత్రులు ముగిసే సరికి ఎక్కడిదాకా వెళ్తుందో తెరపై చూడాల్సిందే.

చాలా (అద్భుతమైన) మిస్టరీ కథల్లోలాగే ఇందులో కూడా బోలెడు ఆధారాలు (Clues) వున్నాయి. అయితే మనం కనిపెట్టేశామనుకున్న ఆధారాలన్నీ పనికిరానివనీ, మనం పనికిరావని వదిలేసిన/మర్చిపోయినవి అన్నీ కీలకమైనవనీ చివర్లొ తెలియటం చెప్పుకుకోదగ్గ దర్శకుడి విజయం అయితే, సామాన్యంగా థ్రిల్లర్ సినిమాలో తేలిపోయే క్లైమాక్స్ బదులు ఇందులో ఊహకి అందని అద్భుతమైన మలుపు వుండటం మరో ఘనవిజయం. ఈ రెండు కారణాలవల్ల ఈ సినిమా extraordinary (బహుశా Trendsetting) సినిమాగా రూపుదిద్దుకుంది.

సేతు సినిమాటోగ్రఫీతో కలకత్తా నగర జీవితం మన ముందుకు వస్తే, నమ్రతారావ్ ఎడిటింగ్ ఫలితంగా సినిమా ఎక్కడా ఎలాంటి ఎడిదుడుకులు లేకుండా సాగిపోయింది.

విద్య విమానాశ్రయం బయటికి వస్తున్నప్పుడే ఆమె ఆహార్యం, ముఖ్యంగా ఆమె నిండు గర్భిణి అన్న విషయం తెలియగానే చూస్తున్న ప్రేక్షకుడికి మనసులో ఎక్కడో ఒక చిన్న వణుకు పుడుతుంది. అంతటి గర్భిణి కోలకతా ఇరుకు సందుల్లో, కరకు మనుషుల్లో తిరుగుతుంటే అయ్యో అనిపిస్తుంది. ఆమె ఎక్కడో జారి పడబోతే, ఇంకెవరో ఆమెను తోసేస్తే మన గుండె కిందకి జారుతుంది. అలాంటి పాత్ర, అలాంటి నటన మనసులో నిలిచిపోతుంది. అది విద్య (బాగ్చీ), విద్య (బాలన్) ల గొప్పదనం.

కవి బొల్లోజు బాబాగారు ప్రస్తావించిన కవిత ఒకటి గుర్తుకువస్తోంది.

నెలలు నిండిన స్త్రీని చూస్తే
మగవాడికి భయమో, జలదరింపో!
బహుశా స్త్రీ ముందు తన
అస్థిత్వమేమిటో గుర్తొస్తుందేమో

ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా దర్శకుడు ప్రతిభావంతంగా వాడుకున్నాడనిపిస్తుంది. ఆ వివరాలు చెప్పటం కన్నా గుప్పిట మూసి వుంచడమే కరక్టేమో..!! అందుకే ఇక్కడ విరమిస్తున్నా… చూడతగ్గ సినిమా… చూడాల్సిన సినిమా…!!

 

చిత్రం: కహానీ

నటీనటులు: విద్యబాలన్, పరంబత్ర ఛటర్జీ, శాశ్వత ఛటరీ

సంగీతం: విశాల్ – శేఖర్

దర్శకత్వం: సుజోయ్ ఘోష్

విడుదల: 09 మార్చి 2012

8 Comments
  1. rahul March 10, 2012 /
  2. priyanka March 10, 2012 /
  3. RAMNV March 15, 2012 /
  4. satish March 15, 2012 /
  5. సందేహ ప్రాణి March 16, 2012 /
  6. హెర్క్యులెస్ March 18, 2012 /
  7. రవి March 30, 2012 /
  8. kishore raja anumula June 8, 2012 /