Menu

ఈ రోజుల్లో…

ఈ రోజుల్లో తెలుగు సినిమా చూడడమంటే పాపమయిపోయింది. డబ్బులిచ్చి మరీ తలనొప్పి తెచ్చుకోవడమంటే తెలుగు సినిమా చూడడమే! అయినప్పటికీ తెలుగు వాళ్లకి వినోదం కోసం సినిమా తప్ప మరో గతి లేకపోవడంతో సినిమాలు ఆడేస్తున్నాయి. ఒక మోస్తరుగా ఉంటే చాలు హిట్లు సూపర్ హిట్లూ అయిపోతున్నాయి కూడా. ఇలాంటి పరిస్థుతుల్లో ప్రేక్షకులు కూడా కాస్తా తెలివి మీరిపోయారని చెప్పాలి. తలనొప్పి ఎలాగూ తప్పదు, డబ్బులు ఎలాగూ వృధా అని పక్కాగా తెలిసిపోయినప్పుడు అదేదో పెద్ద (అంటే భారీ బడ్జెట్ పెద్ద హీరో సినిమా అన్నమాట) సినిమాకి వెళ్లి తెచ్చుకోవడమే మేలని నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఈ రోజుల్లో…

….ఇది “ఈ రోజుల్లో” సినిమా సమీక్షగా మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్తున్న కారణంగా అసలు విషయానికి వచ్చేద్దాం. “ఈ రోజుల్లో” సినిమా గురించి చెప్పాలంటే ముందు ఆ రోజుల్లో మన వర్మ గారు తీసిన “దొంగల ముఠా” గురించి ప్రస్తావించుకోవాలి. గత రెండు మూడేళ్లుగా డిజిటల్ SLR కెమెరాలు ఉపయోగించి సినిమాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే! టెక్నాలజీ పరంగా అందరికంటే ముందున్నానని అనుకునే రాం గోపాల్ వర్మ ఆ రోజుల్లో “దొంగల ముఠా” అనే కళాఖండం తీశారు. ఏదో ఆయన పాటికి ఆయన సినిమా తీసుంటే పోయుండేది. కానీ అతి తక్కువ బడ్జెట్ లో డిజిటల్ టెక్నాలజీ ద్వారా సినిమా తీయొచ్చు అని బాగా పబ్లిసిటీ ఇచ్చుకున్నార. ఆ సినిమా విడుదలయ్యాక జనాలు ఆ సినిమా చూసి బాగోలేదనడమే కాకుండా బాబోయ్ డిజిటల్ SLR లో సినిమాలు తీస్తే ఇంత ఘోరంగా ఉంటుందా అని కంగారు పడ్డారు. దాంతో ప్రపంచం మొత్తం ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ SLR లో ఎన్నో సినిమాలు తీసి ముందుకు దూసుకుపోతున్నా మన తెలుగు పరిశ్రమ కాస్తా ఈ ఉద్యమంలో వెనుకపడింది. అయితే ఈ రోజుల్లో….

…..”ఈ రోజుల్లో” అనే సినిమా గురించి చదవడానికి వచ్చిన పాఠకులు అసహనంగా ఉన్నట్టున్నారు. క్షమించండి. ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా “ఈ రోజుల్లో” గురించి చెప్పలేము. ఎందుకంటే “if we forget history we are doomed to repeat it” అని పెద్దలు చెప్పారు కదా! అందుకే “ఈ రోజుల్లో” సినిమా గురించి మనం చర్చించుకునే ముందు కొంత చరిత్ర అవసరమయింది.

ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజుల్లో అందరివీ డిజిటల్ డ్రీమ్సే! హాలీవుడ్ లో బాలీవుడ్ లో, పక్కనున్న తమిళనాడు లోనూ డిజిటల్ SLR ఉపయోగించి పూర్తి నిడివి సినిమాలు రూపొందించి సక్సెస్ సాధించిన విషయాలు చాలా విన్నాము కానీ తెలుగులో అది జరగడానికి కాస్తా టైం పట్టింది. అయితేనేం నిన్న ఉగాది రోజున విడుదలయిన “ఈ రోజుల్లో” అనే సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది.

ముందుగా ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే ముందు అసలు రొమాంటికి కామెడీ స్క్రీన్ ప్లే రాయడం ఎలా అనే విషయం చర్చించుకుందాం.

