అసంపూర్ణ కళాఖండం- రాక్ స్టార్

ఒక కళాకారుడిలోని నిజమైన కళ బయటికిరావాలంటే జీవితం తెలియాలి. బాధ తెలియాలి. ప్రేమ తెలియాలి. గుండెపగలటం తెలియాలి. విరహంలో రగలటం తెలియాలి. సమాజం వెలి తెలియాలి. వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడటం తెలియాలి. స్వేఛ్ఛతెలియాలి. విహంగంలా ఎగరటం తెలియాలి. మొత్తంగా జీవితంలోని ఘాఢత తెలియాలి. అప్పుడే ఒక సంపూర్ణకళాకారుడు జన్మిస్తాడు. అలాంటి కళాకారుడైన ఒక గాయకుడి జీవిత కథ రాక్ స్టార్.

రన్బీర్ కపూర్ అద్భుతమైన నటన, ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభ, ఏ.ఆర్.రహమాన్ సంగీతం ఈ సినిమాని కళాఖండంగా మిగిలిపోయే దరిదాపుల్లోకి తీసుకొచ్చినా, కథలోని కొన్ని బలవంతపు సినెమాటిక్ మలుపులు అసంపూర్ణంగా మిగిల్చేశాయి. ఇంతియాజ్ అలీ కథనం, ఒక విన్నూత్న నెరెటివ్ విధానాన్ని ఈ సినిమా ద్వారా పరిచయం చెయ్యడం భారతీయ సినిమా చరిత్రలో మిగిలిపోయినా, సినిమా చూసిన ప్రేక్షకుడికి (కొంత)అసంతృప్తిని మిగిల్చిన తీరు ఈ సినిమాని ఉత్కృష్టత దరిదాపుల్లోనే నిలిపేసి శిఖరాన్ని తాకకుండా మిగులుస్తాయి.

తప్పకుండా చూడవలసిన చిత్రం. సినిమాని ప్రేమించేవాళ్ళు ఎవరూ మిస్ కాకండి.