Menu

Eternal Sunshine of Spotless Mind

బయట హోరున వాన పడుతుంటే, లోపలెక్కడో, ఆదమరుపుగా కళ్ళు మూసుకొని ఆ చప్పుడు వింటున్నట్టు, కిటికి దగ్గర నించొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను రెప్పార్పకుండా చూస్తున్నట్టు, చూరు కింద నిలబడి వాన చినుకులతో ఆడకున్నట్టు, గొడుగేసుకొని సగం తడుస్తూ, సగం తడవకుండా నడుస్తున్నట్టు, రేన్ కోర్ట్ వేసుకొని వానలో తడుస్తూనే వడివడిగా నడుస్తున్నట్టు, తడవడం ఇష్టం లేక ఏ మూల ఇంత నీడ (షేడ్) దొరికినా దూరిపోయి, అకాల వానను తిట్టుకున్నట్టు, తప్పించుకునే వీల్లేక వానలో పూర్తిగా తడిసి ముద్దైపోయినట్టు – వలపు వానలతోనూ ఇన్నేసి అనుభవాలుండే అవకాశం ఉండకపోలేదు.ఎంత తప్పించుకుందామన్నా తప్పించుకోలేకపోయి తడిపేసిన వలపు వాన వెలిసాక మనిషి పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. వాన ఆగగానే భళ్ళున ఎండ అన్ని వేళలా రాదు. ఒక్కోసారి చీకటి పడిపోతుంది. చలిగాలి వీస్తుంది. తడిసిన బట్టలకు మట్టంటుకుపోయి చీదరనిపిస్తుంది. వెంటనే బట్టలు మార్చుకొని చక్కగా వేడి కుంపటి ముందు కూర్చునే సావకాశమూ కలుగదు. నచ్చినా, నచ్చకున్నా వానకంటూ లొంగిపోయాక, పూర్వస్థితికి చేరుకోడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు, నానా అవస్థ తప్పదు.అసలు ఆకాశంలో ఏ మూల ఏ మేఘం ఉన్నా, అది తన మీదే కురవాలని ఓ పక్క లోలోపల పరితపిస్తూనే, అలాంటి మేఘం కనిపించగానే అక్కడ నుండి పారిపోయే శాల్తీ, జో బారిష్.

అనుకోకుండా ఓ పూట ఓ అమ్మాయి పరిచమవుతుంది. ప్రణయం మొదలవుతుంది. జోరు జోరుగా కురుస్తున్న వలపు వర్షం, అమాంతంగా, అప్రియంగా ఆగిపోతుంది. ఏ ఆత్రేయ లాంటి వాళ్ళు రాసిన పాటలనో పాడుకోకుండా, పైన నేను చెప్పిన ఇబ్బందులన్నీ తప్పించుకోడానికి, జో instant drynessను ఎన్నుకుంటాడు. అది ఎందాక పనిజేసింది అన్నది, ’Eternal Sunshine of Spotless Mind.’ అనే సినిమాలో చూడాల్సిందే!

ఇంత డొంక తిరుగుడుగా కథను చెప్పటం దేనికి అంటే, ఇట్లాంటి సినిమాల గురించి తక్కువగా తెల్సుకొని, చూడ్డం మొదలెట్టాక మనకు మనంగా విషయాలను తెల్సుకోవడంలో ఉన్న థ్రిల్, జనాలిచ్చే సమ్మరీలలో రాదు. అందుకని ఈ సినిమా ఇప్పటి వరకూ చూడకపోయుంటే, చూడాలన్న ఆసక్తి కలిగితే, ఇక్కడితో చదవటం ఆపేసి, గూగుల్ జోలికి పోకుండా, సినిమాను చూసి రండి.

ఇక్కడ నుండి వ్యాసమంతా, సినిమా చూసేసినవారికో, చూసే ఉద్దేశ్యం లేనివాళ్ళకో మాత్రమే!

మూడున్నరేళ్ళ క్రితం ఈ సినిమా నాకు పరిచయమయ్యేటప్పటికి నాకు సినిమాలంటే చిన్నచూపు ఉండేది. ఒక హీరో-హీరోయిన్ జంట, ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొడ్డకొట్టుడు కథలూ తప్ప సినిమాల్లో ఏం ఉండవని అప్పట్లో నిశ్చితాభిప్రాయం. ఈ సినిమాను కూడా చాలా అలక్ష్యంగా, కేవలం జిమ్ కారీ ఉన్నాడు కాబట్టి, మొదలెట్టాను. డివిడి ప్లే మొదలెట్టి చేతిలో ఏదో పుస్తకం పట్టుకొని ఉన్నాను. సినిమాలు ఫ్రేం టు ఫ్రేం చూడనవసరం లేదు, అప్పుడప్పుడూ చూసినా కథ తెలుస్తుందిలే అని అనుకునేదాన్ని.

