Menu

Gulzar’s Angoor – A tribute to Shakespeare

మొన్నటి శుక్రవారం రాత్రి, నా మానసిక వాతావరణం భీభత్స రూపం దాల్చి, అది ఎవరి పాలిటో వాయుగుండంగా మారబోతుండగా..

“అమ్మాయ్.. ఒక సినిమా చూస్తున్నా! టైటిల్స్ భలే ఉన్నాయి” అని ఫ్రెండ్. నేను: ఓకె (= సర్లే, ఇక్కడ నేనెవరికో శుభం కార్డు వేస్తున్నా)

“అంగూర్ అట.. ఇంతకు ముందు చూసావా?” నేను: నో (= వదిలెయ్య్ నన్ను. మీరూ, మీ సినిమాలు! ఇప్పుడు పేరు కూడా తెలీదంటే నన్ను వాయించేస్తారు.)

“గుల్జార్ సినిమా. సంజీవ్ కుమార్ హీరో. ఉత్పల్ దత్త ఉన్నాడు చూడు…”

“హే.. ఆగు. ఇద్దరం కలిసే చూద్దాం!”

ఇట్లా కల్సి చూడాలన్న ఆలోచనలు నాకు తప్ప ఎవరికీ రావు. నా ఫ్రెండూ, నేనూ పాడుకునే పాట: “నేనీ దరినీ, నువ్వా దరినీ, గూగులమ్మ కలిపింది ఇద్దరినీఈఈఈఈ..”

సరే, అప్పటికే పది నిముషాలు చూసేసిన నా ఫ్రెండ్ నాకోసం ఆగింది. నేను మొదలెట్టాను.

“ఆప్ విలియమ్ షేక్స్-పియర్…” అని వినిపించింది. “ఏంటి, నన్నే?” అని కాస్త సిగ్గుపడబోయాను. నన్ను కాదు.

సాక్షాత్తూ షేక్స్-పియర్ వారి చిత్రపటం. ఆ చిత్రపటం ముందు నైవేద్యంగా “అంగూర్” సమర్పించుకుంటున్నారు గుల్జార్ వారు అని క్షణాల్లో తెల్సిపోయింది. షేక్స్-పియర్ రాసిన సుప్రసిద్ధ నాటకం “కామెడి ఆఫ్ ఎర్రర్స్”ను ఆధారంగా చేసుకొని, రెండు కవల జంటల కథతో ఈ చిత్రాన్ని రూపొందించామంటూ సవినయంగా మొదలెట్టారు.

కథ మొదలయ్యింది. ఉత్పల్ దత్త్ కు ఇద్దరు సంతానం. కవలలూ. మగపిల్లలూ. ఇద్దరి పేర్లూ “అశోక్”. (ఇద్దరికీ ఒకటే పేరు వెనుక ’మతలబు’ను ఉత్పల్ దత్త్ నోటి వెంట వినాలి) కుటుంబసమేతంగా నౌకాయానం చేయడానికి ప్రయాణం కడతారు. దారిలో ఎవరో వదిలేసిన అనాధ, కవల, మగ, పసి పిల్లలు తగులుతారు. వాళ్ళని అలా చెట్టుకీ, పుట్టకీ వదల్లేక ఈ దంపుతులే వారిని చేరదీస్తారు. ఇద్దరికీ “బహాదూర్” అని నామకరణం అవుతుంది. వీరు ప్రయాణిస్తున్న నౌకకు ప్రమాదం జరుగుతుంది. అప్పుడూ…

అప్పుడు.. టైటిల్స్ మొదలవుతాయి. టైటిల్స్ వైరైటీగా, ద్రాక్షపళ్ళగుత్తు థీంతో వచ్చి పోతుంటాయి. ఆ క్రియెటివిటికే నా ఫ్రెండ్ మురిసిపోతా.

టైటిల్స్ అయిపోయాక, అసలు ’సినిమా’ మొదలవుతుంది. సినిమా అన్నాక సినిమానే కదా మొదలవుతుంది అని అనేయకండి. నేను అంటున్నది ఆ సినిమా కాదు. “సినిమా కనిపిస్తుంద్రా బాబోయ్” అని గొణుకుంటూ ఉంటామే అప్పుడప్పుడూ అలాంటిదన్న మాట. ఒక రకంగా చెప్పాలంటే, slapstick. క్షణక్షణానికి నవ్వొస్తుంటుంది. ( మనది ప్రేక్షకపాత్ర కాబట్టి.)

ఇంతకీ, ఈ ఇద్దరు ఆశోక్‍లూ (పెద్దయ్యాక సంజీవ్ కుమార్), ఇద్దరు బహాదూర్లూ (పెద్దయ్యాక దెవెన్ వర్మ) ఆ నౌకాయానంలో విడిపోతారు. ఒక ఆశోక్-బహదూర్ ఉంటున్న ఊరికి, ఒక తోట పని మీద మరో అశోక్-బహదూర్ రావటం తటస్థపడుతుంది. అచ్చుగుద్దినట్టు ఉండే పోలికలు, పైగా ఒకటే పేర్లు, అవి చాలవన్నట్టు సేమ్-టు-సేమ్ నౌకరు / యజమాని. అందుకని ఆ ఊరిజనమే కాకుండా, లోకల్ ఆశోక్ కుమార్ ఇంట్లో కూడా గందరగోళం తారాస్థాయికి చేరుకుంటుంది.

