కథే ప్రాణంగా ’కహాని’

ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని పరిష్కారాన్ని యుగయుగాలుగా వేళ్ళూనుకుపోయిన ఒక విశ్వాసంలో నిలుపుతూనే, సార్వజనీనత కోల్పోకుండా ఒక కథ చెప్పటం కత్తి మీద సాములాంటిది. అవినీతి, ఉగ్రవాదం మొదలైన సమకాలీన సమస్యలతో వచ్చిన సినిమాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నంగా నిలిచిపోయే సినిమా ఇవ్వాళ నేను చూశాననే నాకనిపిస్తుంది. ఆ సినిమా, బాలీవుడ్ తాజా విడుదల – ’కహాని’.

ఇదో థ్రిల్లర్ సినిమా. మొదటి నుండి చివరి దాకా ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకునికి తెలుస్తూనే ఉన్నా, అలా ఎందుకు జరుగుతుందో (అంత త్వరగా) అంతుబట్టదు. నాకు సినిమా పరిజ్ఞానం సూన్యం కాబట్టి, ఇదో గొప్ప థ్రిల్లర్ కథా? అని అడిగితే చెప్పలేను కానీ, చూసినంత సేపు ప్రేక్షకులని కట్టిపడేసింది అని మాత్రం చెప్పగలను. బహుశా, ఆలోచించుకోడానికి కాస్త వ్యవధి ఇస్తే ప్రేక్షకుడు ట్విస్టులను కనిపెట్టేసేవాడేమో గానీ, అలా ఆలోచించే తీరికనివ్వకుండా కథనం వడివడిగా సాగింది. ఒకదాని తర్వాత ఒకటి వేగవతంగా జరిగిపోవటం వల్ల, పైగా కథలోని పరిస్థితులు, మనుషులలో సంక్లిష్టతల పాళ్ళు కొంచెం ఎక్కువ కావడం వల్ల కూడా కథలోని మలుపులన్ని ఆకట్టుకునేలా అనిపించాయి. ఇంతకీ కథ ఏంటంటే..

లండన్ నుండి ఏడు నెలల గర్భవతి అయిన విద్యా బాఘ్‍జీ (విద్యా బాలన్) కలకత్తాకు చేరుకుంటుంది. ఏర్‍పోర్టు నుండి నేరుగా పోలీస్ స్టేషన్‍కు వెళ్ళి, ’రెండు వారాల సాప్ట్-వేర్ అసైన్‍మెంట్‍కని మా ఆయన కలకత్తాకి వచ్చారు. మొదటి రెండు వారాలూ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ తర్వాత నుండి ఆయన ఆచూకి తెలీటం లేదు.” అంటూ తన భర్త ఊరూ, పేరూ, ఉద్యోగం వివరాలన్నీ ఇస్తుంది. పోలీసులు ఆమె కథనం మేరకు దర్యాప్తు మొదలుపెడతారు. అయినా విద్యా భర్త జాడ తెలీదు. పోలీసులు చేతులెత్తేయడానికి సిద్ధపడతారు. విద్య అంత తేలిగ్గా వదలదు. ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఆమెకు ఒక పోలిస్ సహాయం చేస్తూ ఉంటాడు. వారిద్దరూ కల్సి విద్య భర్త ఏ అసైన్‍మెంట్ కోసం ’నేషనల్ డేటా సెంటర్’ కోసం వచ్చారో ఆ డిపార్ట్-మెంట్ హెచ్.ఆర్‍ని కలుస్తారు. ముందు, ఆ వివరాలతో ఎవరూ ఇక్కడ పనిజేయలేదని చెప్పిన హెచ్.ఆర్, ఒక రోజు వ్యవధి తీసుకొని విద్య భర్తను పోలిన మనిషి ఒకడు పనిజేసేవాడని వివరాలు అందిస్తుంది. ఆ రాత్రే ఆమె హత్యకాబడుతుంది. హెచ్.ఆర్ ఇచ్చిన వివరాలు ప్రకారం విద్య భర్తను పోలిన మనిషి, రెండేళ్ళ ముందు కలకత్తా మెట్రోలో విషవాయువు ప్రయోగించి, వందల కొద్దీ ప్రజలు మరణించటానికి కారకుడు!

