Menu

Benegal’s Bhumika

రంగస్థలంపైనో, సినిమా తెరపైనో రంగులు పూసుకొని ఆడి, పాడి, నవ్వి, ఏడ్చి చిత్రవిచిత్ర పాత్రలకు ప్రాణం పోసే కళాకారుల జీవితాలను తరచి చూస్తే ఆ రంగుల వెనుకున్న వివర్ణ జీవితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జీవితం పట్ల కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. అలా ఒక నటి జీవితంలోని విభిన్న కోణాలను అత్యంత హృద్యంగా తెరకెక్కించారు, ’భూమిక-ది రోల్’ అనే సినిమాలో శ్యామ్ బెనిగల్.

చిత్ర కథ: దేవదాసి వర్గానికి చెందిన ఒక గాయని మనవరాలు ఉష (స్మితా పాటిల్). తన తల్లి అనుసరించిన దేవదాసి పరంపరను ధిక్కరించి ఉష తల్లి ఒక బ్రాహ్మణుని పెళ్ళి చేసుకుంటుంది. అతడు అధిక మద్యసేవనం వల్ల అనారోగ్యానికి గురై మంచాన పడతాడు. మగదిక్కు ఉన్నా లేనట్టుగానే ఉన్న ఆ పరిస్థితుల్లో ’కేశవ్ దల్వి’ (అమోల్ పాలేకర్) అనే చుట్టం వీళ్ళ దగ్గరకు చేరతాడు. తండ్రి చనిపోయాక, కుటుంబ పోషణకు మరో దారి లేక, అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న సంగీతంతో ఉష తన వాళ్ళని పోషించగలదని నమ్మించి, ఆమె సినిమా రంగానికి పరిచయం చేస్తాడు కేశవ్. ముందు ఒప్పుకోకపోయినా పరిస్థితులకు అంతా తలొగ్గుతారు. ఉష గాయనిగా, నటిగా సినిమారంగంలో మెల్లిమెల్లిగా స్థిరపడుతుంది. యుక్త వయసు వచ్చేసరికి, తనకి వివాహమైతే సంపాదించాలనే వత్తిడి లేకుండా సుఖంగా వైవాహిక జీవితం గడపొచ్చనే ఆశతో తనకన్నా వయసులో చాలా పెద్దైన కేశవ్‍ను పెళ్ళాడుతుంది, మరో పక్క తోటి-నటుడు రాజన్ (అనంత నాగ్) ప్రేమిస్తున్నాడని చూచాయిగా తెల్సినా! కేశవ్ గుణగణాలను బాగా పసిగట్టిన ఆమె తల్లి ఎంతగా వారించినా మొండిగా అతడినే పెళ్ళాడుతుంది ఉష. వెంటనే ఓ బిడ్డకు తల్లి కూడా అవుతుంది. భార్యాబిడ్డల భాద్యతలను నెత్తికేసుకోక ఉష పర్సనల్ మానేజర్‍గా వ్యవహరిస్తూ ఆమె చేత సినిమా సినిమాల మీద సినిమాలు చేయిస్తాడు. వృత్తిలో ఎన్ని ఎత్తులకు ఎదుగుతున్నా వైవాహిక జీవితంలోని అసంతృప్తి ఉషను వెంటాడుతుంది. ఆత్మహత్యపై నమ్మకాన్ని కుదిర్చి, ఆమె అందుకు సిద్ధపడ్డాక, ఆమెను మోసం చేసి పారిపోతాడు ఒకానొక దర్శకుడు. (నసీరుద్దీన్ షా) సుఖసంతోషాలు దొరక్క భర్త చేతిలో చావుదెబ్బలు తింటూ బతకలేక, బూటకపు బంధంలో ఇమడలేక బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఆమె పైనా ఆశలు పెట్టుకొని కూర్చున్న రాజన్‍ను స్వీకరించక, ఏదో పూట పరిచయమైన ఒక పెద్ద వ్యాపారవేత్తకు (అమ్రిష్ పూరి) రెండో భార్యగా ఉండడానికి సిద్ధపడుతుంది. అక్కడ అత్తగారి, తోటి కోడలు, తోటి కోడల కొడుకుల ప్రేమానురాగాలను సంపాదించగలిగినా, ఆ కుటుంబలోని నియమ నిబంధనలను (ఆడువారు గడపదాటడానికి కూడా వీల్లేదు లాంటివి) జీర్ణించుకోలేక మళ్ళీ తిరిగి తన గూటికి పోవాలని నిశ్చయించుకుంటుంది. ఆమె ప్రయత్నం ఫలించిందా? ఆమె జీవితం ఇకపై ఎలాంటి మలుపులు తిరిగిందనే అంశంతో సినిమా ముగుస్తుంది.

