Menu

మనీ విజన్ – నవంబర్ 21 వరల్డ్ టీవీ డే

ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రభావితమైన వినిమయ వస్తువు ఏది? అని కనుక సర్వే నిర్వహిస్తే టెలివిజన్ కచ్చితంగా నూటికి నూరు శాతం ఓట్లు గెల్చుకుంటుంది. ఆ తరువాతి స్థానం మొబైల్‌ది. నిజానికి అమ్మకాల రీత్యా మొబైల్‌ది మొదటి స్థానం కావచ్చు. ఇంటికి ఒక టీవీ వుంటే అరడజను మొబైళ్లు వుండొచ్చు. కానీ వ్యాపార పరిణామం, పలు రంగాలను ఏకకాలంలో ప్రభావితం చేస్తున్న వైనం, ప్రజలపై చూపిస్తున్న ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుంటే కచ్చితంగా టీవీది అగ్రస్థానమే.
టెలివిజన్.. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ప్రసార సాధనం. అయితే వార్తలు, లేకుంటే రకరకాల కార్యక్రమాలు. సూక్ష్మంగా ఇంతేనా అనిపించినా దీని వెనుక వేలు కాదు లక్షల కోట్ల వ్యాపారం దాగి వుంది. లక్షలాది మంది జీవనోపాధి దాగి వుంది. కోట్లాది మందిని ప్రభావితం చేసే అంశాలు దాగివున్నాయి.
టీవీ కార్యక్రమాలు..వార్తా సంస్థలు..్ఫచర్ల రూపకర్తలు..వాటిల్లోని వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు..వాటికి వివిధ ఫీచర్లు రూపొందించి అందించే సంస్థలు. వాటికి ప్రకటనలు అందించేవారు, వాటిని రూపొందించేవారు. ఇక సినిమాలు, టీవీ కోసం రూపొందించే సినిమాలు, సీరియళ్లు.. వాటిలో నటించేవారు, అందుకు సహకరించే వివిధ విభాగాలు, రకరకాల హక్కుల విక్రయాలు, ఆ వ్యవహారాలు చూసే మధ్యవర్తులు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అని?
ఇవన్నీ టీవీ తెరపై కార్యక్రమాలకు వెనుక దాగిన సంగతులు. ఇవిగాక టీవీ తయారీ, వాటి విడిభాగాలు, సంస్థలు, ఆ వ్యవహారాలు మరెన్నో వున్నాయి.
క్షణానికి విలువ ఎంత? అంటే అది వ్యవహారాన్ని బట్టి వుంటుంది. కోట్ల విలువైన టెండర్ వేయడం ఓ క్షణం ఆలస్యమైతే ఆ నష్టం కోట్లలో వుంటుంది. విద్యార్థి పరీక్షకు హాజరు కావడం ఓ క్షణం ఆలస్యమైతే ఆ నష్టం ఓ ఏడాది కాలంగా మారుతుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా టీవీ ఛానెళ్లు అన్నింటిలో ప్రకటనలకు సంబంధించి ఓ క్షణం ప్రసారానికి తీసుకునే మొత్తాన్ని లెక్కించడం కనుక సాధ్యమైతే ఆ మొత్తం లక్షల కోట్లలో వుంటుందేమో?
జనం తెల్లవారితే లేస్తూనే అందుకునేది టూత్ బ్రష్ కాదు.. టీవీ రిమోట్. జనం మాత్రమే అంతలా టీవీపై ఆధారపడి వున్నారనుకుంటే పొరపాటే. ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, వ్యాపారాలు, రాజకీయాలు, అమ్మకాలు, జీవనశైలి, సామాజిక జీవన శైలిలో మార్పులు, ఆఖరికి అత్యంత భక్తి వేదాంతాలు బోధించే స్వాములు, ఇలా ప్రతి ఒక్క రంగాన్ని టీవీ ప్రభావితం చేస్తోంది. ఆయా రంగాలన్నీ టీవీపై ఆధారపడుతున్నాయి.
ఇదో పెద్ద చక్రభ్రమణం. చిన్ని కృష్ణుడు యశోదమ్మకు చిన్నినోటిలో ప్రపంచాన్ని చూపిన వైనం. యుద్ధరంగంలో అర్జునుడికి విశ్వరూప సాక్షాత్కారం.
అవును నిజమే. ఇవాళ టీవీ పూర్తి విశ్వరూపం దాల్చింది. లక్షల కోట్ల వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. కేవలం అయిదు నుంచి పది సెకెండ్ల ప్రకటనలు, స్క్రోలింగ్ ప్రకటనల రూపంలో వేల నుంచి లక్షల వరకు సంపాదిస్తున్న ఆదాయం మొత్తం మీద లక్షల కోట్ల మేరకు చేరుకుంది. కేవలం టీవీ రైట్ల మీద ఆధారపడి సినిమాలు తీసే నిర్మాతలు తెలుగునాట వున్నారంటే ఆశ్చర్యం కాదు. ఆ మాత్రం ఈ మాత్రం చిన్న సినిమా అయినా యాభై నుంచి కోటి రూపాయల వరకు టీవీ రైట్స్ ద్వారా ఆదాయం వస్తుందని, మరో అంత పెట్టుకుని చిన్న సినిమా తీయచ్చని కలగనే వారు ఎందరో వున్నారు. కోట్లలో సినిమాలు తీసే నిర్మాతలంతా ఇప్పుడు చిన్న తెరబాట పట్టి, టీవీ కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఆదాయ వ్యయాల లెక్కలు కళ్ల ముందు క్లియర్‌గా కనిపించడమే ఇందుకు కారణం. ఆదాయాన్ని బట్టి వ్యయాన్ని

