Menu

ఫెల్లినీ’s 8 ½

“నేను సాహిత్యాన్ని” అన్న కాఫ్కా రీతి లో.. “నేను సినిమాను” అని చాటిన ఇటాలియన్ దర్శకుడు ‘ఫెడెరికో ఫెలినీ’. ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రపంచ సినీ చరిత్ర లో అరుదైన ఆర్టిస్టిక్ జీనియస్ అనిపించుకున్నాడు ఫెలినీ. ఆయన జీవితం గురించి చదివినవారికీ, ఆయన సినిమాలు చూసినవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

 

కవితాత్మకమైన, భావావేశముతో కూడిన అసమాన దృశ్యాల తో ..సినిమా అనే మాధ్యమం ద్వారా ..మనిషి లోని కాంప్లెక్సిటీ ని చెప్పటానికి ప్రయత్నించిన అతికొద్ది దర్శకుల్లో ఫెలినీ ముఖ్యమైనవాడు. ఇమాజినేజన్ ఈజ్ మోర్ ఇంపార్ట్ టెంట్ దెన్ నాలెడ్జ్ అన్న అల్బర్ట్ ఐన్ స్టీన్ మాటలకు నిదర్శనాలుగా నిలుస్తాయి ఫెలినీ సినిమాలు. హ్యూమన్ ఎమోషన్స్ లేదా సెంటిమెంట్ లను వివరంగా చెప్పటమే ప్రధాన లక్ష్యంగా వుంటాయి ఫెలినీ ఇమేజెస్. వీటికి ఏ విధమైన ఆదర్శాలను జతచేయకపోవటమే ఫెలినీ గ్రేట్ నెస్ గా చెప్పుకోవాలి.

 

ఫెలినీ.. ప్రపంచ సినిమాకు దొరికిన అసలు సిసలైన ,నిజమైన కళాకారుడు.డ్రీమ్స్ ద్వారా మాత్రమే మనిషి సిన్సియర్ గా దేనినైనా కమ్యూనికేట్ చేయగలుగుతాడు.మిగిలినదంతా అబద్దం అని బలంగా నమ్మాడు ఫెలినీ. అందుకే ఫెలినీ సినిమాల్లో ఎక్కువశాతం డ్రీమ్స్, ఫాంటసీస్, ఇమాజినేషన్స్ కనిపిస్తాయి. ఫెలినీ సినిమా అర్థం చేసుకోవటం కష్టం అని ఎవరైనా ప్రశ్నిస్తే..అందుకు ఫెలినీ ఇచ్చే సమాధానం.. ఇక్కడ ఏదైతే క్లియర్ గా వుండి,అందరికీ అర్థమవుతుందో అదంతా అబద్దం. ఒక మనిషి నిజాయితీగా, సిన్సియర్ గా తన గురించి తాను మాట్లాడితే..అది ఖచ్చితంగా తనదైన సంక్లిష్ట విధానం లో, ఎక్కువ వ్యాఖ్యానాలు చేయటానికి వీలైన లక్షణాలు కలిగివుంటుంది.అందుకే చాలా కొద్దిగా మాత్రమే అర్థమవుతుంది అని బదులిచ్చే మేధావి,జీనియస్ ఫెడెరెకో ఫెలినీ.

 

ఫెలినీ సినిమాల్లో లా స్ట్రాడా, లా డొల్సి విటా, 8 ½  లు ముఖ్యమైనవి. అయితే..సినిమా మేధావులూ, విమర్శకులూ ,పరిశోధకులూ ముఖ్యంగా ఫెలినీ అభిమానులూ… అందరూ కలిసి ఆయన సినిమాలన్నింటి లో కెల్లా గొప్ప సినిమాగా ఓ సినిమాను నిర్దారించారు. ఆ సినిమా నే 8 ½ . ఫెలినీ లోని ఆర్టిస్టిక్ జీనియస్ ను సంపూర్తిగా, గొప్పగా ఆవిష్కరించిందీ ఈ సినిమా. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్ లను గెలుచుకున్న ఈ సినిమా ను మెచ్చుకోని సినిమా దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 30 మంది తో కూడిన యూరోపియన్ ఇంటెలెక్టువల్ కమిటీ..  1987  లో 8 ½ సినిమా ను అతి ముఖ్యమైన యూరోపియన్ సినిమాగా, ఫెలినీ ని అతి ముఖ్యమైన యూరోపియన్ డైరెక్టర్ గా అభివర్ణించటం విశేషం.

