Menu

చిన చేపను పెద చేప.. అను “గంగపుత్రులు” కథ

“చిన చేపను పెద చేప..పెద చేపను పెను చేపా.. చిన మాయను పెద మాయ..పెద మాయను పెను మాయా..అది స్వాహా ఇది స్వాహా…” – అన్న మాయాబజార్ దృశ్యం గుర్తొస్తోంది నాకు “గంగపుత్రులు” చూసాక. “సొంతఊరు” చిత్రం చూసాక, స్క్రీన్ప్లే విషయం ఎలా ఉన్నా కూడా, ఆ దర్శకుడు అలాంటి కథాంశంతో సినిమా తీసినందుకు కలిగిన గౌరవం కొద్దీ “గంగపుత్రులు” కూడా చూసాను. అంతకుముందే ఈ సినిమా గురించి కూడా ఒక “తప్పక చూడు” రికమెండేషన్ రావడం మరొక కారణం. ఆ మధ్య “సొంతఊరు” సినిమా గురించి అనుకున్నట్లే – “ఆర్టు”/వ్యాపారం మధ్య కొట్టుమిట్టాడుతూ కొనసాగుతున్నట్లు అనిపించినా కూడా, దాని మీద ఈ సినిమా కొంచెం బాగా వచ్చినట్లే లెక్క.

 

కథా విశేషాలు:

1) ౨౦౦౫ లో విశాఖపట్నం దగ్గరలో పోర్టు నిర్మాణానికని గంగవరం పల్లెలో జాలరి వాళ్ళ జీవితాలపై దెబ్బకొట్టే నిర్ణయాలు కొన్ని తీస్కుందని ప్రభుత్వం పై స్థానిక జాలర్లు నిరసన వ్యక్తం చేసారు. (సంబంధిత వార్తలు కొన్ని: ఇక్కడ మరియు ఇక్కడ)

౨) ౨౦౧౦ లో జరిగిన సోంపేటలో కూడా ఇలాగే ఒక పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా మత్స్యకారులు ప్రతిఘటించడంతో పోలీస్ ఫైరింగ్ జరిగింది. (ఈ సంఘటనపై ఆర్.నారాయణమూర్తి తీస్తున్న సినిమా “పీపుల్స్ వార్” షూటింగ్ ఇటీవలే మొదలైందట. వార్త ఇక్కడ)

-ఈ రెండు ఘటనల న్యూస్ కవరేజ్ క్లిప్పింగ్లతో మొదలవుతుంది సినిమా (ఈ రెండు సంఘటనల గురించి లీలగా వినడమే కానీ, లోతుగా వివరాలు నాకూ తెలీవు.)

 

మన కథ పెదజాలరి పేట అని ఒక ఊరిలో సాగుతుంది. అక్కడి జాలర్లకు సంప్రదాయ పద్ధతుల్లో చేపలు పట్టడానికి వెళ్తున్నందుకు కలుగుతున్న ఇబ్బందులు, వీళ్ళ మీద పెద్దోళ్ళు అయిన పడవల యజమాన్లూ – వాళ్ళ సమస్యలూ…. వీటి మధ్య ఒక పక్క ప్రభుత్వం చేపలు పట్టడం మీద వేసే ఆంక్షలు, మరొక పక్క పెద్ద సంస్థలు ఈ ప్రక్రియలోని వ్యాపార విలువలను చూస్కుని జాలర్ల జీవితాలకి ఇంకో పక్క నుంచి గండి కొట్టడం…వీటి మధ్యలో ఒక ప్రేమ కథా… అదీ ఈ సినిమా కథ.ఎంత టూకీగా చెప్పినా ఈమాత్రం వివరాలు చెప్పక తప్పడం లేదు.

 

వివరాల్లోకి వెళ్తే:

 

౧) బోసన్న (రాంకీ), అతని స్నేహితులు: మామూలు జాలర్లు. రోజూ సముద్రంలోకి వెళ్ళడం… గొప్ప వేట ఏమీ జరక్క నిరాశగా వెనక్కి రావడం. ఇదీ తంతు. వీళ్ళ ప్రకారం పెద్ద పెద్ద బోట్లు ఇతరత్రా పరికరాలూ అన్నీ ఉన్న “అన్నలు” లక్కి ఫెల్లోస్.

