Menu

మన హీరోలు సినిమాలు చూడరా?

 

ఓ డాక్టర్ ఎప్పటికప్పుడు తన వృత్తికి సంబంధించి లేటెస్ట్ పరిశోధనలను తెలుసుకుంటూ ఉంటాడు. ఎంబిబిఎస్ చదువు అయిపోగానే వైద్యవృత్తిలో పండిపోయానని అనుకోడు.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డే టు డే తన ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లలో కొత్త వెర్షన్స్‌ని తెలుసుకుంటూ అప్‌డేట్ అవుతాడు.
ఆఖరికి ఓ కిరాణా కొట్టు వ్యాపారి కూడా మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకుంటూ ఉంటాడు…
వీళ్లందరు తమ తమ రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలను పరిశీలిస్తూ ఇతర వ్యక్తుల తీరు తెన్నులను నిరంతరం అంచనా వేసుకుంటూ తమని తాము అప్‌డేట్ చేసుకుంటూ వెడుతున్నారు.
మరి ఇదే పనిని మన తెలుగు హీరోలు చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే ఓ పెద్ద సందేహం మన ముందు నోరెళ్లబెట్టి నిలబడుతుంది. ఇటీవలి కాలంలో మన తెలుగు హీరోలు ఎంపిక చేసుకుంటున్న కథలు…చేస్తున్న సినిమాలలోని కథా వస్తువులను గమనిస్తే మన హీరోలు రోజురోజుకి ‘నిలవనీరు’గా అవుతున్నారు. ప్రవహించే సెలయేరు కావట్లేదేమో అని ఇట్టే అర్ధమవుతుంది.

కంచుకోటల్లో హీరోలు!
మన హీరోలలో చాలామంది వారి పూర్వీకుల వంశం తాలూకు ‘కంచుకోటల్లో’ తమని తాము బంధించుకుని, అదే గొప్పతనమని అనుకుంటూ, తమ చుట్టూ తాము గిరి గీసుకుని కూచున్నవాళ్లే ఎక్కువ! లేదంటే తమకంటూ ఓ ‘ఇమేజ్’ ఏర్పడిందని, ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయలేమని తమని తాము భ్రమ పెట్టుకుంటూ ఆ ‘ఇల్యూజనరీ’ ప్రపంచంలోని ‘చట్రం’ల మధ్య ఉన్న వాళ్లు మరికొందరు. దీనికి తోడు, పైకి ఎన్ని చెప్పినా, ఎన్ని చిరునవ్వులు నటించినా, మన హీరోల మధ్య సరైన సత్సంబంధాలు లేవు అనేది సత్యం! అసలు ఆరోగ్యకరమైన పోటీ అటుంచి ఆహ్వానించదగిన అనుబంధాలూ తక్కువే! అయితే కొందరు హీరోల మధ్య వృత్తిపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రశంసించదగిన స్నేహసంబంధాలు కూడా ఉన్నాయి.అయితే ఇవన్నీ వారి వారి ‘చట్రాలకు’ లోబడే అని గమనించాలి.

ఈ రకమైన ధోరణులు-స్వభావాలవల్ల మన హీరోలు మన సినీ ప్రపంచంలో తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలేంటో గమనించలేని స్థితికి వచ్చారేమో లేదా ‘కామ్’గా పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటూ, తమ పని తాము చేస్కుంటూ ఇతర హీరోల సినిమాల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వెళ్లిపోయే స్థితికి వచ్చారేమో! దీనికి తోడు, వారికి ఉండే షూటింగ్ షెడ్యూల్ వల్ల కూడా ఇలాంటి స్థితికి వచ్చి ఉండవచ్చు. ఇలా తమ పనిలో తాము తలమునకలుగా ఉండే హీరోలు తమ చుట్టూ జరుగుతూ ఉండే అంశాలను, డెవలప్‌మెంట్స్‌ని తెలుసుకోలేకపోతుండవచ్చు. ఒకవేళ తెలుసుకున్నా ఆ విషయాలన్నీ తమ అంతరంగికుల ద్వారానే తెలుసుకుంటారు కనుక, నిజమైన విషయాలు నిజాయితీగా హీరోలను చేరే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చు. ఇన్ని కారణాలవల్ల మన హీరోలు ఎవరికి వారు తమ కంచుకోటల్లో ఉంటున్నారేమో అనిపిస్తోంది.

మన హీరోలు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా చక్కగా తమ పని తాము చేసుకోవడం ‘ప్రొఫెషనలిజమే’ కదా? దీన్లో తప్పేంటి?అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ పాయింటు, ఇతర హీరోల విషయాల్లో జోక్యం చేసుకోవాలని కాదు. సమకాలీన తెలుగు సినీ రంగంలోని సినిమాలు-కథలు-కథా వస్తువుల పరంగా వచ్చే పరిణామాలను తెలుసుకోవాలనేదే పాయింటు! ఆమధ్య ‘మన హీరోలు వారి సినిమాలు తప్ప, ఇతర హీరోల సినిమాలు అసలు చూస్తారా? అలా చూసి, చూసినామని చెప్పేంత విశాల హృదయం మన హీరోలకు ఉందా?’’ అని కూడా ప్రశ్నలు వచ్చాయి.

