The Devil’s Eye (1960) – Ingmar Bergman

IB-The-Devils-Eye-poster-1

సైతాను ఆఫీసు గదిని, అందులో ఉన్న లైబ్రరీ ని చూసారా మీరెప్పుడైనా?

సైతాను దూత ఒకటి – ఇద్దరు ప్రేమికుల మధ్య తగువులు పెట్టేసి, అక్కడే ఒక మూలన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వడం చూసారా?

ఇంతటి దుష్ట దూతనూ, “వైన్ బాటిల్ కప్ బోర్డులో ఉంది. కాస్త తీసిస్తావా?” అని అడిగి, అది లోపలి వంగగానే, తోసేసి, కప్బోర్డు మూసేసి తాళం పెట్టేసిన వాడిని?

సైతాను “డబ్బూ పోయే శనీ పట్టే” అన్న చందాన దిగులుగా ఏడవడం?

-నేను చూసాను. ఇంగ్మార్ బెర్గ్మాన్ తీసిన స్వీడిష్ చిత్రం “ది డెవిల్స్ ఐ” సినిమా చూస్తె మీరు కూడా చూస్తారు ఇలాంటి దృశ్యాలను.

 

“ది డెవిల్స్ ఐ” ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. “The chastity of a woman is a sty in the eye of the devil” అన్న వాక్యంతో మొదలవుతుంది కథనం. నరకంలో సైతానుకి కంటి మీద ఒక కురుపు వస్తుంది. దానికి కారణం భూమ్మీద ఉన్న ఒక అమాయకపు కన్య అని తీర్మానిస్తారు అతని సలహాదారులు. ఆ కురుపు పోవాలంటే ఆమెని ఆకర్షించి, ప్రేమలో పడవేసి, ఆమె కన్యత్వాన్ని అపహరించడమే పరిష్కారం అంటారు. దీనివల్ల, సైతాను డాన్ యువాన్ అన్న ఒక నరకలోక వాసిని పిలుస్తాడు. అతగాడు ఇదివరలో భూమ్మీద బ్రతికున్నప్పుడు వందలకొద్దీ అమ్మాయిలను తన మాయలో పడవేసిన చరిత్ర కలవాడు. ఇలా ప్రతి ఒక్కర్నీ ప్రేమలో ముంచి మోసం చేయడమే కానీ, నిజంగా ప్రేమించడం అంటే ఏమిటో తెలియని వాడు. చివరికి అలాగ “ప్రేమలో” పడ్డ ఒక అమ్మాయి తండ్రి తాలూకా విగ్రహం ఇతనితో చేయి కలిపినట్లే కలిపి, నరకంలోకి లాగేస్తుంది. (అదొక్క పెద్ద కథ. ఆసక్తి గలవారు వికీ పేజీ చూడండి). సరే, అతగాడు సైతాను చెప్పింది విని ఒప్పుకొని భూమ్మీదకు వెళ్లి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తాడు. అతగాడు తన ప్రయత్నంలో సఫలమయ్యాడా? పాపం సైతాను కురుపు తగ్గుముఖం పట్టిందా? అతని బాధ తీరిందా? అన్నది తదుపరి కథ.

 

ఒక బెర్గ్మాన్ సినిమాలో మొదట్నుంచీ చివరి దాకా హాస్యం పండడం నాకు ఇదే తొలి అనుభవం. బాగుంది. ముఖ్యంగా, ఆ సైతాను దూత మనుషుల మధ్య తిరుగుతున్నప్పటి సన్నివేశాలూ, సైతాను ఆఫీసు గదిలో జరిగే సంభాషణలూ నాకు బాగా నచ్చాయి. పాపం కథలో అమాయకుడు అనుకుంటూ వచ్చిన హీరోయిన్ నాన్న ను చూసి జాలి పడుతున్న దాన్ని కాస్తా, అతగాడు తెలివిగా సైతాను దూతని కప్ బోర్డులో పెట్టి తాళం వేసేయడంతో ముక్కున వేలేసుకున్నాను 🙂

 

ప్రత్యేకంగా సంభాషణల వల్ల నాకు నచ్చిన దృశ్యాలు రెండున్నాయి క్లైమాక్సులో.

 

ఒకటి – క్లైమాక్సులో సైతాన్ ఏడుపు:

“Devil: Those on high have deceived us. Our spite is put to evil work by their icily calculating kindness. I have had enough, I will withdraw. Heaven will manage without Hell. It will see whether it is easy. Our best weapon against a young girl, and the result is-

……

……

Whoever was it who had the foolish idea to send Don Juan to Earth…It is true, it was my own idea… This trade of mine starts to nauseate me. It is sad and inelegant to admit the victory of love and the complete defeat of evil. I am getting old. Leave me. ”

 

కాసేపటికి సైతాను మొహాన ఉమ్మేసి డాన్ యువాన్ వెళ్ళిపోయే దృశ్యం –

“Devil: Does that hurt?

D.Juan: If it pleases you, yes. But I am not complaining. You are ridiculous with your punishments – You, Satan, and He up there. And I despise you. Don Juan will never submit even if you crush him in terror. I remain Don Juan, scorning both God and Devil. And I allow myself to spit at your feet.”

అది చూడగానే ఒక రెండు క్షణాలు నోరు వెళ్ళబెట్టాను. “వారేవా! హీరో!” అనుకున్నా. డాన్ యువాన్ అంతమంది అమ్మాయిలతో ఆడుకున్నప్పటికీ, నాకు హీరోలా కనబడ్డాడు ఆ క్షణంలో స్వర్గాన్నీ, నరకాన్నీ ఏకకాలంలో ధిక్కరించగానే! వెంటనే అర్జెంటుగా బెర్నార్డ్ షా డాన్ యువాన్ పాత్ర ఆధారంగా రాసిన “మెన్ అండ్ సూపర్మాన్” చదివాను. యువాన్ కోసం ఓపిక తెచ్చుకుని ఇంక ఒపెరాలూ గట్రా కూడా వీడియోలు చూస్తానేమో…అని అనుమానం.

 

ఎప్పట్లాగే, ఈ సినిమా ముగిసే సమయానికి అన్నింటికంటే ముందుగా నాకు మనసులో నిలిచిపోయింది – కథ. ఆపై, బెర్గ్మాన్ కథనం. బెర్గ్మాన్ సినిమా చూసిన ప్రతిసారీ అనిపించినట్లే, ఆయన సినిమాలు మరిన్ని చూడాలి అనిపించింది ఈ సినిమా అయిపోవచ్చేసరికి :P. ఈ కథకు మరొక స్వీడిష్ రచన ఆధారం అని చదివినట్లు గుర్తు. నన్ను అడిగితే సినిమా తప్పకుండా చూడమని చెబుతాను. ఆన్లైన్ లో దీని స్క్రీన్ప్లే అయితే నాకు ఎక్కడా కనబడలేదు (అమెజాన్ సైట్లో కూడా కనబళ్లా!), . కానీ, ఈ కథకు బెర్గ్మాన్ రాసుకున్న వివరణలు చదవాలని ఉంది. ఎవరికన్నా ఈ స్క్రీన్ప్లే దొరికే మార్గం తెలిస్తే తెలుపగలరు.

3 Comments

3 Comments

 1. kiran.chikkala

  January 23, 2012 at 12:50 pm

  me rachanalu chala bagunnay……Keep it up

 2. kiran

  January 24, 2012 at 9:54 pm

  ippude ee cinima chusanu! naaku chala nachhindi!

 3. Varun

  March 6, 2012 at 9:40 pm

  mee Bergman reviews bagunnai

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title