Menu

అద్భుతానికి అడుగుదూరంలో “రాక్‌స్టార్”

సినిమా చూస్తున్నంతసేపు ఆహా ఎంత గొప్పగా తీశాడు అని అనిపిస్తుంది. రణ్‌బీర్ నటన చూసినప్పుడల్లా ఇతనిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ఆశ్చర్యమేస్తుంది. కథ, కథనం కొత్తగా కనిపిస్తుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభతోపాటు, అతని సినిమాలలో ఎప్పుడూ ఆసక్తికరంగా వుండే హీరోయిన్ కేరక్టరైజేషన్ కట్టిపడేస్తుంది. ఢిల్లీలో మొదలై కాష్మీర్, ప్రాగ్ తదితర ప్రదేశాలలో అందాలు కెమెరా అందంగా పట్టుకుందని తెలుస్తూనే వుంటుంది. ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం ఎప్పటిలాగే వీనులవిందుగా సాగుతుంది. అయితే సినిమా అంతా అయిన తరువాత ఏదో అసంతృప్తి మిగిలిపోతుంది. ఒకే సినిమాలో ఇన్ని అద్భుతాలు కలిసిరావటం సామాన్యంగా జరగని పని. అయితే ఇన్ని అద్భుతాలు కలిసినా సినిమా అద్భుతంగా కాకపోవటమే ఆశ్చర్యం. అయితే అందుకు కారణం లేకపోలేదు.

కథ: జిమ్ మోరిసన్‌లా రాక్ స్టార్ కావాలని కలలు కనే జనార్దన్ ఝకర్/జే.జే. (రణ్‌బీర్) అనే కుర్రాడు, తన ఆశయం సాధించాలంటే జీవితంలో బాధ పొందాలని తెలుసుకుంటాడు. హార్ట్ బ్రేక్ చేసే ప్రేమకోసం అన్వేషిస్తూ కొంచెం హాట్ కొంచెం కూల్ అమ్మాయి హీర్ కౌల్‌ని (నర్గీస్ ఫక్రి) కలుసుకుంటాడు. విరహాన్ని, విషాదాన్ని కోరుకున్నా ఆ అమ్మాయి స్నేహంలో అల్లరి పనులు మొదలుపెడతాడు. అప్పటికే పెళ్ళి నిశ్చయమైన హీర్ పెళ్ళి తరువాత ప్రాగ్‌లో కుదరవనుకున్నవన్నీ లిస్ట్ రాసుకోని మరీ జేజేతో కలిసి చేస్తుంది. పెళ్ళైపోయి హీర్ ప్రాగ్ వెళ్ళిపోయిన తరువాత ఆ అమ్మాయి మీద తనకున్న ప్రేమ తెలుసుకున్న జే.జే. ఆ బాధతో జోర్డాన్ అనే రాక్‌స్టార్‌గా మారిపోతాడు. అక్కడ జే.జే.తో విఫలమైన ప్రేమ గతాన్ని, అంధకారమైన వివాహ భవిష్యత్తుని తల్చుకోని అనారోగ్యం పాలౌతుంది. జోర్డాన్ హీర్ మళ్ళీ కలుసుకుంటే దాని పర్యవసానం ఎలా వుంటుంది? రాక్‌స్టార్ కావలనుకున్న జోర్డాన్ కల ఏమౌతుంది? ఇది మిగతా కథ.

కథ విన్నవారెవరికైనా ఇది ప్రేమ కథే కానీ, రాక్ స్టార్/రాక్ సంగీతం లేదా అలాంటి ఒక బ్యాండ్ కథ కాదని అర్థం అవురుంది. అందమైన ప్రేమకథ చెప్పే వుద్దేశ్యం వున్నా ఈ సినిమాకి రాక్‌స్టార్ అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ప్రేమ కథలను చెప్పడంలో నిష్ణాతుడు అని అనిపించుకున్న ఇంతియాజ్ అలీ చిత్రం అంటే అలాంటి ప్రేమ కథే వూహించాలి. అలా అనుకుని సినిమాకి వెళ్తే ఎలాంటి నిరుత్సాహం వుండదు. జబ్ వి మెట్ చిత్రంలో లాగానే కొంత చిత్రమైన మనస్తత్వం వున్న హీరోయిన్, ఆ అమ్మాయి పెంకితనం ఇలాంటివే కాకుండా – కథా పరంగా కూడా అదే పంథాలో సాగుతుంది. అండుకు అదనంగా వచ్చి చేరేది రాక్‌స్టార్ కథ.