చూస్తూ చూస్తూ ఉండగానే, కథలు పొరలు పొరలుగా సంక్లిష్టతను ఏర్పర్చుకుంటుంది. సమస్య జటిలైపోతూ ఉంటుంది. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అంతుపట్టదు. చివరి ఐదు, పది నిమిషాల వరకూ కథ ముగింపుకు నాలుగైదు possible endings అతికినట్టు సరిపోతాయి అనే అనిపిస్తుంది. (ఆఖరి బాల్‍లో గానీ గెలుపా? ఓటమా? టై? డ్రా? అన్నీ సంభవమే అన్నప్పుడు ఉండే ఉత్కంఠత). అనూహ్యమైన మలుపు తిరిగాక కూడా, ఆ మలుపుకి తగ్గ కారణాలు వెతకడానికి సమయం పడుతుంది. అయితే నరేషన్‍లో ఉన్న కీలకం ఏంటంటే, అంతగా సంక్లిష్టతను పెంచుకుంటూ వచ్చి, చివర్న మాత్రం కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ ముడులన్నీ విప్పేయటంలో సఫలీకృతమైయ్యారు. ప్రేక్షకుల మెదడులో ఉన్న ప్రశ్నలన్నింటికి తగిన సమాధానాలు అప్పటిదాకా చూపించిన చిన్నచిన్న అంశాలనే వాడుకున్నారు.

భర్త ఆచూకీ తెలీకపోవడం, అతడి కోసం మొక్కవోని ధైర్యంతో భార్య వెదకటం, ఆమె పట్టుదలకి పోలీసులూ తలవొగ్గడం, ఆ పై భర్త శవాన్ని గుర్తుపట్టమంటూ మార్చురికి తీసుకెళ్ళటం వంటివన్నీ క్షణకాలం సేపు ’రోజా’ సినిమాను గుర్తుతెప్పించినా, అది అక్కడే ఆగిపోతుంది. రానురాను కొత్త లోతుల్ని సంతరించుకుంటూ, కొత్త మలుపులు తిరుగుతూ వడివడిగా ప్రవహిస్తుంది కథనం. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయమేమిటంటే, కథలో అంతర్భాగమైన పాత్రలూ, పరిస్థితులు, స్థలాలు అన్నీ ఒకదానికి ఒకటి దోహదపడుతూ కథాప్రవాహంలోని ఉదృతిని పెంచాయి. ఉదాహరణకు, ఈ కథను కలకత్తాలో కాకుండా ఏ ముంబై నగరంలో కూడా చూపించవచ్చు. కానీ అప్పుడు, కథను కూడా మార్చాల్సివస్తుంది. కలకత్తా నగరానికి ఉన్న వ్యక్తిత్వమో / ఆత్మో / అలాంటిదేదో, దాన్ని కథలో చక్కగా ఇమిడ్చారు. కలకత్తాను చాలా అందంగా చూపించారు. అందులోని చీకటినీ, చెడునీ కూడా చూపించారు. దసరా రోజుల్లో దేద్దీప్యంగా వెలిగిపోయే నగరాన్ని చూడాల్సిందే! కలకత్తా మీద ఉన్న పాట బాగుంది కానీ, మరీ బాగోలేదు. (ఢిల్లీ-6లో ఢిల్లి మీద ఉన్నంత బాగనిపించలేదు ఈ పాట.) సందర్భోచితంగా వినిపించే ఒకట్రెండు బెంగాళీ పాటలు తప్పించి, అనవసరంగా పాటలను జొప్పించలేదు. నేపధ్య సంగీతం కథకు చక్కగా సరిపోయింది.

