Menu

ఒక రచయిత కృషి “ఋషి”

ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మాణరంగంలోని అడుగుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా అచితూచి అడుగేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానితోపాటూ అలాంటి నిర్మాణ సంస్థని ప్రేరేపించి, మళ్ళీ ఒక సినిమా తియ్యాలనే కోరిక కలిగేలా చేసిన కథకుడూ దర్శకుడూ రాజ్ మాదిరాజు ప్రతిభని కూడా అంచనా వెయ్యొచ్చు. ఈ నమ్మకం, అంచనాతోపాటూ, “మెడిసన్ ఒక తపస్సు. డాక్టర్ ఒక ఋషి” అంటూ ప్రోమోలు కలిగించిన ఆసక్తితో థియేటర్ కి వెళితే వేటినీ నిరాశపరచని చిత్రం ‘ఋషి’.

 

కేర్ లెస్ స్టూడెంట్ గా పరిచయమయ్యే మెడికో ఋషి, డాక్టర్ వృత్తి అనే తపస్సులో నిజమైన ఋషిగా మారి, ఎలా మిగిలిపోయాడు అనేది చిత్ర కథాంశం. డాక్టర్ కి పేషెంట్ కీ మధ్య ఉండాల్సిన సంబంధాల ఆబజక్టివిటీ, మెథాడికల్ ప్రొఫెషనలిజం గురించి భారతీయా సినిమాల్లో ‘ఆనంద్’ మొదలు మొన్నమొన్నటి ‘మున్నాభాయ్’ వరకూ ఎన్నో చిత్రాల్లో వచ్చాయి. వాటన్నిటి పార్శాల్నీ అందుకుంటూనే, మెడికోల కాలేజి జీవితాలను నిజానికి దగ్గరగా చూపిస్తూ, ఋషి అనే ఒక మెడికల్ స్టూడెంట్ (హౌస్ సర్జన్) ఆదర్శాన్ని కళ్ళకుకట్టే చిత్రం ఇది.

 

ఋషి గా అరవింద్ కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నా నటనలో పరిణితి అవసరం. ముఖ్యంగా బాడీలాంగ్వేజ్ పరంగా ఇంకా స్టిఫ్ గానే కనిపించడంతో కొన్ని సీన్లు అవసరమైన స్థాయిలో పండించలేకపోయాడు. నటనలో కొంత ఈజ్ చూపించగలిగితే ఒక మంచి నటుడైన హీరో తెలుగు పరిశ్రమకి దక్కినట్లే. సుప్రియా శైలజ పాత్రోచితమైన నటన కనబరిచించి. సినిమా ప్రారంభంలో కొంత తడబాటు కనిపించినా సినిమా ముగిసేసరికీ తన అందంతోపాటూ నటనా ప్రతిభకూడా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. పాత్ర రచనలోని వైవిధ్యం విద్య పాత్ర చేసిన సుచిత్రా ఆనందన్ లో కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రధానపాత్రలకంటే కూడా చెప్పుకోవలసింది ఉపపాత్రలు చేసిన కొందరు నటుల గురించి. విద్య పాత్రలో తీసుకున్న పాత్రోచితమైన కాస్టింగ్, మెడికల్ కాలేజ్ డీన్ పాత్ర చేసిన సంజయ్ రాయచూర్, కార్డియాలజీ ప్రొఫెసర్ పాత్రచేసిన సురేష్ (ఒకప్పటి హీరో సురేష్), జర్నలిస్టు పాత్రచేసిన రవికాంత్ లో చూపించడంతో పాత్రలేతప్ప నటులు కనిపించకపోవడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.

 

ద్వితీయార్థం నిడివి పాత్రలతో పరిచయం చేసుకోవడానికి అవసరమైనా, ద్వితీయార్థంలోని డ్రమాటిక్ కొనసాగింపులు సినిమా పెద్దదైందేమో అనే భావన కలిగిస్తాయి. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారి కత్తెరకు ఇంకొంచెం పదునుంటే బాగుండేది. చాలా రోజులకు సినిమా నెరెటివ్ లో మిళితమైపోయిన పాటలు కనిపిస్తాయి ఈ సినిమాలో. ముఖ్యంగా “డామిట్ అనాటమీ”, “చదువే చదువు” పాటలు మెడికోల మానసిక స్థితికి, భౌతిక పరిస్థితికి అద్దంపడితే, “చాకో మ్యాన్” అనే పాట బాలనటుడు గౌరవ్ మీద బాగా చిత్రీకరించారు. మెలొడీలుగా సాగే “ప్రేమనే ప్రేమతో”, “దూరం కాని దూరం” పరవాలేదు. “ప్రాణం ప్రణవం” పాట సాహిత్యపరంగా చాలా బాగా ఉన్నా రాక్ లాంటి ఫీల్ వల్ల అంతగా పొసగలేదు. డాన్-స్నిగ్ధ ల సంగీతం సినిమాను సంగీతపరంగా వేరేస్థాయికి తీసుకెళ్ళలేకపోయినా వెన్నుదన్నుగా మాత్రం నిలిచింది. త్రిభువన్ బాబు సినెమాటోగ్రఫీ బాగుంది.

 

ఈ సినిమాకున్న ముఖ్యమైన బలం మంచి కథ. తపన ఉన్న కథనం. అది చెప్పడానికి దర్శకుడు రాజ్ మాదిరాజు చేసిన సిన్సియర్ ప్రయత్నం. కథలు కరువైన తెలుగు సినీపరిశ్రమలో కథాబలంతో సినిమా తియ్యాలనుకునే నిర్మాణసంస్థగా ప్రసాద్ ప్రొడక్షన్స్ నిలబడాలన్నా, మంచి కథలకు ప్రోత్సాహం లభించాలన్నా ‘ఋషి’ సినిమా చూడాలి. ప్రస్తుతపరిస్థితుల్లో ఇటు ప్రేక్షకులుగా మనకూ అటు తెలుగు సినిమా పరిశ్రమకూ చాలా ముఖ్యం. ఈ వారమే విడుదల. చూసెయ్యండి !

7 Comments
 1. Madhu February 12, 2012 /
  • Raj February 21, 2012 /
   • satya February 29, 2012 /
   • Madhu March 1, 2012 /
   • రాజ్ మాదిరాజు March 9, 2012 /
 2. సత్య February 16, 2012 /