Menu

“శాటిలైట్ రైట్స్” అను విచిత్రజాలం

ఇప్పుడు తెలుగు సినిమా బతకడానికి కారణం ఏది అంటే మంచి హీరోలు, మంచి కధలు, మనది చాలా పెద్ద మార్కెట్ లాంటి సమాధానాలు రావొచ్చు కానీ, నిజానికి మన తెలుగు సినిమా బతుకుతున్నది ‘శాటిలైట్ రైట్స్’ మీద. అవును, నిజమే!

 

ఒకప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు బడ్జెట్ ఎంత, హీరోకి మార్కెట్ ఎంత, చివరికి మిగిలేదంత అని లెక్కలు వేసుకుని సినిమాలు తీసేవారు నిర్మాతలు. కానీ ఇపుడు పద్ధతి మారింది. పెద్ద హీరోలకి మించితే చిన్న హీరోలు, కొత్త వాళ్ళతో సినిమా తీసేటప్పుడు ముందు నిర్మాత తనకి తాను వేసుకుంటున్న ప్రశ్న ‘అసలు ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్’ ఎంత వస్తుందనే! దాని బట్టి మిగతా లెక్కలన్నీ వేసుకుని సినిమా మొదలు పెడుతున్నారు. చిన్న సినిమాకి మార్కెట్ అంత ఆశా జనకంగా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడిలో 60% శాటిలైట్ రైట్స్ ద్వారానే వచ్చేట్టు చూసుకుంటున్నారు నిర్మాతలు. ఎదిగే దశలో ఉన్న కుర్రహీరోలు అయిన నాని, వరుణ్ సందేశ్, నిఖిల్, తనీష్ లాంటి వాళ్ళు మరియు తమ ఉనికిని చాటుకోడానికి పాటు పడుతున్న శ్రీకాంత్, జగపతి బాబు, శ్రీహరి లాంటి వారికి ఇంకా వరస పెట్టి సినిమాలు వస్తున్నాయంటే కారణం ఈ రైట్స్ అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు హీరోలు పారితోషకానికి బదులు ఏదైనా ఏరియాలో బిజినెస్ తీసుకునే వారు. ఇప్పుడలా ఈ శాటిలైట్ రైట్స్ తీసుకుంటున్నారు. ‘బెజవాడ’ సినిమాకి నాగచైతన్య అలానే తీసుకుని నాలుగు కోట్లకి అమ్ముకున్నట్టు వినికిడి.

 

మొదట్లో శాటిలైట్ రైట్స్ కోసమే అన్నట్టు కొందరు ఇష్టమొచ్చినట్టు అయిదు, పది లక్షల్లో సినిమాలు తీసేసి లాభం వచ్చేట్టు అమ్మేసే వారు. తక్కువ సమయంలో ఎక్కువ అర్జించొచ్చు అన్న ఆశతో చాలా మంది వచ్చి విచ్చిల విడిగా శాటిలైట్ సినిమాలను తీసేసి తెలుగు సినిమా పరిశ్రమ కొన్నాళ్ళు బ్రష్టు పట్టించారు. (ఈ సినిమాలను అర్ధరాత్రుళ్ళు లేదా ‘విస్సా’ లాంటి చిన్న చానల్స్ లో చూడొచ్చు). అయితే వీటి వలన సినిమా కార్మికులకి చేతి నిండా పని ఉండేది కాబట్టి అందరూ ఇలాంటి సినిమాలను ప్రోత్సహించారు. కొంత కాలానికి ఛానల్ వారు అలాంటి సినిమాలు కొనడం మానేయడంతో నెమ్మదిగా వాటి జోరు తగ్గింది.