ఉన్న పరిస్థితులే తికమకపెడుతుంటాయంటే, ఇహ, ఒక్కో పాత్రకి ఒక్కో రకం తిక్క. లోకల్ ఆశోక్ భార్యాపీడితుడు. ఒక హారం చేయించమని వాళ్ళావిడైన మౌషమి ఆయన్ని దోరుగా వేయించుకొని తినేస్తూ ఉంటుంది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మౌషమి అందమే అందం. రష్‍గుల్లా ఉంటుంది ఈ సినిమాలో. చాలా స్వీట్. బోలెడు అమాయకత్వం. అంతే పెంకితనం. అందుకే భర్తను కూడా మృదుమధురంగా వేధిస్తుంది. లోకల్ ఆశోక్ కుమార్ మరదలుగా దీప్తి. అందరిలోకి తక్కువ తిక్క అనిపించేది ఈవిడే!

లోకల్ బహాదూర్ ఒట్టి అమాయకుడు. నోట్లో వేలు పెట్టినా, “కొరకనా?” అని అడిగేంత అమాయకుడు. అతడికి జోడిగా అరుణా ఇరాని నటించింది.

ఇహ, నాన్-లోకల్ ఆశోక్‍కు డిటెక్టివ్‍ నవలల పిచ్చి. తన చుట్టూ ఉన్నవాళ్ళంతా తనకు వ్యతిరేకంగా పనిజేస్తున్నారని హైపర్ ఇమాజినేషన్‍లోకి వెళ్ళిపోతుంటాడు. అతడి దగ్గరుండే బహాదూర్‍ ’భాంగ్’ ప్రియుడు. మత్తులో జోగుతూ ఉంటాడు.

హాస్యరసమంటే ఓ నాలుగు తిక్క కారెక్టర్లను, గందరగోళ పరిస్థితుల్లో ’గ్రైండ్’ చేసి, పైన కొంచెం మితిమీరిన వెటకారం, వీలు చేసుకొని కూసింత అసభ్యం కూడా జల్లి ప్రేక్షకులకి అందించటమే! అని అనుకునేవారు చూసి నేర్చుకోవాల్సిన చిత్రమిది.

గుల్జార్ కవిగా ఎంతటి విలక్షణత కనబరుస్తారో, ఆయన చిత్రాలు కూడా అంత హుందాగానూ, అందంగానూ ఉంటాయి. ఈ చిత్రంలో ఆయన హాస్యాన్ని పండించిన తీరు అమోఘం. అద్వితీయం. సంజీవ్ కుమార్, దేవెన్ వంటి నటులుండడం ఒకటి. వారి నుండి అంతటి నటనను రాబట్టుకోవటం మరోటి. మొదటిసారి చూసినప్పటి కన్నా, మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు తెలుస్తుంది, ఈ సినిమాను ఎంతటి శ్రద్ధతో తీసారో. ’బారీకియా’ అన్న హింది పదం ఒకటుంటుందే! ’సన్నపని’ అని అనచ్చునేమో తెలుగులో. ఆ ’బారికియా’లపై ఎంత శ్రద్ధగా పనిజేసారో ప్రతి ఫ్రేంలోనూ కనిపిస్తుంది. ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించని చిత్రాల్లో ఉండే ఘనతే అది. చూసిన కొద్దీ కొత్త సంగతులు కనిపిస్తూనే ఉంటాయి. పైగా ఇందులో సంజీవ్, దేవెన్ ముఖకవళికలు ఒకటికి వంద సార్లు చూసి, మస్తిష్కంలో ప్రింట్ చేసేసుకొని, ఎప్పుడుబడితే అప్పుడు రివైండ్ చేసుకునేంత గొప్పవి.

ఇక్కడింకో మాట. నేను చూస్తున్న కొన్ని కొత్త సినిమాల్లో స్క్ర్రీన్ టైంకు విలువివ్వనివి కనిపించాయి. జవాబు వచ్చినా, రాకున్నా ఉన్న రెండున్నర గంటల వ్యవధిలోనూ శక్తివంచన లేకుండా మెదడుకి తోచినదల్లా రాసి, “ఎంథ ఖష్టపడ్డానో” అని ధీర్ఘాలు తీసే విద్యార్థులకూ వీళ్ళకి అట్టే తేడా ఉండదు. ఇలా చేయటం వల్ల తాము తీస్తున్న చిత్రంపై, చూడబోయే ప్రేక్షకులపై ఎంతటి అశ్రద్ధ, అగౌరవం కలవో చెప్పకనే చెబుతుంటారు.

