Menu

తెలంగాణ చరిత్ర చిత్రాలు : వీరతెలంగాణ (2010), మాభూమి(1979))

(ముందు “వీర తెలంగాణా” సినిమా చూసాను. ఫాలో-అప్ గా ఒక ముప్పై ఏళ్ల నాడు వచ్చిన “మా భూమి” చూసాను. వాటి రెంటి గురించి…ఈ వ్యాసం)

 

నాకు ఆర్.నారాయణమూర్తి అనగానే – “నా రక్తంతో నడుపుతాను రిక్షాని…నా రక్తమే నా రిక్షకు పెట్రోలు” అని పాడే రిక్షావాడు, “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…తోడబుట్టిన ఋణం తీర్చుకుంటానే చెల్లెమ్మా” అని పాడే అన్నా…”ఎర్రజెండెర్రజెండెన్నీయలో” అని గుడ్లు మిటకరిస్తూ పాడే విప్లవకారుడో గుర్తువస్తాడు. ఇంతా చేసి ఈ పాటలు అప్పుడప్పుడూ టీవీలో వచ్చినప్పుడు చూడడమే కానీ, ఇప్పటి దాకా ఒక్కసినిమా కూడా చూడలేదు (కొన్ని దృశ్యాలు మినహా). నా తమ్ముడు “వీర తెలంగాణా” సినిమా చూసి, తప్పకుండా చూడు అని సూచించాడు. సినిమా యూట్యూబ్ మూవీస్ చానెల్ లో కనిపించింది. దానితో చూడగలిగాను మొత్తానికి.

 

సినిమా నలభైల నాటి తెలంగాణా పోరాట నేపథ్యంలో నడుస్తుంది. నేపథ్యం కాదు – అదే ముఖ్యం. చారిత్రక ఘటనలు, పాత్రలే ఉంటాయి చాలా మట్టుకు. ఏ పాత్రనీ ప్రత్యేకం హీరో చెయ్యకుండా, కథానుగుణంగా ప్రతి పాత్రనీ హైలైట్ చేయడం ఈ సినిమాలో నాకు అన్నింటికంటే నచ్చిన విషయం. అలాగే, నాకు నచ్చిన మరొక్క విషయం – ఏదో జనాల సెంటిమెంటుపై సొమ్ము చేసుకోవాలి అన్నట్లు కాకుండా నిజంగా జరిగిన సంఘటనలే చూపడానికి ప్రయత్నించారు.

 

౧) మంచి నటులు దొరికి ఉంటే ఇంకా బాగుందేమో సినిమా అనిపించింది. ప్రధాన పాత్రల్లో (దొర, అమీన్, కాసిం రిజ్వీ) లు నిజంగానే భయపెట్టేసారు కానీ, తక్కిన పాత్రల్లో ఇద్దరు ముగ్గురు మినహా పెద్దగా ఆకర్షిన్చలేకపోయారు నన్ను. అంతగా అనుభవం లేని వారిలా అనిపించారు.

౨) పాటలు కొన్ని అద్భుతంగా ఉన్నాయి. వింటూ ఉంటే రక్తమూ మరగొచ్చు, గర్వమూ కలగొచ్చు (వినే పాటని బట్టి). సుద్దాల హనుమంతు గారి పాటలు ఒకట్రెండు యధాతథంగా వాడుకున్నారు అని విన్నాను.

౩) కొన్ని దృశ్యాలు చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి కానీ, నిజంగా అలాంటివి జరిగాయి అనే రాసి ఉన్నాయి పుస్తకాల్లో. అది ఒకప్పటి మన వాస్తవం కనుక, ఎంత డిస్టర్బింగ్ గా ఉన్నా, తెలుసుకోక తప్పదు.

౪) ఈ సినిమాలో ఒక పక్క విప్లవం గురించే చెబుతున్నా, బహుసా మాస్ ని ఆకర్షించడానికి ఏమో, కొన్ని జిమ్మిక్స్ ఉన్నాయి. అయితే, మాములు సినిమాలో సినిమాల నిండా ఇలాంటి జిమ్మిక్స్ చూసి అలవాటు పడిపోయి ఉంటాం కనుక, న్యాయంగా ఇబ్బంది పడకూడదు. 🙂