ఒక తెల్ల కాగితం పై నిలువుగా రెండు గీతలు గీసి పేజీని మూడు భాగాలుగా విభజించండి. మొదటి వరుసలో ఒకమ్మాయి క్యారెక్టర్ ని వివరించండి. మూడో వరుసలో ఒకబ్బాయి క్యారెక్టర్ ని వివరించండి. ఇక మధ్యలో ఖాళీగా ఉన్న వరుసలో వీళ్లిద్దరూ దూరంగా ఉండడానికి కారణాలను లిస్ట్ చెయ్యండి. ఉదాహరణకు: తొలిప్రేమలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డిని తీసుకుంటే హీరోకి చదువుమీద పెద్దగా ఆసక్తిలేదు. కానీ మన హీరోయిన్ కి బాగా చదివి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలనే కోరిక. అలాంటమ్మాయికి అబ్బాయి నచ్చుతాడా? పోనీ అలాంటమ్మాయికి ప్రపోజ్ చేసినా అమ్మాయి ఒప్పుకుంటుందా? పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చెయ్యకపోవడానికి ఇదే కారణం.

అలాగే ఈ మధ్యనే వచ్చిన “ప్రియుడు” సినిమా తీసుకుందాం. అందులో హీరో కి ప్రేమ అంటే నచ్చదు. అందుకేవో కారణాలు చెప్పాడు. ఇక హీరోయిన్ అనుకోని పరిస్థుతుల్లో హీరోని కలిసి అతన్ని ప్రేమించేస్తుంది. కానీ హీరో ఒప్పుకోడు. ఈ లోగా వాళ్లిద్దరి తండ్రులు కలిసి ఒకరినొకరు చిన్ననాటి స్నేహితులుగా గుర్తుపట్టి తమ పిల్లలకు పెళ్లి చేద్దామనుకుంటారు. హీరో కష్టంగానూ హీరోయిన్ ఇష్టంగానూ ఒప్పుకుంటుంది. కానీ హీరో ఎందుకో ఈ పెళ్లి చెడగొట్టాలనుకుంటాడు. ఎందుకు? కారణం తెలియదు. ప్రేక్షకులకే కాదు దర్శకుడికి కూడా! సినిమా మొదట్లో హీరో తనకి ప్రేమ నచ్చదన్నాడు కానీ ఇక్కడ ఎవరూ ఎవరిని ప్రేమించమనటం లేదు; పెళ్లి చేసుకోమంటున్నారు. అలాంటప్పుడు హీరో ప్రాబ్లం ఏమిటో?

అందుకే అమ్మాయి అబ్బాయి మధ్య దూరం కలుగచేసే ఈ కారణాలే రొమాంటికి కామెడీకి ప్రాణం.

ఈ కారణాలు ఎంత చిన్నవైనా ఫర్వాలేదు బిలీవబుల్ గా ఉన్నంతవరకూ ఆడియన్స్ కి ఫర్వాలేదు. “ఈ రోజుల్లో” సినిమాలో మొదలుపెట్టడమే హీరో హీరోయిన్లను స్ప్లిట్ స్క్రీన్ లో ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్లిద్దరికీ ఉన్న సమస్యలు చెప్పేశారు.

ఈ సినిమాలో మన హీరో సమస్య తొలిప్రేమ కాదు. అతని సమస్య మళ్లీ మళ్లీ ప్రేమ. అప్పటికి ఐదారు మంది అమ్మాయిలను సీరియస్ గా ప్రేమించేసి ఇక చాలు అనుకుని తనకి పెళ్లయిపోయిందని అబద్ధం చెప్పి హ్యాపీగా ఉంటాడు.

ఇక మన హీరోయిన్ అప్పటికి చాలా మంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్లు అది ప్రేమ అనుకుని తనను వేధిస్తుండడంతో ఇక నుంచి ఏ అబ్బాయితోనూ ఫ్రెండ్లీగా ఉండనని ఒట్టేసుకుని హాయిగా ఉంటుంది.

వీళ్లిద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటుంటారు. అదీ కూడా హీరోయిన్ వాళ్ల ఇంట్లో హీరో అద్దెకు ఉంటాడు. ఇంకేముంది వాళ్లొద్దొనుకున్నా వీళ్లమధ్య ప్రేమ పుట్టడం ఖాయం. అది వాళ్లు కాదనడమూ ఖాయమే. ఇక చివరికి వీళ్లిద్దరూ కలుస్తారా లేదా? అనేది మిగతా కథ అని నేను చెప్పినా, “ ఆ తొక్కలే” లాస్ట్ లో ఐర్ పోర్ట్ లో వీళ్లిద్దరూ కలుస్తారనే మీకే కాదు తమ్మారెడ్డి భరద్వాజకి (మధ్యలో ఈయనేంటి?) కూడా అనిపించింది. అందుకే సినిమా చివరి భాగంలో కొంచెం వెరైటీ గా ప్రయత్నం చేశారు.