 

8 ½ ( ఎయిట్ అండ్ హాఫ్ )..సినిమా టైటిల్ దగ్గర నుంచీ వైవిధ్యంగా అనిపించే ఈ సినిమా ..కథ ఇదీ అని చెప్పటానికి వీలుపడనిది. హాలీవుడ్ సినిమా లా గా ఇది ప్రారంభం,ఇది ముగింపు అని చెప్పుకొనే కథ కాదు.ఈ సినిమా లో ప్రధాన పాత్ర సినిమా దర్శకుడు. కొత్త సినిమా తీయటానికి కావలసిన ఆర్టిస్టిక్ ఇన్ స్పిరేషన్ కోసం చూస్తుంటాడు. ఇతనికున్న బోలెడన్ని పర్సనల్ స్ట్రగుల్స్ వల్ల కన్ ఫ్యూజన్స్ కు గురవుతుంటాడు.ఈ క్రియేటివ్ ప్రోసెస్ ను అర్థవంతంగా, క్లియర్ గా చెప్పటమే ఈ 8 ½ సినిమా ముఖ్య ఉద్దేశ్యం.

 

ఈ సినిమా లో గైడో  ఓ ఫిల్మ్ డైరెక్టర్. ఆయన కు కొన్ని మానసిక సమస్యలుంటాయి. మితి మీరిన కుతూహలం, భార్య తో సమన్వయం లేకపోవటం వల్ల మానసికంగా డిప్రెస్ అవటం, సెక్సువల్ డిజైర్ ను నిగ్రహించుకోలేకపోవటం,వీటన్నిటివల్ల ట్రీట్ మెంట్ కోసం స్పా లో చేరతాడు. ఇక్కడే ఆయన తీయబోతున్న కొత్త సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ వుంటుంది. సినిమా నటీ నటులు తమ పాత్ర చెప్పమని అడుగుతుంటారు. ఏ క్లారిటీ లేని గైడో మాయమాటలు చెప్పి తప్పించుకుంటుంటాడు.

 

 

ఫెలినీ 8 ½  లో సినిమా ఆర్ట్, సినిమా థియరీ గురించి హెవీ ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ ను ఎక్కడా పెట్టలేదు. 8 ½ ను అర్థం చేసుకోవటానికి,ఇంటర్ ప్రెట్ చేయటానికి దీంట్లో ఏమీ లేదంటాడు ఫెలినీ.ఇదో సింపుల్ సినిమా దీన్ని ఎక్స్ పీరియన్స్ చేయటానికి  ఫిలాసిఫకల్ , ఈస్ఠటిక్, ఐడియలాజికల్ థియరీస్ తెలిసి వుండాల్సిన అవసరం లేదు. ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ను అనుభవించటానికి రెడీగా , స్వేచ గా వుంటే చాలు.సినిమా అనేది దృశ్యమాధ్యమం.ఇమేజెస్ ఏ ఎమోషన్స్ ను కలుగచేస్తాయో అదే నిజం,అంతకు మించి మాటలతో ఎక్స్ ప్లెయిన్ చేయటానికి ఏమీ లేదంటాడు ఫెలినీ.

 

ఆర్ట్ కు ఫిలాసఫీ తో కానీ, ఐడియాలజీ తో కానీ ఏ సంబంధం లేదు. ఫిలాసఫీ ఇచ్చే నాలెడ్జ్ వేరు, సినిమా ఆర్ట్ లేదా జనరల్ గా ఆర్ట్ ఇచ్చే నాలెడ్జ్ వేరు.అసలు ఆర్ట్ కున్న ఉద్దేశ్యం వేరు, అది ఎమోషనల్ గా ,ఈస్థటిక్ గా దేనినైనా కమ్యూనికేట్ చేస్తుంది తప్ప లాజికల్ గా, అర్థం అయ్యేలా , ఓ ఫిలాసఫీ ని చెప్పేలా కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇదీ ఈ 8 ½ సినిమా ద్వారా ఫెలినీ చెప్పాలనుకున్న విషయం.

