Menu

ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)

పురుషాధిక్య సమాజంలో స్త్రీని కేవలం ఒక మాంసపు ముద్దగా ఒక వినోద వస్తువుగా వ్యాపారం చేసుకుంటున్న ఒక స్థాయి లో ఉన్న రచయితలూ కానీ దర్శకులు కానీ ఇలా వాస్తవికత రియల్ పిక్చర్ అంటూ స్త్రీని అసభ్యంగా చూపించే సినిమాలు తీయడం బాగా అలవాటైన సినీ సమాజం మై పోయింది మనది. సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది అన్నది వాస్తవమే. అయినప్పటికీ సినిమా అన్నది ఒక పవర్ఫుల్ మీడియం దీని ద్వారా ప్రజలకి నేటి యువతకి ఏమి చెప్పాలనుకుంటున్నామో అన్నది దర్శకులు కానీ నిర్మాతలు కానీ పట్టించుకోక పోయినా అది సమాజం లో ఉన్న యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలిసీ ఈ పని నిరాఘాటంగా కేవలం డబ్బుల కోసం లాభాల కోసం చేస్తున్న వికృత చర్య. కారణమేదైనా కానీయండి ఒక స్త్రీ జీవితాన్ని చిత్రించే వారు దానికి డర్టీ పిక్చర్ అని పేరు పెడితే ఎలా ఊరుకున్నారో మన మహిళలు.

 

నేను సినిమాలు చూడను అనుకోకుండా ఈ సినిమా చూసాను ముందరే చూసుంటే ఇంకా త్వరగానే స్పందించి ఉండేదాన్ని. ఒక సినిమా విమర్శకుని వ్యాఖ్యానం ఏమిటంటే చాలా కాలం కిందట అంటే దాదపు పాతిక ముప్పై ఏళ్ళ క్రితం “ఆమె శోభన రాత్రులు” ” ఆమె రాత్రులు” ఇలాంటి సినిమాలు వచ్చేవి వాటిని డర్టీ పిక్చార్లనే అనే వాళ్ళు అందుకని ఒక కారణం మరో కారణం ఆ పేరు వల్ల సినిమా లో ఏముందో చూస్తారు ప్రేక్షకులని ఒక కారణం చెప్పాడు. నిజమే కావచ్చు కానీ ఈ సినిమాలో కొంత వరకు నిజ జీవితం లో ఒక సినిమా ఆక్టర్ జీవితాన్ని రేఖా మాత్రంగా తీసుకుని మిగిలినది కొంత కల్పనలతో ఎలా ప్రేక్షకులను రంజింప జేయాలో అలా తీసారు. సినిమా కధ పరంగా ఆలోచిస్తే వాస్తవ సంఘటనలు , రావూరి భరద్వాజ గారి “పాకుడు రాళ్ళు” లో ఆనాడే ప్రస్తావించిన ఎన్.నంది ” సినీ జనారణ్యం” లో కూడా చూపించిన వాస్తవికత ఉంది.

 

ఈ సినిమాలో విద్య బాలన్ పాత్ర బాగానే నటించినప్పటికీ మొదట్లో ఆమె ఆలోచన ధోరణి నే అసహ్యకరంగా చూపించారు. వేరే వారు శృంగారం లో పాల్గొంటు౦టే ఈమె పక్క నుండి కూజితాలు చెయ్యడం ఎందుకో చాలా మానవ స్వభావాన్ని కించపరిచినట్టుగా అనిపించింది . అంటే అప్పటికే ఆమె కి అటువంటి ఊహలున్నట్టు ఏది చేయడానికైనా సిద్ధమైనట్టూ చూపించారు. నాకు తెలిసీ ఏ స్త్రీ కావాలని తన జీవితాన్ని బలి పెట్టుకోవడానికి అంత ఉత్సాహం చూపదు. అది తప్పనిసరైనపుడు తప్పదేహాన్ని బలి పెట్టదు .

 

అన్నిటికంటే ముఖ్యంగా అభ్యంతర కరమైనది ఈ చిత్రం వాల్ పోస్టర్లు.ఇవి చూసే వారికీ ఏమి నయనానందం కలిగించాయో మరి వీటి గూర్చి ఎవరూ ఏ సెన్సార్ వారూ ఏ అభ్యంతరమూ చెప్పలేదో మరి నాకు అర్ధం కాలేదు. జంట నగరాల్లో అతి పెద్ద వాల్ పోస్టర్లు ఆమె ని అర్ధనగ్నంగా చూపిస్తే అవి చూసి ఆ సినిమా చూస్తారని ఆ నిర్మాతల ఆశ అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమాలు చూసేది ఎవరూ మళ్ళీ మగవారే యువకులే. సినిమాలో ఒక చోట బ్లాక్ లో టికట్ కొనుక్కునే కుర్రాడితో ఈ డబ్బులకి ఆమె నీకు దొరుకుతుంది కదా అనడం చాలా అవమానంగా అనిపించింది. ఎంత వాంప్ పాత్రలో నో ఐటెం పాట లోనో నటించినప్పటికీ ఆమె శరీరం ఒక బ్లాక్ టికెట్ కొన్నంత వెలతో సమానమా ? ఇది మనసు కలచివేయ్యడం లేదా?ఇది యువతకు ఏ ప్రబోధాన్నిస్తోంది ?

 

ఇక కధ విషయానికొస్తే ఎంతమంది కూర్చుని రాసారో కానీ ఎక్కడా పొంతనే లేని కధ. ఒక రికార్డ్ డాన్సర్ జీవితం కన్న ఒక వేశ్య జీవితం కన్న అసహ్యంగా చిత్రీకరించడం బాధ కలిగించింది. అయితే ఈ సినిమా గురించి రాసే విమర్శకులు ఇది వాస్తవికత నిజం అని వాదిస్తారు నిజమే కానీ సినిమాలాంటి మీడియా లో మనం చుపిస్తోందేంటి అన్నా స్పృహ దీని ద్వారా ఏమి సందేశం ఇస్తున్నామన్న స్పృహ కాస్తైనా దర్శకుల్లో ఉండాలి కదా. ఆ అమ్మాయి పాత్ర పైన సానుభూతి కాని సాహాను భూతి కాని లేకుండా చిత్రించారు.ఎంతో మంది సినీ నటీమణులు ఇలా మారడానికి కారణాలు చాల ఉన్నాయి ఆర్ధిక పరమైనవి కుటిమ్బాల్ని పోషించుకోవాల్సి రావడం ఇలాంటివెన్నో. ఈ సినిమాలో అలాంటి అవసరమున్నట్టేమీ చూపించలేదు. ఇది చాల నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది అందరి మీద.ఒక విధంగా అటువంతో నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే భావిస్తున్నాను నేను.

 

వాస్తవ జీవితం ఐనప్పుడు దాన్ని డర్టీ అనాల్సిన అవసరమేరమే ముంది. ఒక స్త్రీ జీవితంలో పడిన బాధలు డర్టీ నా ? లేక ఆ స్త్రీ బతుకు డర్టీ నా? ఏంటి దర్శకుల ఉద్దేశం. ఇది ఒక ఆడదాన్ని అత్మభిమానాన్ని దెబ్బ తీసే విధంగా ఉందనడంలో సందేహమే లేదు. అసలు సినిమా అన్నది ఒక పరిశ్రమ అని మనం చెప్పుకోవడానికే జుగుప్స కలుగుతోంది ఎక్కడో ఒక పది శాతం తప్ప సినిమాలన్నీ ఎక్కడ ఏమి చుపిస్తున్నాయో అసలు ఆలోచిస్తున్నామా? పరిశ్రమ అంటే ఏదైనా సరే ఒక మంచిని ఉత్పత్తి చేసేది…అలాంటి మంచి ఏదైనా మనం సినిమా పరిశ్రమ నుండి ఆశించా గాలుగుతున్నమా. ప్రతి స్థాయి లోను రాజకీయాలు కక్షలూ ఫాక్షన్లు హింసలు వీటన్నిటితో బాటు ఒక స్త్రీ ఆమె హీరోయిన్ అయినా సరే ఓకే గొప్ప వారి అమ్మాయి అయినా అత్యంత పొదుపుగా బట్టలు వేసుకోవడం లాంటి వికృత వేషాలు చూపించడం. లేదా ఆ పిల్లాడు ఆమె ప్రేమించాక పోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ చూసి భగ్న ప్రేమలతో (అనే భ్రమలతో) ఆసిడ్ దాడులు చేస్తున్న యువతకి ఏమని చెప్పగలము. ఎలా వారించగాలము అనిపిస్తుంది.

