Menu

రుద్రుడి “సొంతఊరు” కథ

ఎల్బీ శ్రీరాం చాలా బాగా చేసాడు అని ఒకరిద్దరు పదే పదే చెప్పగా విన్నాక, ఈ సినిమా ఎట్టకేలకు చూసేసాను. నాకనిపించింది టూకీగా చెప్పాలంటే: ఈ సినిమాని కమర్షియలైజ్ చేయాలా? లేకుంటే అలాగ “ఆర్టు” సినిమాలాగా ఉంచేయాలా అన్న అయోమయంలో ఈ సినిమా తీసిన వాళ్ళు అలాగ కొట్టుమిట్టాడుకుంటూ, చివరికి దీన్ని ఇలా ఒక కిచిడీ లా చేసారేమో అనిపించింది. డైలాగులు, ఎల్బీ శ్రీరాం నటన మాత్రం అద్భుతం. ఇక వివరాల్లోకి వెళితే:

కథా విశేషాలు ఏమిటంటే: అదొక ఒక చిన్న ఊరు. దానిలో రకరకాల మనుషులు. అందరికీ మధ్య సరసాలు, సరదాలు మొదలుకుని అన్ని రకాల సంబంధాలు ఉంటాయి (మనుషులు కనుక). తన వృత్తి మీద గొప్ప గౌరవం, ఆ ఊరి మీద అభిమానం కలిగిన కాటికాపరి రుద్రుడు/రుద్రస్వామి (ఎల్బీ శ్రీరాం); తను కూడా తన వృత్తిని గౌరవిస్తూ , ఆ ఊర్లో తాను ఉన్నందువల్లనే మానభంగాలు గట్రా జరగట్లేదు అని నమ్మే ప్రాస్టిట్యూట్ మల్లి (తీర్థ); ఈమె విసుక్కుంటున్నా కూడా ఈమె మీద ప్రేమ కొద్దీ పెళ్లి చేసుకోవాలి అనుకునే ఒక అమాయకపు కుంటి అబ్బాయి (రాజా); ఊరి పెద్ద- దేవుడు గారు (తనికెళ్ళ భరణి) – వీళ్ళు ముఖ్య పాత్రలు. ఇక, కథా వస్తువు : సెజ్ ల పేరుతో గ్రామాలను సమూలంగా నిర్మూలించడం. ఏవో కొత్త ఇండస్ట్రీల కోసం భూమి సేకరిస్తూ ఈ ఊరులో భూముల్ని అమ్మమని అడగడానికి ఎమ్మార్వో గట్రా వస్తారు. పాత తరం వారు కొందరు ప్రతిఘటించినా కూడా, యువతరం, అలాగే కొందరు ఊరి పెద్దల సానుకూల దృక్పథం వల్ల మొత్తానికి ఊరు తనని తాను అమ్మేసుకోవడానికి, తనను తాను చంపేసుకోవడానికి (ఈ మాట నేను కాదు అంటున్నది..ఆ సినిమాలో అదే టోన్ లో చెప్పారు) సిద్ధపడుతుంది. అందరూ ఏదో ఒకలా కన్విన్స్ అవుతారు కానీ, రుద్రుడు ఆ ఊరినీ, తన స్మశానాన్నీ వదలడానికి సిద్ధపడడు. తాను ఎంతో గౌరవించే దేవుడు బాబు కూడా ఈ ఊరు అమ్మే ప్రక్రియకి సానుకూలంగా ఉండడం అతనికి అన్నింటికంటే నచ్చని విషయం. ఈ మార్పుల మధ్య రుద్రుడి కుటుంబం ఏమైంది? అతను సొంతూరు మీద ప్రేమలో ఏం చేసాడు? చివరకి ఏమైంది? అన్నది మిగిలిన కథ. అయితే, ముఖ్య కథా వస్తువు ఇదే అయినా కూడా, చాలా ఉపకతలు (ఒక ప్రేమ కథా…దాని తాలూకా డ్యూయెట్లు..విషాదాలూ), బోలెడంత ఫిలాసఫీ, అద్భుతమైన సంభాషణలు, చాలా మంది నుంచి మంచి నటన గట్రా. గట్రా : కొసర్లు చాలా ఉన్నాయి.

