Menu

సినిమా పోస్టర్

అద్భుతమైన ఒక సినిమా పోస్టర్ ముందు, అది మురుక్కాలవ పక్కనే ఉన్నా సరే, గంటల తరబడి నిలబడి చూసినా జ్ఞాపకాలు అందరికీ ఉంటాయేమో!

సినిమా బయటికి వచ్చాక ,మనకు కనపడేది తెరమీది నటులే తప్ప తెరెవెనుక కళాకారులు కాదు. నిజానికి సినిమాను ప్రేక్షకుల వద్దకు ముందుగా చేర్చి, ఆ సినిమా గురించి ఒక ఊహను,మనో చిత్రణను ఏర్పరిచేది సినిమా పోస్టరే! పోస్టరే లేకపోతే ఎంత గొప్ప సినిమా తీరైనా రీతిమారిపోవాల్సిందేగా!

అలాంటి సినిమా పోస్టర్ తయారీ గురించి, పోస్టర్ రూపంలో సినిమా ప్రేక్షకుడి వద్దకు చేరడానికి జీవితంలో సింహ భాగాన్ని వెచ్చించిన పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ చిత్రించిన రంగుల కేన్వాస్ ఇది.

ఈ పుస్తకం ఒక ఆణిముత్యం నిజంగా! పాత తరం సినిమా కళాకారులంతా వారి వారి రంగాల్లోని విశేషాలతో ఇలాంటి పుస్తకాలు తప్పక వేయాలి. కొన్నాళ్ళయ్యాక, ఈ పాత తరం వారి కృషి ఇవాళ్టి సినిమాకు ఎలాంటి పునాది వేసిందో తెలుసుకోవాలంటే, వాళ్ల కృషి ని సచిత్రంగా చూడాలంటే ఇలాంటి పుస్తకాలు తప్పక రావాలి. ఈ పుస్తకం పది కాలాలపాటు భద్రంగా దాచుకోవలసిన పుస్తకాల కోవలోకి చేరుతుంది. కళ్ళకు విందు చేసే అబ్బురపరిచే వర్ణ చిత్రాలు. పోస్టర్ లోంచి అభిమాన హీరోలు , హీరోయిన్లు బయటికి నడిచి వస్తారేమో అన్నంతగా జీవకళ ఉట్టిపడే సమ్మోహన చిత్రాలు.కళాభిమానులు తప్పక దాచుకొవలసిన చిత్రాలు! అందుకే ఈ పుస్తకం నా లైబ్రరీలో చేరింది.

పాల కొల్లులో దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఒకరిగా మొదలైన తన జీవిత చిత్రణకు ఈశ్వర్ ఈ పుస్తకంలో ప్రాముఖ్యత తక్కువే ఇచ్చి,తన వృత్తి జీవితానికి, తనతో పాటు పని చేసిన కళాకారుల కళకు, ఒడిదుడుకులకు,మెలకువలకు, సినిమా నిర్మాణంలో పబ్లిసిటీ పాత్రను వివరిస్తూ, నిర్మాతలతోనూ,దర్శకులతోనూ మధ్య మధ్యలో తన అనుభవాలను నెమరేసుకుంటూ సమగ్రంగా తయారు చేశారు.

అంతే కాదు, డ్రాయింగ్ లో రక రకాల పద్ధతులు , రీతుల గురించి,(క్రోక్విల్ పెయింటింగ్, చార్ కోల్ స్కెచ్,వాష్ డ్రాయింగ్,పాచ్ వర్క్ పైంటింగ్స్), అలాగే పాత్రల రూపకల్పన కోసం వేసిన స్కెచ్ లు (ఉదాహరణకు విగ్గుల తయారీ కోసం ఒక కథానాయుకుడిని రక రకాల హెయిర్ స్టైల్స్ లో ఊహిస్తూ చిత్రాలు వేయడం) ఫైనల్ గా నాలుగైదు స్కెచ్ లు వేసి నిర్మాత, దర్శకులతో ఒకటి నిర్థారించడం ఇవన్నీ ఈశ్వర్ చాలా శ్రద్ధగా వివరిస్తారు. మనకూ బాలీవుడ్ కీ, హాలీ వుడ్ కీ పబ్లిసిటీ పద్ధతుల్లో తేడాలు, సినిమా థీమ్ నిబట్టి పోస్టర్ ప్రిపేర్ చేయడం,టెక్నాలజీకి అనుగుణంగా పోస్టర్ల తయారీలో వచ్చిన మార్పులు ఇవన్నీ చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్త పబ్లిసిటీ ఆర్టిస్టుల పరిచయాలు,దేశవ్యాప్తంగా ప్రసిద్ధ సినిమాల పబ్లిసిటీ కథలు,……. ఇలా పుస్తకమంతా ఆపకుండా చదివేలా ఉంది.

