Menu

కామెడీ డ్రామా! – పిల్ల జమీందార్

తారాగణం:
నాని, బిందుమాధవి
హరిప్రియ, మేఘనానాయుడు
రావురమేష్, ‘వెనె్నల’ కిషోర్
ఎమ్మెస్ నారాయణ తదితరులు.
—-
సినిమాటోగ్రఫీ: సాయ శ్రీరామ్
సంగీతం: సెల్వగణేష్
నిర్మాణం: సిరి శైలేంద్ర సినిమాస్
నిర్మాత: మాస్టర్ బుజ్జిబాబు
దర్శకత్వం: జి.అశోక్
—-
‘క్యారెక్టర్స్‌లోని ట్రాన్స్‌ఫర్మేషన్ మంచి నాటకానికుండాల్సిన ప్రధాన లక్షణం’ అని షేక్‌స్పియర్ అన్నారు. అందుకే నాటకాలలో ఈనియమాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఆ మేరకే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసేవారు. నాటకానికి తర్వాతి తరం ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమాలో కూడా ఈ సూత్రాన్ని మొదట్లో సీరియస్‌గానే పాటించారు. పాతతరం బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో ఈ ‘పాత్రల రూపాంతరతా నియమాలు’ చక్కగా ఒదిగేది కనుకే, ఆ సినిమాలు ఈ నాటికీ అందరినీ అలరించగలుగుతున్నాయి. అయితే కాలక్రమంలో మన తెలుగు సినీదర్శకులు, హీరోలు ఈ సూత్రాన్ని వెనక్కి నెట్టారు. అందుకే హీరో క్యారెక్టర్ ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో’ అన్నట్లుగా ప్రవర్తిస్తుంది తప్ప హీరో స్వభావం తాలూకు డైమన్షన్ పరిధిలో ఒదగదు. సినిమా క్యారెక్టర్ల నిర్మాణ శైలిలో కొట్టొచ్చినట్టు కనిపించే ఈ లోపాన్ని, ఎక్కడా పొడసూపనీయకుండా ‘క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్’ నియమాన్ని చక్కని వినోదంతో…కొంత సందేశంతో అందించిన సినిమా- ‘పిల్ల జమీందార్’!
టైటిల్లో పాత వాసనలతో థియేటర్లకు వెళ్దామనుకున్న ప్రేక్షకులకి ఒకింత వెనక్కి లాగే ఈ సినిమా హాల్లోకి వెళ్లి కూర్చున్న తర్వాత మాత్రం ‘పైసా వసూల్’ అని మాత్రం అనిపిస్తుంది. అలాగే, ‘అలా మొదలైంది’ తదితర ఎక్స్‌పెక్టేషన్‌తో, నాని మీద నమ్మకంతో వెళ్లిన ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నిరాశపరచదు.
కథలోకి వస్తే..‘పిజే’గా ఫ్రెండ్స్ అందరూ పిల్చుకునే ప్రవీణ్ జయరామరాజు (నాని) నిత్యం పబ్‌లు-డిస్కోలలో విందులు, వినోదాలలో తేలియాడుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే పొగరుబోతు యువకుడు. ఐదు వేల కోట్ల ఆస్తికి వారసుడిననే అహంకారంతో చదువన్నా, మనుషులన్నా లెక్కలేని తెంపరి కుర్రాడు. చనిపోయిన తాతయ్య (నాగినీడు) తన విల్లులో పీజే కొన్ని కండిషన్లు పూర్తి చేస్తేనే ఆస్తిని పీజేకి అందించాలని రాస్తాడు. దాని ప్రకారం ఎక్కడో సిరిపురం ఊళ్లోని ఓ హాస్టల్‌లో వుంటూ అక్కడి మంగమ్మ ప్రభుత్వ కళాశాలలోనే డిగ్రీ పాస్ కావాలనేది ఒక షరతు. కాగా మరో షరతు అక్కడున్న మూడేళ్ల కాలంలో స్టూడెంట్ ఎలక్షన్స్‌లో ప్రెసిడెంట్‌గా గెలవాలనేది రెండో షరతు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తికోసం ఆ గ్రామానికి వెళ్లిన పీజేకి అక్కడ ఎదురైన సంఘటనలేమిటి? బద్ధకస్తుడైన పీజే పరీక్షలు పాస్ అయ్యాడా? అసలు అక్కడ పీజే ఏం సాధించాడు? ఏం పోగొట్టుకున్నాడు? అనేది మిగతా కథ.