సినిమా ప్రేమ కథ అన్నప్పుడు కొంత సినిమాటిక్ లిబర్టీ ఊహించవచ్చు. నిజానికి సినిమాలో హీరో హీరోయిన్‌లు మొదటి సారి మాట్లాడుకునే సన్నివేశాలు హాస్యంగా వున్నా కృతకంగానే వున్నాయి. అయితే కథ ప్రేమ కథ కాకుండ ఒక రాక్‌స్టార్ జీవితం అంటేనే సమస్య మొదలౌతుంది. అతను ఏమీ తెలియని మధ్యతరగతి అమాయకుడి నుంచి కరడు కట్టిన కఠినమైన రాక్ స్టార్‌గా తయారవ్వడం వెనక కృషి చూపించాలంటే అండులో ఎంటో సిన్సియారిటీ, ఆనెస్టీ అవసరం. అది కొంతమేరకు లోపించడం ఈ సినిమాని అధ్బుతానికి దాదాపు దగ్గరగా చేర్చినా అడుగు దూరంలో ఆపేస్తుంది.

ఇదంతా విశ్లేషణకోసం వివరించిందే కానీ, ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా ఒక కళాఖండమే. దర్శకత్వం, కథనం, రచన, సంగీతం, నటన, కెమెరా ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా అన్నీ చక్కగా అమరి ఈ సినిమాకి ఒక కల్ట్ స్థాయిని ఇచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మూడు విషయాలు –

ఒకటి

రణ్‌బీర్ నటన. అమాయకంగా, బఫూన్‌లా వున్న జనార్దన్‌గా, ప్రేమో స్నేహమో తెలియని అస్థిరత్వంలో నలిగే జే.జే గా, ఆ తరువాత గుండెల్లో గాయం వల్ల రాక్‌స్టార్‌గా మారి, కేవలం ఆ గుండెల్లో మంటకోసమే పాటలు పాడే కళాకారుడిగా – ఇన్ని వైవిధ్యమైన షేడ్స్ వున్న పాత్రలను అవలీలగా పోషించాడు రణ్‌బీర్. ఈ సినిమా అతని సిని ప్రస్థానంలో మైలు రాయి కాగలదు.

రెండు

ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం. రెహ్మాన్ సంగీతం గురించి కొత్తగా చెప్పేదేమి లేదు. సినిమా రాక్ సంగీతం గురించి అని చెప్పగానే పాటలన్నింటిలో గిటార్ ముఖ్య వాయిద్యాన్ని ఎంచుకోవడం, ఎన్ని రాక్ పాటలు చేసినా వాటి మధ్య వైవిధ్యాన్ని నేర్పుగా వుంచడం అతని ప్రతిభకు తార్కాణాలు. హజరత్ నిజాముద్దీన్ దర్గా దగ్గర సాగే సూఫీపాట, ప్రాగ్ వీధుల్లో వచ్చే పాట వింటే రెహ్మాన్ గొప్పదనం, సంగీతం పట్ల అతనికి వున్న నిబద్దత స్పష్టమౌతాయి. కథలొ ఎక్కడ ఎమోషనల్‌గా అనిపించినా అందుకు కారణం సింహభాగం రెహ్మాన్ నేపధ్య సంగీతానిదే.

మూడు

కథనం. ఈ సినిమా విజయానికి ఇంతియాజ్ అలీ కారణం అయితే అవ్వచ్చు కానీ అది దర్శకత్వానికి కాదు. కథనానికి. సినిమాని ప్రాగ్‌లో జోర్డాన్ తన్నులు తిని, తప్పించుకోని స్టాజ్ ఎక్కి పాట అందుకోవడంతో మొదలుపెట్టి, వున్నట్టుంది కాలేజిలో అమాయకుడిగా చూపించడం ఇలా నాలుగు అడుగులు ముందుకి, మళ్ళీ రెండడుగులు వెనక్కి ఇలా సాగుతుంది కథనం. ఎమోషనల్ అయిన జే.జే. వున్నట్టుండి మాయమైపోవడం, ఎవరికీ అర్థం కాకపోవడం అనే లక్షణాలను స్క్రీన్‌ప్లేలో కూడా చూపించడాం ఒకరకం అరుదైన సరికొత్త టెక్నిక్. వున్నట్టుండి పెరిగిపోయిన గడ్డంతో అడుకునేవాడిలా కనిపించిన జోర్డాన్ అంతకు ముందు దర్గాలో రెండు నెలలు వున్నాడని చెప్పడం లాంటివి అద్భుతంగా పండాయి.

మొత్తమ్మీద సగటు ప్రేక్షకుడికి దృశ్య శ్రవణానందమైన సినిమా. సినిమా విమర్శకులకి అడుగు దూరంలో అద్భుతాన్ని అందుకోలేకపోయిన సినిమా.

4 Comments
  1. Vasu November 21, 2011 /
  2. prasad November 28, 2011 /
  3. kishore. December 1, 2011 /