ప్రతి కళా రంగమూ కంప్యూటర్ కి అనుసంధానమై పోయిన ఈ రోజుల్లో ఇలాంటి పుస్తకం ఆవశ్యకత తప్పకుండా ఉంటుంది. గత చరిత్ర వైభవాలను తెలుసుకోవడం, దాన్నుంచి పాఠాలు నేర్చుకోడం ఎంత గొప్ప ఆర్టిస్టుకైనా అవసరమే! ఇలా తమ వృత్తి జీవితాన్ని గ్రంథస్థం చేయకపోతే వారి సృజనాత్మక కృషి, వారి అనుభవాలు, వారు నేర్చుకున్న పాఠాలు వారితోనే అంతమై పోతాయి. ఇలా పుస్తకాలు రాకపోతే ఈ తరం కళాకారులకు కొన్నాళ్ళయ్యాక తమకు తెలిసిందే బ్రహ్మ విద్య అనే అభిప్రాయం ఏర్పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి పుస్తకాలు కేవలం పబ్లిసిటీ రంగంలోనే కాక ఎడిటింగ్,ప్రొడక్షన్ మేనేజ్ మెంట్,ఫొటోగ్రఫీ వంటి రంగాల్లో కూడా రావాలి.

నా చిన్నప్పటి నుంచీ సినిమా తెర మీద పబ్లిసిటీ_ ఈశ్వర్ అనో గంగాధర్ అనో చూడ్డం గుర్తు. ఎడిటింగ్ అంటే గౌతం రాజు పేరు తప్ప మరోటి గుర్తుకు రాదు.

ప్రతిదీ మాన్యువల్ గా డ్రాయింగ్ గీసుకుని, పోస్టర్లు తయారు చేయడానికి అవధులు లేని సృజనాత్మకత కావాలి. ఎంతో దీక్ష,శ్రద్ధ,పట్టుదల ఉండాలి. పని ఒత్తిడిని తట్టుకునే స్ట్రెస్ మేనేజ్ మెంట్ తెలియాలి.పది మంది ఆర్టిస్టుల చేత సినిమా కళను కేవలం టెక్నికల్ గా కా దాన్నొక కళగా గుర్తింప జేయాలి. అప్పుడే అద్భుతమైన పోస్టర్లు జీవకళ ఉట్టిపడుతూ తయారవుతాయి. ఈ దిశలో అకుంఠిత దీక్షతో, ఇష్టంతో పని చేసి చరిత్రలో నిల్చిన కళాకారుడు ఈశ్వర్.

ఈ పుస్తకంలో అందమైన చిత్రాలు అనేకం చోటు చేసుకున్నాయి. అందువల్ల ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద పుస్తకం ముద్రించాల్సి వచ్చింది. ఫలితంగా ఖరీదు కూడా ఎక్కువగానే నిర్ణయించాల్సి రావడం అర్థం చేసుకోదగ్గ విషయం! నిజానికి మొదట ఇంకా ఎక్కువ ధరను నిర్ణయించి, తర్వాత ఎక్కువ మంది పాఠకులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో సగం ధరను తగ్గించారట.

35 ఏళ్ళ పాటు పబ్లిసిటీరంగంలో విశ్రాంతనేది లేకుండా పనిచేసిన ఈశ్వర్ ఆ బిజీ బిజీ జీవితంలో తను వేసిన స్కెచ్ లను, పోస్టర్లను దాచుకోవాలనే దృష్టితో ఎప్పుడూ లేరు. ఈ పుస్తకం రాయాలని సంకల్పించాక ఆయన స్కెచ్లు, డ్రాయింగ్, పోస్టర్లను దాచిన అభిమానులు,శిష్యులు,మిత్రులు ఆయనకు వాటిని ఇచ్చారట.

ఇదంతా పక్కన పెడితే ఈ పుస్తకంలో నాలుగో వంతు ఆక్రమించిన వర్ణ చిత్రాలు ఈ పుస్తకానికి ప్రాణం. నేనసలు అవి చూసే, వాటిని దాచుకోవాలని ఈ పుస్తకం కొన్నాను.

ఒకటో తారీకు నుంచి నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ప్రారంభం కాబోయే బుక్ ఫేర్ లో ఈ పుస్తకం తప్పక లభ్యమవుతుంది. కొని దాచుకోండి.

అద్భుతమైన క్వాలిటీతో విజయా పబ్లికేషన్స్ ఒక్క అచ్చు తప్పు కూడా లేకుండా ( ఈ విషయంలో నాకు పట్టింపు చాలా ఎక్కువ. అచ్చు తప్పులుంటే ఆ పుస్తకాన్ని పక్కన పారేయడమే! పంటి కింద రాళ్లలా వాటిని భరిస్తూ చదవలేను)ముద్రించిన ఈ పుస్తకం వెల కేవలం….కేవలం 450 రూపాయలు.! 1000 రూపాయలు ధర నిర్ణయించినా ధరకు తగ్గ విలువ గల పుస్తకం ఇది!.

 

– సుజాత (మనసులో మాట)

 

7 Comments
  1. రమణ మూర్తి November 27, 2011 /
  2. శ్రీనివాస్ పప్పు November 28, 2011 /
  3. ఆ.సౌమ్య November 28, 2011 /
  4. వేణు November 28, 2011 /
  5. ravikishore pemmaraju December 7, 2011 /
  6. Christy December 15, 2011 /