 

8 ½ సినిమా లో క్రియేటివిటీ అన్న ప్రక్రియ ను విజువలైజ్ చేసి చూపించాడు ఫెలినీ. క్రియేటివ్ ప్రోసెస్ ఎలా ఉంటుంది? దాంట్లో ఏ యే అంశాలు ఎలా కలుస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం డైలాగ్స్ రూపం లో ఎక్కడా వివరించే ప్రయత్నం చేయకుండా ,సినిమా లో కనిపించే దృశ్యాల ద్వారా, ఏది ఎలా జరుగుతోందో చూపించాడు. ఇది మనం చూసి అర్థం చేసుకోవాలంటాడు ఫెలినీ.

 

సినిమా దర్శకుడు గైడో   ఓ వైపు ఉంపుడు గత్తె తో రహస్యంగా రొమాన్స్ ను నడుపుతుంటాడు. భార్య ,గైడో నుంచి నిజాయితీ ని కోరుకుంటుంది.గైడో అబద్దాలు చెప్పటానికి అలవాటు పడతాడు. దీంతో వీరిద్దరి మధ్యా ఎన్నో సమస్యలు. మరో వైపు గైడో తీయబోతున్నసినిమా సెట్ వర్క్ జరుగుతుంటుంది. ఇంకా కథ పట్ల గైడోకు క్లారిటీ లేదు. ఇలా గైడో జీవితాన్ని చూపిస్తూ,క్రియేటివ్ ప్రోసెస్ లో అంతర్లీనంగా ఇవి ఎలా కనెక్ట్ అవుతాయనే దాన్ని చూపించాడు ఫెలినీ.

 

8  ½ సినిమా క్రియేటివిటీ ప్రోసెస్ ను ఓ రకంగా రెండు సినిమాల మేకింగ్ ప్రోసెస్ ను చూపిస్తూ జరిగిందని చెప్పాలి. ఈ సినిమా లో గైడో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేద్దామనుకుంటాడు, అయితే ఆ సినిమాను పూర్తిగా కంప్లీట్ చేయలేడు. ఇదొక క్రియేటివ్ ప్రోసెస్ అయితే,8 ½  ఒక కంప్లీట్ సినిమా. ఫెలినీ గైడో ఒక సినిమాను ఎలా తీయలేకపోయాడు అనే దాన్ని సినిమాగా తీసాడు. ఇది మరో క్రియేటివ్ ప్రోసెస్. ఇలా రెండు సార్లు క్రియేటివ్ ప్రోసెస్ ను 8 ½ చూపించిందని చెప్పాలి.

 

 

ఈ సినిమా టైటిల్ 8 ½ వెనుక ఆసక్తికర కథ వుంది. ఫెడెరికో ఫెలినీ ఈ సినిమా తీసే నాటికి మొత్తం 6 ఫీచర్ ఫిల్మ్స్ , 2 షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్స్..ఇవి కాక మరో దర్శకుడి తో కలిసి ఓ సినిమా ను డైరెక్ట్ చేసారు. అలా ఈ సినిమా ఫెలినీ డైరెక్ట్ చేస్తోన్న ఎనిమిదన్నరవ సినిమా. అందుకే ఈ సినిమా టైటిల్ ను 8 ½ గా పెట్టారు ఫెలినీ.ప్రపంచం లో ఏ దర్శకుడికి రాని అరుదైన ఆలోచన ఇది.

 

 

8 ½ సినిమా ఎడిటింగ్ సాధారణ సినిమా ఎడిటింగ్ లా అనిపించదు. ప్లేస్ పరంగా.. స్పేస్ పరంగా.. ఎస్టాబ్లిషింగ్ షాట్స్ లాంటివి లేకుండానే ఈ సినిమా లో చాలా సీన్లు జరుగుతుంటాయి. ఒక షాట్ నుంచి మరో షాట్ కు ఏ విధమైన ట్రాన్సిషన్ లేకుండా నే.. రియాలిటీ నుండి డ్రీమ్ కి, ఫాంటసీ కి, గైడో చైల్డ్ హుడ్ కి సినిమా వెళ్ళిపోతూ వుంటుంది.

