Menu

Agneepath – 2012

ఒక కుర్రాడు. పసిప్రాయంలోనే తీరని అన్యాయానికి గురవుతాడు. అయినవాళ్ళను పోగొట్టుకుంటాడు. అలా పోగొట్టుకోడానికి కారణభూతమైన ఒక వ్యక్తి ఉన్నాడని తెల్సుకుంటాడు. పగే ఊపిరిగా, ప్రతీకారమే జీవితాశయంగా పెరిగి పెద్దవాడవుతాడు. చెడుమార్గాలను అనుసరిస్తాడు. ఎవరన్నా ప్రశ్నిస్తే, “నేరం నాది కాదు. లోకానిది.” అంటాడు. వెతుక్కుంటూ వెళ్ళి తనకు అన్యాయం చేసిన వ్యక్తిని చీల్చిచెండాడుతాడు. ది ఎండ్.

ఇదే కథాంశంతో వచ్చిన బాలీవుడ్ చిత్రాలకు కొదువ లేదనుకుంటాను. నాకున్న మిడిమిడి జ్ఞానంతోనే ఒక రెండు సినిమాల పేర్లు చటుక్కున గుర్తొస్తున్నాయి. డభ్బై, ఎనభైలలో అచ్చొచ్చిన కథాంశాన్ని తీసుకొని అచ్చంగా అలాంటి సినిమా ఇప్పుడు తీయడమే దేనికంటే? కరణ్ జోహర్ జవాబు ఇలా ఉంది.

అగ్నిపథ్ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డా, ఒక కల్ట్ స్టేటస్‍ను సంపాదించుకొంది. అమితాబ్‍కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. మా నాన్నకు చాలా ఇష్టమైన సినిమా. – వగైరా, వగైరా!

Old wine in new bottle చందాన తీసిన తాజా చిత్రం “అగ్నిపథ్” సినిమా మొదలవ్వాల్సిన చోటే మొదలై, ముగుస్తుందనుకున్న చోటే ముగుస్తుంది. మొదలుకి, తుదకి మధ్య ఏం జరిగిందంటే ఒక్కసారి చూసినవారు చెప్పటం కాస్త కష్టమే.

విజయ్ (హృతిక్) తండ్రి “మన్వడ్” అనే ఊర్లో స్కూల్ మాస్టర్. గ్రామస్తుల బాగోగులు చూసుకుంటూ, అందరి నోట్లో నాలుకగా ఉండి, అక్కడి జమిందారులకన్నా ఎక్కువ ప్రజాదరణ పొందుతాడు. ఇది మెచ్చని జమిందారు కొడుకు, కాన్‍చా (సంజయ్ దత్త్) విజయ్ తండ్రిపై చేయని నేరంలో చిక్కుకునేలా వల పన్ని, గ్రామస్థుల ముందే ఉరి తీస్తాడు. అది కళ్ళారా చూస్తూ కూడా ఏం చేయలేని విజయ్, అతడి అమ్మ ఊరి నుండి వెలివేయబడతారు. అక్కడ నుండి ముంబైకు చేరుకుంటారు. ప్రపంచంలో బలముంటే తప్ప బతకలేమని భావించిన విజయ్ ముంబైలో డ్రగ్స్, ట్రాఫికింగ్ చేస్తున్న రౌఫ్ లాలా (రిషి కపూర్) పంచన చేరుతాడు. అది మెచ్చని తల్లి, చెల్లి అతడి నుండి విడిపోతారు. అయినా, ఎప్పటికైనా కాన్‍చాను చంపి కసి తీర్చుకోవాలన్న పంతంతో ఉన్న విజయ్ ఆ లక్ష్యాన్ని ఎలా చేధించాడు? అతడి ప్రియురాలు కాళి (ప్రియాంక చోప్రా) అతడికెలా సాయపడింది? అన్నదంతా తక్కిన కథాంశం. (పాత సినిమా కథను యధాతధంగా తీసుకున్నట్టు లేరు. మార్చారు. ఆ మార్పులు అంతగా అతకలేదని నాకనిపించింది.)