సినిమా మొదలయ్యింది. తెరపై జిమ్ కనిపించాడు. నేను ఎప్పుడు పుస్తకం పక్కకు పారేసి, కళ్ళప్పగించి సినిమా చూడ్డం మొదలెట్టానో నాకే తెలీలేదు. నన్నంతగా ఆకర్షిస్తున్నది జిమ్ మాత్రమే కాదు, I’m watching a genius’s work అని అర్థం అవటానికి అట్టే సమయం పట్టలేదు.

కథాపరంగా ఈ సినిమా విలక్షణం. ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రతిపాదించటం వల్ల, ఈ సినిమా అనగానే “భలే కాన్సెప్ట్ కదా!” అని వినిపించటం సర్వసాధారణం. కథే ఓ ఎత్తైతే, దాన్ని చూపించడానికి ఎన్నుకున్న తీరు నా మతి పోగొట్టేసింది. నా ఫేవరట్స్ లో ఈ సినిమానే టాప్‍లో ఉంటుంది. కారణం కథ నడిపించిన తీరు.

ప్రేమకథలెన్ని చూడలేదు? కానీ ఎప్పుడైనా ఒక ప్రేమికుడి మస్తిష్కంలోకి (నో..నో.. మనసు కాదు, మెదడు! The organ called brain!) దూరి, అక్కడ అతడు పదిలపర్చుకున్న సంగతులను కళ్ళారా చూసే అవకాశమిచ్చే కథలెన్ని? ప్రేమ జోరులో ఉండగా హార్మోన్ల డాన్స్ లతో సరిపోతుంది గానీ, ఈ లోపు అవతల మనిషి మన మెదడు అనే నోట్‍బుక్‍లో ఎన్నేసి పేజీల్లో తమ ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతారో మనకే తెలీదు. వాళ్ళతో చెడినప్పుడు, అప్పటి వరకూ మహాకావ్యాలనిపించనవన్నీ ఇప్పుడు చిత్తు కాగితాలు కాబట్టి, చించి అవతల పారేద్దామనుకుంటే ఏం జరుగుతుందో ఈ చిత్రంలో మనసుకు హత్తుకునేలా, అదే సమయంలో మెదడును పదును పెట్టేలా చూపించారు.

ఓపినెంగ్ సీన్‍తోటే, జో బారిష్ బుర్రలో మనల్ని ’డ్రాప్’ చేసి, ఆ తర్వాత ఆ మెదడంతా టూర్ వేయిస్తారు. ఓ మనిషి మెదడు. ఎంతటి అపురూపమైన విషయాలుంటాయో, అంత చెత్తా ఉంటుంది. ఒక్కో చోట వెగటు పుడుతుంది. చాలా చోట్ల “వావ్” అనిపిస్తుంది. మన కవులూ, భావకులూ వేవేల పదాలను అందంగా పేర్చి ఓ ప్రేమికుడి హృదయాన్ని ఆవిష్కరిస్తారు గానీ, అవ్వన్నీ ఉత్త embellishments. రాసుకోడానికి, చెప్పడానికి ఏముంది, పదసంపద ఉంటే? అలా కాక, ఒకరి పట్ల తనలో అంతరాలలో దాగున్న ప్రేమని, in its rawest form చూపించగలటం, అది కూడా మనకు సూటిగా తగిలేలా, అసామాన్య ప్రతిభ.

జో బారిష్‍గా జిమ్ కారీ నటన అనిర్వచనీయం. తెరపై కనిపించినప్పటి నుండి అతడితోనే ప్రయాణం సాగుతుంది. అమ్మాయిగా కేట్ విన్సెలెట్ కూడా బాగా చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే జీవించేస్తుంది. కాస్త తలతిక్క అనిపించే పాత్రలో కూడా హుందాతనం తీసుకొచ్చి, ఒక నిండుదనాన్ని ఇస్తుంది కథకు. కానీ, ఇది – కనీసం నా వరకూ – జో బారిష్ కథ! అతడి కథే! అందులో ఆమె ఉంటుందంతే! ఆమెను దూరం చేసుకోవాలన్న పంతం మంచులా వీడిపోయి, ఆమెను దాచుకోవాలన్న సంకల్పంలో అతడు పడే ఆవేదన, వెంపర్లాట. గాడ్! చూసి తీరాల్సిందే!

