Menu

వెండి తెరపై ‘బాలానందం’

‘‘మెరుపు మెరిస్తే- వాన కురిస్తే
ఆకసమున హరివిల్లు విరిస్తే
అది మాకోసమే అనుకుని’’ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు- పిల్లలు… పాపలు… రేపటి పౌరులు!
బాలలు నిత్యోత్సాహులు… నిరంతర కుతూహలురు!
వారు ఆశ్చర్యపడే మెరుపును… వారు ఆనందపడే వానను… వారు తన్మయమై తారంగం పాడే హరివిల్లును వెండి తెరపై సృష్టిస్తే ఏమవుతుంది?
బాలల చిత్రోత్సవం అవుతుంది…!
అంతర్జాతీయ బాలల సినిమా పండగ అవుతుంది…!
అలాంటి ఓ జిలుగువెలుగుల… జ్ఞానదీపాల… విజ్ఞాన వీచికల చిత్రోత్సవం నవంబర్ 14నుండి 21వరకూ హైదరాబాద్‌లో జరగబోతోంది… ప్రపంచస్థాయిలో వివిధ దేశాల ప్రతినిధులు- బాలల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది.
అవసరమేంటి?
ప్రపంచం మొత్తంమీద అన్ని వర్గాలు- దేశాలు- జాతుల ప్రజలు అందరికీ వినోదం అంటే గుర్తొచ్చే ఆమోదయోగ్యమైన విశేషం- సినిమా! ఈ శతాబ్దపు అద్భుతంగా మానవుల జీవితంలో అంతర్భాగంగా మారిన ఈ సినిమా మనలో వినోదానికేకాక విజ్ఞానానికీ, వికాసానికీ, మానవీయ విలువల స్థాపనకీ కూడా ఎంతో దోహదపడుతోంది. అంతేగాక, దృశ్య-శ్రవ్య సాధనంగా సినిమా మనిషి మనస్తత్వాలపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.. ఇక ‘‘టాబ్యులా రసా’’ (లాటిన్‌లో పరిశుభ్రమైన పలక అని అర్థం) వంటి బాలల మెదళ్ళను సినిమా ఆకట్టుకున్నంతగా మరేదీ ఆకట్టుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన మేధావులు, విద్యావేత్తలు, సైకాలజిస్టులు బాలలకోసం వారి మానసిక స్థాయికి తగిన ప్రత్యేక సినిమాలను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణిస్తున్నారు. వౌఖికంగా చెప్పే కథలను, లిఖితంగా చదువుకొనే విషయాలను ఎంతో ఆసక్తిగా గమనించడం, తమలోని ఊహాశక్తి (ఇమాజినేషన్ స్కిల్)కు పదునుపెట్టుకోవడం బాలల సహజ లక్షణం. ఈ ఊహాశక్తి దృశ్యమాధ్యమమైన సినిమాలు తోడైతే బాలల ప్రవర్తన- స్వభావాలలో తీసుకొచ్చే మార్పు గణనీయంగా ఉంటుంది. దీనికితోడు బాలల లేత మనసులపై మంచి జీవన విలువలతో కూడిన కథలను, సినిమాలను ముద్రించడం ద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని, మానవతా విలువలని పెంపొందించవచ్చు.
ఈ కారణాలవల్ల బాలలకోసం ప్రత్యేక సినిమాలను నిర్మించాలనే ఆలోచన అంకురించింది. ఆ ఆలోచనే చివరికి బాలల చిత్రాలన్నింటినీ ఒక్కచోట ప్రదర్శించడానికి వీలుగా ఓ చిత్రోత్సవాన్ని నిర్వహించాలనే కోరికకు పునాదులు ఏర్పరిచింది. అందుకే ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని దేశాలు, వాటి ప్రభుత్వాలూ బాలల చిత్రాల నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధను కనబరుస్తున్నాయి. రాయితీలు ఇస్తున్నాయి. పన్ను మినహాయింపు సౌకర్యాలను అందచేస్తూ, నిధులు సమకూరుస్తూ బాలల చిత్రాలను ప్రోత్సహిస్తున్నాయి. ఆ దిశగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న మరో

