Menu

తెలుపు-నలుపుల తెరపై ’వైట్ నైట్స్’

సాహిత్యంలో అనుబంధం ఉన్నవారికి రష్యన్ రచయిత Dostoyevsky పేరు సుపరిచితం. వీరు 1848లో రాసిన కథ “వైట్ నైట్స్”ను ఆధారంగా తీసుకొని 1957లో తీసిన ఇటాలియన్ సినిమా, “Le notti bianche” గురించిన పరిచయ వ్యాసం ఇది.

ఇదో త్రికోణ ప్రేమకథ. ఒక ఆసామి తన రోజువారి పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వస్తుండగా, వాగుపై నున్న వంతెన మీద నిలబడి ఓ అమ్మాయి భోరు భోరున ఏడుస్తుంటుంది. చూస్తూ చూస్తూ ఆ అమ్మణ్ణి అలా వదిలిపోవటం ఇష్టం లేక ఆమెకు “నేనున్నాగా!” అన్న భరోసా ఇవ్వబోతాడు. ఆమె తిరస్కరిస్తుండగా కొందరు దుండగలు ఆమెను అల్లరి పెడతారు. వారిని బెదరించి, దూరంగా పంపి “నేనున్నాగా!” అని నిరూపిస్తాడు. ఆమె కూడా ఇక కాదనలేక ఆ రాత్రికి అతడి సాయంతో
ఇంటికి చేరుతుంది, మర్నాడు మళ్ళీ కలుస్తానన్న మాట ఇస్తుంది.

మరుసటి రాత్రి మళ్ళీ కలుస్తారు. అప్పుడప్పుడే పరిచయం ఏర్పడుతున్నవారి మధ్య కలిగే భయాలూ, అపోహలూ, సందేహాలూ అన్నీ కలుగుతాయి. వెనువెంటనే
మాయమవుతాయి. పరిచయం స్నేహంగా మారుతుంది. ఆమె, తాను వేరొకరి కోసం ఎదురుచూస్తున్నానని చెప్తూ, ఆ వేరొకరితో ఉన్న సంబంధాన్ని కూలంకషంగా
వివరిస్తుంది. అతడంతా విని “నేనున్నాగా!” అని మాట ఇస్తాడు. సాయం కోరుతుంది. చేస్తానంటాడు. కానీ అప్పటికే ఆమెపై కలిగిన ప్రేమ వల్ల సాయం చేయడు. చేయలేకపోయాననీ చెప్పేస్తాడు.

ఏది ఏమైనా నీకు నేనున్నాను అన్న భరోసా ఇస్తూనే ఉంటాడు. “నువ్వుండటమే నాకు సమస్య” అని అంటుంది. ఆపై ఏమవుతుంది? ఆమె ఎదురుచూపులు ఫలిస్తాయా? ఇతడి భరోసా పనికొస్తుందా? అన్నది ముగింపు.

ఇది ఇటాలియన్ చిత్రం అని చెప్పానుగా! నేను ఇంగ్లీషు సబ్-టైటిల్స్ తో చూశాను. మాటలెక్కువగా మూలకథలో నుండి తీసుకున్నట్టే అనిపించాయి.

1957లో వచ్చిన సినిమా కాబట్టి, పైగా ఇది కేవలం నాలుగు రాత్రుల కథ కాబట్టి కథనం నత్తనడకగా సాగుతుందేమోనని అపోహపడ్డాను. నా ఊహకు విరుద్ధంగా కథనం చాలా ఆసక్తికరంగా, వడివడిగా సాగింది. ఎక్కడా కథ ఆగినట్లు, సాగదీస్తున్నట్లు అనిపించలేదు. సినిమాలోని కీలక లొకేషన్ అయిన వాగులానే కథనం కూడా హాయిగా గలగలా సాగింది.

బ్లాక్ ఆండ్ వైట్ చిత్రమైనా చూడ్డానికి భలే బాగుంది. ఏ కెమెరా ట్రిక్కులు వాడారో మరి, సినిమా మొత్తం రాత్రుల్లే జరిగినా, ఆ రాత్రి వాతావరణాన్ని బాగా చూపించారు. ఒక ప్రస్ఫుటమైన వెలుతురునీ, మసకబారినట్టు, చీకటి అయినట్టూ తేడాలను కొట్టొచ్చినట్టు చూపారు. మంచుపడుతున్న సీన్లు ఆహ్లాదంగా ఉన్నాయి.