కథ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న “ఈ రోజుల్లో” సినిమా చూశాక చాలా మంది ఏదో కొన్ని జోకులు బావున్నాయి, అక్కడక్కడా బూతు కామెడీ తప్ప పెద్దగా ఏమీ లేదని కొంతమంది అన్నారు. కానీ ఇవన్నీ లేని తెలుగు సినిమా ఇప్పుడుందా? కాబట్టి జోకులు, బూతు కామెడీ మాత్రమే కాదు కథా పరంగానూ ఒక మోస్తారు గా ఇది మంచి సినిమానే అని చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ పరంగా చూసినా, బి స్టోరీ పెద్దగా లేకపోయినా అక్కడక్కడా హింట్స్ ఇస్తూనే క్లైమాక్స్ కి వచ్చేసరికి బి స్టోరీ లోని ఎలిమెంట్స్ మైన్ స్టోరీ కి కీలకం కావడం వంటివి ఇది మంచి స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు.

అంతే కాదు పాటలున్నా అలా కాసేఫు వచ్చి పోయేవేగానీ స్టోరీ ఫ్లో కి పెద్ద అడ్డంకిగా ఉండవు. అంతే కాదు, రింటి ట్రింగ్ పాటని థీమాటిక్ గా కీలకమైన చోట్ల వాడడం కూడా చాలా బావుంది.

కాబట్టి “ఈ రోజుల్లో” కేవలం ఫ్లూక్ గా హిట్ అయిపోలేదు. క్లీచే సన్నివేశాలే అయినా, మనకి బాగా తెలిసిన కథే అయినా, it will surely engage you in a strange way.
కాబట్టి డిజిటల్ SLR ద్వారా తీసి విజయం సాధించిన సినిమాగా మాత్రమే కాకుండా ఈ టెక్నాలజీ సంగతులేవీ పట్టించుకోని వాళ్లకు సైతం ఈ సినిమా నచ్చే అవకాశాలే ఎక్కువ.
ఇక పోతే డిజిటల్ సినిమా అంటే ఆసక్తి ఉన్న వారు ఈ సినిమా తప్పకచూడాలి. అందుకు కారణాలు చూస్తే మీకు ఇట్టే తెలిసిపోతాయి. ముఖ్యంగా ఫర్వాలేదు 5D లో తీస్తే థియేటర్ లో సినిమా చూడొచ్చు అని నిరూపించింది ఈ సినిమా. ఇంకోటి యాభై లక్షల్లో తీసినా ఎక్కడా సినిమా పేద అరుపులు అరవదు. లుక్ అండ్ ఫీల్ రిచ్ గానే ఉంది. అలాగే పూర్తిగా ఆన్ లొకేషన్ లో తీసిన సినిమా ఇది.

అయితే ఇంత పొగిడేస్తున్నానని ఇదేదో మాస్టర్ పీస్ అని అపోహతో వెళ్లకండి. సినిమాలో ఆర్టిస్ట్ ల మేకప్ దారుణంగా ఉంది. బహుశా డిజిటల్ లెన్స్ లు వాడడం వలన ఇమేజెస్ చాలా షార్ప్ గా కనిపించి అలా అనిపించిందేమో. కథ కూడా కొన్ని సార్లు ముందుకు జరక్కుండా అక్కడక్కడే తిరుగుతూ కొంచేం సహనానికి పరీక్షగా మారుతుంది. ఇక చివరిగా, ఈ జెనరేషన్ ప్రేమ ప్రేమ అంటూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారని, సినిమాల్లో మరీ బూతులు వాడకం ఎక్కువైపోయిందని బాధపడేవారయితే మీరు ఈ సినిమాకి దూరంగా ఉండడమే మేలు.

8 Comments
 1. ramesh kolluri March 24, 2012 /
  • సురేష్ అట్టా March 26, 2012 /
   • siva April 19, 2012 /
   • kiran April 27, 2012 /
 2. chandu March 26, 2012 /
 3. ramesh kolluri March 28, 2012 /
 4. damodar April 14, 2012 /
 5. anil May 5, 2012 /