కీలక ఆచరణే- అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు..
ఎలా మొదలైంది?
‘్భరతదేశ భవితవ్యాన్ని నిర్ణయించగలిగేది బాలలే’ అనేది మహాత్మాగాంధీజీ, పండిట్ నెహ్రూల ప్రగాఢ నమ్మకం. ఇక మన దేశ తొలి ప్రధాని నెహ్రూకైతే బాలలంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన బాలలకోసం ఎనె్నన్నో ప్రత్యేక కార్యక్రమాలను దేశంలో ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే బాలల మనోవికాసానికి తీస్కోవలసిన చర్యల గురించి ఆలోచించారు… ఎనె్నన్నో సాంస్కృతిక కళారూపాల ద్వారా బాలల మేధోప్రగతికి ప్రణాళికలు రూపొందించారు. ఆ సమయంలోనే ఆయన సినిమాల ద్వారా బాలలకోసం ఏమైనా చేయవచ్చా అని ఆలోచించారు.్ఫలితంగా 1949లో నెహ్రూ ‘‘్ఫల్మ్ ఎంక్వయరి కమిటీ’’ని నియమించారు. ఆ కమిటీ ‘‘ప్రస్తుత భారతీయ సినిమాలన్నీ సాధారణ ప్రేక్షకవర్గ మానసిక స్థాయికి సంబంధించిన సినిమాలే తప్ప బాలల శారీరక- మానసిక స్థాయిలకు అందేవి కావ’’ని తేల్చిచెప్పింది. సరే బాగుంది… అప్పుడు బాలలకోసం ఏంచేయాలి అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ కమిటీ బాలల సినిమాలకోసం ఓ ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది… ఆ సూచనలలోంచి ఆవిర్భవించిన ప్రభుత్వ సంస్థే- ‘‘చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’’! 1955 మే 5న పండిట్ హృదయనాథ్ కుంజ్రూ నేతృత్వంలో ఈ సంస్థ ఏర్పాటయింది. దీని లక్ష్యాలు:
1. బాలలకోసం వారి స్థాయికి అనుగుణమైన సినిమాలను ప్రత్యేకంగా నిర్మించడం.
2. బాలల చిత్రాలకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించడం- పంపిణీని చేపట్టడం.
3. పిల్లలకు జ్ఞానాన్ని పెంపొందించే కథలనే సినిమాలుగా నిర్మించేలా చర్యలు చేపట్టడం.
4. ఈ సినిమాల ద్వారా బాలలకు సంపూర్ణ వినోదాన్నివ్వడం, సరైన ప్రదర్శన రీతులను, విశాల దృక్పథాన్ని పెంపొందించడం.
5. సినిమా మాధ్యమం ద్వారా బాలలలో బాధ్యతాయుత మనస్తత్వాన్ని, నైతిక విలువలను, మానవతా ఆదర్శాలను నెలకొల్పడం.
6. జాతీయస్థాయిలో బాలల చిత్రోత్సవాలను నిర్వహించి, బాలల చిత్రాలపై వివిధ సినీ ప్రముఖులు- నిర్మాత- దర్శకులకు అవగాహన కల్పించడం.
7. అంతర్జాతీయంగా బాలల చలనచిత్రాల నిర్మాణంలో, కథావస్తువుల ఎంపికలో, నేరేషన్ టెక్నిక్‌లో వస్తున్న అధునాతన మార్పులను ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్’ చేసుకోవడంకోసం ‘‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల’’ను నిర్వహించడం.