ఇహ, నటుల సంగతికి వస్తే, అత్యంత సహజంగా అనిపించింది. అప్పటి సినిమాల్లో నాటకీయత ఎక్కువని అపోహపడ్డాను. ముఖ్యంగా కీలకపాత్రలే కాక, అసలు తెరపైకి ఏ మనిషి వచ్చినా దృష్టి వారిపైకి పోయింది. రాత్రుళ్ళు వీధిలో ఏ చిన్న అలికిడైనా అటుగా దృష్టి పోతుందిగా. అలా అనిపించింది. సంగీతం కూడా కథకూ, సన్నివేశాలకూ అతికినట్టు అనిపించింది.

నాలుగో రాత్రి వారిద్దరూ కల్సి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం సహజంగా, ఆసక్తికరంగా చూపారు.

ముఖ్య పాత్ర వేసినతను బాగున్నారు. బాగా చేసారు. ఆమె తొలిప్రేమగా వేసిన వ్యక్తి చూస్తే కొంచెం భయం వేస్తుంది,అంత సీరియస్ మొహం.


ఇందులో అమ్మాయి పాత్ర వేసిన మారియా స్కెల్‍కు మాత్రం చప్పట్లు. ప్రేమపీడిత పాత్రలో అప్పుడే నవ్వి, అప్పుడే ఏడ్చి, అప్పుడే తేరుకొని, అప్పుడే ఆలోచనల్లో మునిగిపోయినట్ట నటించిన తీరు అత్యద్భుతం. వర్ణాతీతం. ఎక్కడా అతి కానివ్వకుండా, తాను పడే తికతికమను భలే చూపించింది హావభావాల్లో. సంక్లిష్ట పాత్రను సునాయసంగా చూపించింది. ఆమె ఎంతగా నచ్చేసిందంటే నేను ఆమె ప్రేమకథ విజయం అవ్వాలనే కోరుకునేంత.

ఆమెను చూస్తూ ఉంటే ఇదో నలుపు-తెలుపు చిత్రం అని మర్చిపోయాను. ఆమె ఆవిష్కరించగలిగినన్ని రంగులు మరెక్కడా చూడలేదు నేను.

సినిమా vs సాహిత్యం

(కథను చదివున్నవారికోసం)

ఒక కథనో / నవలనో తీసుకొని చిత్ర్రానువాదం చేసినప్పుడు కొన్ని చిత్రమైన విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి నాకు. ఒక రచనకు పాఠకులు బోలెడు మంది ఉన్నా, చలనచిత్రం చూపాలనుకొని నిశ్చయించుకున్న పాఠకుడు ప్రత్యేకమైనవాడు కదా. అతడు చదివి, ఆస్వాదించి, ఊరుకోక, దాన్ని తిరిగి అందరికీ పంచిపెడతాడు.

ఈ పంచిపెట్టటంలో అతడు అనేక మార్గాలు ఎన్నుకోవచ్చు. మూలానికి పూర్తిగా కట్టుబడిపోవడం, లేదా మూలంలో ఉన్న కీలికాన్ని మాత్రమే గ్రహించి దానికి కొత్తందాలు అద్దడం లాంటివి. ఏ మార్గాన్ని ఎన్నుకున్నా, అతడి రీ-టెలింగ్ అబిలిటీస్‍ను భూతద్దంలో చూడడానికి నాలాంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారు.

దొస్తొవెయస్కీ కథలో ఒక యువకుని డైరిలో కొన్ని పేజీలుగా కథ నడుస్తుంది. అతడో స్వాప్నికుడు. ప్రపంచాన్ని వెలివేసి తన ఊహాజగత్తులో బతుకుతుంటాడు. అలాంటివాడికి ఉన్నట్టుండి ఓ అమ్మాయి దగ్గరవుతుంది. ఆమె తన ప్రేమను గురించిన పంచుకున్న విషయాలను వింటూ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. సాహిత్యం కాబట్టి అతడి మానసిక లోకాన్ని పాఠకునికి చూపటంలో రచయిత సఫలమయ్యారు. అలాంటి స్వాప్నికుడి మనోగతాన్ని తెరపై ఎలా చూపుతారా? అన్న కుతూహలం తొందరగానే వీడిపోయింది. అతడి మానసిక జగత్తులో ప్రేక్షకుని తిప్పే ఉద్దేశ్యం దర్శకునికి లేదని త్వరగానే స్పష్టమయ్యింది.