ఇది మారాఠి రంగస్థల నటి “హన్సా వాడేకర్” జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమా అట. బాలీవుడ్ నటీమణుల జీవితాల్లోని వెలుగుచీకట్లను పరిచయం చేయడానికి తీసిన చిత్రంగా తోస్తుంది. కాకపోతే, దర్శకుడు సినిమాలో ఒక జీవితాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారే తప్ప, మధ్యలో ఎక్కడా కలగజేసుకోడానికి ప్రయత్నించినట్టు కనిపించదు. పాత్రల పట్ల ప్రత్యేకమైన మొగ్గు చూపటం కానీ, వారి పట్ల దయ, జాలి కలిగేలా చిత్రీకరించటం కానీ చేయలేదు. ముగింపు కూడా తేటతెల్లంగా ఉండదు. “ఇప్పుడు ఏమైనట్టు?” అన్న దిశగా ప్రేక్షకుల ఆలోచనలు నడిచేట్టు సినిమా ముగుస్తుంది. సినిమా అంతా చూసి ఎవరి ఆలోచనల దగ్గ వ్యాఖ్యానం వాళ్ళకి దక్కుతుంది.

పొట్టకూటి కోసం సమాజం అంతగా ఆమోదించని వృత్తుల్లో కొనసాగే స్త్రీల కథల్లో ఒక గమనించదగ్గ విషయం కనిపిస్తోంది నాకు. వారు జీవిస్తున్నది ఊబిలాంటిదని తలచి, దాన్ని నుండి విడిపడటానికి సర్వశక్తులూ ఒడ్డి, తీరా వాళ్ళు కోరుకున్న సంప్రదాయక, మర్యాదక పూర్వకమైన జీవితం చేతుల్లోకి వచ్చినప్పుడు, అది ఒకప్పుడు వాళ్ళున్న ఊబి కన్నా పెద్ద ఊబిగా అనిపిస్తుంది. సరిగ్గా గుర్తులేదు గానీ, ఉమ్రావ్ జాన్ సినిమాలో కూడా తిరిగి గూటికొచ్చేసిన ఉమ్రావ్‍తో అక్కడి పెద్దావిడ అంటుంది, “మంచిదైంది నువ్వు తిరిగి వచ్చేయటం. బయట లోకం పాడుది. ఇక్కడే మేలు” అని. ఈ సినిమా చూసాక కూడా అలానే అనిపించింది నాకు. కాకపోతే, ఇందులో ఉష తోటికోడలు ఓ చోట అంటుంది: “ఇళ్ళు మారుతాయి. వంటిళ్ళు మారుతాయి. మగాళ్ళ ముసుగులు మారతాయి. మగాళ్ళు మాత్రం మారరు, అక్కడైనా, ఇక్కడైనా, ఎక్కడైనా” అన్న అర్థంలో. ఆలోచించే ఓపికుండాలే కానీ, ఈ సినిమా చాలా ప్రశ్నలనే లేవనెత్తుతుంది.

ఇందులో నటీనటుల గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే! ముఖ్యంగా, స్మిత-అమోల్-నసీర్ ఒక్క దగ్గర వచ్చిన అపురూప సినిమా ఇది. స్మిత విలక్షన నటి అన్నది జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ఉరకలెత్తే యవ్వనం నుండి జీవితంలో పూర్తిగా దెబ్బ తిన్న మధ్యవయసు స్త్రీగా రూపాంతరం చెందినట్టు నటించిన తీరు బహు కొద్ది నటులకు సాధ్యం. ఈ సినిమా చేసేనాటికి ఆమె వయసు ఇరవై రెండేళ్ళే. అలాగే, నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఆమోల్ పాలేకర్ జీవించారు. తనకన్నా వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకొని, ఆమె సంపాదన మీదే బతుకుతూ, ఆమె తల్లి పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తించే పాత్రలో ఆయన నటన అమోఘం. కనిపించేది కాసేపే అయినా, నసీరుద్దీన్ తన పాత్రకు న్యాయం చేసారు. ఇహ, అనంత నాగ్ వర్థమాన సూపర్ స్టార్‍గా, తను ప్రేమించిన అమ్మాయి బాగోగుల కోసం పరితపించే మనిషిగా ఉన్న చిన్న పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. అమ్రిష్ పూరిది కూడా కీలక పాత్ర, చిన్నదైనప్పటికి.

కథంతా series of flashbacksగా చూపిస్తారు, నాయికకు తన జీవితంలోని భిన్న ఘట్టాలు గుర్తొస్తున్నట్టుగా. ప్రస్తుతం అంతా కలర్‍లోనూ, గతమంతా బ్లాక్ ఆండ్ వైట్‍లోనూ చూపించటం వల్ల, చాలా వరకూ సినిమా నలుపు-తెలుపు రంగుల్లోనే ఉంటుంది. ఇహ, శ్యాం బెనిగల్ మార్కు లాంటి దర్శకులు కథను చెప్పటం కన్నా చూపించటంలో ప్రదర్శించే నేర్పు ఈ సినిమాలో పుష్కలంగా కనిపిస్తుంది. నాయిక ఐదారేళ్ళ వయసు నుండి నలభై ఏళ్ళ వరకూ కథ సాగటంతో, ప్రేక్షకులకి ఆయా సంవత్సరాలను పరిచయం చేయడానికి “ఫలానా సంవత్సరంలో..” అని తెరపై చూపకుండా, ఆయా సన్నివేశాల్లో ఆకాశవాణి వార్తల ద్వారా చూపించారు. ఒక చోట ’రెండో ప్రపంచ యుద్ధ వార్తలు’ వినిపిస్తే, మరో సారి ’స్టాలిన్ మరణం’, మరో సారి ’పాక్‍లో అల్లర్లు’ ఇలా వినిపిస్తాయి. దీన్ని బట్టి కథాకాలం ఎలా పురోగమిస్తున్నదన్నది ప్రేక్షకులకు ఒక ఐడియా వస్తుంది. అలానే, టైటిల్స్ పడేటప్పుడు స్మిత చేస్తున్న నాట్యాన్ని సినిమా మధ్యలో మరో నటి చేస్తున్నట్టు చూపి, “అంటే, ఆమె ఈ ఇండస్ట్రీని వదిలి పెట్టి పోయింది. ఆమె చేస్తున్న సినిమాలను కూడా పూర్తి చేయకుండా విడిచిపెట్టి ఆ వ్యాపారవేత్తతో వెళ్ళిపోయింది.” అనే సమాచారంగా అంతర్లీనంగా ఇస్తారు. ఓపినింగ్ సీన్స్ లో స్మితను డ్రాప్ చేస్తానంటూ వచ్చిన అనంత నాగ్ ఎవరో చెప్పటానికి, వాళ్ళిద్దరూ ఉన్న ఒక భారీ పోస్టర్‍ను కూలీలు తీసుకెళ్తుంటారు. దీని బట్టి అతడు కో-స్టార్ అని తెలుస్తుంది, ఒక్క ఫ్రేమ్‍లో, ఎవరూ చెప్పకుండా. ఇలా చాలా పకడ్బందీగా చెప్పారు కథనాన్ని. కాకపోతే ఉష-రాజన్ మధ్యలో సంబంధాన్ని సరిగ్గా చెప్పినట్టు నాకనిపించలేదు. ఒక్కో చోట అతడి మీద ఎందుకు కోపంగా ఉంటుందో, ఎందుకు అతడిని దూరంగా ఉంచుతుందో చెప్పలేదు సరిగ్గా.

మొత్తానికి ఇదో అందమైన, అపురూపమైన చిత్రం. ఇందులోని నటీనటుల్లో ఏ ఒక్కరు మీ అభిమాన నటులైనా తప్పక చూడాల్సిన సినిమా. ఎవరూ లేకునా చూడదగ్గ సినిమా! ఒక జీవితాన్ని అత్యంత సహజంగా, నమ్మశక్యంగా, ఆలోచింపజేసే విధంగా ఒక బాలీవుడు చిత్రం ఉండటం బహు అరుదు. అందులో ఇదొక్కటి అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

One Response
  1. Sowmya December 17, 2011 /