నిర్ణయించుకునే సౌలభ్యం వుండడం మరో కారణం. ఇది కేవలం మన ఒక్క రాష్ట్రంలో సంగతి కాదు..విశ్వవాప్తంగా జనజీవనంలో పాతుకుపోయిన ఓ పరికరం వెనుక దాగిన వాస్తవం.

 

టెలివిజన్ ఆరంభం
టేప్‌రికార్డర్‌గా, రేడియోగా, గ్రామ్‌ఫోన్‌గా, టెలిఫోన్‌గా, ఫొటోగా, ఎనె్నన్నో దశల తర్వాతే ‘టెలివిజన్’గా రూపాన్ని సంతరించుకుంది. థామస్ ఆల్వా ఎడిసన్, మార్కొనీ, గ్రాహంబెల్‌లందరి కృషి ఫలాన్ని జాన్‌లోగీ బెయిర్డ్ సమన్వయం చేసి సృష్టించిన సాంకేతిక అద్భుతం – టెలివిజన్..

మన దేశం – టీవీ విస్తరణ
మన దేశంలో తొలిసారిగా టీవీ ప్రసారాలు 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో ఓ చిన్న ట్రాన్స్‌మీటర్‌తో, షిఫ్ట్‌ల మీద నడిచే స్టూడియోలో ఆరంభమయ్యాయి. 1976 వరకూ అంటే 17 ఏళ్లపాటు టెలివిజన్ ప్రసారాలు అన్నీ ‘ఆకాశవాణి’లో అంతర్భాగంగానే జరిగాయి.. ఆ తర్వాత నుంచీ క్రమక్రమంగా దూరదర్శన్ ఎదుగుతూ వచ్చింది. జాతీయ స్థాయి ప్రసారాలకు, కలర్ ప్రసారాలకూ విస్తరించింది. 1991 అనంతరం ప్రైవేటు ఛానెళ్ల రివల్యూషన్‌తో మన దేశంలో టెలివిజన్ ప్రసారాలు ఊపందుకొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా 515 పైగా ఛానెల్స్‌తో విశ్వరూప స్థితికి చేరుకుంది.
ఇప్పుడు మన దేశంలో టెలివిజన్ ఓ అంతర్భాగం అయింది. కర్ణుడికి కవచ కుండలాలలాగా, గృహానికి టెలివిజన్ సెట్ ఓ సహజ ఆభరణం అయింది. ఆ విస్తరణను ఈ విధంగా చెప్పవచ్చు. భారతదేశంలో 1962వ సం.లో కేవలం ఒకే ఒక్క ఛానెల్‌తో టీవీ ప్రసారాలు జరిగేవి. అప్పట్లో దేశవ్యాప్తంగా ఉన్న టెలివిజన్ సెట్‌ల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 41! కానీ 1992 తర్వాత దేశవ్యాప్తంగా 7 కోట్ల గృహాలకు టీవీ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. 100 ఛానెల్స్ ప్రసారాలు ఆరంభించాయి. 2000 నాటికి 8.8 కోట్ల గృహాలకు, 2010 నాటికి 13.4 కోట్ల గృహాలకు టీవీ సెట్లు విస్తరించాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం గృహాలు 22.3 కోట్లుగా ఉంది. ఇందులో 55% పైగా గృహాలు టీవీ మాయామేయ జగత్తులో మునిగి తేలుతున్నాయన్నమాట. ఇందులోనూ, 10.3 కోట్ల గృహాలు కేబిల్/ శాటిలైట్ టీవీ ప్రసారాలను కలిగి ఉండగా, 2 కోట్ల గృహాలు అత్యంత అధునాతన డీటీహెచ్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.