బాలల సినిమా అనేది మేకింగ్‌పరంగా స్థానికమైనదే కానీ, విస్తృతిపరంగా అంతర్జాతీయమైందనడంలో సందేహం లేదు. అందుకే బాలల చిత్రాలపై వివిధ దేశాలలో జరుగుతున్న ప్రయత్నాలు, వాటిలో ఇచ్చిపుచ్చుకోవడాలు జరగడానికి ఓ వేదిక అవసరమైంది. ఆ అవసరంలోంచే ఈ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు 1979లో బొంబాయిలో శ్రీకారం చుట్టుకున్నాయి. ఈ ఉత్సవాలకి ‘‘గజ్జు’’అనే గున్న ఏనుగుని మస్కట్‌గా నిర్ధారించారు.
ఫ్లాష్ బ్యాక్
– మన దేశంలో ఈ ‘‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు’’ 1979 నుండే మొదలయ్యాయి. బొంబాయిలో జరిగాయి.
– మొదట్లో ఈ ఉత్సవాలలో విజేతలకు కేవలం మెమెంటోలను మాత్రమే బహూకరించేవారు. కానీ 1995నుండీ మెమెంటోతోపాటు నగదు బహుమతిని కూడా ఇవ్వడం ఆరంభించారు.
– ఉత్తమ చిత్రానికి ‘బంగారు నంది’ని ఇస్తారు. దాంతోపాటు (1995 నుండి 2005వరకూ) ప్రైజ్‌మనీ మొత్తం రూ.లక్ష ఇచ్చేవారు.
– 2007లో జరిగిన 15వ చిత్రోత్సవాల నుండి ప్రైజ్‌మనీ మొత్తాన్ని 2 లక్షల రూపాయలకు పెంచారు.
– తొలి బాలల చలనచిత్రోత్సవాలు బొంబాయిలో (1979), రెండవ ఉత్సవాలు చెన్నై (1981)లో, మూడో ఉత్సవాలు కోల్‌కతా (1983)లో, నాలుగో ఉత్సవాలు బెంగళూర్ (1985)లో జరిగాయి.
– 1987లో భువనేశ్వర్ (ఒరిస్సా)లో, 1991లో త్రివేండ్రం (కేరళ)లో 1993లో ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లో జరిగాయి.
– 1995లో జరిగిన 9వ బాలల చిత్రోత్సవాలనుండి ‘శాశ్వత వేదిక’గా హైదరాబాద్‌ను నిర్ణయించారు.
– ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవాలు 1979నుండి ఇప్పటివరకూ 17వవి కాగా, హైదరాబాద్‌లో జరుగుతున్నవి- 8వవి!
17వ బాలల చిత్రోత్సవం, 2011
ప్రతీ రెండేళ్ళకోసారి అంతర్జాతీయ స్థాయిలో బాలల చలనచిత్రోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, 1979నుండి 1995 వరకు ఈ ఉత్సవాలను దేశంలోని వివిధ నగరాలలో నిర్వహిస్తూ వచ్చారు. దీని ద్వారా ఆయా రాష్ట్రాలలో చైతన్యం అవగాహన కలుగుతాయని ఆశించారు. కానీ 1995నుండి హైదరాబాద్‌ను శాశ్వత వేదికగా నిర్ణయించి నిర్వహిస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం జరుగనున్న 17వ బాలల చలన చిత్రోత్సవాలు ఎనె్నన్నో విశిష్టతలు, విశేషాలతో ముస్తాబై అందరినీ ఆకర్షిస్తోంది.

 