౫) బైరంపల్లి ఘటన జరిగిన దృశ్యంలో ఒకడు వచ్చి ఒకడి తలపై కాలిస్తే, వెనుక ఉన్న ఐదుగురు చావడం వంటివి రజనీకాంత్ సినిమాని గుర్తుచేశాయి. కానీ, తరువాత బైరంపల్లి ఘటన గురించి ఒక పుస్తకం చదువుతూ ఉంటే, ఈ తరహా లో ఒక గుండుతో ఒకేసారి ఎంతమందిని కాల్చవచ్చు? అని ఆటా ఆడుతూ పోలీసులు జనాల్ని చంపారు అని ఉంది. అంటే, యధాతథంగా అలాగే జరిగి ఉండకపోవచ్చు కానీ, ఆ వర్ణనని మాస్ అపీల్ కి వాడుకున్నారు అని అర్థమైంది. ఎలాగైనా, బహుసా వారి మెసేజ్ (బైరంపల్లి ఘటన జలియన్వాలా బాఘ్ అంత తీవ్ర ఘటన అని) తక్కిన ప్రేక్షకులని కూడా చేరే ఉంటుంది. ఇక్కడే గమనించిన మరో సంగతి – ఆ పుస్తకంపై ఉన్న బొమ్మ, సినిమాలో కనబడ్డ కోట బొమ్మ ఒకేలా ఉన్నాయి.. (ముందే హేలీ కూడా గమనించినట్టు) నిజంగా అక్కడికి వెళ్ళే తీసారు అంటే బానే కష్టపడ్డారన్నమాట!

౬) ఆ దొరసాని “అయ్యగారు” అని పిలిపించుకోవడం మహా విడ్డూరంగా అనిపించింది. నిజంగా అలాంటివి కూడా జరిగాయా? లేకపోతే సినిమా జిమ్మిక్కా? అన్నది ఎవరన్నా చెప్పాల్సిన విషయం.

౭) కాస్త టైంలైన్స్ గురించి అయోమయం సృష్టించకుండా ఉంటే బాగుండేది. అన్ని ఘటనలు సమాంతరంగా చూపడం కష్టం కానీ, కింద తేదీలో ఏవో డిస్ప్లే చేసి ఉంటే, బాగుండేది. ఐలమ్మ ఘటన ప్రపంచ యుద్ధం తరువాత జరిగిందా? ముందా? – ఇలాంటి ఆలోచనలతో నేను చాలా సమయం గడపాల్సి వచ్చింది సినిమా తరువాత, ఈ టైం లైన్ అయోమయం మూలాన.

 

సినిమాలో ప్రస్తావించబడ్డ/కనిపించిన పాత్రలు – హనుమంతు, రావి నారాయణరెడ్డి, మక్దుం మోయిద్దీన్, సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు – ఏదో ఒక సందర్భంలో నేను విన్నపేర్లు కావడం వల్ల కూడా, ఈ సినిమా నా మీద ప్రభావం చూపిందేమో. “సలాం హైదరాబాద్”, “కాలరేఖలు” నవలల్లో వర్ణించిన కొన్ని పాత్రలు, సంఘటనలు ప్రత్యక్షంగా కనిపించాయి ఈ సినిమాలో. వీటి వల్ల,

సినిమా చూసాక, ఒక పట్టాన నిద్రపోలేకపోయాను. సినిమా గుర్తొచ్చి మాత్రమే కాదు. చరిత్ర పాఠాలు చదువుతూ! అప్పుడప్పుడు మన ఉనికిని గురించిన స్పృహ తీసుకురావడానికి ఇలాంటి సినిమాలు చూడ్డం అవసరం అనిపిస్తోంది నాకు. నావని చెప్పుకోడానికి నాలుగైదు ఊర్లున్నా, అధికార పత్రాల ప్రకారం నేను తెలంగాణా నివాసిని :). కనుక, నా ప్రాంతపు చరిత్ర నేను తెలుసుకుని, బ్రతుకు పరుగులో కొట్టుకుపోకుండా, కాళ్ళు నేలని ఆన్చి ఉండేందుకు ఈ సినిమా నాకు ఉపకరించింది అని నేను నమ్ముతున్నాను. గతంలో – బోస్, అము వంటి సినిమాల గురించి చెప్పినప్పుడు కూడా ఇవే ఆలోచనలు కలిగాయి. నన్ను ఇంత ప్రభావితం చేసింది కనుక, తెలుగు వారిని (ప్రత్యేకం తెలంగాణా ప్రాంతం లో నివసించే వారిని…వారి మూలాలు ఎక్కడివైనా) తప్పకుండా చూడమని సూచిస్తాను.

 

నేనిలా టముకు వేసి మరీ చెప్పినా ఎవ్వరూ చూడకపోవచ్చు ఈ సినిమాని. కానీ, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఒక అభిప్రాయం ఏర్పరుచుకోకుండా, గతం గురించి కూడా తెలుసుకొమ్మని, నా తరంలోని (అన్ని ప్రాంతాల) యువతీ యువకులకు నా విజ్ఞప్తి.