మొన్న రెండు రోజుల క్రితం ముగిసిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‍లో గుల్జార్-జావెద్ అఖ్తర్-విషాల్ భరద్వాజ్-ప్రసూన్ జోషిల మధ్య చర్చ జరిగింది. కథలు, సినిమా స్ర్కిప్ట్, స్క్రీన్ ప్లే అన్న అంశంపై జరిగిన ఆసక్తికరమైన చర్చలో జావెద్ సాబ్, కథ నది లాంటిది, పుట్టినచోట నుండి సముద్రంలో కలిసేవరకూ దాని దోవ అది వెతుక్కుంటూ పోతుంది. సాగరసంగమం వరకూ నది ప్రవహించాలంటే దాంట్లో అంత నీరు, అంత ఉదృతి ఉండాలి అన్నారు. ఉపమానానికి కొత్త కోణం చేర్చుతూ గుల్జార్, నది సముద్రం దాకా పోవటానికి ఉపనదుల కలయిక కూడా కీలకం అన్నారు. అదే పోలికను ఈ చిత్రానికి ఆపాదించుకుంటే, ఈ నదిలో నీటి కొరత లేదు. ఉపనదులూ బానే ఉన్నాయి. మొదట్లోనే ఏ సముద్రాన్ని చేరాలో తెల్సు. మొదలవ్వటమూ ప్రామిసింగ్‍గా మొదలవుతుంది. అయినా, ఏ దిశగా సాగుతూ ఉందో తేల్సుకోలేకపోతుంటారు చూసేవాళ్లు. ఆఖరున మాత్రం ఒక లాంగ్ జంప్ కొట్టి సముద్రంలోకి దూకేసినట్టు అనిపించింది నాకు. సగం వరకూ వడివడిగా సాగిన కథనం ఉన్నట్టుండి ఆగిపోయిన భావన కలిగించింది. ఏం జరుగబోతుందో ముందే తెల్సిన కథల్లో, “ఎలా?” అన్నది కూడా సరిగ్గా చూపలేకపోతే, అది విఫలప్రయత్నమే అవుతుంది.

ఇందులో హీరో తండ్రి కవిత్వాన్ని ఆస్వాదించే వ్యక్తి. కొడుక్కి కూడా కవితల్లో ఉన్న శక్తి తెల్సుకోమని సూచిస్తూ ఉండి, పదేపదే వాటిని చదివించేవాడు. అందులో “అగ్నిపథ్” (హరివన్స్ రాయ్ బచ్చన్ రాసినది?) అన్న కవిత: ఏది ఏమైనా, వెనుకకు తిరగకుండా, ఎంచుకున్న దారి ఎంతటి అగ్నిపథమైనా ముందుకు పోతూ ఉండాలి అన్నది ఆయన చెప్తాడు కొడుక్కి. కానీ అది మస్తిష్కపు అంతరాళల్లోకి ఇంకిపోయిన యువకుడిగా విజయ్ పాత్రను తీర్చిదిద్దడంలో విఫలమయ్యారు. కవితను అప్పజెప్పటానికీనూ, కవితను జీవించటంలోనూ చాలా తేడా ఉంటుంది కదా?! గుర్తొచ్చినప్పుడల్లా కవిత వల్లిస్తే సరిపోతుందనుకుంటే సినిమాకు దాన్నే పేరుగా పెట్టటం అనవసరం కదా? అలాగే, ఇందులో విలన్‍కు పురాణాలపై మంచి పట్టు ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసారు. కాకపోతే అతడు ఒకసారి “ఇది మహాభారతం. నేను పందొమ్మిదో అధ్యాయం రాస్తాను” అని ప్రకటిస్తాడు, మరో సీనులో “నేను రావణున్ని. ఇది నా లంక!” అన్న ధోరణిలో మాట్లాడుతుంటాడు. “బాబూ.. రెండూ ఎందుగ్గానీ? ఏదో ఒక మాట చెప్పు” అని నా పక్కనున్నవారి కామెంట్! కానీ అక్కడక్కడా మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి.