ఎన్ని దేశాలు-ఎన్ని సినిమాలు?
ప్రస్తుత బాలల చిత్రోత్సవాలలో అమెరికా, సింగపూర్, పోలండ్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలతోపాటు బాలల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన ఇరాన్ కూడా పాల్గొంటున్నాయి. ఇక చైనా, జపాన్‌లు సరేసరి. అలా మొత్తం 86 దేశాల నుండి ఈ పోటీలకు 741 ఎంట్రీలు వివిధ కేటగిరీలలో వచ్చాయి. అయితే వాటిలో 151 సినిమాలను మాత్రమే ‘షార్ట్‌లిస్ట్’చేసి ఈ ఉత్సవాలలో ప్రదర్శించబోతున్నారు. కేటగిరీ వైజ్‌గా గమనిస్తే, ఈ పోటీలకుగాను 56 యానిమేషన్ షార్ట్ఫిల్మ్స్… 85 లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిల్మ్స్… మరో 3 లైవ్ యాక్షన్ షార్ట్ఫిల్మ్స్ ప్రదర్శనకు, పోటీలకి ఎంపికయ్యాయి.
వీటిలో ‘ది అదర్’, ‘మెడో’, ‘విండ్ అండ్ ఫాగ్’, ‘హయత్’, ‘గోల్డ్ టెయల్’ వంటి ఇరాన్ సినిమాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
విభాగాలేంటి?
ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నారు. కాగా ఈ సంస్థ 10 అక్టోబర్, 1975లో స్థాపించిన నాటినుంచీ సినీ రంగ అభివృద్ధికి, తెలుగునాట సినీ పరిశ్రమ బలంగా రూపుదిద్దుకోడానికి కావలసిన చర్యలెన్నో చేస్తోంది. ఇక, ఈ అంతర్జాతీయ ఉత్సవాలకోసం ఈ సంస్థ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీతో కలిసి కొన్ని విభాగాలను రూపొందించి, ఆ కేటగిరీలలోని చలనచిత్రాలకు అవార్డులను ఇవ్వాలని సంకల్పించింది.
1) పోటీ విభాగం: దీనిలో అంతర్జాతీయ పోటీ విభాగంలో 15 సినిమాలను, ‘్భరతీయ పోటీ’ విభాగంలో 10 సినిమాలను, ‘లఘుచిత్రాల పోటీ’ విభాగంలో 25 చిత్రాలను, లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో 12 లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు.
ఆయా విభాగాలలోని ఉత్తమ చిత్రాలను ఎంపిక
చేయడంకోసం ఒక్కో విభాగానికి 5గురు చొప్పున మొత్తం 20 మంది జ్యూరీ సభ్యులను నియమించారు.
2) పోటీయేతర విభాగం: దీనిలో ‘బాలల ప్రపంచం’ పేరిట 100 ఉత్తమ బాలల చిత్రాలను ప్రదర్శించనున్నారు. అంతేగాకుండా, చైనాలోని బాలల చిత్రాలపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు.
ఏఏ కార్యక్రమాలు?
వారం రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ ఉత్సవాలలో ఎనె్నన్నో వర్క్ షాపులను నిర్వహించనున్నారు. యానిమేషన్, ఫిల్మ్ నిర్మాణం, స్క్రిప్ట్ రచన, పప్పెట్‌ల తయారీ వంటి ప్రత్యేక అంశాలని ఈ వర్క్‌షాపులలో హైలైట్ చేస్తున్నారు. వీటిలో జాతీయ అంతర్జాతీయ స్థాయి దర్శక నిర్మాతలు, మేధావులు పాల్గొంటారు.
వీటికితోడు సమకాలీన సినిమా రంగంపై ఎనె్నన్నో ఆసక్తికరమైన చర్చలను ‘ఓపెన్ ఫోరమ్’ పేరిట నిర్వహించనున్నారు. కుటుంబ కథాచిత్రాలు బాలల చిత్రాలకు ఆటంకమా? బాల దర్శకుల ఆవశ్యకత ఏమిటి? సినిమా నిర్మాణంలో భారతీయ యానిమేషన్ ఎలా ఉంది? బాలల చిత్రాల విషయంలో మన దేశం ఉన్నతస్థాయిలో ఉందా లేక ఇంకా ఉద్యమ స్థాయిలోనే ఉందా? అసమానతలను తొలగించడంలో బాలల చిత్రాల పాత్ర ఏమిటి? వంటి అంశాలపై ఈ చర్యలు జరుగుతాయి.

అవార్డుల సంగతేమిటి?
మొదట్లో ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో విజేతలకు నగదు బహుమతి ఇచ్చేవారు కాదు… కానీ ఇప్పుడు ఉత్తమ చిత్రానికి స్వర్ణ ఏనుగు, ప్రశంసా పత్రంతోపాటు 2 లక్షల రూపాయలను, ద్వితీయ ఉత్తమ చిత్రానికి లక్ష రూపాయలను, ఉత్తమ దర్శకుడికి 1.5 లక్షలను, ఉత్తమ స్క్రీన్‌ప్లేకి లక్ష రూపాయలను నగదు రూపంలో ఇస్తున్నారు. ఈ 17వ బాలల చిత్రోత్సవాలలో ఏ చిత్రాలు ఈ అవార్డులను గెల్చుకుంటాయో త్వరలోనే తేలిపోతుంది.
తెలుగు తేజం
మన నేలమీద జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఉత్సవాలలో మన తెలుగు సినీ పరిశ్రమ భాగస్వామ్యం అంతగా లేకపోవడం బాధాకరమే.. ఆ మాటకొస్తే ప్రతిసారీ అసలు భారతీయ భాషాచిత్రాల నిర్మాణం మరీ అల్పం. కనుక, మన గడ్డమీదే ఈ అంతర్జాతీయ స్థాయి ఉత్సవాలు జరుగుతున్నా మన సినీ పరిశ్రమకేమీ సంబంధం లేనట్లుగానే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది.
అయితే ఈసారి మాత్రం ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తెలుగుతేజం తనదైన ప్రతిభను ప్రదర్శించబోతోంది. ఆ సినిమానే ‘‘లోటస్ పాండ్’’! ఈ సినిమాని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి.లింద స్వీయ దర్శకత్వంలో అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించారు. హిమాలయాలలోని మానస సరోవరంకోసం ఇద్దరు స్కూల్ బాలలు చేసే యాత్రే ఈ సినిమా! భారతదేశ ప్రాకృతిక సౌందర్యం, భౌగోళిక వైవిధ్యత, జాతి సాంస్కృతిక విలువలను సున్నితంగా రంగరించి అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రీకరించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది.
ఏది ఏమైనా, ప్రతీ రెండేళ్ళకోసారి ఈ ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ మాత్రం వినోదాత్మక చిత్రాలు- కమర్షియల్ చిత్రాలవైపే మొగ్గుచూపుతోంది. ఇలాంటి బాలల చిత్రాల నిర్మాణంవైపు కనీసం దృష్టిసారించకపోవడం ఒకింత బాధాకరం.
*

ఉత్సవ సూత్రధారులు

భారత ప్రభుత్వం- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను ముందుండి నడిపిస్తూ, మార్గదర్శనం చేస్తూన్న ప్రధాన సూత్రధారులు వీరే:

నందితాదాస్: అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నటి, దర్శకురాలు ప్రముఖ పెయింటర్ జతిన్‌దాస్ కూతురు. సోషల్ వర్క్‌లో మాస్టర్ డిగ్రీ సాధించిన నందితా ‘జననాట్య మంచ్’లో సభ్యురాలిగా నాటకాలతో నటిగా కెరీర్‌ని మొదలెట్టింది. ఫైర్ (1996), ఎర్త్ (1998), బవందర్ (2000), అమార్‌భువన్ (2002) వంటి సినిమాలలోని నటనతో గొప్ప కీర్తి సంపాదించింది. ఎనె్నన్నో జాతీయ – అంతర్జాతీయ అవార్డులను సాధించిన నందితా ఫిరాఖ్ (2008) సినిమాతో దర్శకురాలిగా మారింది. తెలుగులో ఆమె ‘కమ్లి’ సినిమాలో నటించింది. దీనికిగాను ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది.
ఈ ఉత్సవాలను భారత ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ‘చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’కు ప్రస్తుత ఛైర్ పర్సన్ ఆమె.

సుశోవన్ బెనర్జీ: ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్రలో మాస్టర్ డిగ్రీ సాధించిన సుశోవన్ ఐపిఎస్ అధికారిగా పలు బాధ్యతలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ మానవ హక్కుల సంఘం ఐ.జిగా పనిచేసిన ఈయన ‘చిల్డ్రన్ ఫిలిం సొసైటీ’కి ప్రస్తుతం చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

శ్రీమతి డి.కె.అరుణ: మన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి. సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శాఖలు కూడా ఈమె పరిధిలోనివే. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైన ఈమె రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ ప్రగతికి దోహదపడ్తున్న ప్రభుత్వ శాఖా మంత్రిణి. ప్రస్తుత బాలల చిత్ర ఉత్సవాలు ఈమె ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి.