టెలివిజన్ బిజినెస్
దేశవ్యాప్తంగా నలుమూలల్లోకీ టెలివిజన్ విస్తరిస్తున్న క్రమంలోనే టెలివిజన్ వ్యాపారం, టెలివిజన్ ఆధారిత వ్యాపారం, టెలివిజన్ కంటెంట్ కోసం చేసే వ్యాపారం కూడా ఇప్పుడు లక్షలాది కోట్లకు పెరిగింది. 1992 నుండి దేశంలో మొదలైన నూతన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని మన దేశంలోకి విదేశీ ఛానెళ్లు, శాటిలైట్ ప్రసారాలు ఊపందుకున్నాయి. స్టార్‌టీవీ ప్రసారాలతో మొదలైన ఈ ‘టీవీ ఛానెల్ రివల్యూషన్’ ఎంతో వేగంగా దేశంలోకి చొచ్చుకుపోయింది. దీనికి తోడు 2003లో ‘న్యూస్ ఛానెళ్ల విజృంభణం’ మొదలై ఇప్పుడు టెలివిజన్ నిజంగానే విశ్వరూపం ఎత్తిన ఫీలింగ్‌ని కలిగిస్తోంది. ఈ విస్తరణ జరుగుతున్న క్రమంలోనే, టెలివిజన్ వ్యాపారం కూడా విజృంభించింది. 1991కి ముందు టెలివిజన్‌లో వ్యాపార ప్రకటనల వల్ల వచ్చే ఆదాయం కొన్ని లక్షల

లోపే ఉండేది. కానీ 2010 నాటికి కేవలం వ్యాపార ప్రకటనల ప్రసారాలతోనే అన్ని ఛానెల్సూ కలిపి దాదాపు వెయ్యి కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 10 సెకన్లు, 20,30 సెకన్లు వంటి స్వల్పకాల ప్రకటనల ప్రసారాల ద్వారా టీవీ ఛానెళ్లు 2008లో 450 కోట్లకు పైగా సంపాదించాయి. ‘అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్’ ప్రకారం యాడ్స్ రూపేణా టెలివిజన్ ఛానెళ్లకు వచ్చే ఆదాయం 2015 నాటికి 2000 కోట్లను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

బిజినెస్ విశ్వరూపం
ప్రస్తుతం భారతీయ టెలివిజన్‌లో జరుగుతున్న బిజినెస్ ప్రధానంగా 8 దశలలో జరుగుతోందని చెప్పాలి. 1.శాటిలైట్ ఛానెళ్ల స్థాపన – నిర్వహణ 2.కార్యక్రమాలు – సీరియల్స్, గేమ్‌షోల ప్రొడక్షన్ 3.ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం కావలసిన అనుబంధ నైపుణ్య రంగాలలో జరుగుతున్న వ్యాపారం 4.ప్రసారాలు, ప్రాయోజిత కార్యక్రమాలపై జరుగుతున్న వ్యాపారం 5.టెలివిజన్ ప్రసారాల ప్రభావంతో దేశవ్యాప్తంగా మార్కెట్‌లో వివిధ వస్తూత్పత్తుల అమ్మకాల వల్ల పెరిగే వ్యాపారం 6.టెలివిజన్ ఛానెల్స్ ప్రమోట్ చేసే ఫ్యాషన్స్, ఈవెంట్స్ వల్ల ఆయా సంస్థలకు పెరిగే బిజినెస్ 7.కొత్త ఫ్యాషన్స్ పరిచయం వల్ల మార్కెట్‌లో పెరిగే అమ్మకాలు జరిగే బిజినెస్ 8.యాడ్స్ కోసం, యాడ్స్ రూపొందించే ఏజెన్సీలకూ పెరుగుతున్న వ్యాపారం.
దీనికి తోడు టెలివిజన్‌కి ఇప్పుడు పెరిగిన ‘రీచ్’, ‘యాక్సెసిబిలిటీ’ వల్ల బడా వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం తమ ప్రొడక్ట్‌లను మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి టీవీలనే ప్రధాన ప్లాట్‌ఫాంగా భావిస్తున్నాయి. ఇప్పుడు ప్రతీ కంపెనీ తన వస్తువుల ప్రొడక్షన్ కాస్ట్‌లో టీవీ మీడియా ప్రమోషన్ పేరిట ప్రత్యేక కేటాయింపులను చేస్తోంది. ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్)వారి అంచనాల ప్రకారం కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ బడ్జెట్‌లో 2001లో కేవలం 5 శాతం మాత్రమే ఖర్చు చేస్తుండగా, 2005 నాటికి అది 15 శాతానికి.. 2010 నాటికి అది 35 శాతానికి పెరిగిందని తేలింది. దీని భారమంతా ఆయా కంపెనీలు తిరిగి వస్తువు ధర మీదనే వేస్తున్నప్పటికీ, ఈ కేటాయింపులు మాత్రం ఇప్పుడు అనివార్యం అయ్యాయి.

