Menu

అమెరికా సిత్రాలు…

‘పడమటి సంధ్యా రాగం’. జంధ్యాల గారు అమెరికాలో తీసిన ఈ చిత్రాన్ని, అది అందించిన హాస్యాన్ని ఎవరైనా మర్చిపోగాలరా? ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సినిమా మొత్తం అమెరికాలోనే తీయడం. ఒక వైపు జంధ్యాల గారి చల్లని హాస్యం, ఇంకో వైపు చక్కని అమెరికా అందాలు వెరసి తెలుగు వారికి ఒక చక్కని చిత్రాన్ని అందించాయి. ఆ తర్వాత పాతికేళ్ళు ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ వరకు మొత్తం అమెరికాలోనే సినిమాలు తీసేటట్టు పెద్దగా ప్రయత్నాలు జరిగినట్టు లేవు. అడపా దడపా కొంత భాగం అక్కడ చిత్రీకించడం తప్పితే!

 

అసలు అమెరికాలో తెలుగు సినిమాలు ఎందుకు తీయాలి? అందమైన ప్రదేశాలను ప్రేక్షకులకి చూపిద్దమనా? ఈ ప్రశ్నే అమెరికాలో ఉంటున్న ‘కీ’ సినిమా నిర్మాత సుకుమార్ రెడ్డి గారిని అడిగితే ‘ఏ ప్రేక్షకుడు కూడా అందమైన లొకేషన్ చూద్దామనుకుని సినిమాకి రాడు. అంతగా చూడాలనుకుంటే ఏ ‘ట్రావెల్స్’ ఛానల్ పెట్టుకున్నా అంతకన్నా అందమైన ప్రదేశాలు చూడొచ్చు’ అంటారు. పోనీ అది నిజం కాదు, ప్రేక్షకులు చూస్తారు అనుకున్నా మన తెలుగు సినిమా ఏం తక్కువ తినలేదు. ప్రపంచం మూల మూలల్లో ఉన్న అందాలన్నీ వెతికి అందిస్తూనే ఉంది పాటల రూపంలో. మరి అమెరికాలో తీసి మాత్రం ఏంటట? నిజానికి ఇప్పటివరకు విడుదలైన చిత్రాలను చూస్తే మాత్రం అమెరికాలో ఉండేవారు తమ ఉద్యోగాలు/వ్యాపారాలు వదులుకుని ఇండియా వచ్చి మరి సినిమా తీయడం ఇష్టం లేక మరియు అక్కడే ఉండడం వలన ఉండే వెసులుబాటును వాడుకోవడం కోసం అక్కడే తీయడానికి సిద్దపడి ఉండొచ్చు అనిపిస్తూ ఉంటుంది. శేఖర్ కమ్ముల అవకాశం ఉన్నా సరే అమెరికాలో తీయడానికి ఇష్ట పడలేదు ఎందువల్లనో. అయితే, 2005లో రవి వల్లభనేని గారు దేవ కట్టను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘వెన్నెల’ అనే చిత్రాన్ని నిర్మించారు. మొదటి సగం అంతా అమెరికాలోనే సాగుతుంది. రెండో సగం మాత్రం ఇండియాలో ఉంటుంది. అప్పటిలో ఈ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ స్పూర్తితో శరత్ కొంతం అతి తక్కువ బడ్జెట్ 5 లక్షలతో ‘మిసమ్మ NRI’ అనే గంట నిడివి చిత్రం అమెరికాలో తీసారు. అది feature length లేకపోవడంతో రిలీజ్ చేయడం కుదరలేదు. కాని అది సినిమాకి ఏమి తీసిపోదు. క్రితం ఏడాది ‘LBW’ రిలీజ్ అయ్యేవరకు అమెరికాలో తీసిన సినిమాలు చెప్పుకో తగ్గవి లేవు. అయితే ఈ సినిమా కుడా 50 శాతం మాత్రమే అక్కడ షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం విజయవంతం కాలేకపోయినా కొన్ని సెక్షన్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడమే కాక కొందరి NRIలలో స్పూర్తి నింపింది. సినిమా తీయాలనే కోరిక, కొంచం డబ్బు ఉంటే ఎవరైనా సినిమా తీయొచ్చు అని ప్రవీణ్ సత్తూరు ఈ చిత్రంతో నిరూపించారు.