 

8 ½ లో ప్రధాన పాత్ర గైడో .ఇతని గురించి హేతువుకు అందని ఫాంటసీస్ ద్వారా  లేదా మ్యాజికల్ పవర్స్ ద్వారా నే మనకు చెపుతాడు ఫెలినీ. గైడో లో అంతర్గతంగా దాగివున్న కోరికలను బహిర్గతం చేస్తాయి ఈ ఫాంటసీ లు. ఒక్కో ఫాంటసీ ఒక్కో విజువల్ ఎక్స్ పీరియన్స్ ను కలుగచేస్తుంది. ఫెలినీ ఇమాజినేషన్ పవర్ కు లిమిట్స్ లేవు అన్న విషయాన్ని మరోసారి నిజం చేస్తాయి ఈ డ్రీమ్స్ అండ్ ఫాంటసీస్.

 

ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఫెలినీ గైడో ను రిప్రజెంట్ చేయటానికి ఓ ఫాంటసీ చూపిస్తాడు. ప్రపంచ సినీ చరిత్ర లో ఈ విజువలైజేషన్ ముఖ్యమైనది .గైడో ఓ కారు లో ఇరుక్కుపోతాడు.అదొక సొరంగం లా వున్న రోడ్డు. ఆ రోడ్డు మీద కార్లు, బస్సులు ట్రాఫిక్ జామ్ అవటం తో అలా ఆగి వున్నాయి. మనుషులు చాలా మంది వున్నారు. కానీ ఏ ఒక్కరూ ఏ శబ్దం చేయటం లేదు. గైడో కారు లో పొగలు వస్తుంటాయి.అద్దాలు తీయాలని చూస్తే గట్టిగా మూసుకుపోతాయి. కారు లోంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తాడు. చూస్తే.. గైడో ఆకాశం లో ఓ కైట్ లా వేలాడబడి వుంటాడు. కాలికి ఒక తాడు కట్టి వుంటుంది. భూమి మీద నుంచి ఓ వ్యక్తి గైడో ను కిందకు లాగుతుంటాడు. ప్రస్తుతం గైడో వున్న స్టేట్ ను వివరిస్తున్నాడు ఫెలినీ. గైడో పడే స్ట్రగుల్ చుట్టూ చూస్తోన్న వారికి అర్థం కాదు, కనీసం అతను స్ట్రగుల్ పడుతున్నాడన్న ఫీలింగ్ కూడా లేదు.ఆ స్ట్రగుల్ లోంచి పారిపోదామనుకుంటే జనాలు వెళ్లనీయటం లేదు.

 

 

8 ½  లో ఓ ముఖ్యమైన డ్రీమ్ సీక్వెన్స్ లో గైడో తన ఫాదర్ సమాధి దగ్గరకు వస్తాడు. గైడో ఫాదర్ సమాధి చాలా చిన్న గా కట్టించినందుకు గైడో ను విమర్శిస్తాడు.ఇక్కడ గైడో మదర్ గైడో ను కిస్ చేస్తుంది. ఐతే..ఆ మరుక్షణమే ఆ మదర్ కాస్తా గైడో భార్య గా మారుతుంది. గైడో కు ఓడిపల్ కాంప్లెక్స్ వుందన్న విషయాన్నీ.. వుమెన్ తో గైడో రిలేషన్ కాంప్లెక్స్ అన్న విషయాన్నీ చెపుతున్నాడు ఫెలినీ.