౨) ఇలాంటి “అన్నలలో” ఒకాయన, ఆయన ఇబ్బందులు, ప్రభుత్వం ఆంక్షలు గురించి విసుర్లు… అవతల ఇతర దేశాల వాళ్ళు మాత్రం స్వేచ్చగా చేపలు పట్టుకోవడం గురించి సెటైర్లు…

౩) వీళ్ళందరికీ అప్పులిచ్చే ఆయన, ఆయన సమస్యలు, దృక్కోణమూ

౪) బోసన్న ని మూగగా ప్రేమించే నూకాలు (తన్మయి), ఆమె కుటుంబ పరిస్థితి

౫) గంగమ్మ తల్లి దగ్గరే ప్రాణాలు విడువాలి అనుకునే ఒక తండ్రి…సోంపేట ఉదంతంలో అన్నని పోగొట్టుకున్నాక అండమాన్ వెళ్ళిపోయిన అతని కొడుకు

…..

మరొక పక్క: నెమ్మదిగా ప్రపంచాన్ని చూస్తూ, సీరియస్ జర్నలిస్టు అవుతూ ఉన్న స్వప్న (గాయత్రీ రావ్). ఆవిడని అనుక్షణం ప్రోత్సహించే వాళ్ళ ఎడిటర్ (రావు రమేష్), టీఆర్పీ రేటింగ్స్ తప్ప ఏమీ పట్టించుకుని మరో ఉద్యోగి (సుదర్శనం)

…..

ఇంకో పక్క: చేపలు పట్టడంలో గొప్ప బిజినెస్ మాడెల్ చూసి, ఇండియా మొత్తంలో చేపలన్నీ తామే పట్టాలని, వ్యాపార సామ్రాజ్యపు రారాజు కావాలని (ఇలాగ అతిగా పట్టేస్తే పదేళ్ళలో చేపలు లేకుండా పోతాయి అంటే… అప్పుడు మనం బిజినెస్ మార్చేస్తాం కదా… అనేయగలిగే) కలలు కనే యువ పారిశ్రామిక వేత్త అజయ్, అతని తాలూకా జనాభా.

– ఈ పాత్రల మధ్య జరిగే కథే…”గంగపుత్రులు”.

 

ఇందులో నాకు బాగా తీసారు అనిపించినవి:

 

౧) జాలరిపేట, దానికి సంబంధించిన వాళ్ళంతా శ్రీకాకుళం ప్రాంతాల యాస మాట్లాడ్డం (పూర్తిగా అర్థం కాకపోయినా) వినసొంపుగా ఉండింది 🙂 నాకు ప్రత్యేకం ఆ ప్రాంతాలతో పరిచయం లేదు కానీ, “నేటివిటీ” కొట్టొచ్చినట్లు కనబడడంతో చాలా సంతోషంగా అనిపించింది. నూకాలు పాత్ర వేసిన తన్మయి ఇంటర్వ్యూ యూట్యూబ్ లో చూసాక, ఆ అమ్మాయి ఎంత బాగా నటించిందో అర్థమైంది నాకు. నూకాలుగా కాక తన్మయి గా ఆమె మామూలు హైదరాబాది అమ్మాయి. కానీ, ఆ సినిమాలో మాత్రం పొరపాటన కూడా ఆ ఛాయలు కనబడవు. జాలరిపేటలో నూకాలు, నటి తన్మయి ఒకే మనిషంటే ఒక పట్టాన నమ్మలేకపోయాను. ఇప్పుడు నాకు ఈ సినిమాలో అందరికంటే నచ్చిన పర్ఫామెన్స్ నూకలుదే! 🙂

 

౨) నూకాలు కీ, విలేఖరికీ జరిగిన తొలి సంభాషణ, హార్బర్లో బోటు యజమాని డైలాగులు, చివర్లో స్టాక్ మార్కెట్ల గురించి ఎల్బీ శ్రీరాం పాత్ర మాటలూ, ఎడిటర్గా రావు రమేష్ మాటలూ,: ఇవన్నీ సాధారణ జీవితానుభవాల నుంచి పుట్టిన అద్భుతమైన సంభాషణలు. పారిశ్రామికవేత్త అజయ్ కీ, మినిస్టర్ కీ మధ్య జరిగే సంభాషణ – వీళ్ళకి వ్యతిరేక కోణంలో జరుగుతుంది. వీటిల్లో ప్రతి ఒక్కటీ (మనం బుర్ర పెట్టి వింటే)…ఆలోచనలో పడేసేవే! పడేసి మనసులో అల్లకల్లోలం సృష్టించేవే! ఈ సంభాషణలని బట్టి (కొన్ని రీవ్యూలలో రాసినట్లు) ఇదేదో anti-development చిత్రం అనిపించవచ్చు. కానీ, నాకు అర్థమైనంతలో ఇది విచ్చలవిడిగా వ్యాపారం చేస్కుంటూ పర్యావరణానికి, ప్రపంచానికి (కొందరు ప్రజలకి) సమస్యను సృష్టించే తరహా కాపిటలిజానికి వ్యతిరేకంగా తీసినది కానీ, అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు అనిపించింది.

