Menu

హంగర్ గేమ్స్

మీరు పుస్తకాల పురుగయితే ఈ పాటికి మీరు “హంగర్ గేమ్స్” గురించి వినే ఉంటారు. పిల్ల బచ్చాగాళ్ల కోసం రాసిన ట్వైలైట్ సీరీస్ తర్వాత అంత పెద్ద పాపులారిటీ పొందిన బుక్స్ గా ఈ హంగర్ గేమ్స్ సీరీస్ ని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాల ఆధారంగా రూపొందించిన “హంగర్ గేమ్స్” సినిమా చూడడానికి నిన్న సినీ మాక్స్ కి వెళితే అక్కడంతా ఈ పిల్ల బచ్చాగాళ్లే. అంతే కాదు, సినిమా అయిపోయాక విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి బాగానే హడావుడి చేశారు.

మీరు ప్రపంచ సినిమా ని ఫాలో అయ్యే వాళ్లయితే ఈ సినిమా కథ చెప్పక్కర్లేదు. మీకు అప్పుడెప్పుడో జపాన్ లో వచ్చిన “బాటిల్ రాయల్” సినిమా లాగే ఉంటుంది అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ పుస్తకం తెలిసిన వాళ్లకూ, బాటిల్ రాయల్ చూసిన వారికోసమే కాకుండా సాధారణ ప్రేక్షకులందరి కోసం “హంగర్ గేమ్స్” సినిమా ని సమీక్షించదలచాను కాబట్టి కథ గురించి చెప్పుకోవడం అవసరం.

ఎప్పుడో తెలియదు కానీ భవిష్యత్ లో ఎప్పుడో….ప్రపంచం అంతమైపోయింది. మిగిలిన కొద్ది మంది మాత్రం పన్నెండు డిస్ట్రిక్స్ లో జీవిస్తుంటారు. వీళ్లందరినీ పరిపాలించే వారు క్యాపిటల్ లో ఉంటుంటారు. అయితే గతంలో ఎప్పుడో అంటే బహుశా మన కథ జరిగే సమయానికి ఎనభై ఏళ్ళముందు ఈ డిస్ట్రిక్స్ లో ఉండే వాళ్లందరూ క్యాపిటల్ మీద తిరుగుబాటు ప్రకటించి ఉంటారు. ఆ తిరుగుబాటు ని ప్రభుత్వం అణిచివేస్తుంది. అంతే కాకుండా ఇలాంటి తిరుగుబాటు మరోసారి జరగకుండా, అప్పటి తిరుగుబాటుని ప్రజల మదిలో గుర్తుండిపోవడానికి అప్పట్నుంచి ప్రతి సంవత్సరం హంగర్ గేమ్స్ ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ హంగర్ గేమ్స్ నియమాల ప్రకారం ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇద్దరిని (ఒకమ్మాయి, ఒకబ్బాయి) ఎన్నుకుని మొత్తం ఇరవై నాలుగు మందిని ఈ పోటీకి ఎన్నుకుంటారు. ఈ ఇరవై నాలుగు మందిలో చివరికి ఒకరు మాత్రమే విజేత; అలా విజేతగా నిలవాలంటే మిగిలిన 23 మంది అప్పటికి చనిపోయిఉండాలి. అంటే ఇది మన ఇండియన్ ఐడల్ లాంటి రియాలిటీ షో అన్నమాట. ఈ 24 మంది ఒకర్నొకరు చంపుకుంటూ ఎవరు చివరికి విజేతగా మిగిలారు అనేది కథ.

వినడానికి బాబోయ్ అనిపించినా ఇది అంత హింసాత్మకమైన చిత్రం కాదు. పైకి ఇదేదో ఫ్యూచర్ లో సెట్ చేసిన రియాలిటీ షో లా అనిపించే ఈ సినిమా మొదటి సగం హంగర్ గేమ్స్ కోసం మెంబర్స్ ని ఎన్నుకోవడం, వారి ట్రైనింగ్ లాంటి విషయాలతో నిండి ఉంటుంది. నాకైతే అంతవరకూ సినిమా తెగ నచ్చేసింది.

కానీ సినిమా ద్వితీయార్థంలోనే సినిమా మరో డిఫరెంట్ లెవల్ కి వెళ్లింది. అక్కడున్న 24 మంది ఎలా సర్వైవ్ అవుతారో అనేదే చాలా మంచి కథ. కానీ అంతటితో ఆగకుండా గేమ్ మేకర్స్ ప్లేయర్స్ కి వివిధ అడ్డంకులు కలిగించడం నాకు నచ్చలేదు. బహుశా నేను మళ్లీ బాటిల్ రాయల్ లాంటి సినిమానే expect చేసి ఉండొచ్చు. లేదా హంగర్ గేమ్స్ నవల చదివుంటే బహుశా ఈ సినిమా ని నేను ఇంకా ఎంజాయ్ చెయ్యగలిగి ఉండేవాడినేమో!

ఏదేమైనా సినిమా మొదటి సగం లోనే మన డబ్బులు వసూలయిపోతాయి. అంతే కాదు IMDB లో Rotten Tomatoes లో దాదాపు ఎనిమిది కి పైనా రేటింగ్ ఉంది కాబట్టి చాలా మందికి ఈ సినిమా తెగనచ్చేసిందన్నమాట.

బాటిల్ రాయల్ చూడకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఈ సినిమా నచ్చిన వాళ్లు చూడదగ్గ మరిన్ని సినిమాలు:

1)      Battle Royale

2)      Lord of Flies

3)      1984

4)      Series 7: The Contenders

5)      13 tzameti

చివరిమాట: ఒకర్నొకరు చంపుకునే రియాలిటీ షో సినిమా ఏంట్రా బాబూ అని అనుకోకుండా sub text కనుక పట్టుకోగలిగితే ఇది నిజానికి ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నవల రాయడం వెనుక inspiration ఇరాక్ పై అమెరికా చేసిన యుద్ధం అంటే వింతగా ఉండొచ్చు కానీ రచయిత మాటల్లోనే చెప్పాలంటే  “I was flipping through images of reality television, there were these young people competing for a million dollars … and I saw images of the Iraq War,” Collins said in a video from her publisher, Scholastic. “Two things began to sort of fuse together in a very unsettling way, and there is really the moment when I got the idea for Katniss’ story.”

2 Comments
  1. here April 10, 2012 /
    • అబ్రకదబ్ర November 20, 2012 /