సరే, మన హీరోలకు అంత విశాల హృదయం ఉందో లేదో మనకనవసరం. కానీ దీనివల్ల వచ్చే సమస్యలేంటి? అనేది మరో ప్రశ్న! సమస్యేం లేదు కానీ, ప్రేక్షకులు-హీరోల సినిమాలను చూసి, గతంలోని మరో హీరో సినిమాలతో, పోల్చుకుని ఆయా కథల ఎంపికలో హీరోల ‘కామన్‌సెన్స్’ను అనుమానించే పరిస్థితి వస్తోంది. అదే సమస్య! ఈ రకమైన అభిప్రాయం హీరోలపై సామాన్య ప్రేక్షకులలో సైతం ఏర్పడడానికి ఇటీవలి సినిమా కథనే ఓ కారణం అని చెప్పాలి.
ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘ఒక్కమగాడు’ సినిమా అత్యంత భారీ అంచనాలతో వచ్చింది. తీరా సినిమా విడుదలయ్యాక ‘ఒక్కమగాడు’ సినిమా దాదాపుగా ‘్భరతీయుడు’కు నకలు అనే విషయం (బాలకృష్ణ మేకప్‌తో సహా) ఈజీగానే తెలిసిపోతుంది. అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బాలు సినిమా వచ్చింది. ఈ సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుడికి సైతం నాగార్జున నటించిన ‘అంతం’ సినిమాయే గుర్తువచ్చింది. అలాగే కల్యాణ్‌రామ్ కూడా ‘కత్తి’ అనే సినిమాని తీశాడు. టైటిల్ విషయంలో ఎనె్నన్నో వాదవివాదాలు సృష్టించిన ఈ సినిమా తీరా విడుదలయ్యాక అభిమానులను సైతం పెదవి విరిచేలా చేసింది. పైగా ఈ సినిమా మహేష్‌బాబు ‘అర్జున్’ సినిమా కథను గుర్తు చేసేలా ఉండడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
ఇవన్నీ ఒకెత్తయితే, సిద్ధార్ధ-రవితేజ-నితిన్‌ల సినిమాలు మరో ఎత్తు. సిద్ధార్ధ-ఇలియానా జోడీగా వచ్చిన ‘ఆట’ సినిమా పవన్‌కల్యాణ్ ‘గుడుంబా శంకర్’ సినిమాకు మరో రూపాన్ని గుర్తు చేస్తుంది. రవితేజ-బోయపాటి కాంబినేషన్‌లోని ‘్భద్ర’ సినిమా ‘ఒక్కడు‘ సినిమాని, నితిన్-హన్సికల ‘సీతారాముల కల్యాణం’ సినిమా ‘గుడుంబా శంకర్’ని వద్దనుకున్నా గుర్తు చేస్తాయి. ఇక రవితేత ‘కిక్’ సినిమా యావత్తూ ‘జెంటిల్‌మేన్’ సినిమాకు అనుకరణే అనే మాటలు విపరీతంగా వినిపించాయి.
ఇలా పెద్ద హీరోల ఇటీవలి కాలపు సినిమాలన్నీ మరో సమకాలీన హీరో సినిమాలకు కాపీలే అనే ఆలోచన ఎంత వద్దనుకున్నా వస్తోంది. ఈ స్థితి హీరోలు తమ కాంటెంపరరీ హీరోల ఇతర సినిమాలని చూడకపోవడం వల్లనే దాపురించేందేమో అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ మన హీరోలు మన చుట్టూ ఉన్న సినీ ప్రపంచంలోని కథల్లోని విషయాలను అప్‌డేట్ చేసుకోగలిగితే ఎంత పెద్ద డైరక్టర్ చెప్పినప్పటికీ కథ మధ్యలోనే ఆపి ఇది ‘్భరతీయుడు’లా ఉంది అనో, ‘అంతం’లా ఉందేంటి అనో ఆయా దర్శకులను అడిగేవారు కదా? అనేది సగటు సినీ జీవికి సైతం వస్తున్న మిలియన్ రీళ్ల సందేహం!
రీసైక్లింగ్ కథలూ చెప్పేదదే!
నేటి తెలుగు సినిమా ప్రేక్షకుడు ఇదివరికటిలా లేడు. మీడియా, ఇంటర్‌నెట్‌ల పుణ్యమా అని ప్రపంచంలోని సినిమా రంగంలో జరిగే ప్రతి డెవలప్‌మెంట్‌నీ సునాయాసంగా తెలుసుకుంటున్నాడు. ఇంతకాలం హాలీవుడ్, కొరియన్, ఇరానియన్, చైనీస్ సినిమా కథలను, సీన్లను మక్కికి మక్కి కాపీ చేసినా అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈజీగా చెప్పేయగలుగుతున్నారు. ఎక్కడెక్కడి విదేశీ భాషా చిత్రాల మూల కథలనే చెప్పగలుగుతున్నప్పుడు మన తెలుగు సినిమాల కథలని మాత్రం గుర్తుపట్టలేరా? అందుకే సినిమా తెరపై నడుస్తున్నప్పుడే ‘ఈ సీన్ ఆ హీరో సినిమాలో ఉందే’ అని చెప్పేస్తున్నాడు. మరి ఓ సామాన్య ప్రేక్షకుడు గుర్తించిన విషయాన్ని కూడా మన తెలుగు హీరోలు గుర్తించలేకపోతున్నారా? లేక ఐచ్ఛికంగానే విస్మరిస్తున్నారా? అనేది అర్ధంకాని ప్రశ్న!
ఇక ఇటీవలి కాలంలో తెలుగు తెరని పావనం చేస్తున్న సినిమాలలో ఇలాంటి కథా చిత్రాలది ఒక ‘స్టైల్’ అయితే, మరో ‘స్టైల్’ రీ సైక్లింగ్ కథలది!…ఈ ‘రీసైక్లింగ్ కథలు’ రాస్తున్న రచయిత-దర్శకులు కొంచెం తెలివిగా ఒక్క సినిమా కథ మీదనే ఆధారపడకుండా రెండు మూడు తెలుగు సినిమాలనే కలిపి కథలల్లుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే…ఏ హాలీవుడ్‌నో, బాలీవుడ్‌నో కాపీ చేయడమో లేద ఇన్‌స్పిరేషన్ పొందడం కంటే మన తెలుగు సినిమాలలో హిట్ అయిన సినిమాలలోని రెండు మూడు లైన్‌లను ‘మిక్స్’ చేసి ‘రీ సైక్లింగ్ కథలని’ తయారు చేయడం గొప్ప విషయమే కదా?
‘కింగ్’ సినిమా చూడండి. అది ఢీ, చంద్రముఖి సినిమాలను కలిపి వండిన రీమిక్స్ సినిమా అని ఇట్టే అర్ధమవుతుంది. అలాగే ‘దూకుడు’ చూడండి. అతడు, కింగ్, ఢీల మిక్చర్ అని ఎంత వద్దనుకున్నా తెలిసిపోతుంది. ‘ఊసరవెల్లి’ కూడా అంతే! తెనాలి, ఒక్కడు సినిమాల రీమిక్స్ సినిమా అని తేటతెల్లమవుతుంది. సినిమాని థియేటర్లో చూసిన సగటు సినీ ప్రేక్షకుడు సైతం గుర్తిస్తున్న ఈ విషయాలు ‘కథల నెరేషన్’ అపుడు హీరోలకు స్ఫురణకు రావడంలేదంటే, వారు ఇతర హీరోల సినిమాలను చూడట్లేదనే కదా? చూస్తే ఇలా జరుగుతుందా? లేదా హిట్ ఫార్ములాలుగా ప్రూవ్ అయినాయి కనుక రిపీట్ చేయడంలో తప్పులేదని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు ‘హీరోను కొత్తగా వెరైటీగా, డిఫరెంట్‌గా చూపే సినిమా’’ అని ప్రచారం చేయడం వంచన కాదా? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే!