ఇహ, నాకీ సినిమా ఒక అడిక్షన్ లాంటిది. ఎన్ని సార్లు చూసినా ఏదో కొత్త విషయం స్ఫురిస్తూనే ఉంటుంది. ఒక్కసారి చూసి ’చూసేసాం’ అనుకోవచ్చు గానీ, ఎన్ని సార్లు చూస్తే అన్ని సార్లు ఒక అనిర్వచనీయమైన భావావేశాల్లోకి తీసుకెళ్ళి వదిలిపెడుతుంది. ఓ ప్రేమకథగానే కాదు, ఒక కథ హృద్యంగా మలచిన తీరు కూడా. ఊహాశక్తి మెండుగా గల రచయితలను చాలా చూసాను. కానీ ’చార్లీ కౌఫ్‍మాన్’ పనితనం నన్ను clean bowled చేసి పారేసింది. ఈ సినిమాను చూసినదాని కన్నా ఈ స్క్రిప్ట్ ను ఎక్కువ సార్లు చదివాను.

ఆసక్తికరమైన సంగతేంటంటే, ఈ చిత్రం రూపుదాల్చిన విధానం గురించి గూగులిస్తే, ఈ సినిమా టైటిల్ ఒకానొక కవిత నుండి తీసుకున్నారని తెల్సింది. ఆ కవితెలా పుట్టిందని చూస్తే, దాని వెనుకో చక్కని, చిక్కిన ప్రేమకథ – ఎప్పుడో పన్నెండో దశాబ్దం నాటిది! ఆ జంట ప్రేమకథ వెనుక ఇంకేం కథలేవులెండి. కవిత చదివినప్పటి నుండి, అది రచయితల బుర్రలోకి ఇంకి, అందులోంచి కొత్త ఆలోచన పుట్టి, అది కాగితంపైకి ప్రవహించి, అక్కడి నుండి తెరపై ఆవిష్కృతమై, నేరుగా మనలోకి… ఆ సైకిల్ మొత్తంలో ఉండే రోలర్ కోస్టర్ రైడ్ అయ్యాక, ఇంత అద్భుతమైనది బయటకొస్తే, అంతకన్నా కావాల్సిందేముంటుంది, చేసినవాళ్ళకి.

అన్నట్టు, ఇది అమెరికన్ ప్రేమకథ. చిటికేసినంతలో కలవడం, ఒకటై కరగడం, కలహపడ్డం అన్నీ జరిగిపోతాయి. As a flash! మనకు మల్లే డైవింగ్ బోర్డు మీద రాకముందు ఒక తతంగం, వచ్చాక తైత్తెక్కలు, చివర్న హై క్లైమాక్స్, అప్పుడు ప్రేమసాగరంలో దూకడం లాంటివన్నీ ఉండవు. వన్..టు..థ్రీ అనకుండానే వీళ్ళు దూకేస్తారు. అయినా కూడా, మనవాళ్ళు ఇలాంటి కథతో సినిమా తీస్తే, ఇంచక్కా, దానికి గుల్జార్ లాంటి వాళ్ళు పాటలు రాస్తే ఎంత బాగుణ్ణూ అన్న అత్యాశ మాత్రం నన్ను వదిలిపెట్టదు.

పోయినోళ్ళంతా మంచోళ్ళని ఎవరో సెలవిచ్చినట్టున్నారు?! అలానే, పోగొట్టుకోబడిన్నోళ్ళంతా (people lost to egos, fates, insecurities, misunderstandings and all such crap!) మంచోళ్ళని వదిలేయటం మేలు అని నా సలహా!

You can’t kill someone without killing a part of yours. Here’s a movie that shows one such killing-and-getting-killed process in a fascinatingly gut-wrenching way!

కొన్ని ఆసక్తికరమైన లంకెలు:
అలెగ్జాండర్ పోప్ కవిత
పన్నెండో శతాబ్దం ప్రేమ కథ
ఈ సినిమా స్క్రిప్ట్
సినిమా ఆఫీషియల్ వెబ్‍సైట్

Movie Details:
Eternal Sunshine of the Spotless Mind
Director: Michel Gondry
Cast: Jim Carrey, Kate Winslet.

4 Comments
  1. shravan December 7, 2011 /
  2. అబ్రకదబ్ర December 10, 2011 /
    • Rishi December 28, 2011 /
  3. prasad December 10, 2011 /