 

అసలు శాటిలైట్ రైట్స్ అంటే ఏమిటి? ఒక సినిమాను ఏదైనా టీవీ ఛానల్ వారు తమ ఛానల్ లో ప్రసారం చేసుకోడానికి ఆ సినిమా నిర్మాత దగ్గర అనుమతి పొందుతూ దానికి బదులుగా ఎంతో కొంత మొత్తం ముట్ట చెప్పడమే ఈ శాటిలైట్ రైట్స్. అది ఎంత అన్నది వారిరివురి మద్య ఒప్పందం మీద ఆధార పడి ఉంటుంది. సాధారణంగా సినిమా జయాపజయాల మీద, అందులో నటించిన నటుల మీద ఆ ధర నిర్ణయించబడుతుంది. ఏ హీరోని అయితే ప్రేక్షకులు ఎక్కువ సార్లు చూడడానికి ఇష్ట పడతారో, ఆ హీరో సినిమాలకి ఎక్కువ ధర పలుకుతూ ఉంటుంది. ఛానల్ ఆ సినిమాని ఎన్ని సార్లంటే అన్ని సార్లు వేసి, ప్రకటనలు ద్వారా వారు రైట్స్ కి ఇచ్చిన మొత్తంతో పాటు లాభాలు గడిస్తుంటారు. ‘మా’ ఛానల్ వారు ఎక్కువగా ‘అతడు’, ‘పోకిరి’ లాంటి movies ప్రసారం చేయడం మీరు గమనించే ఉంటారు. అది మహేష్ బాబుకి ఉండే క్రేజ్ ని బట్టి అలా వేస్తుంటారు.

 

ఈ రైట్స్ లో మళ్ళీ రకాలు ఉంటాయి. సదరు ఛానల్ వారికి శాస్వతంగా ఆ సినిమా ప్రసారం చేసుకునే హక్కులు ఇస్తున్నారా లేక కొన్నేళ్ళ వరకేనా అన్నది ఒప్పంద పత్రంలో తెలియ చేయబడుతుంది. శాశ్వత హక్కులు ఇచ్చేసారు అంటే ఇంక నిర్మాతకు ఆ సినిమా మీద టీవీలో ప్రసారం విషయమై అయితే అధికారం లేనట్టే. అదే పరిమిత అని ఒప్పదం తీసుకుంటే అయిదేల్లో, పదేళ్ళో గడిచిపోయాక మరలా వేరే ఎవరికైనా రైట్స్ ఇచ్చుకోవచ్చు లేదా అదే ఛానల్ వారికి ‘రెన్యువల్’ చేసుకునే అవకాశం ఇవ్వొచ్చు. ఇది వరకే తీసుకున్న ఉదాహరణ ‘అతడు’ నే మళ్ళీ తీసుకుంటే, ‘మా టీవీ’ వారు వారిదగ్గరున్న రైట్స్ కాల నియమం సమీపించడంతో మరో నాలుగేళ్ళకు గాను ఆరు కోట్లు ఇచ్చి రెన్యువల్ చేయించుకున్నారు.

 

అయితే, నిజానికి ఈ రైట్స్ ఎప్పుడూ ఛానల్ వారు నేరుగా కొనరు. ‘మూడో పార్టీ’ జోక్యం ఎక్కువ ఉంటుంది. ఎవరు ఈ మూడో పార్టీ?

నిర్మాత నుంచి రైట్స్ పొంది, దాని మరలా లాభదాయకంగా (కొన్ని సార్లు నష్టానికి) ఛానల్ కి అమ్ముకునే వారే ఈ ‘థర్డ్ పార్టీ’ వ్యక్తులు. నిర్మాతలు వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వీళ్ళంతా ఏక తాటి మీద నిలబడుతుంటారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఒక ధరకు రైట్స్ అడిగి, అతనికి నిర్మాత ఆ ధరకు ఇవ్వను అంటే, ఆ తర్వాత వచ్చే వ్యక్తులు అంతా దానికంటా తక్కువ మొత్తమే చెప్తారు. సరే, మొదటి వ్యక్తికే ఇద్దాం, కొంచం మంచి ధర చెప్పాడు కదా అనుకోడానికి ఇంకేం ఉండదు. ఆ వ్యక్తిని కలిశారో ‘అదప్పుడు చెప్పిన ధర అండి. ఇప్పుడంత లేదు’ అని ఇంకా తక్కువ చెప్తాడు. ఇలాంటి సంఘటనలు జరిగాక ఇంక ఏ నిర్మాతైనా ఏం చేస్తాడు? చేసేదేం లేక, ఆగితే ఇంకా తగ్గుతుందేమో అనే భయంతో ముందు అనుకున్న ధర కన్నా చాలా తక్కువకే అమ్ముతుంటారు. అందుకే నిర్మాతలు ఎప్పుడూ ‘First offer is the best offer’ అన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