 

అమెరికాలో చిత్రీకిరించిన సినిమాలను చూస్తే చాలా వరకు అంతా కొత్త వాళ్ళే ఉంటారు. దర్శకులు, నటులు కావాలనే ఆశ ఉండి కొన్ని కారణాల వలన తాము అనుకుంటున్నది చేయలేకపోతున్నాం అనే బాధ నుండి మనమే ఎందుకు ఒక సినిమా చేయకూడదు అని కలలు కనే వారంతా కలిసి అక్కడే ఒక సినిమా ప్లాన్ చేసేస్తారు. మరిలాంటి సినిమాలకి నిర్మాత ఎవరు? డబ్బులుంటే వారికి వారే నిర్మించుకుంటారు లేదా షేర్ల రూపంలో తమ మిత్రులని ఇన్వెస్ట్ చేయమంటారు. తలా కొంత వేసుకుని షూటింగ్ మొదలెట్టేస్తారు. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం వలన నష్టం వచ్చినా భరించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ విధానంలో ఎవరు అంతగా నష్టపోకపోవడం సంతోషించదగ్గ విషయం.

 

అమెరికాలో చిత్రీకరణ అంటే తడిసి మోపెడవుతుంది అనే భ్రమ లోనుంచి బయటకి వచ్చి ఒక కెమేరా, కొందరు నటులు, ఇంకొంత మంది సాంకేతిక సిబ్బంది ఉంటె సరిపోతుంది అని గ్రహించారు అమెరికాలో ఉండే మన వాళ్ళు. ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చేసిందో ఎవరికీ వారు ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెట్టారు. అందిరిలో ముందు విజయవంతం అయ్యి తమ సినిమాను విడుదల చేసుకున్నది మాత్రం కిరణ్ మీగడ మరియు అరుణ రుద్ర.. వీరిద్దరు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ‘My heart is Beating… అదోలా’ ఇటేవలే విడుదలైంది. వారి target audience అయిన A class వారికి ఈ చిత్రం నచ్చడంతో వారు ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం మొత్తం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. అలానే వీరు కూడా ముందు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఈలోగా వీరి కధ నచ్చి రాజశేఖర్ గారిలాంటి మంచి నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి రావడంతో ఇంక ఆ అవసరం లేకుండా పోయింది.

 

సరే, అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవడంలో లాభనష్టాలు ఏమిటి? కిరణ్ మీగడ నన్ను మై హార్ట్ ఈజ్ బీటింగ్ నిర్మాత రాజశేఖర్ గారికి పరిచయం చేస్తూ ‘ఇతను కూడా తన రెండో సినిమా అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు’ అని చెప్పినప్పుడు రాజశేఖర్ గారు ‘చేయండి. అక్కడ చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి’ అన్నారు నాతో సంతోషంగా. ఏంటి ఆ ఉపయోగాలు అంటే, అక్కడ సినిమా చేయడం వలన ఇక్కడలా అవసరమున్నా లేకున్నా సిబ్బందిని వేసుకుని వెళ్లడం ఉండదు. మనకు ఎవరు అవసరమో వారినే తీసుకెళ్తాం. అలాగే అక్కడకి షూటింగ్ కోసమే వెళ్తాం కాబట్టి చక్కగా షూటింగ్ చేసుకుని వచ్చేయడం తప్పితే ఇక్కడిలా వేరే diversions ఉండవు. అందరు మనకి అందుబాటులో ఉంటారు. ఎలాంటి టెక్నాలజీ అయినా వెంటనే దొరికేస్తుంది. ఇక్కడ రెంట్స్ కి అయ్యే ఖర్చుతో అక్కడఆ equipment కోనేయొచ్చు. ఇన్ని సౌలభ్యాల వలన ఇక్కడ కన్నా అక్కడే సినిమా తక్కువ బడ్జెట్లో తీసేసుకోవచ్చు.