 

 

సినిమా లో ఓ చోట..టెలిపతి ద్వారా మైండ్ రీడింగ్ చేసే గైడో  ఫ్రెండ్ కలుస్తాడు. గైడో మైండ్ ను రీడ్ చేసి.. ఆస..నిసి..మస..అన్న పదాలున్నాయని చెపుతాడు. ఇక్కడ గైడో చైల్డ్ హుడ్ కు వెళ్తుంది సీన్. అదొక ఫామ్ హౌస్. అక్కడ చిన్న గైడో ను అందరూ ముద్దు చేస్తుంటారు.చాలా కేర్ ఫుల్ గా వైన్ బాత్ చేయిస్తారు. చిన్న గైడో జీవ చైతన్యం తో తొణికిసలాడుతూ సినిమా చూసే వాళ్ళందరికీ ముద్దొచ్చేలా వుంటాడు. ఇక్కడ అందరూ నిద్రపోయాక ఆస..నిసి.. మస అంటారు పిల్లలు. ఈ మాట ఇటాలియన్ లో ఎనిమా అనే పదం.ఎనిమా అనగా కార్ల్ జంగ్ ఎనాలిసస్ ప్రకారం తెలియకుండా మగ వాళ్ళు ఆడవారి లక్షణాన్ని కలిగివున్నారని చెపుతుంది..ఇక్కడ గైడో ఆంతరంగిక విషయాలను చెపుతున్నాడు ఫెలినీ.

 

గైడో కు వుమెన్ పట్ల కొన్ని ప్రత్యేక అభిప్రాయాలుంటాయి. సెక్సువల్ డిజైర్ ను గైడో నియంత్రించుకోలేక పోతుంటాడు. ఉంపుడు గత్తె ను ప్రాస్టిట్యూట్ లా మేకప్ అయ్యి, సెడ్యూస్ చేయమని చెపుతుంటాడు.ఓ ఫాంటసీ లో అమ్మాయిల చేత గైడో అన్ని అవసరాలనూ తీర్చుకోవటం, వాళ్లని డామినేట్ చేయటం వుంటుంది. వుమెన్ కూ,.గైడోకూ మధ్య ఇలా వుండటానికి చైల్డ్ హుడ్ ఇన్సిడెంట్స్ కారణమని చెపుతాడు ఫెలినీ.

 

గైడోకు వుమెన్ పట్ల వున్న ఉద్దేశ్యాలను తెలియచేసే ఓ ముఖ్యమైన చైల్డ్ హుడ్ ఫ్లాష్ బ్యాక్ 8 ½ సినిమా లో హైలెట్ సీక్వెన్స్ గా చెప్పాలి. దీంట్లో గైడో కొందరు పిల్లల తో కలిసి బీచ్ దగ్గరకు వెళతాడు. అక్కడ సర్గనియా అన్న పేరు తో ఓ ప్రాస్టిస్ట్యూట్ వుంటుంది. డబ్బుల కు శరీరాన్ని రివీల్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది. ఇదంతా చూస్తుండగా చర్చ్ ప్రీస్ట్స్ వచ్చి గైడో ను పట్టుకొని తీసుకెళతారు. గైడో ను శిక్షిస్తారు. అప్పుడే యవ్వనం లోకి ప్రవేశిస్తున్న గైడోకు వుమెన్, సెక్సువాలటీ, షేమ్ , గిల్టీ వీటి మధ్య వున్న కనెక్షన్ ను గట్టిగా ఉపదేశిస్తారు.

 

ఈ అనుభవం తో గైడో ప్రపంచం లోని ఆడవాళ్ళ ను రెండు రకాలుగా విభజించుకుంటాడు.విర్జిన్స్ అండ్ వోర్స్.. గైడో మొదటి రకం అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. రెండో రకం అమ్మాయిని ఉంపుడు గత్తె గా ఉంచుకుంటాడు. ఇలా జరగటానికి కాథోలిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కారణమని గట్టిగా చెపుతాడు ఫెలినీ.

 

 

8 ½ సినిమా లో గైడో కు వుమెన్ పట్ల వున్న వ్యూ ను చెప్పే ఓ ముఖ్యమైన సీన్ వుంది. ఇదొక ఫాంటసీ. దీంట్లో..గైడో తో ఇప్పటివరకూ తన జీవితం లో కలిసిన అమ్మాయిలందరూ ఉంటారు.భార్య, ఉంపుడు గత్తె,సినిమా లోని ఫిమేల్ ఆర్టిస్ట్స్, గైడో ఐడియల్ వుమెన్ క్లాడియా..ఇలా అందరూ కలిసి గైడోకు స్నానం చేయిస్తుంటారు.ప్రేమగా చూసుకుంటారు. ఈ వుమెన్స్ అందరి మీదా తెలియని అధికారం , హక్కు తనకున్నట్టు ఫీలవుతాడు గైడో.