 

నూకాలుకీ, స్వప్నకీ మధ్య జరిగిన తొలి సంభాషణ నన్ను రెండు వారాలు అయ్యాక కూడా ఇంకా వెంటాడుతోంది.

టీవీ విలేఖరి స్వప్న పెద జాలరిపేట వాసులని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి, పనిలో పనిగా నూకాలుతో కూడా ముచ్చట్లు మొదలుపెడుతుంది. సంభాషణ ఇలా సాగుతుంది.

 

********

స్వప్న: “హలో, మీరే…వన్ మినిట్.”

నూకాలు: “చేపలు కావాలామ్మా? మంచి చేపలు ఉన్నాయి.”

స్వప్న: “లేదు లేదు.చేపలు వద్దు”

నూకాలు: “బొంతలమ్మా” (నాలాంటి అమాయకులకి: అవొక రకం చేపలుట – బొంతలు)

స్వప్న: “లేద్లేదు..వద్దు”

నూకాలు: “పనిమనిషి కావాలా?”

స్వప్న: “అదేంటీ, అలా అన్నావు?”

నూకాలు: “మీ పట్నం వోళ్ళు మాలాంటోళ్ళని పిలిచేది అందుకోసమేగా. అపార్తుమెంట్లలో సగం ఇళ్ళలో పాచి పని చేసేది మా ఆడోళ్ళే”

స్వ: “ఏ? ఎందుకలాగా?”

నూ: “కాయ కట్టం చేసుకునేవాళ్ళు అంటే మీ కంటికేప్పుడూ చులకనే కదమ్మా. అందుకే, మా లాంటి వాళ్ళు పనిమనుషుల్లా అగుపిత్తారు”

స్వ: “మీరు కూడా మాలా చదువుకుని ఉంటె ఈ సమస్యలేవీ ఉండేవి కావు కదా. ఇలా మురికిగా కాకుండా, మీరూ మాలా బ్రతకొచ్చు కదా. అసలు మీ బతుకులు చూస్తూంటేనే మా అందరికి ఎంతో జాలి వేస్తుంది”

నూ: “ఎందుకమ్మా జాలి? నీ కళ్ళతో నా బ్రతుకెందుకు పోలుస్తావ్? నీ బ్రతుకు నీకు గొప్పైతే నా బ్రతుకు నాకు గొప్ప. అనవసరంగా జాలిపడి మా బ్రతుకులు సిన్నవి సెయ్యబోక.”

స్వ: “అయ్యో..అది కాదండీ… ఎక్స్క్యూజ్ మీ… మీ బ్రతుకులు బాగు చేయాలి అని తాపత్రేయంతో…”

నూ: “అమ్మా, నీకు దండవెడతాను. మా బతుకులు మాకు ఒగ్గేయండి. ఒకప్పుడు మా తాతా అయ్యా బానే బతికినారు. నీలాంటోళ్ళు మా బతుకులు బాగు చేయాలి అన్నాకే, మొదలెట్టాయి కట్టాలు. కరెంటు ఫ్యాక్టరీలు పెట్టి మా బతుకులు చీకటి సేసింది చాలమ్మా..చాలు” (నా ఘోష: ఇది హైలైట్ డైలాగు!)

స్వ: అదే మీరూ చదువుకుని ఉండుంటే..

నూ: ఏం సదువులమ్మా మీరు సెప్పేది? మీ కొలువుల్లో బంట్రోతు ఉద్యోగాలు సేయడానికా? అలా సదివే కొందరు…గంగక్కాకుండా, భూమిక్కాకుండా పోనారు. మా సదువులేవో మాకు సెప్పోచ్చుగా.. ఎలా బాగా సేపలు పట్టొచ్చు, అమ్మొచ్చో అని.. (నా ఘోష: ఇది ఇంకా హైలైట్ డైలాగు!!)

స్వ: నిజమే కానీ, ఇంకా మీరా మూఢ నమ్మకాలు, ఇరుకు జీవితాలు..

