Menu

మైనే గాంధీ కొ నహీ మారా

ఈ సినిమా ౨౦౦౫లొ వచ్చినప్పుడు, చూడాలి చూడాలి అనుకున్నా కూడా, ఇప్పటికి చూసాను. అద్భుతమైన సినిమా. అర్రే! దీన్నా నేను మిస్సయింది! అనిపించింది. అందుకే, ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం –

కథ: ఇది హిందీ సాహిత్యం లో ఆచార్యులుగా పనిచేసి విశ్రమిస్తున్న ఉత్తమ్ చౌదరి అన్న వ్యక్తి కథ, అతని కుటుంబం కథానూ. ఆయనకి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ, మొదట డిమెంషియా అనీ, తర్వాతా అల్జీమర్స్ అనీ….ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా, ఉన్నట్లుండి, ఆయన ఎందుకో గానీ, “నేను కావాలని గాంధీని చంపలేదు. పొరపాటన జరిగిపోయింది. నన్ను నమ్మండి” అంటూ ప్రాధేయపడ్డం మొదలుపెడతాడు. అసలు ఏం జరుగుతోంది? ఆయన పరిస్థితికి కుటుంబం ఎలా స్పందించింది? మధ్యలో గాంధీ ఎక్కడనుంచి వచ్చాడు? – టూకీగా ఇదీ కథ. ఇదంతా మీరు సినిమాలో చూడండి. సినిమా యూట్యూబ్లో లభ్యం.

నటీనటులు: అనుపం ఖేర్ జీవించేసాడు అనడం కూడా చిన్నమాటేనేమో!! ఇలాంటి వాళ్ళు ఉండగా మన సినిమాలకెం తక్కువ? అద్భుతమైనవి తీయొచ్చు అనిపించింది. అలాగే, తండ్రి వ్యాధికి, తన ప్రేమకి, ఇతర కుటుంబసభ్యుల స్పందనకి మధ్య నలిగిన కూతురుగా ఊర్మిళ అద్భుతంగా చేసింది. మిగితా వాళ్ళందరూ కూడా ఆ పాత్రల్లో బాగా ఇమిడిపోయారు.
కథనం: ఈ సినిమా కథా పరంగా నాకు చాలా నచ్చింది. ఇక, కథను చెప్పిన తీరు, నటీనటుల ప్రదర్శన, సంభాషణలు, నేపథ్య సంగీతం – అన్నీ చక్కగా కుదిరి, మంచి సినిమాని ఇచ్చాయి. నాకు ప్రత్యేకం గుర్తుండిపోయిన దృశ్యాలు –

౧) ఊర్మిళ, ఆమె ప్రేమించిన అతని తల్లిదండ్రులని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆసమయంలో ఆమె తండ్రి విపరీత మానసిక ప్రవర్తన వల్ల ఆ సంబంధం చెడుతుంది. సినిమాటిక్ గా ఆలోచిస్తే, నెక్స్ట్ సీన్లో ఊర్మిళ ఓపిగ్గా నాన్న ని అర్థం చేసేస్కుని, నిట్టూర్చి, కంటిన్యూ అయిపోవాలి. కానీ, ఇక్కడ కాస్త వాస్తవికంగా, ఊర్మిళ తన తండ్రిపై విరుచుకుపడుతుంది. ఫ్రస్త్రేట్ అవుతుంది. కాసేపటికి మళ్ళీ తండ్రి పరిస్థితి అర్థం అవుతుంది. వెళ్తుంది, తండ్రి చేయి పట్టుకుని ఏడుస్తుంది. ఇలాంటి దృశ్యాలు సినిమాలో కోకొల్లలు. నా ఉద్దేశ్యంలో, ఇవన్నీ చాలా వాస్తవికంగా తీసినట్లు అనిపించింది.

౨) చివర్లో ఒక కోర్టు సీనులో అనుపం ఖేర్ ఇచ్చే ఉపన్యాసం వింటూ ఉంటే, నాకేమిటో గానీ, ఉన్నట్లుండి హోవార్డ్ రోర్క్ గుర్తొచ్చాడు. ఒక కోణంలో ఆలోచిస్తే, ఇది ఒక మానసిక సమస్య గురించిన సినిమా అనే అనుకున్నా కూడా, ఈ భాగం తరువాత, సినిమాలో ‘ప్రస్తుత సమాజంలో గాంధీ అంటే ఏమిటి’ అన్న ఆలోచనపై సాగిన ఒక కామెంటరీ లా కూడా తోచింది.