ఒక కథను రాసేటప్పుడు, ప్రతి వాక్యం రెంటిలో ఒక పనిజేయాలి. ౧) కథకు ముందుకు నడపడం. ౨) పాత్రల స్వభావాన్ని తెలియపర్చటం. దీన్ని సినిమాలకు అన్వయించుకుంటే ప్రతి సన్నివేశం కథాగమనానికో, కథను ప్రేక్షకునికి మరింత దగ్గర చేయడానికో పనికిరావాలి. ఈ సినిమాలో ఒక సీన్ చెప్తాను. లోకల్ ఆశోక్ కుమార్ హారం చేయించడానికి కంసాలి దగ్గరకు వెళ్ళినప్పుడు, మాటమాటల్లో కంసాలి అసిస్టెంట్ ఇతడిని బాగా ఆటపట్టిస్తాడు, ఉర్దూలో. ఇతడూ దీటైన సమాధానం చెప్తాడు. ఇది చూస్తున్నప్పుడు ప్రేక్షకునికి పెద్దగా పట్టకపోవచ్చు, ఏవో సరదా మాటలని. కొంత కథ నడిచాక, అదే అసిస్టెంట్ లోకల్‍ అనుకొని నాన్-లోకల్ ఆశోక్‍కు హారం అప్పజెప్పబోయినప్పుడు ’ఉర్దూ’ భాష కలిగించే ఇబ్బంది చూస్తున్నప్పుడుగానీ, ముందు చెప్పిన సీన్ ప్రాముఖ్యత తెలిసిరాదు. ఓ ఒక్క మాటగానీ, సీన్‍గానీ, నటుల హావభావం గానీ కథకు పనికిరానిదంటూ లేకుండా జాగ్రత్త పడ్డారు.

సినిమాలో మూడే పాటలు. రెంటిలో సునితమైన హాస్యం, కమ్మని సాహిత్యం ఉంటాయి. మూడో పాటైన “ప్రీతం ఆన్ మిలో” అన్నది ఒంటరిగా చూడాల్సిన పాట కాదు. నో, నాట్ హారర్. ఒన్లీ లాఫ్టర్. ఇయర్ ఫోన్ల పుణ్యమా అని పాట ఎవరికీ వినపించకుండా సైలెంటుగా మనకే చేరినా, మన నోర్లకి సైలెన్సర్లు లేవే?! “పబ్లిక్ లాఫింగ్ ప్లేసెస్” కూడా లేవుగా. అందుకని ఒంటరిగా చూడకూడదు. కొన్ని డైలాగులు చాలా నవ్వుతెప్పించేవి అయినా, దాదాపు ప్రతి డైలాగూ హాస్యస్ఫోరకంగానే ఉంటుంది.

సంగీతం: ఆర్డి బర్మన్. అబ్బా, ఏం చెప్తాం వీళ్ళ గురించి? ఇహ చెప్పలేకే కదా, అభిమానులు “ది బాస్” అని ఫిక్స్ అయ్యారు. ఈయన నేపధ్య సంగీత విన్యాసాలు విని తరించవలసిందే. పరస్త్రీ తనలో దాచిపెట్టిన తాళంచెవిని బయటకు తీయడానికి ఇద్దరు తల్లకిందులైపోతున్నప్పుడు, అన్నీ మరచి, నేపథ్య సంగీతం వినాలనిపించేంతగా ఉండడం, బాస్‍లకు మాత్రమే సాధ్యం.

అసభ్యం, అసమంజసం లేకుండా నీట్‍గా కామెడిని పండించారు. నటులతో అతి చేయించలేదు, ఎక్కడా! మలుపులు ఎక్కువుగా ఉన్నాయనిపించినా, అవి పట్టిబలవంతాన తెచ్చినవి కాదు. కథానుగుణంగా సాగేవి. సున్నితమైన హాస్యం నుండి కడుపుబ్బ నవ్వించగల సినిమా. పెదాలపై చిర్నవ్వు మాయమవుదు, ఓ క్షణం కూడా! అన్నింటికన్నా మించి, తన ఆరాధ్యునికి ఓ భక్తుడు భక్తిశ్రద్ధలతో, తనకున్నంత దానిలో నిష్టగా పెట్టుకున్న నైవేద్యం, ఈ ’అంగూర్.’ తీయతీయగా, పుల్లపుల్లగా ఉండే ఈ ద్రాక్షలు రుచికరమైన ప్రసాదం.

నిజమే. ఢబ్బై, ఎనభై దశకాల్లో వచ్చిన అపురూప చిత్రాల పేర్లు కూడా తెలీకపోవటం, నేరమూ, ఘోరమూనూ! నాబోటి సినిమాజ్ఞానులకు ఇంతటి మంచి చిత్రాలను చూపించిన నా ఫ్రెండుకు స్పెషల్ థాంక్స్! నవ్వుకుంటూ నిద్రలోకి జారుకోవడం కూడా ఓ గొప్ప అనుభూతి కదా!

(చివర్న, చావు కబురు చల్లగా. ఇదే చిత్రాన్ని షారుఖ్-కరినా-తుషార్ కపూర్ త్రయంతో రిమేక్ చేస్తున్నారట.)

-పూర్ణిమ తమ్మిరెడ్డి

3 Comments
  1. శారద November 23, 2011 /
  2. jd- November 23, 2011 /