బుర్రా వెంకటేశం: వరంగల్ జిల్లా జనగామ ప్రాంతానికి చెందిన వెంకటేశం జాతీయస్థాయిలో అత్యున్నత ప్రతిభకనబరిచి ఐఎఎస్ అధికారిగా ఎంపికయ్యారు. మునిసిపల్ కమీషనర్‌గా, జిల్లా కలెక్టర్ వివిధ పదవులలో తనదైన ప్రత్యేక మానవీయ ముద్రను వేసిన ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమీషనర్‌గా, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల నిర్వహణ వెనుక ఉన్న ప్రధానకర్త ఆయనే.

దీపికారెడ్డి: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి. ఈ బాలల చలనచిత్రోత్సవాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ నిర్దేశకురాలు ఆమే! వివిధ జాతీయ – అంతర్జాతీయ వేదికల మీద తన నాట్య ప్రదర్శనతో భారతీయ సంప్రదాయ నృత్య విశిష్టతను చాటిచెప్పిన అసమాన ప్రతిభాశాలి.
ఇంకా… అంతర్జాతీయ స్థాయిలో మన దేశ గౌరవ ప్రతిష్టల చిహ్నంగా జరుగుతున్న ఈ బాలల చలనచిత్రోత్సవాలకి నిరంతరం దిశానిర్దేశం చేస్తున్న వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి అంబికాసోనిల పాత్ర కూడా అధికమే!

 

17వ బాలల చిత్రోత్సవాలు – విశేషాలు

– నవంబర్ 14, 2011న ప్రారంభమయ్యే 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ప్రధాన వేదికగా మొదటిసారిగా ‘శిల్పారామం’ను ఎంపిక చేసారు.
– ఈ ఉత్సవాలలో 86 దేశాలకు చెందిన 741 చలనచిత్రాలు పోటీపడనున్నాయి.
– ప్రదర్శనకు షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాలు 151.
– ఉత్సవాలలో రెండు క్యాటగిరీలు చేసారు.
1) పోటీ విభాగం 2) పోటీయేతర విభాగం.
– ఈసారి ‘కాంపిటీషన్ ఇండియా’ పేరిట కొత్త విభాగాన్ని పరిచయం చేస్తున్నారు.
– షార్ట్ఫిల్మ్‌ల ఎంపికకోసం మొదటిసారిగా ప్రత్యేక జ్యూరీని నియమించారు.
– బాలల చలనచిత్రోత్సవ చరిత్రలోనే తొలిసారిగా ‘లిటిల్ డైరెక్టర్స్’ పేరిట పోటీ విభాగాన్ని ఏర్పాటుచేసారు.
– ఈ ఉత్సవాలలో వయసుల వారీగా కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టారు. ఇది మొదటిసారి. ఆ ప్రకారం 6నుండి 9, 10 నుండి 12, 13 నుండి 14 అనే మూడు వయోవర్గాల వారీగా కార్యక్రమాలుంటాయి.
– ఈ ఉత్సవాలలో చైనా దేశ బాలల చిత్రాలపై ‘స్పెషల్ రెట్రాస్పెక్టివ్’ని ఏర్పాటుచేసారు.
– ఐయ్యేఎస్ అధికారి బుర్రా వెంకటేశంగారి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగడం మొదటిసారి. గతంలో సీనియర్ ఐయ్యేఎస్ అధికారి పార్థసారథి నేతృత్వంలో ఈ ఉత్సవాలు సక్రమంగా జరగడమేకాక ప్రశంసలు కూడా పొందాయి.
– ఈ ఉత్సవాలకి 200పైగా విదేశీ ప్రతినిధులు, 500మందికి పైగా బాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

