Menu

పరమసిల్లీ కథనంతో ‘ఊసరవెల్లి’

సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా  పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు.

కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని బ్రతికే టోనీ(ఎన్.టి.ఆర్) తండ్రి చనిపోతూ ‘ఏదైనా ఒక మంచిపనైనా చెయ్యరా! లేకపోతే నాలాగే ఒక గుర్తుపెట్టుకోతగ్గ క్షణంకూడా లేకుండానే నీ జీవితమూ ముగుసిపోతుంది’ అంటే ఏంచేద్దామా అని సరదాగా ఒక ఫైట్ చేస్తుంటే, ప్రతీకారేచ్చతో రగులుతున్న నిహారిక (తమన్నా) టోనీని చూసి తన ప్రతీకారం తీర్చుకునే ఆయుధంగా ఎన్నుకుంటుంది. నిహారిక చెప్పిన పని సాధించడానికి టోనీ ఏంఏంచేశాడు? నిహారిక ప్రతీకారకాంక్షకు కారణం ఏమిటి? పరిస్థితుల ప్రభావం వల్ల నిహారికే అతని పనులకు ఎలా అడ్డుతగిలింది? గన్నూ బుల్లెట్టుల్లా మొదలైన వాళ్ళిద్దరి బంధం ప్రేమగా ఎలా మారింది? చివరికి ఏమయ్యింది? అనేది కథ.

పైన చెప్పిన కథ వెతికిపట్టుకోవడానికి సినిమా తరువాత నాకు మరో అరగంటపట్టింది. అదే సినిమాలో ఉన్న అసలు సమస్య. నిజానికి సినిమాచూసేసిన నూటికి యాభైమంది ప్రేక్షకులు నేను చెప్పిన కథవిని “ఓహో నీకు అలా అర్థమయిందా” అని జాలిగా చూసినా ఆశ్చర్యం లేదు.

సినిమా ప్రధమార్థంలో హీరో, హీరోయిన్ ప్రేమ కోసం పచ్చిమోసగాడిలా ప్రవర్తిస్తూ, కామెడియన్ల దగ్గర నంగివెధవలా బిహేవ్ చేస్తూ కొంత అర్థంకాని ప్రేమని, అపహాస్యమయ్యే హాస్యాన్నీ పండిస్తాడు. ఆతరువాత హఠాత్తుగ్గా డాన్ లను మించిన డాన్ లాగా యాక్షన్ సీక్వెన్స్ కానిచ్చేసి సినిమాకీ ప్రేక్షకులకీ ట్విస్ట్ ఇస్తాడు. “ఓహో, హీరోకి ఏదో మహత్తరమైన మోటివేషన్ ఉంది విలన్లని వేసెయ్యడానికి” అనుకునే తరుణంలో, “అబ్బే ఇది హీరో కథ కాదు. హీరోయిన్ కథ” అని హీరో నోటితో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిస్తారు. అప్పటికే చాలాసేపు బోర్ కొట్టేశారు కాబట్టి క్లైమాక్స్ ఫైట్ తో సినిమా ముగించి ప్రేక్షకుడికి “టాటా బైబై”చెప్పేస్తారు. ఇంత సిల్లీ ప్రహసనంలో చివరాఖరికి పేకలో జోకరయ్యేది మాత్రం అప్పటికే ప్యాకైపోయిన ప్రేక్షకుడు.

ఎన్.టి.ఆర్ నటనలో చెప్పుకోవడానికి ఏమీలేదు. మనిషిలో కళమాయమై ఏదో జబ్బుచేసినవాడిలాగా చాలా సీన్లలో కనిపిస్తాడు. కనీసం పెదాల డ్రైనెస్ ని కూడా కప్పిపుచ్చలేకుండా మేకప్ ఎలా వేశారో, షాట్లు ఎలా తీశారో ఏమిటో! తమన్నా కొన్ని దృశ్యాలలో ఆకట్టుకుంటుంది. నృత్యాలలో కూడా ఎన్.టి.ఆర్ కన్నా మెరుగ్గానే కనిపించింది. హీరోయిన్ ఫ్రెండ్ గా పాయల్ ఘోష్ ఒక ప్రముఖపాత్రలో నటించింది. ఫరవాలేదు. ప్రకాష్ రాజ్ కు ఇది రొటీన్ పాత్ర. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ నటన అంటే జయప్రకాష్ రెడ్డి, రఘుబాబులది అని చెప్పుకోవచ్చు.

వక్కంతం వంశీ అందించిన ఈ కథకి వెంజెన్స్, దీపావళి సినిమాలు ఆధారం అయినప్పటికీ అది చెబితే ఆ సినిమాలని అవమానించడమే అవుతుంది కాబట్టి చెప్పడం లేదు. సంభాషణలు అక్కడక్కడా చమక్కుమన్నా, మరీ అంత చెప్పుకోదగ్గవి మాత్రం కావు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కొంత మెలొడీప్రధానంగా మరి కొంత గోలగానూ ఉంది. రసూల్ ఎల్లోర్ సినెమాటోగ్రఫీ బాగుంది.

దర్శకుడు సురేందర్ రెడ్డి తన సోకాల్డ్ స్టైలైజ్డ్ టేకింగ్ (వాటెవర్ ఇటీజ్) మీదకన్నా కథ ఎలా చెప్పాలి అనేవిషయంలో కొంత శ్రద్ధచూపితే బెటర్.

హీరో పాత్రలో మారే రంగులమాటేమిటోగానీ, సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు తెల్లముఖాలు వెయ్యాల్సిన పరిస్థితి మాత్రం గ్యారంటీ. అటూఇటూగా ఊసరవెల్లి పేరుతో ఒక పరమసిల్లీ కథతో వచ్చిన సినిమా ఇది. సో…వాచ్ ఇట్, అట్ యువర్ ఓన్ రిస్క్.

25 Comments
 1. SHAFI October 9, 2011 / Reply
  • umec October 21, 2011 / Reply
 2. krshany October 9, 2011 / Reply
 3. krshany October 9, 2011 / Reply
 4. madhu October 10, 2011 / Reply
  • umec October 21, 2011 / Reply
 5. Aravind October 11, 2011 / Reply
 6. ఆ.సౌమ్య October 11, 2011 / Reply
 7. unknown October 12, 2011 / Reply
 8. kish October 12, 2011 / Reply
   • రమణ మూర్తి October 12, 2011 /
   • rahul October 17, 2011 /
   • అబ్రకదబ్ర October 19, 2011 /
   • శుభకరుడు October 28, 2011 /
   • చదువరి October 28, 2011 /
 9. sasank October 14, 2011 / Reply
 10. lally October 14, 2011 / Reply
 11. Kiran October 14, 2011 / Reply
 12. అబ్రకదబ్ర October 21, 2011 / Reply
 13. umec October 21, 2011 / Reply
 14. పుల్లారావు November 11, 2011 / Reply
 15. Vammo November 18, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *