ఎడారి వర్షం: దోషం నాది కాదు, మూలానిది!

ఏం చెప్పదల్చుకున్నాడో రచయిత ముందే నిక్కచ్చిగా నిర్ణయించేసుకోవడం వల్ల పుట్టే అసంబద్ధమైన కథల కోవకి చెందినది దేవరకొండ బాల గంగాధర తిలక్‌ ‘ఊరిచివర ఇల్లు’. పరాయి జీవితమైనా దాన్నొక సహానుభవంగా కాకుండా స్వకపోల కల్పితంగా ‘సృజిస్తే’ కొన్ని అష్టావక్ర కథలు పుట్టుకొస్తాయి. తన ఆధునిక కవిత్వానికి ఆపాదించుకున్నట్లే, కథలకు కూడా ప్రబోధించే తత్త్వాన్ని ఎక్కించాలని ‘బాధ్యత’తో భావించినందువల్లనేనేమో తిలక్‌ కథలు చాలావరకూ పైకోవకి చెందుతాయి.

ఇక ‘ఊరి చివర ఇల్లు’ విషయానికొస్తే, ఈ కథకి Third person నేరేటర్‌- all pervading, all knowing కథకుడే.

”ఊరికింత దూరంగా ఈ ఇల్లెందుకు ఉందో ఎవరికీ తెలియదు”- అని చెప్తాడు కథకుడు కథారంభంలో.

రమ అనే ఓ యువతి, ఆమెని, ఆమె శరీరాన్ని నమ్ముకొని బతుకుతున్న ముసలి అవ్వ ఉంటారా ఇంట్లో. ఆ ఇల్లెందుకు అలా ఏకాంతంగా, పోని ఒంటరిగా ఉందో ఎవరికీ తెలియకపోతే ‘బేరాలు’ ఉండవేమోనని అవ్వ తరఫున బెంగటిల్లుదామంటే, అవ్వే అంటుంది-”….వచ్చిన ప్రతివాణ్ణి వెళ్ళగొడతావు. ఎవళ్ళో రాజకుమారులు కాని నీకు నచ్చనే నచ్చరు.”

కాబట్టి, ఊరికి చివర మైళ్ల పొడవున విస్తరించి ఉన్న పొలాల మధ్య ఆ ఒంటరి ఇల్లు ఎందుకు ఉందో మెజారిటీకి తెలియకపోయినా, ‘తెలియాల్సిన’ వాళ్ళకి తెలిసే ఉంటుందని అర్థమవుతుంది. అయితే, వచ్చిన విటులందర్నీ ఆమె అంగీకరించదు(ట) తన ఇష్టాయిష్టాల కనుగుణంగా ఎంచుకునే సావకాశం ఉందన్నమాట. తీయని మాటలతో ఆమెని మభ్యపెట్టి, అనాథాశ్రమం నుంచి లేపుకెళ్ళిన పెద్దమనిషి అర్థాంతరంగా తనని విడిచిపెట్టి వెళ్ళిపోతే, దిక్కులేని తనని అవ్వ చేరదీసి వృత్తిలోకి దించింది. రాకుమారుల వంటి వారిని మాత్రమే అరుదుగా ఎంచుకునే రమ, ఒకానొక యువరాజు వల్ల గర్భవతై, గర్భస్రావానికి ఇష్టపడకుండా ఒక పిల్లాడ్ని ప్రసవించి, ఆ పసిగుడ్డు మూడు నెలలు నిండకుండానే చనిపోవడంతో పుట్టెడుదుఖంతో ఉన్నప్పుడు మొదలవుతుంది కథ. తిలక్‌ మాటల్లో చెప్పాలంటే ‘పెద్ద సహారా ఎడార’ంత ఒంటరితనాన్ని లోలోపల భరిస్తూ ఉంటుందామె.

కుండపోత వర్షంలో ప్రమాదకరమైన దారిలో వెళ్తున్న అపరిచితుడ్ని కేవలం మానవతాదృష్టితోనే లోనికి పిలుస్తుంది. కానీ, అతను తన చిన్ననాటి నేస్తంలా అన్పిస్తే అలజడికి గురవుతుంది. సందర్భాలు కుదిర్చిన చనువు వల్ల తన బాల్యం, అనాథ జీవితం, విఫల ప్రేమవృత్తాంతం…ఇవన్నీ చెబుతుంది అతనికి. సమాజం అంగీకరించి, ఆమోదముద్రలు వేసే ‘స్థిరత్వం’ లేనివాడు కావడం వల్ల, మిలటరీలో మానేసి మరో ఉద్యోగం చేస్తున్నా, దిశా, గమ్యం లేకుండా తిరిగే నైజం ఉన్న జగన్నాథం ఆమె పట్ల ఆకర్షితుడౌతాడు. ఆమె ప్రేమకథ, చిన్ననాటి జాలికథ విని పెళ్లి చేసుకోవాలని అనుకోవడమే కాదు, ఆమెకి వాగ్దానం చేస్తాడు. జగన్నాథం అన్నంతపని చేస్తే తాను నిరాధారమవుతానన్న భయంతో అవ్వ అతని మనసు విరిచేస్తుంది. రమ మాటలన్నీ బూటకాలని నమ్మి జగన్నాథం కోపంతో డబ్బున్న పర్సు విసిరేసి వెళ్లిపోతాడు. అవ్వ చేసిన ద్రోహం అర్థమై, రమ పర్సు ఇవ్వడానికి రైల్వేస్టేషన్‌కి పరుగులు తీస్తుంది. వేగం అందుకున్న రైలు కిటికీలోంచి జగన్నాథం పర్సు విసిరేస్తుంది. చీర మడత కాలికి తట్టుకొని బొక్కబోర్లా పడిపోతుంది. డబ్బు చెక్కుచెదరకుండా ఉంటుంది గానీ జగన్నాథం ఫోటోమాత్రం ఉండదు అందులో. వేగం అందుకున్న రైలులోంచి ఆమె దుస్థితి చూసిన జగన్నాథం ముఖం బాధలో నల్లబడుతుంది.

కథాగమనంలో పాత్రల ఉద్దేశాలకి, తదనుగుణంగా ఉన్న సంభాషణలకి ఏ మేరకు పొంతన ఉందో చూద్దాం:

అవ్వ ఉద్దేశం ప్రకారం జగన్నాథానికి రమ మీద అసహ్యం కలగాలి. ‘పెళ్ళి చేసుకోవాలన్న’ నిర్ణయాన్ని మానుకోవాలి.
”నువ్వు నమ్మేశావా బాబూ, అదంతా నటన. ఎప్పుడూ ప్రతివాళ్ళ దగ్గరా యిలాగే కల్పించి చెప్పుతుంది. వాళ్ళు జాలేసి యింకో వంద ఎక్కువిచ్చేవారు. నీ కనుభవం తక్కువ. లేత మనిషివి. ఇట్టే నమ్మేశావ్‌” అంది ముసలిది అతన్ని కనిపెడుతూ.
అంటే రమ నటనని నిజమని నమ్మిన జగన్నాథం పెళ్లి చేసుకుంటానన్నాడు. రమ నటనని నమ్మనివాళ్ళు జాలిపడి మరో వంద రూపాయలు ఎక్కువ ఇస్తారు. రమ చేసేమోసం అర్థమైతే, ఆమెకి ఒక వందరూపాయలే లాభం. ఆమె మోసం అర్థం కాకపోతే మరింత లాభం- ఆమెకి పెళ్ళవడం.

జగన్నాథం- మోసపోయే బాపతో కాదో తెలియదు. ఈలోపే ‘డబ్బు మాట నువ్వడుగు నాకు సిగ్గేస్తుంది’ అని మరీమరీ అవ్వకెలా చెబుతుంది? ‘ఆఖరికి బజానా అయినా కొంత తీసుకో అవ్వా’ అని పోరిన మనిషి, లోపలికి వెళ్లి ఈ కల్పిత కథని మహా నటనాభినయంతో చెప్తుందా? ‘ఇలాంటి తప్పుడు వేషాలెయ్యొద్దని ఎన్నోసార్లు చెప్పా’నంటుంది అవ్వ. మోసాలు చెయ్యకని హెచ్చరించానని జగన్నాథంతో అంటుంది. మోసం చేయాలని ప్రయత్నించినా, ఎవరో జగన్నాథంలా అనుభవం తక్కువైన, లేత మనుషులు మోసపోతారు గానీ, మిగతా వారి విషయంలో ఆ గొడవ లేదు. ఒకవేళ జగన్నాథం లాంటి వాళ్ళు మోసపోక మునుపే, బజానా తీసుకోమని చెప్పి రమ స్వయంగా తన మోసాన్ని తానే రసాభాస చేస్తుంది కదా. ఇక ముసలి అవ్వకి సమస్యేముంది!

