Menu

గుల్జార్ విరచిత ’మీరా’!

వారాంతంలో సినిమాల, సంగీతాల డివిడిల వేటలో అనూహ్యంగా హేమామాలి నటించిన ’మీరా’ చిత్ర డివిడి కనిపించింది.  దృష్టిని ఆకర్షించేంత పెద్దగా ’Gulzar’s Meera’ అని రాసుంది. ముందు, ఏదో ప్రైవేట్ ఆల్బమ్ అనుకున్నాను. తీరా చూస్తే హేమామాలిని ప్రధాన పాత్రగా, వినోద్ ఖన్నా, షమ్మీ కపూర్,భరత్ భూషణ్ తదితర తారాగణంతో రూపొందించిన పూర్తి నిడివి చలనచిత్రం అని తెలియగానే మరో ఆలోచన లేకుండా కొన్నాను. ఇవ్వాళే చూసాను.చిత్రశీర్షిక తెలుపుతున్నట్టు ఇది మీరా బాయి కథ. కృష్ణుని మదిలో నిలుపుకొని, అతడినే భర్తగా భావించి, ఐహిక సుఖాలను, ఇహపర బంధాలను తజ్యింజి, ప్రేమకూ, భక్తికి కొత్త నిర్వచనాన్ని సృష్టించిన జగద్విత మీరా బాయి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయబడింది. మాటలూ, స్ర్కీన్‍ప్లే గుల్జార్.

సినిమా మొదలయ్యేటప్పటికి మీరా తన తల్లిదండ్రులను కోల్పోయి, మేనత్తమామల దగ్గర పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు తల్లి సరదాకి “నీ భర్త కృష్ణుడు” అన్న మాటలను యుక్తవయసులో కూడా బలంగా నమ్ముతూ, కృష్ణునికి సంబంధించిన పాటలు పాడుకుంటూ ఉంటుంది. అప్పటికి దేశరాజకీయ పరిస్థితులు చాలా సున్నితంగా ఉంటాయి. ఓ పక్క జోధా బాయి వల్ల కలిగిన సంతానాన్ని హిందూ-ముస్లిం రాజులకు దగ్గర చేయటానికి ఢిల్లిని ఏలుతున్న అక్బర్ ఓ కొత్త మతాన్ని సృష్టించి దేశాన్ని ఏకం చేయాలని పరితపిస్తూ ఉంటే, మరో పక్క రాజ్‍పూత్‍లంతా కలిసి అతడి అధికారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

ఆ ప్రయత్నంలోనే తన కూతురికి కుదిర్చిన సంబంధం విధి వక్రించటం వల్ల విఫలమవ్వటంతో, అదే ఇంటికి మీరాని వధువుగా పంపిస్తారు. అప్పటిదాకా మనసా,వాచా,కర్మణా కృష్ణున్నే భర్తగా ఊహించుకున్న ఆమె, ఇప్పుడు మరో మనిషికి ఆ స్థానం ఇవ్వటానికి నిరాకరిస్తుంది. “నాకు ఇది వరకే పెళ్ళైయ్యింది, కృష్ణుణితో” అని చెప్పినప్పుడు నవ్వుతూ కొట్టిపారేసిన ఆమె భర్తకు రోజుల గడిచేకొద్దీ ఆమె నమ్మకం హాస్యాస్పదం కాదని అవగతమవుతుంది. కృష్ణునికి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ కొద్దిగా కూడా వెనక్కి తగ్గకుండా మీరా చేపట్టే పనుల వల్ల అత్తారింట అందరి అగ్రహానికి గురైవుతుంది. ఎప్పుడూ పూజలతో, భజనలతో ఉండే ఆమెను ఆడబడచు కంటకంగా చూస్తుంది. ఆమె మితిమీరిన వ్యవహారం వల్ల పుట్టింటికి పంపవేయబడుతుంది. అక్కడా ఆమెకు ఆశ్రయం దొరకదు. కృష్ణుని సన్నిధానికే చేర్చే గురువు కోసం ఆమె దేశం పట్టుకొని తిరుగుతుంది. సంత్ రాయ్‍దాస్‍ను కలుస్తుంది. ఆయన నిమ్న కులాలకు చెందిన వ్యక్తి కావటంతో, ఆయనను గురువుగా స్వీకరించటంతో అందరికి అప్రియం అవుతుంది.

