Menu

మెప్పించని మొగుడు !

* మొగుడు
తారాగణం:
గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్
రాజేంద్రప్రసాద్, నరేష్
హర్షవర్ధన్, ఆహుతి ప్రసాద్
గీతాంజలి, మహర్షి రాఘవ
వేణుమాధవ్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్
సంగీతం: బి.బాబు శంకర్
నిర్మాణం:
లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
కృష్ణవంశీ
—-
మన తెలుగు సినిమాలలో ’మొగుడు’ సినిమాలది ఓ ప్రత్యేక శైలి. శోభన్‌బాబు పుణ్యమా అని మొగుడు సినిమాలు కొనే్నళ్లపాటు ట్రెండ్‌గా మారాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ మహిళా చిత్రాలు అంటే అప్పట్లో ఈ తరహా ‘మొగుడు’ సినిమాలు మాత్రమే అనేంతగా వెల్లువెత్తిన సందర్భాలు తెలుగు సినిమా ప్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత మోహన్‌బాబు, జగపతిబాబు వంటి హీరోలు ఈ స్టయిల్ సినిమాలను మరింత ముందుకు తీసుకువెళ్లారు. కానీ ఇప్పుడు తెలుగు సినీ రంగంలో కొత్తతరం హీరోలు వచ్చిన తర్వాత ‘మొగుడు’ ఆధారిత కుటుంబ కథా చిత్రాల నిర్మాణం చాలా తగ్గింది. అయితే శోభన్‌బాబు స్థాపించిన ఈ తరహా చిత్రాల ప్లేస్ మాత్రం ఖాళీగానే ఉండిపోయింది. కృష్ణవంశీ ‘మొగుడు’ అనే సినిమా టైటిల్ ప్రకటించగానే ప్రేక్షక జనంలో మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షక జనంలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ‘నినే్న పెళ్లాడుతా’, ‘మురారి’ వంటి ఫ్యామిలీ స్టోరీస్‌ని ట్రెండ్‌గా చెప్పిన ట్రాక్ రికార్డు కృష్ణవంశీది. దాంతో ఈ తరం ‘మొగుడు’ని ఎలా చూపిస్తాడో అనే క్రేజ్ క్రియేట్ అయింది. మరో వైపున యాక్షన్ చిత్రాల హీరో గోపీచంద్…గ్లామర్ భామ తాప్సీ ఈ ‘వివాహ మహోత్సవ చిత్రం’లో ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో బిల్డప్ అయింది. ఐతే, సినిమా చూసి బైటికి వచ్చిన తర్వాత ప్రేక్షకుల ఉత్సాహం అంతా చప్పబడిపోయి, వీడేం ‘మొగుడు’రా బాబూ అని తల పట్టుకునే పరిస్థితి రావడం ఓ విషాదం.
ఇక కథ విషయానికి వస్తే వివాహ బంధం-కుటుంబ విలువలంటే ప్రాణంపెట్టే పెద్దమనిషి ఆంజనేయ ప్రసాద్ (రాజేంద్రప్రసాద్). ‘తాళిబొట్టు ఆడదాని గుండెలమీద…మగవాడి గుండెల్లోనూ ఉండాల’ని ఉద్బోధించే సంప్రదాయపు మనిషి. ఆయన కొడుకు రామ్‌ప్రసాద్ (గోపీచంద్). ముగ్గురు అక్కల తర్వాత సంతానం కావడంతో రామ్‌ప్రసాద్ అంటే అందరికీ అభిమానం. అక్కలు-బావలు-పిల్లలు-తండ్రి-హీరో అందరూ ఒక ఇంట్లో సమిష్టి కుటుంబంలా జీవిస్తూ ఉంటారు. ఈ అందరి ఏకైక లక్ష్యం రామ్‌ప్రసాద్ పెళ్లి చేయడం..రామ్‌ప్రసాద్ రాజేశ్వరి (తాప్సీ)ని ఓ డాన్స్ ఫెస్టివల్‌లో చూసి మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెతో, పెళ్లి ప్రపోజల్ చెప్తాడు. రాజేశ్వరి ప్రముఖ రాజకీయ నాయకురాలు చాముండేశ్వరి (రోజా) కూతురు. ఆమె ఓ ప్రపోజల్‌కు మొదట్లో తటపటాయించినా, ఆ తర్వాత ఇరు పెద్దల అంగీకారంతో పెళ్లి అవుతుంది. పెళ్లి మండపంలో అనూహ్యంగా జరిగిన సంఘటనతో ఇరువర్గాల మధ్యా మాటా మాటా పెరిగి రామ్‌ప్రసాద్-రాజేశ్వరి ఇద్దరూ విడిపోతారు. పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లికాని స్థితిలోకి వెళ్లిన ఆ ‘మొగుడు’ తన కాపురాన్ని నిలుపుకోవడానికి ఏం చేశాడు? వారి వివాహ బంధం విడాకులకు దారి తీసిందా? లేక అన్ని అపార్ధాలు తొలిగి నిలబడిందా? అనేది సగటు ప్రేక్షకుడు సైతం ఊహించగలిగిన మిగతా కథ.