 

సరే ఇదంతా చాల మంది చేసిన వ్యర్ధ చర్చ అని నాకూ తెలుసు.కానీ ముఖ్యంగా ఈ సినిమా గురించి మాటాడి నప్పుడు మాత్రం మనసు నిజంగా కలత చెందుతోంది. సినిమా వారి జీవితలంటూ శృంగారాన్ని బాగా రంగరించి పోసి దాన్ని వాస్తవికత గా చలామణి చేస్తున్న దర్శకులకు నిర్మాతలకు ఒక్కసారి తామేమి చేస్తున్నారో ఆలోచించరా. కేవలం ధనార్జన తప్ప మానవ జీవన మర్యాదలు కూడా పాటించకుండా ఒక సినిమా తీయడం దానికి ఎగేసుకుంటూ కుర్రాళ్ళందరూ వెళ్లి చూడటం…అందుకు కొందరు విమర్శకులు చాల వాస్తవిక మైన ది అంటూ మెప్పులు కురిపించడం ఇదంతా ఒక ఫాబ్రికేటేడ్ గా కావాలని అల్లిన వల లా అనిపించడం లేదా ప్రేక్షకులకు. వాస్తవికంగా అయితే ఒక జీవితాన్ని యధాతధంగా తీసి చూపండి మీ క్రూరపు మసాలాలన్నీ ఎందుకు కూరుతారు?

 

ఒక్క డైలాగ్ మాత్రం సినిమాలో నిజంగా చాలా బాగుంది ఆమెను ఈ వేషం కోసం తీసుకెళ్ళేవాడు ఆమెకు “సిల్క్” అని నామకరణం చేస్తే ఈ రోజునుండీ నువ్వు “కీడా దాస్ వి ” అంటుంది కీడా అంటే పురుగు పట్టు పురుగుల దేహలతోనే కదా సిల్క్ పట్టు నేయబడుతుంది. అలాగే ఇలాంటి విపరీత వికృత కీడా ఒక సినిమా క్రీడా గా ఆవిర్భవించి సందేశం మాట అటుంచి ఎవరికి మంచి చేసిందో లేక ఎంత హాని కలిగిస్తుందో ఒక్క సారి ఆలోచించగలిగితే బాగున్ను కదా వ్యాపారులుగా కాక మనుషులుగా మన నిర్మాతలు.

 

సిని జీవితలంటే రంగుల అందాల జీవితాలు కావని చెప్పదల్చుకుంటే ఇంకొంచం జీవన మర్యాద తో చెప్పకూడదా. రోడ్డున ఉన్న వెలయాలి కూడా చయ్యని పనులు మాటలు ఒక పేద అమ్మాయి అయినంత మాత్రాన కేవలం సినిమా నటి గా మారాలన్న తపనతో అలా ఏ బాధా లేకుండా చేయడం బాగా మనసును కలిచివేసింది. ఏది ఏమైనప్పటికీ డర్టీ పిక్చర్ లో డార్ట్ (మురికి) కంటే నిర్మాతల దర్శకుల మెదళ్లలోని డర్టీ నెస్ ని ప్రేక్షకులకి సాధ్యమైనంత డర్టీగా అందించి ఒక స్త్రీ సిని నటి జీవితాన్ని అసహ్యంగా చిత్రీకరించడం మాత్రం చాల అభ్యంతరకరం , బాధాకరం కూడా. ఇలాంటి పాత్రల్లో నటిస్తే తాము ఎంతో గొప్ప నటీమణులుగా చెలామణి అయిపోతామని అవార్డులు వచ్చేస్తాయని ఆశించి నటించే మన నటీ మణులను చూసిన నిజంగా జాలి కలుగుతుంది.

 

వాస్తవికత చిత్రీకరించడం తప్పు కాదు అది వికృతీకరించి డబ్బులు వసూలు చేసుకోవడం తప్పంటున్నాను. ఏమి మిత్రులారా నా ఆవేదనకీ అర్ధం లేదంటారా? మేకు ఈ వేదన కలగలేదంటారా? ఒక్కసారి అలోచించి చూడండి.

…జగద్ధాత్రి

7 Comments
  1. Mauli December 27, 2011 /
  2. surampudi pavan santhosh December 27, 2011 /
  3. Sarath December 28, 2011 /
  4. శ్రీరామ్ వేలమూరి January 8, 2012 /
  5. chelluru.sambamurty February 8, 2012 /
  6. Swaroop May 2, 2012 /