అలానే కొన్ని కీలక సన్నివేశాలను కూడా మిస్ అయ్యారు. పదిహేనేళ్ళ క్రితం తన చేతిలో దారుణంగా బలైన శత్రువు వంశాకురం ఇప్పుడు తనని వెదుక్కుంటూ వచ్చాడని తెల్సుకోవటంలో విలన్‍కు కలిగే విస్మయాన్నో లేక హీరోనే ఆ విషయం బయటపెట్టటంలో చూపించే తెగువునో వాడుకోలేకపోయారు. విలన్‍ను కల్సిన రెండు సార్లు హీరో చావుదెబ్బలు తింటాడు. దాదాపుగా సినిమా మొత్తం విలన్‍దే పై చేయి. అమాంతంగా హీరో విజృంభిస్తాడు. అదో బాలివుడ్ మాయ!

కథకు బలాన్ని చేకూర్చేంతగా గొప్పగా పాత్రలను మల్చుకోలేకపోయినా, ఉన్న పాత్రలకే నటీనటులు కొత్త ఊపిరి పోసారు. లీడ్ రోల్‍లో హృతిక్ తన నటనా ప్రతిభనంతా కుమ్మరించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో, భావోద్వేగభరితంగా చక్కగా అభినయించాడు. చాన్నాళ్ళ తర్వాత ఒక హింది సినిమా విలన్ చూసి భయపడేట్టు చేసాడు, సంజయ్ దత్. మరాఠి యువతిగా ప్రియాంక చోప్రా కథలో అల్లుకుపోయింది. మంచివాడో, కాడో తేల్చుకోలేని పాత్రలో రిషి కపూర్ తనదైన శైలి నటను చూపించాడు. పోలిస్ ఇన్‍స్పెక్టర్ పాత్రలో ఓమ్ పూరి యధావిధిగా బాగా చేసారు. హీరో తల్లి పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోవటంచేత జరీనా వాహిబ్ వృధా పోయినట్టు అనిపించింది.

ఈ సినిమా మ్యూజిక్ ఇప్పటికే హిట్. పాటలన్నీ బాగా చిత్రీకరించారు. కత్రినా కైఫ్ “చికిని చమెలి” గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విధి వైపరిత్యం కాకపోతే, నిన్న మొన్నటి వరకూ అంగుళం కూడా కదలకుండా డాన్స్ చేసిన కత్రినా ఈ పాటలో డాన్స్ దున్నేసింది. మొన్నటి వరకూ డాన్స్ కు కేరాఫ్ అడ్రెస్‍గా ఉన్న హృతిక్‍కు కనీసం నాలుగు స్టెప్పులు కూడా లేవు. పాటలు బాగున్నా, బాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం లౌడ్‍గా అనిపించింది. నేను కొన్ని కీలక డైలాగులు ఆ హోరులో మిస్సైనట్టున్నాను.

సినిమాలో హింస చాలా చూపించారు. చిన్నపిల్లలకు చూపించకపోవటం ఉత్తమం.

కథలో కొత్తదనం లేకపోయినా, కథనంలో తడబాటున్నా నటీనటుల వల్ల ఈ సినిమా మంచి విజయం సాధించచ్చు. ఎవరూ కొనేసుకోకుండా ఉంటే (లేదా వీళ్ళే కొనుక్కుంటే) అవార్డులూ రావచ్చు.  మరో పాతికేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమానా? అంటే నాకు అనుమానమే!

4 Comments
  1. అబ్రకదబ్ర January 27, 2012 /
    • Purnima January 27, 2012 /
  2. hino January 31, 2012 /
  3. R. Srimannarayana. February 12, 2012 /