టీవీ ఛానెళ్లు
ప్రస్తుతం దేశం మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి 515 పైగా వివిధ టీవీ ఛానెళ్లు పని చేస్తున్నాయి. ఒక్క తెలుగులోనే అన్ని రకాల ఛానెళ్లూ కలిపి దాదాపు 55 పైగా ఛానెల్స్ ప్రసారాలు చేస్తున్నాయి. కాగా, ఇపుడున్న అంచనాల ప్రకారం సగటున ఒక ఛానెల్‌ను ఏర్పాటు చేయడానికి కనీసం 40 కోట్ల నుండి 100 కోట్ల వరకూ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. స్టూడియోల నిర్మాణం, కెమెరాలు, వెహికిల్స్, భవనాలు, సిబ్బంది, కంప్యూటర్లు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నింటికీ అయ్యే వ్యయం ఇది. ఈ ఖర్చుకు సంబంధించిన ఆదాయం అంతా టీవీ ఛానెల్స్ వ్యాపార ప్రకటనల ద్వారానూ, ‘స్లాట్స్ అమ్మకాల’ ద్వారానూ సాధిస్తున్నాయి.
కాగా ఈ భారీ వ్యయాలను దృష్టిలో పెట్టుకున్న వివిధ టీవీ ఛానెల్స్ ‘మల్టీ ఛానెల్ వ్యవస్థ’ని ఏర్పాటు చేసుకున్నాయి. అలా స్టార్ టీవీ నెట్‌వర్క్‌కు మన దేశంలోనే దాదాపు 25పైగా ఛానెల్స్ ఉన్నాయి. దేశంలో మొట్టమొదటి స్వదేశీ ప్రైవేట్ టెలివిజన్ సంస్థ అయిన జీ టెలివిజన్‌కు అన్ని భాషల్లో దాదాపు 15పైగా ఛానల్స్ ఉన్నాయి. సోనీ గ్రూప్‌నకు 4 ఛానెల్స్, ఈటీవీ గ్రూప్‌నకు 12 ఛానెల్స్, సన్ టీవీ నెట్‌వర్క్‌కు 10 ఛానెల్స్ ఉన్నాయి. మన తెలుగులో సైతం ఎన్‌టీవీ గ్రూప్‌లో 4 ఛానెల్స్ నడుస్తు

న్నాయి.