 

 

గైడో ఫాంటసీస్ ను విజువలైజ్ చేయటం ద్వారా ఫెలినీ ఆర్టిస్టిక్ క్రియేటివిటీ కి సోర్సెస్ ను విజువలైజ్ చేసి చూపించాడు.సాధారణంగా చిన్నప్పటి సంఘటనలే ఆర్టిస్ట్ కు కియేటివ్ ఇన్ స్పిరేషన్ ను అందిస్తాయి. ఓ ట్యూన్, ఓ పెయింటింగ్, ఓ పదం ..ఇలా ఏదో ఒకటి అంతర్గతంగా వున్న ఆ విజువల్ ఇమేజెస్ ను గుర్తుకు తెస్తాయి.అయితే ఈ ఇమేజెస్ కు ఓ ఆర్డర్ వుండదు. ఓ అర్థం వుండదు. పై గా ఇవి కన్ ఫ్యూజింగ్ గా వుంటాయి.ఈ విజువల్ ఇమేజెస్ ఆర్టిస్టిక్ క్రియేషన్ లోకి  మ్యాజిక్ లా ఎంటరవుతాయి అన్న విషయాన్ని 8 ½  సమర్థనీయం గా అర్థవంతంగా క్లారిటీ గా వివరించింది.

 

ఈస్థటిక్ జడ్జ్ మెంట్స్ విషయం లో ఏది సరైనది అని చెప్పటం కన్నా, ఏది కాదు అని చెప్పటం చాలా సులభం. ఆర్టిస్టిక్ క్రియేటివిటీ అంటే ఏమిటి అన్న విషయాన్ని మాటల రూపం లో ఫెలినీ ఎక్కడా వివరించకపోయినా, ఏది కాదు అన్నదాన్ని మాత్రం ఈ సినిమా లో చాలా సందర్బాల లో వివరించాడు. ఈ సంభాషణలు 8 ½ లో కొంత కామెడీ రిలీఫ్ ను కలిగిస్తాయి. సినిమా క్రిటిక్ డామిర్ గైడో ను స్క్రిప్ట్ గురించి బోలెడన్ని ప్రశ్నలడుగుతుంటాడు. రచయిత ఉద్దేశ్యం ఏంటనేది స్పష్టంగా లేదు, అసలు ఏ సెంట్రల్ పాయింట్ ను బేస్ చేసుకొని కథ నడుస్తోందనేది తెలియట్లేదు. ఇలాంటి కొన్ని సూటైన వ్యాఖ్యలు చేస్తాడు డామిర్.

 

 

గైడో స్పా లో మెడిసినల్ వాటర్ తీసుకోవటానికి లైన్ లో నుంచుంటాడు. ఓ మ్యాజిక్ లా  క్లాడియా  అనే అందమైన  అమ్మాయి కనిపిస్తుంది. ఇక్కడ ఫిల్మ్ క్రిటిక్ గైడో మీద అటాక్ చేస్తాడు.ఒక అమ్మాయి మ్యాజిక్ లా కనిపించటం, ఆ అమ్మాయి లో కథానాయకుడుకు మోక్షం వుందనుకోవటం, ఆ సింబల్స్,, అసలు వీటికి అర్థం ఏంటి. సినిమా మొత్తం మీద అత్యంత దరిద్రంగా వున్నది ఈ సీక్వెన్సే అని చెపుతాడు క్రిటిక్.