౩) ఒక దృశ్యంలో అనుపంఖేర్ చిన్నకొడుకు తండ్రిని ఏదన్నా మానసిక చికిత్సాలయంలో పెడదాం అంటాడు. ఊర్మిళకి పిచ్చి కోపం వస్తుంది. ఈ చర్చ సాగుతూ ఉండగా, పెద్ద కొడుకు (రజిత్ కపూర్)  ఆమెతో అంటాడు – “మన అందరికీ నాన్న అంటే చాలా ఇష్టం. అది మర్చిపోకు” అని. ఆ సంభాషణ నాకు చాలా నచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనుషుల మధ్య జరిగే మానసిక సంఘర్షణను ఈ సినిమాలో బాగా చిత్రీకరించారు అని నేను అనుకున్న దృశ్యాల్లో ఇదీ ఒకటి.

౪) అలాగే, సినిమాటిక్ గా ఆలోచిస్తే, మనకి బ్లాక్ అండ్ వైట్లో రెండే రకాల పాత్రలు ఉంటాయి. పరమ సహనశీలులు, పరమ అసహనశీలులు. మొదటి వాళ్ళు అన్నీ భరిస్తారు, రెండోవాళ్ళు ఏదీ భరించరు. కానీ, ఈ సినిమాలో అనేకచోట్ల అన్ని పాత్రల్లోనూ అన్ని భావోద్వేగాలూ కనిపిస్తాయి. చిన్నకొడుకు నాన్నని ఆసుపత్రిలో పెడదాం అన్నంత మాత్రాన వాడు క్రిమినల్ అయిపోడు. పెద్దవాడు తండ్రి ఈ పరిస్థితుల్లో ఉండగా అమెరికాలో స్థిర పడినంత మాత్రాన వాడు హృదయం లేని మనిషి అయిపోడు. ప్రతి పాత్ర ప్రవర్తనకీ ఏదో ఒకచోట మరొక పాత్ర ఒక జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. ఇలా మాములు మనుషుల్ని (మహానుభావుల్ని కాక!) ప్రధాన పాత్రలుగా చూపడం నాకు చాలా నచ్చింది.

౫) ఇలాంటి వ్యాధులు ఉండే కుటుంబాలలో దీని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారతాయి? ఒక్కొక్కరి స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళ మధ్య ఉండే డైనమిక్స్, డాక్టర్ల సలహాలు, ఇదంతా : ఒక మామూలు ప్రేక్షకుడికి కనీస అవగాహన కల్పించడంలో సఫలం అయ్యారు అనే అనుకుంటున్నాను (నాకున్న హైపర్ ఇమాజినేషన్ వల్ల నాకు ఈ భావన కలిగి ఉండవచ్చు, అది వేరే విషయం!)

౬) ఈ సినిమా సంగీతం బప్పీలహరి అని ఒక రివ్యూలో చదివి ఆశ్చర్య పడ్డాను. ఇంత కంట్రోల్డ్ గా కూడా అతను ఇవ్వగలడా!!! అనుకుని తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది.

మొత్తానికి, చూసాక, ఈ మానసిక సమస్యల గురించి, వాటిని హ్యాండిల్ చేసే పధ్ధతి గురించి, డాక్టర్ల పాత్ర గురించి, కుటుంబ సభ్యుల సమస్యలను గురించి ఆలోచనలో పడేసింది ఈ సినిమా.

ఒక్క సందేహం మిగిలింది: సినిమా ఆద్యంతమూ “హిమ్మత్ కర్నే వాలో కో కభీ హార్ నహీ హోతీ” అన్న కవిత చాలాసార్లు వస్తుంది. కథ ప్రకారం ఈ కవిత రాసింది నిరాలా గారు (సూర్యకాంత త్రిపాఠి ‘నిరాలా’). కానీ, గూగుల్ సర్చ్ చేస్తే, అందరూ హరివంశ్ రాయ్ బచ్చన్ అంటున్నారు. ఏమిటో, ఇదొక్కటి మాత్రం అలా సందేహంగా మిగిలిపోయింది.

ఈ సినిమా ఇప్పటికింకా చూడలేదు అంటే తప్పకుండా చూడండి.

 

సినిమా వివరాలు:
Maine Gandhi ko Nahi Maara
Cast: Anupam Kher, Urmila, Praveen Dabas, Rajit Kapur
Director: Jahnu Barua
Producer: Anupam Kher

 

2 Comments
  1. శారద October 5, 2011 /