ప్రొడక్షన్ వ్యాపారం
టెలివిజన్‌లు ప్రస్తుతం 24 ఇంటు 7 ప్రసారాలతో పోటాపోటీగా
నడుస్తున్నాయి. ఇన్ని గంటలపాటు టీవీ ప్రసారాలు జరగాలంటే వాటికి విపరీతమైన ‘సాఫ్ట్‌వేర్’ కావాలి. ఆ సాఫ్ట్‌వేర్‌ని వివిధ టీవీ ఛానెల్స్ – కార్యక్రమాలు, సీరియల్స్, ఈవెంట్స్, గేమ్‌షోస్, రియాలిటీ షోస్ ద్వారా సమకూర్చుకుంటున్నాయి. ఆ లెక్కన టీవీ ప్రోగ్రామ్‌ల ప్రొడక్షన్ వ్యాపారం ఇపుడు 10 వేల కోట్ల బడ్జెట్‌లను దాటిపోయాయని తెలుస్తోంది. ఈ విషయంలో కౌన్ బనేగా కరోడ్‌పతి, బిగ్ బాస్, దస్ కా దమ్, ఖత్రోంకీ ఖిలాడి వంటి గేమ్ షోలు, రియాలిటీ షోల పాత్రను తక్కువ అంచనా వేయలేం. ‘బిగ్‌బాస్’ ఫస్ట్ సీజన్ ప్రొడక్షన్ వ్యయం 84 ఎపిసోడ్‌లకి 120 కోట్లు.. అలాగే ఖత్రోంకే ఖిలాడీకి అయిన వ్యయం 30 ఎపిసోడ్‌లకి 100 కోట్లు.. ఇక కెబిసి వంటి గేమ్ షోలో ప్రైజ్‌మనీయే ఇప్పుడు 5 కోట్లు. అమితాబ్ రెమ్యునరేషన్ ఎపిసోడ్‌కి 1.5 కోట్లు. 100 ఎపిసోడ్‌లకి దీని ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు 350 కోట్లు అవుతోంది.

సీరియల్ బిజినెస్
టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సీరియళ్లపై జరిగే ప్రొడక్షన్ కాస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. హమ్‌లోగ్, బునియాద్ వంటి పాతకాలం సీరియళ్ల స్థానంలో ‘శాంతి’తో డైలీ సీరియల్ ప్రభంజనం ప్రారంభమైన తర్వాత టీవీ సీరియళ్ల రివల్యూషన్‌కి శ్రీకారం జరిగింది. ఇక స్టార్ ఛానెల్‌లో బాలాజీ టెలీ ఫిలింస్ ఏక్తాకపూర్ ప్రారంభించిన ‘క్యోంకీ సాస్ బీ బహు థీ’ వంటి సీరియల్స్ ప్రభంజనాన్ని సృష్టించాయి. వీటికి తోడు ‘రామాయణ్’ ‘మహాభారత్’ సీరియల్స్ ఇప్పటికీ రిపీటెడ్ టెలికాస్టింగ్స్‌తో పర్మినెంట్ సాఫ్ట్‌వేర్‌గా రూపొందాయి.
ఈ సీరియల్స్ దాదాపు 500 నుంచి 1000 ఎపిసోడ్స్ వరకూ నిర్మాణం అవుతున్నాయి. మీడియా కౌన్సిల్ అంచనాల ప్రకారం జాతీయ స్థాయి సీరియళ్ల నిర్మాణానికి ఎపిసోడ్‌కు 5 నుండి 10 లక్షల వ్యయం అవుతోంది. అదే ప్రాంతీయ సీరియల్స్ అయితే ఆ వ్యయం 1.5 లక్షల నుండి 4 లక్షల మధ్య ఉంటోంది. ఆ లెక్కనే నేషనల్ సీరియల్ ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు 50 నుండి 100 కోట్ల వరకూ అవుతోంది. కాగా, తెలుగు వంటి ప్రాంతీయ సీరియల్‌కి 500 ఎపిసోడ్స్‌కి 7.5 కోట్ల వరకూ అవుతున్నాయి.

