Menu

The Fall (2006)

దాదాపుగా ప్రతి జీవితంలోనూ వచ్చే మలుపు ఇది. ఆ మలుపు వద్ద, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగల్లేదనిపిస్తుంది. ముందుకు చూడబోతే ఏమీ కనిపించదు, గాఢాంధకారం తప్పించి. అక్కడే ఆగిపోదామంటే ముళ్ళపై నుంచున్నట్టు ఉంటుంది. ఉండలేక, వెళ్ళలేక, నిలువలేక ఉన్న ఆ పరిస్థితుల్లో గుక్కెడు విషం ఇచ్చినవారు కూడా దేవతాసమానులైపోతారు. కానీ చిత్రంగా, అలా విషమిచ్చి చేతులు దులిపేసుకోక, ఒక చిన్న దివిటి వెలగించి మనకేదో కొత్త వెలుగు చూపించేవారు తయారవుతారు. మనం చూడకూడదని కళ్ళు మూసుకున్నా, వినకూడదని చెవులు మూసుకున్నా, పట్టించుకోకూడదని ఎంత ప్రయత్నిస్తున్నా, అశక్తులమై, వారు చూపించిన బాటలో బయలుదేరుతాం. వాళ్ళ పంతమే నెగ్గుతుంది.

ఇప్పుడు నేను మాట్లాడబోతున్న సినిమా ఇలాంటి ఇతివృత్తంతో సాగాదే! ఈ సినిమా కథను గూర్చి చెప్పుకుంటే..

1920లలో సినిమాల్లో స్టంట్ మాన్‍గా పనిజేసే ఒకతడు, ఒక షూటింగ్‍లో బ్రిడ్జ్ మీదనుండి దూకాల్సి వచ్చి, ప్రమాదానికి గురై, నడుం కింది భాగమంతా చచ్చుబడిపోవటంతో ఒక రి-హాబ్ సెంటర్‍లో చికిత్స పొందుతూ ఉంటాడు. చేయి విరిగి, కాస్ట్ సాయంతో కోల్కుంటున్న ఒక రొమానియన్ చిన్నారి కూడా అక్కడే చికిత్స తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళద్దిరకి అనుకోకుండా పరిచయం కలుగుతుంది. జత కుదురుతుంది.

అతడిది బతుకు మీద విరక్తి కలిగిన మానసిక అవస్థ. కాళ్ళు పనిజేయక, ఇంకెప్పటికి నిలబడడేమోనన్న పరిస్థితి. పైగా వలచిన ప్రియురాలు తనకిక దక్కదనీ తేలిపోయింది.

ఆ చిన్నది ఐదేళ్ళది. బూరెల్లాంటి బుగ్గలు గలది. ముద్దుముద్దు మాటలతో ఊరించగలదు. ఆ కళ్ళల్లో ఒక మెరుపుటుంది. కోట్లానుకోట్ల రంగుల ఊహలలో ఓలాలడడం వల్ల వచ్చిన మెరుపది. మాతృభాష రొమానియన్ అయినా, ఇంగ్లీషు చకచకా మాట్లాడేస్తుంది. హాస్పిటల్ అంతా కలియతిరుగుతూ, అందరితో కల్సిపోతూ ఉంటుంది. ఈ చిన్నారికి విషాదాలు లేక కాదు. ఎవరో ఆగంతుకులు వచ్చి ఇంటిని కాల్చేసి, తండ్రిని చంపేసారు. పొట్టకూటి కోసం తానే పనిచేయవలసిన పరిస్థితులు.

చినదాన్ని తన అవసరం కోసం మచ్చిక చేసుకోవాలనుకున్న ఇతగాడు, కథలు చెప్పటం మొదలెడతాడు. అతడి మానసిక స్థితికి తగ్గట్టు అప్పటికప్పుడు ఏ ఆలోచనొస్తే ఆ ఆలోచననే బయటకనేస్తాడు. చిన్నది, ఆ మాటలను తన భారీ మనోకాన్వాస్ పై నిలిపి, బోలెడన్ని రంగులద్ది, కథలో పాత్రలన్నింటిని తనకు పరిచయమున్న మొహాలను నిలిపి, కథలో లీనమైపోతుంది. కథతోనూ, కథలోని పాత్రలతోనూ, కథ చెప్తున్నవాడితోనూ అనుబంధం ఏర్పరచేసుకుంటుంది.

కథ ఎవరిది? చెప్పేవాడిదా? వినేవాడిదా? తాను వింటున్న కథలోని పాత్రలను వరుసగా చంపేస్తుంటే, భరించలేని ఆ చిన్నది –

“ఎందుకు నువ్వు అందర్ని చంపేస్తున్నావ్?” అని అడుగుతుంది, ఓ చోట.

“నా కథా, నా ఇష్టం” అంటాడతడు.

“నాది కూడా!” అని బల్లగుద్దినట్టు చెప్తుంది.