ఈ సినిమాలో మొదటగా ప్రస్తావించుకోవాల్సింది ఈ సినిమా దర్శకుడు అశోక్ గురించే. సింపుల్ కథని అంతకంటే సింపుల్‌గా చక్కనైనా సన్నివేశాలతోనూ కడుపుబ్బ నవ్వించే కామెడీతోనూ, మనసునిండా ఫీల్ అయ్యే సన్నివేశాలతోను అల్లుకుని తెరపై ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కాగా ‘పిల్ల జమీందార్’గా టైటిల్ రోల్‌లో చూడచక్కని నటనను కనబరిచి సినిమా సినిమాకు ఎదుగుతున్నానని నిరూపించాడు హీరో నాని. సినిమా ఆరంభంలో పొగరుబోతుగా అహంకారిగా కనిపించే క్యారెక్టర్ కాస్తా క్రమక్రమంగా మరో ‘మనిషి’గా ఎదగడం అనే ప్రాసెస్‌ని తన నటన ద్వారా స్పష్టంగా చూపించిన నాని ఈ సినిమాకి అస్సెట్.
ఈ సినిమాలో మాటల రచయిత చంద్రశేఖర్! తెలుగు సినిమాకు ఆలోచనాసార్ధకమైన డైలాగులు రాసే మరో రచయిత దొరికినట్లే. ‘ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమంటే ఏంటో తెలుస్తుంది’, ‘దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువులను వాడుకోవడానికి సృష్టించాడు’ వంటి డైలాగ్స్ ఆయా సీన్లలో చక్కగా కుదిరాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రకృతి అందాలను, పల్లె సొగసులను ఎంతో ప్లెజంట్‌గా తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ సక్సెస్ అయ్యారు. కృష్ణ చైతన్య పాటలు, సెల్వ గణేష్ సంగీతం ఒకే.‘అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే’ పేరడీ సాంగ్, మేఘనారెడ్డి ఐటెం సాంగ్ ఓ వెరైటీ.
ఇక ఈ సినిమాలో కథను ముందుకు నడిపించడంలో సపోర్టుగా నిలిచిన క్యారెక్టర్లలో రావురమేష్ పాత్ర చక్కగా కుదిరింది. మిలిటరీ రాజన్న, ప్రిన్సిపాల్‌గా ఆయన నటన గుడ్. తెలుగు లెక్చరర్‌గా ‘ఉద్దండం మాస్టార్’ పాత్రలో ఎమ్.ఎస్ నారాయణకు ఓ మంచి పాత్ర దొరికింది. ‘జాతీయం’ పాత్రలో ధనరాజ్, ఇతరులు అందరూ కామెడీని టీమ్‌గా సృష్టించారు. అవసరాల శ్రీనివాస్ నటన ఒకే. హీరోయిన్లు బిందుమాధవి, హరిప్రియ సోసోనే. సినిమా ఫస్ట్ఫా అంతా కామెడీతో నవ్వులు పూయించగా, సెకండాఫ్ గుండెను తట్టే మానవీయ కోణంతో కూడిన సీన్లతో(నాని చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్, ఎమ్మెస్ అనారోగ్యం సీన్, జాతీయం నాన్న మరణం సీన్, అవసరాలకు సర్జరీ సీన్) ఆలోచింపచేస్తుంది. అయితే ఈ సీన్లు సాగదీసినట్టుగా అనిపించి ఒకింత విసుగును కూడా తెప్పిస్తాయి.
అయితే ఈ సినిమా ఆడమ్ సాండ్లర్ హీరోగా 1995లో వచ్చిన ‘బిల్లీ మాడిసన్’ (పిల్ల జమిందార్ టైటిల్ సౌండ్ కూడా అలాగే ఉంది కదూ!) సినిమాకు…అలాగే 2006లో వచ్చన కొరియన్ సినిమా ‘ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’ సినిమాకు ‘ఫ్రీమేక్’గా తెలిసే సరికి మన కొత్తతరం తెలుగు దర్శకుల మీద పెరిగే అభిమానం అంతా తుస్సుమని జారిపోతుంది. అలాగే డైలాగులలో ఎక్కువగా ఎస్సెమ్మెస్ కొటేషన్‌లే! ఇక, ఈ కథలో నేటి కాలపు ‘రెలెవెన్సీ’ మిస్ అయిందనిపిస్తుంది. జమీన్‌లు, జమీందారీలు ఎప్పుడో 1979 నాడే చట్టపరంగా రద్దయిపోయాయి. అలాంటప్పుడు ఇదంతా ‘ఉత్తకథే’ అనిపిస్తుంది. ఏది ఏమైనా భారీ బడ్జెట్‌లు, క్రేజీ కాంబినేషన్స్ ఏవీ లేకుండా కేవలం కథే హీరోగా, కథను నమ్ముకుని వచ్చిన ఈ సినిమా ‘ఫ్రెష్ ఫీలింగ్‌‘నీ కలిగిస్తుంది. వయొలెన్స్, వల్గారిటీకి తావులేకుండా చక్కని సినిమాని చూసిన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌గా చెప్పినట్లు…‘కండిషన్లు వర్తిస్తాయి’!

 

కర్టేసీ: ఆంధ్రభూమి

One Response
  1. శ్రీరామ్ వేలమూరి November 22, 2011 /