 

గైడో చైల్డ్ హుడ్ ఫ్లాష్ బ్యాక్ లో వైన్ బాత్ చేసిన సీన్ తర్వాత సైతం సినిమా క్రిటిక్ గైడో ను పరోక్షంగా ఎదుర్కోవటం మనం గమనించవచ్చు. అలాగే ఈ సినిమా లో ముఖ్యమైన సన్నివేశం బీచ్ లో సర్గనియా డ్యాన్స్..అయ్యాక సినిమా క్రిటిక్ డామిర్ తనదైన రీతి లో గైడో ను మాటలతో ఎటాక్ చేస్తాడు.సినిమా క్రిటిక్ డామిర్ కు స్క్రిప్ట్ లో ప్రతిదానికీ లాజిక్ కావాలి.కారణం కావాలి.ఐడియాలజీ కావాలి.ఇంటెలెక్చువల్ గా ఏ విషయాన్ని చెపుతున్నావనే స్పష్టత కావాలి.అయితే వీటికి పూర్తిగా విరుద్దం ఫెలినీ తత్వం.అందుకనే ఓ ఫాంటసీ లో..సినిమా క్రిటిక్ డామిర్ ను గైడో అసిస్టెంట్ లు ఉరితీయటం అనే సన్నివేశాన్ని చూపిస్తాడు ఫెలినీ.

 

సినిమా చివర్లో గైడో కు ఈ లైఫ్ ను ఉన్నదున్నట్టు అంగీకరించాలని అర్థం అవుతుంది.గైడో సినిమా క్యాన్సిల్ అవుతుంది. ఫిల్మ్ క్రిటిక్ గైడో తో నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని చెపుతాడు.సరిగ్గా అప్పుడే మాయలు చేసే వ్యక్తి గైడో దగ్గరకొచ్చి, గైడో..మనం మొదలుపెట్టటానికి అంతా రెడీ అని చెపుతాడు. గైడో సినిమా క్యాన్సిల్ అయ్యింది.మరి ఈ మాటలు దేనిని ఉద్దేశించి అంటున్నవి అంటే..ఫెలినీ తీస్తున్న సినిమా గురించి అన్న మాటలివి.

 

8 ½ సినిమా ద్వారా ఆర్టిస్టిక్ క్రియేటివిటీ కి అసలైన సీక్రెట్ జీవితం లోని ప్రతిదాన్నీ యదార్థంగా అంగీకరించటమే అని చాటి చెపుతున్నాడు ఫెలినీ. మనిషి లోని అన్ని సైకలాజికల్ ప్రోబ్లమ్స్ కు సొల్యూషన్ కూడా ఈ అంగీకరించటమే అన్నది స్పష్టం చేస్తున్నాడు.ఒక మూవింగ్ విజువల్ ద్వారా ఇంటెలెక్చువల్ అస్పష్టతను తుడిచిపారేయ వచ్చు.  హేతువుకు అందని, అర్థ రహిత, వివరణ కు నోచుకోని విజువల్ ఇమేజెస్  ఇచ్చే ఎమోషనల్ ఇన్ వాల్వ్ మెంట్ ముందు లాజిక్, అర్థం, ఫిలాసఫీ, ఐడియాలజీ ఇవేమీ కనిపించవు అని ప్రూవ్ చేసాడు ఫెలినీ.

 

నా సినిమా లో ప్రతీది జరుగుతుంది. నేను అన్నిటినీ చూపిస్తున్నాను, ఇంకా చెప్పటానికి ఏమీ లేదు.నేను చెప్పాలనుకున్నదే చూపిస్తున్నాను .ఇలా సినిమా గురించి మాట్లాడతాడు ఫెలినీ.8 ½ సినిమా వెర్బల్ గా ఏ ఐడియాను చెప్పకపోయినా,ఓ విజువల్ ఎక్స్ పీరియన్స్ ను చూపిస్తుంది.సినిమా లో దృశ్యం ఏ ఎమోషన్ ను కలిగిస్తే అదే సినిమా. అలా కాక పదాలతో, మాటలతో ఎక్స్ ప్లెయిన్ చేయబడేది సినిమా కాదు అన్నది ఫెలినీ గట్టిగా చెపుతున్నాడు. ప్రపంచ సినీ చరిత్ర లో ఫెలినీ 8 ½  సెలబ్రేషన్ ఆఫ్ ఆర్టిస్టిక్ క్రియేటివిటీ గా చెప్పాలి.

 

—- జగన్మోహన్.

 


 

 

One Response
  1. sravan December 19, 2013 /