For once, వింటున్న వారి ఇష్టప్రకారం ఈ కథ ముగుస్తుంది. అలా జరగడానికి ఆ పిల్లకూ, కథకుడికీ మధ్య అనుబంధం కీలకమేమో.

ఇదో అద్భుతమైన సినిమా. కథాపరంగా బలంగా ఉండటమే కాకుండా, చిత్రీకరణ విషయంలోనూ విశేషంగా చెప్పుకోవాల్సిన సంగుతులెన్నో ఉన్నాయి. చిన్నదాన్ని ఊహాలోకానికి మనకు తెరపై చూపించిన తీరు అత్యద్భుతం. అలా చూపడానికి ఖండఖండాంతరాల్లోని వివిధ ప్రాంతలను నయనాందకరంగా చూపించారు; కొండలూ, కోనలూ, సముద్రాలు, ద్వీపాలు, రాజప్రసాదాలూ, ఏడారులూ, మహళ్ళూ! చూపించినంత మేరకు, ఇండియాను అందంగా చూపారు. (ఈ చిత్రదర్శకుడు ఇండియన్!)

ఇది ఏదో పాత రొమానియన్ చిత్రానికి రీమేక్ అట. కథనం నింపాదిగా నడిచినట్టు అనిపించినా కథలూ, ఊహలూ నచ్చిమెచ్చేవారిని సమ్మోహితులను చేస్తుంది. కథను ఊహించుకుంటున్నట్టు చూపించే ప్రతి ఫ్రేం ’గ్రాండ్’గా ఉంటుంది. మళ్ళీ రీ-హాబ్ సెంటర్‍లోకి వచ్చేసరికి అంత వాస్తవికంగానూ ఉంటుంది. ఒక అసంబద్ధ కథను అంత ఆకర్షణీయంగా తెరపై చూపటం కష్టం. చిన్నపిల్ల ఏవేవో ఊహించుకొని మమేకం అవటం అటుంచితే, పెద్దలు కూడా లీనమైయ్యేట్టు చేయటంలో దర్శకుని పనితనం తెలుస్తోంది. అంతే కాదు, ఒక చిన్నారి ఊహాలోకం ఎలా ఉండచ్చు అన్నదానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పిల్లల ఆలోచనాతీరు అర్థంచేసుకునే కొద్దీ అబ్బురమనిపిస్తుంది. అమాయకత్వమో లేక తెలియనితనమో, మనల్ని కట్టిపడేస్తుంది.

నటీనటుంతా బాగా చేసారు. ముఖ్యంగా కథ చెప్పేవాడునూ, ఈ పిల్లా! చిన్నారిగా వేసిన అమ్మాయి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ అమ్మాయిలో సహజత్వాన్ని కోల్పోనివ్వకుండా, ఆ పసిదనాన్ని, అమాయకత్వాన్ని, అదే సమయంలో గడుసుదనాన్ని అందంగా చూపించారు. నాకీ సినిమా బా నచ్చి, ఆ పాపను చూపించడానికని, ఒకరిద్దర్ని పిల్చి, రెండు నిముషాల సీన్ చూపిస్తుంటే, వాళ్ళు సినిమా మొత్తం అయ్యేదాకా కదల్లేదు. పైగా ఇప్పుడు ఆ పిల్ల మార్క్లు ఇంగ్లీషునే మాట్లాడుకుంటున్నాం, సరదాగా! నచ్చాలే గానీ, అలా తిష్ట వేసేస్తుంది ఆ అమ్మాయి, మనసులో.. అంత మురిపెంగా అభినయించింది.

టూకీగా చెప్పుకోవాలంటే, ఒక స్టంట్ మాన్‍నే తన ఫీట్లతో కాపాడిన ఒక ఐదేళ్ళ చిన్నారి కథ. ఇంకో లెవల్‍లో చూస్తే, కథలు చెప్పేవాడికే కథలు చెప్పటమెలానో నేర్పించిన బుడత కథ. ఈ సినిమాలో ఒక డైలాగ్: “Are you trying to save my soul?” అని అడుగుతాడు, ఆ పాపను. అంటే ఏమిటో, దానికి అర్థం కాదు. మనలో చాలా మందికి అర్థం కాదు. అది అర్థం అయినవాళ్ళకి, అవును, ఇది ఒక soul-saving tale! ఒకవేళ అలా అర్థం కాకున్నా కూడా, కళ్ళప్పగించుకొని చూడాలనిపించే సినిమా. అయిపోయాక, బుర్ర గోక్కున్నా కూడా, చూసినంత సేపూ అలా తనలోకి లాగేసుకుంటుంది ఈ సినిమా, మనల్ని.

If you believe that life shows up its best miracles only after pushing you into deep abyss and if you believe ‘angels’ happen and happen in all forms and sizes, this movie is a MUST WATCH!

For anyone into movie making, this movie is a best blend of simplicity in story and grandeur in showcasing it, to leave a soul stirring impact on the audience.

4 Comments
  1. rajendrakumar devarapalli December 13, 2011 /
  2. Kumar N December 25, 2011 /
  3. Bigfish February 4, 2012 /