‘మొగుడు’ సినిమాలో ప్రధానంగా కథ వీక్! కథలో కీలక మలుపులకు కారణమయ్యే సీనే్లవీ కన్విన్సింగ్‌గా ఉండవు. గౌరీదేవి ప్రతిమకోసం గొడవ పడడం దగ్గర నుంచి, తాప్సీ మారిషస్‌లో గోపీచంద్ వెంటపడడం, పాయిజన్ తాగడం వరకు సీన్లన్నీ కృత్రిమంగా కథను నడిపించడం కోసం అల్లుకున్న సీన్లుగానే అనిపిస్తాయి తప్ప ‘అవునేమో’ అని ప్రేక్షకులు నమ్మేలా లేవు. తాప్సీ ఇంట్రడక్షన్‌లో క్లాసికల్ డాన్స్ గెటప్‌తో నోట్లో చాకొలేట్ బార్‌తో వెరైటీగానే చూపించారు కానీ హీరోకి తొలిసారి ఎదురుపడే సీన్‌లో ఆమెను తప్పతాగినట్టుగా చూపించడం ఏ స్టైలో అర్ధం కాదు. మానవ సంబంధాలు-కుటుంబ విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిగా ఉండే రాజేంద్రప్రసాద్ పాత్ర ఆవేశ పడకుండా మొదటే హుందాగా వ్యవహరించే అవకాశం ఉంది కదా అనే ప్రశ్న ఎంత వద్దనుకున్నా వస్తుంది. అలాగే రోజా క్యారెక్టర్ అధికారం-అహంకారం-పొగరుబోతు తనంల కలయికలా అనిపించేలా బిల్డ్‌చేసి…ఆ వెంటనే సద్దుమణగడం..మళ్లీ ఎందుకో పూనకం వచ్చినట్టు ప్రవర్తించడం క్యారెక్టర్‌లోని కంటిన్యుటీ మెకానిజమ్‌ని దెబ్బతీసింది. కాకపోతే రాజేంద్రప్రసాద్ నటన కొన్ని లోపాలను ఓవర్‌టేక్ చేయగలిగింది.
హీరో గోపీచంద్ రొటీన్ యాక్షన్‌కు ఇది వెరైటీనే అని చెప్పాలి. ఈ సినిమాతో గోపీచంద్‌కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ కొంత పెరుగుతుందని చెప్పవచ్చు. తాప్సీ గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యాయి కానీ ఆమె చెప్పిన డబ్బింగ్ మైనస్ అయింది. అయినా పరభాషా నటి అయినా తెలుగులో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేసినందుకు అభినందించాల్సిందే. శ్రద్ధా దాస్ నటన, అందాలు కొంత రిలీఫ్. మాడ్రన్ ‘మొగుడు’ ఎలా ఉండాలో చూపించే తాపత్రయంలో డైరక్టర్ కొంత తడబడ్డాడనే చెప్పాలి. అలాగే మాడ్రన్ అమ్మాయిలు ఇప్పటికీ, అప్పుడెప్పుడో శోభన్‌బాబు సినిమాలో జయసుధలా హీరో శ్రద్ధాదాస్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతుంటే ఆటంకాలు సృష్టించేంత ఇన్‌సెక్యూర్డ్ అమ్మాయిలా చూపించడం కుదరలేదు.
‘మొగుడు’లో కంటికింపుగా హాయిగా కనిపించే దృశ్యాలేవైనా ఉన్నాయా అంటే అవన్నీ పెళ్లి వేడుక తాలూకు సీనే్ల…! కామెడీ సిచువేషనల్‌గా కొంతవరకే వర్కవుట్ అయింది. పాటల చిత్రీకరణ కృష్ణవంశీ స్టయిల్లో బాగానే ఉన్నాయి. లగ్నపత్రికను తెలంగాణ యాసలో రాయించిన సీన్…గోపీచంద్ పెళ్లి సంబంధాల ఎపిసోడ్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్‌తో రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీని పరిచయం చేసిన తీరు బాగున్నాయి.
‘మాయవో మహిమవో’ పాట…‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా’ పాటలు ఆహ్లాదంగా ఆకట్టుకుంటాయి. అయితే సామూహిక కౌన్సిలింగ్ సెషన్‌లా ‘క్లైమాక్స్’ విసుగు పుట్టిస్తుంది. ఈ సినిమాలో హీరో ఓ సీన్‌లో ‘ఒక్కసారే పుడతాం…ఒక్కసారే చస్తాం…ఒక్కసారే పెళ్లిచేసుకుంటాం’ అని డైలాగ్ చెప్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ‘ఒక్కసారే చూస్తాం’ అనుకుంటూ వెళ్లేలా చేసిన క్రెడిట్ దర్శకుడిదే!