సినిమాలో ధర్డ్ పార్టీ నరేషన్‍లో నడిపించారు. ఇరువురి మధ్య జరుగుతున్న సంఘటనలకూ, మాటలకూ మాత్రమే పెద్దపీట వేసారు. పాత్రల అంతస్సంఘర్షణ జోలికి పోలేదు. పుస్తకానికి, సినిమాకు ఇదో పెద్ద తేడా. కథ చదివినప్పుడు అతడి దృక్కోణం నుండే అన్నీ చూడ్డం వల్ల, కథ చదవడం పూర్తయ్యేసరికి అతడి పరిస్థితిని గురించే పాఠకుడు ఆలోచిస్తాడు. కానీ సినిమాలో అలా కాకుండ, మూడో వ్యక్తి కథను చూపుతున్నట్టు ఉండడం, ఎక్కడా పాత్రలు తమ మోనోలాగ్స్ నూ బయటకు వినిపించకపోవడం వల్ల ఆయా పాత్రల మానసిక పరిస్థితి మనకు తెలీదు. ఇది ఒకందుకు మంచిదే! బాగా తెల్సున్న కథను ఒక కొత్త కోణం నుండి చూసే వీలు కల్పించింది.

కాకపోతే ఇక్కడే నాకో విషయం అతికినట్టు అనిపించలేదు అని చెప్పచ్చు. ప్రేమ అనే దివ్వె వెలగడానికి క్షణం సరిపోయినా, అది ఆరిపోడానికి కూడా అంతే సమయం పట్టచ్చు. అలా కాక, ఆ దివ్వె మహోజ్వలంగా వెలుగుతూ ఉండాలంటే మాత్రం దానికి ఆలోచనల నూనె పోస్తూ ఉండాలి. Any deep, enduring love has to be nourished by memory. అది ఒకటి.

ఇంకోటి. ప్రేమలో విఫలమైనవాడు అమాంతంగా వేదాంతి అయిపోడు. అతడి లోలోపలి భావజాలమంతా అగ్నిపర్వతంలా బద్దలయ్యాకే ’ఫిలాసఫీ’ అన్న లావా పనికొచ్చేది అవుతుంది. అంతే కాని, తాను ప్రేమించిన పిల్ల వదిలెళ్ళిపోతానూ అని చెప్తుంటే, అక్కడ భారీ డైలాగులకు ఆస్కారం లేదు. అందులోనూ, ఆమె అప్పటికి వరకూ చేయి పట్టుకునే ఉండి, ఉన్నట్టుండి వెళ్ళిపోయినప్పుడు. భారీ డైలాగులన్నీ ఆనక ఉత్తరాలలోనో, లేక పాటలలో చూపించుకోవచ్చు.

ఇందులో ఉండే అమ్మాయి పాత్ర పేరు ’నతాలియా’. దొస్తొయెవ్స్కీ కథలో ఆమెది అమాయకత్వమో, కాదో నిర్దారించుకోవటం కష్టం. సినిమాలో ఆమెను కాస్త నేర్పరితనం ఉన్న అమ్మాయిగా చూపించారు. ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం ’ప్రాక్టికల్’ అన్నది తెలుసునన్న అమ్మాయిగా ఉంటుంది.

మూడునాలుగేళ్ళ క్రితం పరిచయమైన కథను నేను తరచుగా చదువుతుంటాను. ప్రతిసారి ఆ అబ్బాయి భావజాలంలో పడి మునకలేస్తుంటాను. కానీ ఈ సినిమా చూసినప్పటినుండి “నతాలియా” తప్ప నాకింకెవరూ కనిపించటం లేదు. కథ ఎంచుమించు అదే అయినా, మనం ఎటు వైపు నుండి కథను చూస్తున్నాం అన్నదాని బట్టి భిన్న స్పందనలు కలుగుతాయనుకుంటాను.

దీని గురించి ఇంత చెప్పుకున్నాక, ’సావరియా’ చిత్రం గుర్తొచ్చే ఉంటుంది, కొందరికైనా. అవును, ఆ చిత్రం కూడా ఇలాంటి కథతోనే సాగుతుంది. కాకపోతే భన్సాలి బాబు గారికి “అనగనగా ఒక ఊర్లో, ఒక రాత్రి పూట, ఒక వాగుపైన ఉన్న వంతెన మీద నుంచున్న అమ్మాయి..” అన్న కథలో ఊరికి, రాత్రికి, వాగుకి, వంతెనకి, అమ్మాయి నుంచున్న పోస్చర్‍కి ఇచ్చిన ప్రాధాన్యం, ఆ అమ్మాయి కథకి ఇవ్వటం నేను చూడలేదు, ఆయన ఇన్ని సినిమాల్లో. ఇద్దరు కలిసుండటానికి ఓ కుటీరం కట్టమంటే, ఆయన భవంతి వేసివ్వగలడు గానీ, దాన్ని నివాసయోగం చేయగలడా? అన్నది నాకు అనుమానమే! ఎంతటి హృద్యమైన కథైనా చెప్పే తీరును బట్టి దీనావస్థకు చేరుకోగలదని నిరూపించిన ప్రయత్నం “సావరియా”!

– పూర్ణిమ తమ్మిరెడ్డి

2 Comments
  1. jd- November 23, 2011 /
  2. g s rammohan January 14, 2013 /