తిరస్కారాన్ని లెక్కచేయకుండా మీరా కృష్ణనామ సంకీర్తనలతో కాలం గడుపుతూ ఉంటుంది. ఆమె గానామృతం గురించిన చర్చలు నలుదిశలా వ్యాపిస్తాయి. ఇంతలో రాజకీయ పరిస్థితులు క్షీణించి రాజ్‍పూత్‍లను అక్బర్ యుద్ధంలో దారుణంగా ఓడిస్తాడు. మీరా తండ్రిని, తమ్ముణ్ణి చంపేస్తాడా యుద్ధంలో. ఆమె భర్తను  క్షతగాత్రుడిగా మిగిలిపోతాడు. ఇవేవీ తెలియని మీరా గానానికి ముగ్దుడై అక్బర్ ఆమెకు బహుమానం ఇస్తాడు. అది తెల్సుకున్న ఆమె అత్తింటి వారు, అమెను దేశద్రోహిగా భావించి మరణదండన విధిస్తారు. ఆమెను అమితంగా ప్రేమించే భర్త, తప్పించుకుపోమనో, లేక తప్పొప్పుకోమనో ఎన్ని విధాల నచ్చజెప్పినా తలొగ్గక విషం స్వీకరించటంతో సినిమా ముగుస్తుంది.

మీరా సినిమా అనగానే భక్తిరస ప్రధానంగా ఉంటుందనుకున్నాను గాని, సినిమా పూర్తయ్యాక కొన్ని రాజకీయ, సామాజిక పరిస్థితుల మధ్య ఒక యువతి తన నమ్మకాన్ని నిలబెట్టుకున్న తీరుని చూపించటం బలమైన ఉద్దేశ్యం అనిపించింది నాకు. తమ సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడి ప్రాణానికి తమ ప్రాణానికున్నంత విలువిచ్చి, అనివార్యమైతే తప్ప యుద్ధం జోలికి పోకుండా, అలా తప్పించడానికి వీలైతే తమ కుటుంబాలోని అమ్మాయిలను విరోధులకు వియ్యమివ్వటానికి వెనుకాడని అప్పటి రాజుల ప్రయత్నాలు ఒకవైపు అయితే, తండ్రి ఆదర్శాల మేరకు తలవంచి మనువులకు సిద్ధపడే రాజకుమార్తెలు మరో వైపు. మీరా మేనత్త ఒక చోట అంటుంది, “రాజ్‍పూత్ ఇంటి అమ్మాయిలు, సతియై మరణించడానికి సిద్ధపడ్డట్టే, సతియై బతకటానికీ వెనకాడరు” అని. (ఆవి సతిసహగమన ఆచారం ఉన్న రోజులు). ఆ ఒక్క మాటే అప్పటి రాకుమార్తెల జీవనంలోని సంక్లిష్టతలకు అద్దం పడుతుంది. ఇహ, సమాజంలో ఉన్న విభేధాలు, మర్యాదల పేరిట స్త్రీలకున్న నిబంధనలను ఎటూ ఉండనే ఉంటాయి.

ఈ సినిమాకు ఇద్దరు హిరోయిన్లు, నా లెక్క ప్రకారం. ఒకరు తెరపై కనిపించే హేమమాలిని. ఆవిడ నటనలో ఉండే విలక్షణత చూపించే చిత్రం ఇది. కీలక సన్నివేశాల్లో కూడా ఎక్కడా డ్రమాటిక్‍గా కాకుండా సహజంగా భావోద్వేగాలను పలికించారు. ఇహ, ఇంకో హీరియిన్ వీనులవిందు చేసే వాణి జయరాం. మీరా బాయి రాసిన పాటలను వాణి గారి మృదుమధుర గాత్రంలో వింటుంటే తాదాత్మ్యం కలుగుకమానదు. ఈ చిత్రానికిగాను ఆవిడకు ఫిల్మ్-ఫేర్ అవార్డు వచ్చింది. అన్నీ పాటలూ బాగున్నాయి. నాకు విపరీతంగా నచ్చినవి మాత్రం “మై సాన్‍వరె కె రంగ్ రచీ” ఇంకా “మెరె తొ గిరిధర్ గోపాల్”. ఈ చిత్రానికి పండిత్ రవిశంకర్ స్వరాలను కూర్చారు. నేపథ్యసంగీతం కూడా చాలా నచ్చింది నాకు.