 

చాలా మంది నిర్మాతలకి తమ సినిమా మీద పిచ్చ నమ్మకం ఉంటుంది. ఉండడంలో తప్పు లేదు కుడా.. కానీ, తప్పల్లా ఆ అతి ప్రేమ వ్యాపారం దగ్గర తన చేత తప్పటడుగులు వేయించినప్పుడే… సినిమా విడుదలకి ముందు కొందరు ఆ సినిమా మీద నమ్మకంతో ‘మంచి ధర’ ఆఫర్ చేసినప్పుడు, ఇదింకా మంచి ధరకి వెళ్తుందని ఆశ పడి, ఇంకా చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ అయ్యాక అత్యధిక ధరకి అమ్ముకోవచ్చు అని చూస్తుంటారు. కానీ బోల్తా పడతారు. ‘మంత్ర’ తర్వాత శివాజీతో ‘డైరీ’ తీసిన వారికి సినిమాకి ముందే కోటి ఇరవై లక్షల ఆఫర్ వస్తే కాదనుకుని, ఇంకా ఎక్కువ ఆశించి, సినిమా ఫ్లాప్ అయ్యాక చివరికి 60లక్షలకి అమ్ముకున్నారు. అలాగే ఈ మద్యే విడుదల అయిన హీరో భరత్ డబ్బింగ్ సినిమా ఒక దానికి 20 లక్షలు ఖర్చవ్వగా, మొదట్లో పాతిక లక్షల ఆఫర్ వస్తే ముప్పై అయిదు లక్షలు ఆశించి సినిమా విడుదల అయిన రెండో రోజే ధర తగ్గడంతో భయపడి పది లక్షలకు అమ్మారు. అత్యాశ పోయే ఇలాంటి ఉదంతాలు పరిశ్రమలో ఇంకా చాలా చూడొచ్చు.

 

మరి కొందరు నిర్మాతలు ఉంటారు. వారి దగ్గర సినిమాకి సరిపడా పెట్టుబడి ఉండదు కానీ సినిమా తీసేద్దాం అని వచ్చేస్తారు. వారికి ఉన్న ఆశ అంతా ఒక్కటే. కోటి రూపాయలు సినిమా తీయాలంటే యాభై లక్షలు ఉంటే చాలు. మిగతా యాభై శాటిలైట్ రైట్స్ ముందే అమ్మి మిగతా పూర్తి చేయోచ్చన్నది వారి ఆలోచన. అసలు ముందే ఎలా అమ్ముతారంటే, వారు సినిమా తీస్తున్నట్టు, ఆ ఫిలిం తమ వద్దే ఉన్నట్టు స్టూడియో వారు ‘ల్యాబ్ రిపోర్ట్’ ఇస్తే, అది చూసి ‘థర్డ్ పార్టీ’ వారు కొన్ని సార్లు కొంటూ ఉంటారు. కానీ ఇలా సినిమా పూర్తి కాక ముందే రైట్స్ అమ్మేయడం, ఆ డబ్బులు మళ్ళీ సినిమా మీదే పెట్టి పూర్తి చేయడం వంటివి శ్రేయస్కరం కాదు. అలా చేయడం వలన, సినిమా పరాజయం పాలైతే, ఆ తర్వాత నిర్మాత చేతులో చిల్లి గవ్వ కుడా మిగలదు చివరికి.