నూ: మా బతుకులు మావి, నా నమ్మకాలు మావి. నేను ఏ ఎలా సేపలు పట్టేదానిగా పుట్టానని దిగులు పడలేదు. నా బతుకు కంపనీ, నా కొంప ఇరుకనీ యాడ్నేదు. గంగమ్మ తల్లి సల్ల గాలి పీలుత్తూ, అమ్మిచ్చిన కలో గంజో తాగుతూ, హాయిగా బతుకుతున్నాం. మీకు నిజంగా ఏదైనా చేయాలనిపిస్తే, మమ్మల్నిలా ఒగ్గేయండి. మా నీట్లో ఇసాన్ని కలపొద్దు. మా నోట్లో మట్టి కొట్టొద్దు. అది సాలమ్మా మాకు.

*****

– ఈ సంభాషణ ఎన్ని సార్లు విన్నానో. ఎన్నిసార్లు తల్చుకున్నానో! దీన జనోద్దరణ సామ్రాట్లు, సామ్రాజ్ఞులు – పదే పదే గుర్తొచ్చారు. మగత నిద్ర నుండి బిందెడు నీళ్ళు పోసి నిద్రలేపినట్లు అయ్యింది నాకు. మళ్ళీ, ఇక్కడ సమస్య అభివృద్ధి కాదు. మనకి అభివృద్ధి అనిపించినది అందరికీ అభివృద్ధి – అన్న భావన ప్రమాదకరం: అని చెప్పడం ఈ చిత్రం ఉద్దేశ్యం కానీ, అభివృద్ధి వ్యతిరేకత కాదు అనిపించింది.

(ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, సినిమా స్క్రీన్ప్లే చదవాలని మహా ఆరాటంగా ఉంది)

 

 

నచ్చని విషయాలు:

౧) నాకర్థం కాని విషయం ఏమిటి అంటే: స్కిన్ షో, రెండు మూడు పాటలు పెట్టడం మాత్రమేనా కమర్షియల్ ఆంగిల్ అంటే? ప్రేమ కథ అంటూ ఉంటే అర్థ నగ్న ప్రదర్శనలు తప్పనిసరా? (ఇతర సినిమాల్లో ఇంతకంటే ఎక్స్పోజింగ్ చేస్తారుగా! అనే వాళ్ళకి నేను చెప్పేదేం లేదు). “సొంతఊరు” విషయంలో లాగానే, ఈ పాటలు జోడించడం వాళ్ళ ఈ సినిమాకి ఒరిగిందేమీ లేదు (ఆర్టు పరంగా, వ్యాపార పరంగా) అని నా అభిప్రాయం. పాటలు బాలేవని కాదు కానీ, సినిమా మూడ్ దెబ్బతీసాయి అనిపించింది.

 

౨) “ఓవర్ ఫిషింగ్” అన్న అంశం రేఖామాత్రంగా ప్రస్తావించి వదిలేసారు. కొంచెం దాని వల్ల పర్యావరణానికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా?? అన్నది కూడా చెప్పి ఉంటే, సినిమా కొంతమంది అభిప్రాయపడ్డట్లు “anti development propaganda” లాగా కాకుండా కొంచెం ప్రభావవంతంగా ఉండేది అనిపించింది. నా మట్టుకు నాకు ఇది “అభివృద్ధి వ్యతిరేకత” చూపే సినిమా కాదు. అది వేరే సంగతి.

 

౩) నటులు అందరూ వారి పరిధిలో బానే చేసారు కానీ, కొంచెం అనుభవం ఉన్న వారు దొరికి ఉంటే, ఇంకా ప్రభావ వంతంగా ఉండేదేమో అనిపించింది.

౪) ఎల్బీ శ్రీరాం కలం నుండి సంభాషణలు మిస్సయ్యా (దీనికి సునీల్ కుమార్ రెడ్డి గారే కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం). కానీ, ఉన్నంతలో ఆలోచింపజేసే డైలాగులు బోలెడు!

౫) రాను రాను నాకు సుబ్బరాజు మహేష్ బాబు డూప్ లా అనిపిస్తున్నాడు :))

౬) కొన్ని చోట్ల డాక్యుమెంటరీ లా ఉంది.

 

ఇదంతా అటు పెడితే, ఈ అంశం మీద సినిమా తీసినందుకు, దాన్ని ప్రోత్సహించినందుకు – దర్శకుడు, నిర్మాతలూ అభినందనీయులు.

తప్పక చూడవలసిన సినిమా!

 

7 Comments
 1. సురేష్ అట్టా February 21, 2012 /
  • Sowmya February 21, 2012 /
   • సురేష్ అట్టా February 22, 2012 /
   • Sowmya February 22, 2012 /
 2. vijay February 21, 2012 /
 3. lalitha February 23, 2012 /
 4. Sowmya February 23, 2012 /