Menu

మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు

పాఠం ఎంత గొప్పగా వున్నా, చెప్పడం బాగలేకపోతే ఎలా విసుగనిపిస్తుందో అలాగే ఎంటర్టైన్మెంట్ లేని డాక్యుమెంటరీ కూడా చప్పగా వుంటుంది. ఈ విషయం ఎం.బీ.యే. లాంటి ప్రొఫెషనల్ పట్టా పుచ్చుకున్నవారికీ, తరచూ కార్పొరేట్ ట్రైనింగ్లలో కూర్చునేవారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యే వుంటుంది. అలా బోరు కొట్టే డాక్యుమెంటరీలతో కాకుండా సినిమాల ద్వారానే కార్పొరేట్ పాఠాలు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అలాంటి సినిమాలు వున్నాయా? అన్న ప్రశ్నలకు నేను వెతుక్కున్న సమాధానమే ఈ వ్యాసం.

 

ఎప్పటికప్పుడు కొత్త కథలకోసం వెతికే సినిమా ప్రపంచానికి కార్పొరేట్ ప్రపంచం చాలా కథలనే అందించింది. అలా కార్పొరేట్ నుంచి కథలు తీసుకున్న సినిమా ప్రపంచం అదే సినిమాల ద్వారా కార్పొరేట్ పాఠాలనూ అందించింది. ఎన్నో సినిమాలను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో పాఠ్యాంశాలలో చేర్చారంటే ఆ సినిమాల ప్రాముఖ్యత ఏమిటో మనకి అర్థం అవుతుంది. మన దేశంలో కూడా ఐ.ఐ.ఎమ్. లాంటి కాలేజీలలో సినిమాల ద్వారా పాఠాలు బోధిస్తుంటారు. (“లగాన్” సినిమాని టీమ్ బిల్డింగ్ నేర్పించడానికి చూపిస్తారని మనందరికి తెలిసిందే.). అయితే ఇలా కార్పొరేట్ కథాంశాలతో వచ్చిన కథలన్నీ మనకి పనికిరాకపోవచ్చు. కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉపయుక్తంగా వుంటాయి. కొన్ని సినిమా మొత్తం ఒక పాఠం లాగే వుంటుంది. సినిమాలో ఏ భాగాన్ని ఏ రకంగా వాడుకుంటే అది కార్పొరేట్ పాఠం అవుతుందో తెలుసుకోవడం ముఖ్యం.

కార్పొరేట్ కథల ఆధారంగా వచ్చిన సినిమాలలో ప్రముఖమైనవి బయోగ్రఫీ సినిమాలు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను స్థాపించిన వ్యక్తుల జీవితాల గురించి తీసిన సినిమాలు, కథలో అంతర్భాగంగా బిజినెస్ గురించి చెప్తాయి కాబట్టి నేర్చుకోడానికి, వారి జీవితాల నుంచి స్పూర్తి పొందడానికి అవకాశం వుంటుంది. 1946 లో వచ్చిన సిటిజన్ కేన్ నుంచి నిన్నా మొన్నటి సోషల్ నెట్ వర్కింగ్ దాకా ఎన్నో సినిమాలు ఈ కోవలోనే వుంటాయి. మనందరికీ తెలిసిన హిందీ చిత్రం “గురు” కూడా ఇలాంటిదే. ఇక రెండో రకం. ఇవి క్రమంగా ఊపందుకున్న పారిశ్రామీకరణ ఆ తరువాత జరిగిన ప్రపంచీకరణ పుణ్యమా అని పుట్టుకొచ్చిన కొత్త కథలతో తయారైన సినిమాలు. చార్లీ చాప్లిన్ తీసిన “మోడ్రన్ టైమ్స్” (1936) ఇలాంటి చిత్రాలకు మొదటి వుదాహరణ. 2008 రిసెషన్ ఆధారంగా తయారయిన “టూ బిగ్ టు ఫెయిల్”(2011), డౌన్ సైజింగ్ (ఉద్యోగాల తీసివేత) గురించి తీసిన “ది కంపెనీ మెన్” (2010) వంటివి అదే కోవకి చెందినవి. ఇక కార్పొరేట్ ప్రపంచం మనిషి జీవితాన్ని, ముఖ్యంగా కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తోందని చెప్పిన సినిమాలు కోకొల్లలుగా వచ్చాయి. “ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్”(1946), “ఆఫీస్ స్పేస్” (1999), “రెవల్యూషనరీ రోడ్” (2008) వంటివి మరి కొన్ని సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. ఇలాంటి సినిమాలలో వుండే సౌలభ్యం ఏమిటంటే కథ కార్పొరేట్ ప్రపంచం కాకపోయినా అది “Plot B” గా వుంటూ ప్రధాన కథని ప్రభావితం చేస్తుంది. ఇక మూడో రకం సినిమాలు ఉన్నాయి. ఇవి కార్పొరేట్ ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా మామూలుగా తమ కథని చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ కథలోనే ఎన్నొ మేనేజ్మెంట్ పాఠాలు ఉంటాయి. ఇలాంటి సినిమాలను గుర్తించడంలో కార్పొరేట్ ట్రైనర్లు చాలా ముందుంటారు. ఉదాహరణకి స్పోర్ట్ జాన్రాకి చెందిన ఎన్నో సినిమాలు మోటివేషన్, టీమ్ వర్క్ వంటి పాఠాలు నేర్పించడానికి ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో కూడా ఎన్నో మేనేజ్మెంట్ పాఠాలు వున్నాయి.

పైన చెప్పిన మూడు రకాలలో మొదటి రెండింటితో ఎలాంటి సమస్య లేదు కానీ చివరి రకం సినిమాలతోనే చిక్కంతా వస్తుంది. వెతకాలేకానీ ప్రతి సినిమాలో ఏదో ఒక మేనేజ్మెంట్ పాఠం వుంటుంది. ఈ మధ్య పోకిరి సినిమాలో డైలాగులని కార్పొరేట్ ట్రైనింగ్ లో వాడిన మిత్రుడు ఒకరు నాకు తెలుసు. బిజినెస్ మెన్ సినిమాలో బిజినెస్ పాఠాలు అంటూ ఈ మధ్య ఇంటెర్ నెట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ చాలా మంది చూసే వుంటారు. ఇలా వెతుక్కుంటూ పోతే “రతి నిర్వేదం”లో కూడా కార్పొరేట్ పాఠాలు దొరుకుతాయి (నమ్మండి… ఉన్నాయి). అందువల్ల పాఠకుల సౌలభ్యం కోసం ఆ మూడో రకాన్ని వదిలిపెట్టి మొదటి రెండు రకాలలో కొన్ని సినిమాలను మీకు పరిచయం చేస్తాను.

మీరు సిద్ధమేనా..??

3 Comments
  1. Srinu Pandranki March 4, 2012 /
  2. richfield March 5, 2012 /
  3. VenkateshWarlu May 9, 2012 /