బాక్సాఫీసు లక్ష్యం!
ఏది ఏమైనా, సమకాలీన తెలుగు సినిమా కథల తీరు తెన్నులను కూలంకషంగా గమనిస్తే సినిమా దేనికి కాపీ? దేనికి ఇన్‌స్పిరేషన్ అనే సందేహాల కన్నా బాక్సాఫీసు కలెక్షన్లు సాధించిందా? లేదా? అనేదే ముఖ్యం అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ప్రేక్షకులు అలాంటి సినిమాలనే తెలిసి తెలిసీ ఆదరిస్తున్నప్పుడు అవి కాపీ కథలైనా, రీ సైక్లింగ్ కథలైనా, రీమిక్స్ కథలైనా ముఖ్యంకాదు అనేది మరో అభిప్రాయం! అల్టిమేట్‌గా తెలుగు సినిమా అంతిమలక్ష్యం వినోదమే…సినిమాకు వచ్చే ప్రేక్షకులు కోరుకునేది కూడా అదే! అలాంటి వినోదాన్ని అందుకోవడానికి హీరోలు కథల పరంగా అనుసరించే ఏ మార్గం అయినా తప్పుపట్టలేనిదే అనేది దీని సమర్ధించేవారి ఆలోచన.

కొసమెరుపు:

ఈమధ్య మన హీరోలు కథలు చెప్పడానికి వెళ్లిన రచయితలు, దర్శకులకు ‘్ఫలానా సినిమాలోని ఫలానా సీన్ లేదా కథలాంటి దానే్న మనమూ చేద్దాం’ అని సజెస్టు చేస్తున్నారట! మరి ఈ లెక్కన మన తెలుగు సినిమా హీరోలు ఇతర సినిమాలు చూస్తున్నట్టా? లేనట్టా

కర్టేసీ: ఆంధ్రభూమి

4 Comments
  1. kishore. November 22, 2011 /
  2. jd- November 23, 2011 /
    • kishore. November 23, 2011 /
  3. Kiran December 3, 2011 /