కథాబలం ఉన్న సినిమా కాబట్టి, ఒక మోస్తరు నటన చేయగలిగిన నటీనటులున్నా సరిపోతుందేమో! కానీ ఈ చిత్ర యూనిట్‍కు విద్యా బాలన్ దొరికింది. హిందిలో ’సోనె పె సుహాగా’ అంటారుగా, అలాగ అన్న మాట. ప్రస్తుతపు బాలీవుడ్ నాయికల మధ్యనైతే విద్యాకు ఒక ప్రత్యేక స్థానం ఉందనటంలో అనుమానమే లేదు. ఆమె మరికొన్ని సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటే, బహుశా, బాలీవుడ్ చాన్నాళ్ళ వరకూ గుర్తుంచుకునే నటిగా మిగిలిపోతుందనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె విలక్షణ నటనను కనులారా చూసుకునే అవకాశం ఉంది. సినిమా మార్కిటింగ్ ఆమె స్టార్ ఫాక్టర్ మీద ఆధారపడితే (ఆమె తప్ప మరో చెప్పుకోదగ్గ కాస్ట్ లేరిందులో. అందరూ బా చేశారు, అది వేరే విషయం.), కథాపరంగా కూడా సినిమాకు ఆమె పాత్రే కేంద్రబిందువు. ఆ భాద్యతను చక్కగా నిర్వర్తించింది. కంటికింపుగా చక్కని నటనతో అందరిని ఆకట్టుకుంది.

ఈ సినిమాలో నాకు అన్నింటికన్నా ఎక్కువగా నచ్చిన అంశం, అన్యాయాన్ని, అక్రమాన్ని అంతమొందించటానికి ఏదో ఒక శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుందని, ఆ శక్తి చేయాల్సిన పనిని చేసి నిష్క్రమిస్తుందని ఒక నమ్మకం కదా! అలా దుష్టశిక్షణలు, శిష్టరక్షణలు చేసిన ఎన్నో అవతారాల కథలను చెప్పుకుంటూనే ఉంటాం కదా! ఆ విశ్వాసాన్ని బేస్‍గా చేసుకొని ఒక సమకాలీన సమస్య ఎలా పరిష్కరించబడిందో చూపించిన తీరు నాకు నచ్చింది. సమస్యలకు పరిష్కారాలు ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి వాలవు. వాటిని పరిష్కరించటానికి కంకణం కట్టుకున్న వారి నమ్మకాల్లో నుండి, వారి పట్టుదలల నుండి వస్తాయి. ఆ పరంగా చూస్తే, ఇది అచ్చమైన స్వచ్చమైన భారతీయ సినిమా. బహుశా, దేశకోసం, ప్రజారక్షణకోసం నేలకొరిగిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ’కహాని’లు ఉంటాయేమో. అందులో చాలా వరకూ మనకి చేరవు కదా!
(ఈ పేరా మొత్తం నా విశ్లేషణ. My interpretation! That’s all! :) )

అక్కడక్కడా గూఫ్స్ ఉండకండా ఉండవు. ముఖ్యంగా చాలా విషయాలు ఒక్కసారిగా జరుగుతున్నట్టు చూపించటం వల్ల పొరపాట్లకు అవకాశం ఉండనే ఉంటుంది. తీరిగ్గా కూర్చొని కథను విశ్లేషిస్తే లోపాలు దొరకవచ్చునేమో! అలాంటివి కొన్ని ఉన్నా, నా మట్టుకు నాకు, చాలా నచ్చింది సినిమా. చిక్కటి కథ. పదునైన కథనం. మంచి నటీనటులు. చక్కని సాంకేతిక సహాయం. విభిన్న కథాంశం. ఓ రెండు గంటలు కేటాయించగలిగితే చూడదగ్గ సినిమా.  Such a well-told story is such a rarity in our movies! If you’re a story lover, don’t miss this.