 

తెలివిగా వ్యవహరిస్తే ఈ రైట్స్ నుంచి చాల లబ్ది పొందొచ్చు. మార్కెటింగ్ లో ఆరితేరిన దర్శకుడు ‘మధుర’ శ్రీదర్ గారు ఇందులో బాగా తల పండినవారు. అతడి మొదటి సినిమా ‘స్నేహ గీతం’ని విడుదలకి ఒక రోజు ముందు పాత్రికేయులకి, కొందరు ముఖ్య వ్యక్తులకి షో ఏర్పాటు చేసారు. అది చూసి నచ్చిన ఒక వ్యక్తి ఆ మరుసటి రోజే, అనగా విడుదలైన రోజు 90 లక్షలకి రైట్స్ ఇచ్చేసారు. అందరు కొత్త వాళ్ళతో తీసిన ఆ సినిమాకి ఆ ధర పలకడం మామూలు విషయం కాదు. అతడి రెండో సినిమా ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ విషయంలో ఇంకా తెలివిగా వ్యవహరించారు ఆయన. విడుదలైన మొదటి వారం 40 లక్షలకి ఆఫర్ వస్తే ఇవ్వలేదు. సినిమా రెండో వారానికి పోయింది. ధర ఏమో ముప్పై ఐదుకి తగ్గింది. మూడో వారం కూడా సినిమా బాగా నడుస్తుంది. అయినా సరే ధర ముప్పైకి పడిపోయింది. విసిగి వేసారిన శ్రీధర్ గారు నేరుగా SUN NETWORK వారిని కలిసి సినిమా చూపించి, మాట్లాడి, తనకి మొదట వచ్చిన ధర కన్నా మూడు రెట్లకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఉదంతాలను బట్టి, నిర్మాతకి మార్కెట్ మీద పరిజ్యానం, నేర్పు, ఓర్పు ఉంటే లాభ పడొచ్చు అని అర్ధం అవుతుంది.

 

ప్రతీ సారి నిర్మాతే నష్టపోతాడని కూడా ఏం లేదు. కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులు కుడా ముందు ఎక్కువకి కొనేసుకుని తర్వాత అమ్మడానికి కష్టపడి, లాభం లేక ఎవరో ఒకరికి తక్కువకి ఇచ్చేస్తారు. అలాగే, ఇక్కడ ‘థర్డ్ పార్టీ’ అంటే ఒకే వ్యక్తి ఉండడు. కొన్ని సార్లు ఈ రైట్స్ ఛానల్ కి చేరే లోపు చాలా చేతులో మరుతూ ఉంటుంది. కొందరైతే మంచి ధర పలికే వరకు ఎవరికీ అమ్మకుండా అట్టే పెట్టేసుకుంటారు.

 

నిర్మాత శాటిలైట్ రైట్స్ కి అదనంగా ‘దూరదర్శన్’ ప్రసార హక్కులు కూడా పొందవచ్చు. ఏదైనా ప్రైవేటు ఛానల్ కి హక్కులు ఇచ్చేశాక కూడా ఈ హక్కులు పొందగలరని గమనించాలి. అయితే దూరదర్శన్ వారు దేని హక్కులు అంత తేలికగా తీసుకోరు. ఆ సినిమాకి ‘నంది’, ‘జాతీయ అవార్డు’ లాంటివి లభిస్తే పరిగణిస్తారు. అలాగే, DVD/VCD రైట్స్ కూడా ఇందులో కలవవు. అవి వేరేగా అమ్ముకోవచ్చు.

 

ఈ విధంగా ఒక నిర్మాత సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తన పెట్టుబడి మొత్తం శాటిలైట్ రైట్స్ ద్వారానే తెచ్చేసుకోగలిగే అవకాశం ఇప్పుడు ఉంది. కాబట్టి నిర్మాత దానిని గుర్తుంచి నేర్పుగా వ్యవహరిస్తే, లాభాలతో బయట పడొచ్చు, పరిశ్రమకి మరిన్ని మంచి సినిమాలు అందిచొచ్చు…

 

 

– శ్రీను పాండ్రంకి

www.srinuthedirector.com

 

Note: The figures I’ve mentioned in the article article are purely through some inner sources which may not be right. I hardly have evidences to prove that.

3 Comments
  1. Truthful February 24, 2012 /
  2. Praveen Sarma February 24, 2012 /
  3. అరిపిరాల February 27, 2012 /