ఇందరు అతిరధమాహారధులున్న సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైయ్యిందని, ఈ సినిమా తర్వాత గుల్జార్ ఐదేళ్ళవరకూ మరో చిత్రాన్ని తీయలేదని వికిపీడియా భోగట్టా. బాక్సాఫీసు వద్ద జయాపజయాలను మంచి చిత్రాలకు కొలమానంగా తీసుకోవటం తొందరపాటే అవుతుందని తెలియజెప్పే సినిమా ఇది. కథనం వడివడిగా సాగుతూ, మంచి నటనతో, అద్భుతమైన సంగీతంతో సాగే ఈ సినిమా నా మట్టుకు నాకు బా నచ్చింది.

నన్ను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఒకటుంది, ఈ చిత్రంలో. అది మీరా భర్త పాత్రను చిత్రించిన తీరు, దాన్ని వినోద్ ఖన్నా పోషించిన వైనం. కృష్ణునిపై మీరాకున్న భక్తి, ప్రేమ అనితర సాధ్యం అని వేన్నోళ్ళ వినిపిస్తూనే ఉంటుంది కదా. అంతటి భక్తిశ్రద్ధలతో భగవంతునిని కొలవడానికి పెట్టి పుడతారు కాబోలు, ఆయా మనుషులు. ఎన్ని యుగాలైనా వారిని గాధలను కథలు కథలుగా చెప్పుకుంటుంటారు, లోకులు. ఈ సినిమాలో ప్రేమకు మరో కోణం ఉంది. మీరా భర్తకు ఆమెపైనున్నది గొప్ప ప్రేమల లెక్క కింద వస్తుందో లేదో కానీ, అది నిజాయితీ గల ప్రేమ. మొదట్లో ఆమె చేష్టలకు కోపంతెచ్చుకొని, మనసు కష్టపెట్టుకున్న అతడు రానురాను ఆమె ప్రేమకున్న శక్తిని తెలుసుకుంటాడు. ఆమెలో ప్రజ్వల్లితున్న భక్తి దీపాన్ని సంభ్రమాశ్చర్యాలతో గమినిస్తూ ఉంటాడు. మీరాకు రాధ అంటే ఈర్ష్య. అది తెల్సుకున్న అతడు, “నీవు రాధంటే ఈర్ష్య పడుతుంటే ఏమో అనుకున్నాను గానీ, ఇప్పుడు కృష్ణుడి విషయంలో నా పరిస్థితి అంతే కదూ!” అని వాపోతాడు. ఆమెను మృత్యువాత నుండి తప్పించడానికి పరిపరి విధాల పరితపిస్తాడు. చివరకు, ఆమె తన కళ్ళముందే విషాన్ని తాగుతూ ఉంటే చూస్తూ ఉండిపోతాడు. ఈ పాత్రను ప్రత్యేకమైన శ్రద్ధతో మల్చినట్టున్నారు. ఒక వైపు దేశరాజకీయ,సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగానే విధుల నిర్వహిస్తూ, మరో పక్క మీరా శ్రేయస్సుకోసం తపించే భర్తగా వినోద్ ఖన్నా నటన అద్భుతం. ఆ పాత్రలో ఉన్న సంఘర్షణను, అసహాయతనూ ఆయన బాగా చేసుకొచ్చారు.

మొత్తానికి సినిమా భక్తి అనే ఒకే ఒక్క కోణంలో కాక, చరిత్రకు, మానవసంబంధాలకు, స్త్రీ అస్థిత్వానికి సంబంధించిన అనేక కోణాలను స్పృశిస్తుంది.

డివిడి ఇంగ్లీష్ సబ్‍టైటిల్స్ తో అందుబాటులో ఉంది. కానీ అనువాదం చాలా పేలవంగా ఉండటమే కాక, కొన్ని చోట్ల తప్పులు కూడా దొర్లాయి. “ఇవ్వలేదు” అన్నచొట “ఇచ్చారు”లాంటి అలక్ష్యపు పొరపాట్లూ ఉన్నాయి. కేవలం సబ్‍టైటిల్స్ మీద ఆధారపడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

సినిమా వివరాలు:

మీరా
నిర్మాత: ప్రేమ్‍జీ
రచన, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: గుల్జార్
సంగీతం – రవి శంకర్
తారాగణం: హేమామాలిని, వినోద్ ఖన్నా, షమ్మీ కపూర్, అమ్జద్ ఖాన్, భరత్ భూషణ్, ధీనా పాఠక్, ఓం షివ్‍పురి తదితరులుడివిడి వివరాలు:

షెమరూ ఎంటర్నైమెంట్
నిడివి: 139 నిముషాలు
సబ్‍టైటిల్స్: ఇంగ్లీష్
వెల: INR 149