 

చాకలి ఐలమ్మ పాత్ర ఈ సినిమాలో బహుసా ఒక పావుగంటకి మించి కనిపించదు. అయితే, త్వరలో ఆమెపై ఒక సినిమా రాబోతోందనీ, ప్రీతీ నిగం అందులో ఐలమ్మ గా నటిస్తోందనీ చదివాను. ఈ సినిమా చూసి చరిత్ర గ్రంథాలు తిరగేస్తున్న వారు కూడా ఐలమ్మ గురించి ఇంకే సంగతులూ కనబడలేదు అన్నారు. చూడాలి మరి ఈ రాబోయే సినిమాని నాటకీయంగా తీసి నిడివిని నిమ్పుకుంటారో, వాస్తవికంగానే తీస్తారో!

********************

ఇంతసేపు ఈ సినిమా గురించి చెప్పాను, కానీ, తెలంగాణా పోరాట నేపథ్యం లో వచ్చిందనీ, మహా గొప్ప చిత్రమనీ అందరూ గొప్పగా పొగిడే మరో చిత్రం కూడా నేను ఇది చూసాక చూసాను. దాని పేరు “మా భూమి”. దర్శకుడు – గౌతమ్ ఘోష్. నిర్మాత – బి.నర్సింగరావు. ఇందులో సాయిచంద్ ఒక ప్రధాన పాత్ర వేసాడు. పైన చెప్పుకున్న సినిమా తో పోలిస్తే, నాకీ సినిమా – చప్పగా, డాక్యుమెంటరీ లా అనిపించింది. ఈ సినిమాలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థం కాలేదు నిజానికి. ఉద్యమ నేపథ్యం లో లవ్ స్టోరీనా? కాదు. ఉద్యమం చరిత్రా? కాదు. భూస్వాముల ఆగడాలు చూపడమా? కాదు. కమ్యూనిస్టు ప్రాపగండా నా? అయ్యుండొచ్చు. అసలీ సినిమా ఉద్దేశ్యం తెలంగాణా ఉద్యమం గురించి ఎంతో కొంత చెప్పడమా? లేక అది అడ్డం పెట్టుకుని కమ్యూనిజం గురించి ఉపన్యాసాలు ఇవ్వడమా? అన్న సందేహం కూడా కలిగింది. ఒక్కోదగ్గర – దూరదర్శన్ లో వచ్చే పల్లెసీమల చర్చల్లా, సాయిచందో ఇంకొకరో అడగడమూ, వాళ్ళ ఆ కమ్యూనిస్టు ఆసామీ లెక్చర్ మొదలుపెట్టడమూ చూస్తూ ఉంటే నాకు సినిమా చూస్తున్నట్లు అయితే అనిపించలేదు. కాకపోతే, ఒకటి చెప్పాలి – ఈ సినిమాలో తెలంగాణా యాస, నటీనటులు పైన చెప్పిన “వీర తెలంగాణా” కంటే చక్కగా కుదిరారు/యి.

 

ఈ రెండో సినిమా గురించి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, “వీర తెలంగాణా” కి రావల్సినంత గుర్తింపు రాలేదు కానీ, “మా భూమి” గురించి మాత్రం తెగ విన్నాను కనుక. “మా భూమి” చిత్రం చూస్తె “బోరింగ్” గా అనిపిస్తుంది నాకు. కనుక, తెలంగాణా ఉద్యమం గురించి ఒక ప్రాథమిక అవగాహన కలగడానికి “వీర తెలంగాణ” చూడ్డం ఉత్తమం అని నా అభిప్రాయం. “వీర తెలంగాణా” “పీపుల్స్ స్టార్” కాకుండా ఏ “మేధావి” దర్శకుడో తీసి ఉంటే, ఇలాగే పొగిడే వారేమో…ఎంతైనా, ఆర్.నా ఓపికకి, కమిట్మెంట్ కి, పట్టుదలకి నావి కొన్ని నమస్కారాలు (ఈ సినిమా లో నటించేందుకు నటుల్ని పట్టుకోడానికి అయన చాలా కష్టపడ్డాడు అని చదివాను.). అన్ని కష్టాలనూ భరించి, (అయన ఒరిజినల్ గా తెలంగాణా కి చెందినా వాడు కాకపోయినా), ఆ ఉద్యమం పై గౌరవంతో దీన్ని తీసినందుకు ఆయన నా దృష్టిలో నిజమైన స్టార్. ఎవరన్నారో గానీ, “పీపుల్స్ స్టార్” అని కరెక్టుగా అన్నారు.

 

గమనిక: ఈ నా వ్యాసానికి, ప్రస్తుత తెలంగాణా ఉద్యమానికి సంబంధం లేదు. ఆర్.నా. “పోరు తెలంగాణా” అని ప్రస్తుత ఉద్యమం గురించి మరో చిత్రం తీసాడని విన్నాను. దానికి, ఈ వ్యాసానికి సంబంధం లేదు అని గమనించగలరు.

 

4 Comments
  1. kiri November 27, 2011 /
  2. NaChaKi November 29, 2011 /
  3. Praveen Sarma December 7, 2011 /