 

మరి నష్టాలేంటి? మొత్తం అమెరికా లోనే తీయడం వలన మరో బాధ ఏంటంటే నేటివిటీ ఫీలింగ్ పోతుంది. ఇది మన సినిమా కాదు అనే భావన కలిగే ప్రమాదం ఉంది. ఇక్కడ నుంచి అందర్ని పట్టుకెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందరికి వీసా, టికెట్స్ మొదలగు ఖర్చులు భరించాల్సి వస్తుంది. అమెరికాలో దిగాక హోటల్, ఫుడ్ లాంటి బిల్లులు నిర్మాతని తప్పకుండా భయపెడతాయి. అందుకే అమెరికాలో ఉండేవారికి మాత్రమే ఈ విధంగా సినిమాలు తక్కువలో తీయడానికి వీలవుతుంది. వాళ్ళకైతే ఈ ఖర్చులు ఏవి ఉండవు కాబట్టి. ఒకవేళ, ఇక్కడి వారు అక్కడ తక్కువలో చేసుకోవాలనుకుంటే మాత్రం, అతి ముఖ్యమైన వారు ‘దర్శకుడు’, ‘హీరో’ లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమె వెళ్లి, మిగతా నటీనటుల్ని, సిబ్బందిని అక్కడే వెతుక్కోవాలి. కాకపోతే అక్కడ నటులని ముఖ్యంగా అమ్మాయిలను పట్టుకోవడం చాలా కష్టమని గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని గైడ్ చేయడానికి, ఎల్లప్పుడూ సాయం చేయడానికి ఒకరైనా మీకు తెలిసిన వారు ఉండడం ఉత్తమం.

 

ఈ మధ్య అందరూ తక్కువలో అయిపోతుంది అని తెలుగు సినిమాలను విదేశాలకు వెళ్లి తీసుకుంటూ ఉండడం వలన సినీ కార్మికులకు పని లేకుండా పోతుందని తెలుగు సినిమా నిర్మాత మండలి వారు ‘తెలుగు సినిమా తప్పకుండా 70% ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ జరగనిదే Publicity ClearanceCertificate ఇవ్వడం జరగదని’ నిభందన విదించారు. ప్రస్తుతానికి అంతగా పట్టించుకోవడం లేదు కానీ ఏ క్షణాన గట్టిగా పట్టుకుంటారో తెలీదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలయితే స్క్రిప్ట్ అందించి మీ చిత్రం అమెరికాలో మాత్రమే తీయగలిగినది అని ఒప్పించి పర్మిషన్ తీసుకోగలిగితే ఉత్తమం.

 

అమెరికాలో తెలుగు చిత్రాలు నిర్మించే పరంపర ఇప్పుడే ఊపందుకుంది. మరో రెండు నెలల్లో అజయ్ కంభంపాటి నిర్మించి, దర్శకత్వం వహించిన ‘రామాలయం’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కూడా మొత్తం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. ఇది కాక మరో రెండు మూడు తెలుగు చిత్రాలు అమెరికాలో ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరికొన్ని షూటింగ్ జరుపుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నా సినిమా, రవి వల్లభనేని గారు వెన్నెల తర్వాత మళ్ళీ అమెరికాలో తీస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి.

 

నోట్: నేను కూడా నా సినిమాకు ఇన్వెస్టర్లను ఆహ్వానించాను. పదిహేను మంది అవసరం కాగా తొమ్మిది మంది వచ్చారు. ఎవరికైనా ఇంటరెస్ట్ ఉంటె నాకు మెయిల్ చేయండి.

 

Email: srinu.thedirector@gmail.com

– శ్రీను పాండ్రంకి

 www.srinuthedirector.com

One Response
  1. అబ్రకదబ్ర March 8, 2012 /