ఇంత అసంబద్ధంగా అవ్వ చెప్పిన చాడీలు విన్న జగన్నాథం అచ్చంఅవ్వ ఊహించినట్టే డబ్బు విసిరేసి, రమని లేపకుండా వెళ్లిపోయాడు కాబట్టి సరిపోయింది గానీ, లేకుంటే రమని లేపి, ఇంత మాయమాటలు చెప్తావా అని నిలదీసినట్టయితే అవ్వ పథకం పారేదేనా? రమ అతని ఫోటోని మరో జ్ఞాపకంగా ఉంచుకోవాలంటే కథకుడు, అవ్వ కూడబలుక్కుని జగన్నాథాన్ని అడ్డగోలుగా నడిపించాలి. పరిగెత్తించాలి కాబోలు. రమని అపార్థం చేసుకున్న బాధతో జగన్నాథం ముఖం నల్లగా మారిపోయింది చివర్లో. రైలు చాలాదూరం కదిలిపోయింది కాబట్టి దిగలేకపోయాడు. పక్క స్టేషన్‌లో దిగి వెనక్కి వస్తే, ‘ఊరి చివర ఇల్లు’ కథ యావత్తూ బొక్కబోర్లా పడిపోతుందని కథకుడికి తెలుసో లేదో. కాబట్టి, రక్తమాంసాలు లేని ఇటువంటి చెత్తకథని- పాత్రలు, లొకేషన్‌, బడ్జెట్‌ వంటి పరిమితులకు లోబడి అయినా- ఎంచుకోవడం ‘తెలుగు ఇండిపెండెంట్‌ సినిమా’ చేసిన తొలితప్పు. కథలో ఏవైతే పొసగని అంశాలున్నాయో, దాని ఆధారంగా తీసిన సినిమాకి కూడా అవే అంటుకుంటాయి అనివార్యంగా.

కథకుడు, కవి కూడా అయిన తిలక్‌ కొన్ని వర్ణనలు, మరికొన్ని వివరాల ద్వారా మట్టిముద్దని పిసికి పిసికి బొమ్మని చేసే ప్రయత్నం చేశారు. పదాల ద్వారా ఎస్టాబ్లిష్‌ అయ్యే వాటిని, దృశ్యాల సాయంతో నిలబెట్టాల్సిన పెద్ద బాధ్యత (లఘు) చిత్ర దర్శకుడిది. ‘కత్తి’మీద సాము వంటి బాధ్యతది.

బడ్జెట్‌ పరిమితుల వల్ల కావొచ్చు, 30 నిమిషాల ఈ లఘు చిత్రం మాటల ఊతకర్ర మీద నిలబడిందే తప్ప, ఎస్టాబ్లిషింగ్‌ దృశ్యాల దన్ను లేదు. దాంతో సంభాషణలకి కృతకత్వం అంటింది. అందంగా అన్పించిన కొన్ని షాట్ల చిత్రీకరణ వల్ల దర్శకుడు కత్తి మహేష్‌ కుమార్‌ నుంచి ఓ promise దక్కుతుందంతే.

skype,gtalk ద్వారానో మరే ఇతర కమ్యూనికేటివ్‌ వ్యవస్థలతో కనెక్ట్‌ అయి ఉండే ఈ తరానికి తోకలేనిపిట్ట (ఉత్తరం) మాత్రమే ఉభయకుశలోపరి సందేశాలు చేరవేసే కాలం నాటి సాధకబాధకాలు అర్థంకావు. కాబట్టి కథాకాలాన్ని, అన్యాపదేశంగానైనా నిర్థారించకపోతే, గాఢమైన వియోగ సన్నివేశాన్ని కూడా ప్రేక్షకుడు సీరియస్‌గా పట్టించుకోడు.

ఇంతకీ ఈ లఘు చిత్రానికి ‘ఎడారి వర్షం’ అని పేరెందుకు పెట్టారో మాత్రం అర్థంకాలేదు. రమ, జగన్నాథం, చివరికి అవ్వలో కూడా ఒంటరితనం సహారా ఎడారిలా వ్యాపించి ఉందని అంటారు కథకుడు తిలక్‌, ‘ఊరి చివర ఇల్లు’లో. మరి ఏ ఎడారి ఒంటరితనానికి సాంత్వనలా కురిసిన వర్షమిది?

      -నరేష్‌ నున్నా