అనుబంధ నైపుణ్యాల బిజినెస్
టెలివిజన్ రంగం వృద్ధి చెందుతున్న కొద్దీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌పైన ఆధారపడిన అనుబంధ నైపుణ్యాల బిజినెస్ కూడా విస్తృతంగా పెరిగింది. కాస్ట్యూమ్ రంగం, మేకప్ రంగం, కెమెరా రంగం, ఆర్ట్ డైరెక్షన్ రంగం, క్రియేటివ్ రంగం వంటివి దీనివల్ల తమ బిజినెస్‌ను విపరీతంగా పెంచుకున్నాయి. అయితే టీవీ ప్రోగ్రామ్‌లు, సీరియళ్లు ఎక్కువగా సెట్‌లలోనూ, కంట్రోల్డ్ కండిషన్స్‌లోనూ నిర్మిస్తున్నందువల్ల, సెట్‌లను డిజైన్ చేసే ఆర్ట్ డైరెక్టర్లకి పని, సిబ్బందికి వేతనాలు పెరిగాయి. అంతేకాక, వివిధ సెట్‌లను నిర్మించడానికి గాను కావలసిన మెటీరియల్‌లకు కూడా డిమాండ్ పెరిగింది.
అలాగే మన టీవీ ఛానెల్స్‌లో టాప్ రేటెడ్ షోస్‌లో డాన్స్.. సాంగ్స్ బేస్డ్ షోస్ కూడా ఒకటి. ఇండియాస్ గాట్ టాలెంట్, జస్ట్ డ్యాన్స్, పూజా నాచ్‌లే, సూపర్ సింగర్, సరిగమప వంటి షోస్ పుణ్యమా అని ఇప్పుడు డాన్స్ ఇనిస్టిట్యూట్‌లు, సంగీత కళాశాలల బిజినెస్‌లు కూడా విస్తృతంగా పెరిగాయి. ఇక ఫ్యాషన్స్, మోడలింగ్ రంగంలో కూడా అంతే. అన్నింటికీ మించి టీవీ రంగం ఇప్పుడు సినిమా రంగంలోని ఎంతోమంది నటీనటులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మారింది. మరోవైపున ఎంతోమంది తెర వెనుక సాంకేతిక నిపుణులు, కళాకారులకు ఉపాధిగా మారింది.

తెలుగులోనూ అంతే!
మన తెలుగులోనే కాకుండా, జాతీయ స్థాయిలో టెలివిజన్ రంగంలో వచ్చిన కొత్త పరిణామం ఏమంటే – క్లాసిఫైడ్ ఛానెళ్ల ఏర్పాటు.. అంటే ప్రత్యేక వర్గాల ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఛానల్స్ అన్నమాట. ఈ పరిణామం మన తెలుగు ఛానల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 1977 అక్టోబర్ 23న అప్పటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా తెలుగు టెలివిజన్ దూరదర్శన్ ప్రసారాలు ఆరంభమయ్యాయి. 1995 నాటికి శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలను ప్రారంభించుకున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 9 ఛానెళ్లు, కామెడీ కోసం 2 ఛానెళ్లు, పిల్లల కోసం 2 ఛానెళ్లు, మ్యూజిక్ కోసం 2 ఛానెళ్లు, ఆధ్యాత్మికత కోసం 5 ఛానెళ్లు, సినిమాల కోసం 3 ఛానెళ్లు, న్యూస్ కోసం 14 ఛానెళ్లు పని చేస్తున్నాయి. ఇవేకాకుండా డబ్బింగ్ ఛానెల్స్ మరో 8 ప్రసారాలు చేస్తున్నాయి.
* * *
నవీన భారతం..
ఆడియో విజువల్ సంగ్రామ క్షేత్రం.. నరుడు – ప్రేక్షకుడు..
టెలివిజన్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది..
ప్రేక్షకుడు కళ్లు తెరుచుకుని ఆ విశ్వరూపాన్ని చూస్తూ తరిస్తున్నాడు.. *

********

భారతీయ టీవీ ప్రస్థానం
1959 తొలి టీవీ ప్రసారాలు ఆరంభం
1965 ఆల్ ఇండియా రేడియోలో భాగంగా ఏర్పాటు
1976 ప్రత్యేక దూరదర్శన్‌గా స్థాపన
1982 దేశవ్యాప్త ప్రసారాలు – కలర్ ప్రసారాలు ఆరంభం
1992 కేబుల్ టీవీ ప్రసారాలు మొదలు
1993 స్టార్ టీవీ ప్రసారాలకు శ్రీకారం
1992 దక్షిణాదిలో సన్ టీవీ ప్రసారాలు
-రాజ్ ఛానెల్, ఆసియా నెట్ ఆరంభం
1995 సోనీ టీవీ ఏర్పాటు
2001 అంతర్జాతీయ టీవీ ఛానెల్స్ ఆరంభం
2003 న్యూస్ ఛానెళ్ల విజృంభణ – కొత్త శకం
2003 డిసెంబర్ 28, ఈటీవీ 2 ప్రారంభం
2004 టీవీ 9 ప్రారంభం
2009 కలర్స్ ఛానెల్ ఆవిష్కరణ – భారీ పెట్టుబడులతో బిగ్ షోల ఆరం