 

పోటీపడ్తున్న భారతీయ చిత్రాలు

ప్రపంచం మొత్తంమీద సినిమాల నిర్మాణంలో, సంఖ్యాపరంగా హాలీవుడ్ తర్వాత పెద్ద వినోద పరిశ్రమ భారతీయ సినీ పరిశ్రమదే! కానీ బాలల చిత్రాల విషయానికొస్తే మన దేశ పరిస్థితి ‘నెదర్లాండ్స్’కన్నా దయనీయమైన స్థితే. అందుకే బాలల చిత్రాల ఆవశ్యకతను సినీ పరిశ్రమ ప్రముఖులు గుర్తించాలని, విస్తృతస్థాయిలో బాలల చిత్రాలు రావలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించడానికే ఈ అంతర్జాతీయ స్థాయి బాలల చిత్రోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే 1979నుండి ఇప్పటివరకూ 16 బాలల చలనచిత్రోత్సవాలను సొంత గడ్డపై నిర్వహించినప్పటికీ, మన సొంత సినిమాలు సాధించిన అవార్డులు మాత్రం అత్యల్పంగా ఉండటం బాధాకరం. ఈ ఉత్సవ చిహ్నంగా ‘‘బంగారు ఏనుగు’’ను అందించే మన దేశానికే ‘బంగారు ఏనుగుల’కొరత ఏర్పడటం మనలో బాలల సినిమాల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిజమైన నిదర్శనం.
కాగా, ఈ ఉత్సవాలు 32 ఏళ్ళుగా జరుగుతున్నప్పటికీ ఉత్తమ చిత్రంగా బంగారు నందిని అందుకున్న భారతీయ సినిమాలెన్నో తెలుసా?… ఒక్కటి…! కేవలం ఒకే ఒక్కటి! 1987 భువనేశ్వర్‌లో జరిగిన పోటీలలో ఆ అరుదైన ఘనతను సాధించిన సినిమా- ‘స్వామి’! మంజునాథ్ ప్రధాన పాత్రలో ప్రముఖ రచయిత ఆర్.కె.నారాయణ్ రాసిన నవలకు తెర రూపంగా వచ్చిన సినిమా ఇది. మళ్ళీ అప్పటినుంచి భారతీయ సినిమాలకు బంగారు enugu దక్కలేదు.
ఐతే ఈసారి దాదాపు 25పైగా భారతీయ చిత్రాలు ఉత్తమ కథా చిత్రంగా ‘బంగారు ఏనుగు’కోసం పోటీపడ్తున్నాయి. వాటిలో ‘చిల్లర్ పార్టీ’ (వికాస్ బాల్ దర్శకత్వం), ది పీక్ (నాగ్ గొట్టప్), ఆటపత్‌నగర్ హోతే (నీలేష్ ఉపాధ్యే), ఛాంపియన్స్ (రమేష్ మోరె), ది బర్డ్ క్యాచర్ (మజీద్ గులిస్తాన్), ది వాల్ (ఉమేష్ కులకర్ణి), ఐ యామ్ కలామ్ (నీలమాధవ్ పాండా), సండే (పంకజ్ అద్వానీ) వంటి సినిమాలున్నాయి.
అంతేగాక, ఈ వీటికితోడు ప్రముఖ దర్శకులు తీసిన బాలల చిత్రాలు కూడా పోటీ పడ్తున్నాయి. వాటిలో స్టాన్లీస్ టిఫిన్‌బాక్స్ (అమోల్‌గుప్తే- తారే జమీన్‌పర్ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్), హేలో (సంతోష్‌శివన్ దర్శకుడు) ముఖ్యమైనవి. అలాగే, ప్రముఖ కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్‌బెనెగల్ తీసిన బాలల చిత్రం ‘‘చరణ్‌దాస్ ది థీఫ్’’ కూడా ఈ ఉత్సవాలలో పోటీపడుతోంది.

*

One Response
  1. దాసరి వెంకటరమణ November 23, 2011 /