అంత సీరియస్ అంశంగా కనబడే ఈ కథలో, ఎన్నో హాస్యపూరితమైనవి, వ్యంగ్య సహితమైనవి అయిన వాక్యాలు ఉన్నాయి (సంభాషణలు: ఎల్బీ శ్రీరాం, గంధం నాగరాజు, ఈ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి). ఎల్బీ పాత్ర ఎక్కడికక్కడ తన కాటికాపరి జీవిత ధర్మాన్ని ఉదాహరిస్తూ, జనం మీద వేసే సెటైర్లు ఉంటాయి చూసారూ, కేవలం వాటికోసం సినిమా మళ్ళీ చూడొచ్చు. ఎవరన్నా పోయారు అనగానే రుద్రుడు, అతని మనవడు, మనమరాలు పడే సంబరం అదీ చూస్తే, ఒక పక్క సన్నగా వణుకు పుడుతుంది కానీ, అదే సమయంలో నాకైతే “నిజమే కదా…అది వాళ్ళ జీవనాధారం” అని కూడా అనిపించింది. సైడ్ ట్రాక్లో ఆలోచిస్తూ ఉంటే,ఈ మధ్య పారిశ్రామికీకరణ, గాంధియన్ ఎకనామిక్స్ వగైరా అంశాల గురించి విరివిగా చదువుతున్న వాళ్ళ ద్వారా కలుగుతున్న జ్ఞానోదయం వల్ల కాబోలు – ఈ సినిమాలో నాకు రకరకాల అంశాలు కనబడ్డాయి.. ముఖ్యంగా రుద్రుడి మాటల్లో. వివిధ కులవృత్తుల వారి పనులు ఆధునిక జీవన విధానం వల్ల దెబ్బతినడం గురించి రుద్రుడు చెబుతున్నప్పుడూ, అలాగే, ఈ భూములు అమ్ముకు పోయిన వాళ్ళు పట్నం పొయ్యి అవస్థ పడ్డం – ఇలాంటివి అన్నీ చూస్తున్నప్పుడు పదే పదే ఇందాకటి గాంధియన్ ఎకనామిక్స్ వాళ్ళు చెప్పిన “గ్రామీణ అభివృద్ధి పై గ్లోబలైజేషన్ ప్రభావం” కథలూ అన్నీ గుర్తొచ్చి, అయోమయానికి గురయ్యాను. అయోమయం ఎందుకంటే: సరిగ్గా అదే గ్లోబలైజేషన్, సరిగ్గా అదే ఆధునికతా – వీటి వల్ల కలిగిన లాభాలు అనుభవిస్తున్న ఆ “నాణేనికి రెండో వైపు” బ్రతికే జనాభాలో నేనూ ఉన్నా కనుక. కాళ్ళు నేల మీద ఉంచుకుని, అలాగ సత్ఫలితాలు మాత్రం అనుభవిస్తూ వాటిలో కొట్టుకుపోకుండా, కొంచెం వాస్తవికంగా ఆలోచించడానికి (వ్యక్తిగతంగా) ఉపకరించిన సినిమాల గురించి ఇదివరలో రాసాను. వాటిలో దీన్నీ చేర్చుకుంటున్నా. (ఇప్పుడు అమాంతం నేను సమాజం పై విరుచుకుపడిపోయి ఏదో చేసేస్తా అని కాదు. సామజిక స్పృహ గురించి చెబుతున్నా, అంతే!)

ఇక, నాకు నచ్చనివి కొన్ని:

౧) మంచి ఫ్లో అంటూ ఎక్కడా లేదు ఈ సినిమాలో. భాగాలుగా విడగొట్టుకుని చూస్తే (అంటే, సీన్లు సీన్లుగా) బాగుంది అంతే. ఉన్నదానికి తోడూ, అక్కడ చర్చించే అంశాలేమిటి? వాటికి ఆ డ్యూయెట్లు, ఐటెం సాంగులూ ఏమిటి? అసలు ఆ పాటలు లేనప్పుడే ఆ సినిమాకి ఎ కాస్త కమర్షియల్ వాల్యూ నో ఉంది అనిపించింది నాకు. అవి పెట్టడం వల్ల నా ఉద్దేశంలో లాభం కంటే నష్టమే ఎక్కువ.

౨) రాజా ఉన్నంతలో బాగా చేసాడు కానీ, అతని భాషని “రూరలైజ్” చేయలేకపోయాడు అనిపించింది. నిజానికి హీరోయిన్ తీర్థ గురించి కూడా ఇదే అనిపించింది. ఈ ముగ్గురిలో ఎల్బీ శ్రీరాం కూతురుగా చేసిన అమ్మాయి కొంచెం నేచురల్ గా అనిపించింది ఆ పాత్రకి. “రూరలైజ్” అంటే ఏంటి? అనకండి. “ఆవకాయ బిర్యానీ” లో హీరో కమల్ కామరాజు ఆటో డ్రైవర్. కానీ, అతగాడి బాడీ లాంగ్వేజ్ గానీ, మాట్లాడే లాంగ్వేజ్ గానీ … కాన్వెంట్లలో చదువుకున్న వాళ్ళ భాషలా ఉంటుంది. అలాగే అనిపించింది నాకు ఈ సినిమాలో కూడా.

౩) ఈ అమ్మాయి తీర్థ పాత్ర డైలాగులు, శరీర కదలికలు భరించడం కొంచెం కష్టంగా ఉండింది నాకు (సెన్సార్ కత్తిరింపుల తరువాత కూడా). బహుసా, ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారేమో అనుకుని సరిపెట్టుకున్నా చివరికి. అంత ప్రభావం కలిగించింది కనుక బాగా చేసినట్లే! 🙂

 

మొత్తానికి, మంచి కథాంశాన్ని ఎంచుకున్నా, చక్కటి సంభాషణలు రాసుకున్నా, మంచి నటనను రాబట్టినా కూడా: స్క్రీన్ప్లే సరిగ్గా ఉండకపోవడం వల్ల ఒక సినిమా పాడు కావొచ్చని అర్థమైంది ఈ సినిమా చూసాక.

అయితే, రొటీన్గా ఒకే రకం కథాంశాలతో వచ్చే సినిమాలు చూసి బోరు కొట్టి ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే, ఆ సంభాషణల కోసం, అవి రేకెత్తించే ఆలోచనల కోసం, ఎల్బీ శ్రీరాం కోసం తప్పకుండా చూడండి.

 

ఈ సినిమా డైలాగులు మాత్రం (స్క్రీన్ప్లే అక్కర్లేదు)… ఎక్కడన్నా దొరికే సౌలభ్యం ఉందా?

One Response
  1. jd- February 4, 2012 /