Menu

జగ్జీత్ -ఒక అమర గీతం

సరిగ్గా రెండు మూడు వారాల క్రితం.
నిండా పది సంవత్సరాలు లేని ఒక చిన్న కుర్రాడు..

నీలాకాశం లాంటి నీలి కళ్ళు, అమాయకత్వపు చూపులు , చూసిన వారికి ముద్దే కాదు బోలెడెంత ప్రేమ కలిగించే కనిపించే చూపులతనివి.

అతను వచ్చిన ఒక మూరుమూల వెనకపడిన గ్రామానికి ఛిహ్నంలా అనిపిస్తుంది బక్కపలుచని దేహం. అంత బలహీన దేహం నుంచి వెలువడుతున్న స్వరం మనల్ని ఒక సంగీత ప్రపంచంలోకి తీసుకు వెళ్ళి పోయే ఓ హిందీ పాటను ఆలాపిస్తోంది. ఆ పిల్లాడు పాడుతున్న పాట..

తుమ్ నహీ గమ్ నహీ జవాబ్ నహీ , ఐసీ తన్హాయీ కా జవాబ్ నహీ, గాహే గాహే ఇసే పఢా కీజియే దిల్ సే బహెతర్ కోయి కితాబ్ నహీ ( నీవు లేవు బాధ లేదు, మదిర లేదు, అలాంటి ఏకాంతానికి ఎదురే లేదు, మళ్ళీ మళ్ళీ చదవుకుంటే హృదయాన్ని మించిన పుస్తకం లేదు) ..

అతనా పాట పాడుతుంటే రియాలిటీ షో స్టూడియో లో ఉన్న ఈ తరానికి చెందిన నలుగురు స్టార్ సింగర్లు, మహామహులైన టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్తో పాటు స్టూడియోలో ఉన్న ప్రేక్షకులు, టీవీలో చూస్తున్న ప్రేక్షకుల మనసుల మూరు మూలల నుంచి ఒక బాధ, ఒక సుఖ వంతమైన బాధ కన్నీళ్ళ రూపంలో ఉబికి వస్తుంది. చాలా మంది కాసేపు మాటలు రాని నిశ్శబ్దమయ్యారు. . పాట ముగిశాక స్టూడియోలో ఒక సెకను నిశ్శబ్దం, మరు క్షణం సెలబ్రిటీలు సహా అందరి కరతాళ ధ్వనులు, ఇదేమీ రియాలిటీ షో టీ ఆర్ పి కోసం చేసిన విన్యాసం కాదు. అక్కడిక్కడ ఒక పాట చేసిన మాయాజాలం. ఆ పిల్లాడు కనీసం అక్షరాలు కూడా నేర్చుకోవడానికి వీలు లేని పేద ముస్లిం. ఒక జడ్జి అతడిని నీవా పాట ఎలా పాడావురా , ఇంత చిన్న దేహం నుంచి అంత బాధ , అంత సంగీతం ఎలా బయటకు వచ్చింది రా అంటే అతను చెప్పిన సమాధానం నేను వింటూ నేర్చుకున్నాను. అది మనసు నుంచి బయటకు వచ్చిందని చెప్పాడు… అతను విన్నది జగ్జీత్ సింగ్ లాంటి గ్రేట్ సింగర్లను. టెలివిజన్ చానెల్స్ లో మ్యూజికల్ రియాలిటీ షోల్లో ( తెలుగు కావు). ఇదో అపురూప దృశ్యం. మన సంగీత ప్రపంచంలో సదా నిలిచిపోయే చిత్రపటాల్లాంటి సీన్లు చాలా సార్లు చాల బాలగంధర్వులు గజల్స్ పాడినపుడల్లా సృష్టిస్తూనే ఉంటారు. ఆ పిల్లాడికే కాదు బోలెడు మంది బాల గంధర్వులకు ఒక ఇన్ స్పిరేషన్ , నిశ్శబ్ద మార్గదర్శకుడు జగ్జీత్ సింగ్( 70) ఇక లేరు….. అనేది పాక్షిత సత్యం. అసలు సంగీత సత్యం ఏమిటంటే అతని గజల్ లోని లైన్ లానే అతని పాట కూడా పదే పదే పాడుకుంటూ చదువుకోవాలనిపించే పుస్తకమే. ఒక్కడి పాట , ఒక్కడి స్వరం ఎందరో సంగీత ప్రపంచాలను పరిపుష్టం చేసింది.ఎందరి ఏకాంత ప్రపంచాలకు, ఒంటరి తనాలకు ఒక తోడు అయింది.
———- —- —-
మర్హంపట్టీ
జగ్జీత్ సింగ్ పంజాబీ .. అతను ప్రపంచ ప్రసిద్ధ గజల్ గాయకుడు. అతని భార్య చిత్రా సింగ్ కూడా అతని లానే మంచి గజల్ గాయని. ఒకసారి పెళ్ళయి విడాకులు తీసుకున్న ఆమెను జగ్ జీత్ సింగ్ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ గొంతులు కలిపారు. ఒక సుస్వర గజల్ ప్రపంచాన్ని మన ముందు పరిచారు. గజల్ నిజానికి సాహిత్య ప్రక్రియ.దానిని సంగీతం ప్రక్రియగా మార్చినపుడు అందులో గాయకుడి ప్రతిభతోనే అది వన్నెకెక్కుతుంది. కానీ గజల్ అంటే ఒక సాహిత్యప్రక్రియ అని తెలియకుండానే జగ్జీత్ సింగ్ పాడే పాటలను గజల్స్ అంటారని అలాంటి గజల్స్ ను ఇతరులు కూడా పాడుతుంటారనేది పాపులర్ అభిప్రాయమైందటే అది జగ్జీత్ స్వర మాయే. లేట్ సెవంటీస్ లో వచ్చిన కొన్ని అర్ధవంతమైన హిందీ సినిమాల్లో గజల్స్ పాడటం ద్వారా జగ్జీత్ పాపులర్ సంగీత ప్రపంచానికి దగ్గర అయ్యారు. హోటోం పే ఛూలో తుమ్ మేరి గీత్ అమర్ కర్ దో ( ప్రేమ్ గీత్ సినిమా ) నుంచి మొదలు పడితే రెండు వేల సంవత్సరంలో వచ్చిన తుమ్ బిన్ కోయి ఫర్యాద్ . జాన్ బాకీ హై సాంస్ ధబీ హో జైసే ( ప్రాణం ఉంది కానీ శ్వాస నిలిచిపోయినట్లు గా ఉంది) తుమ్ ఇత్ నా ముస్కురారే హో, యే తేర ఘర్ యే మేర ఘర్ లాంటి సినిమా గజళ్ళ నుంచి తుమ్ నహి గమ్ నహి వంటి సినిమా ఏతర గజళ్లు జగ్జీత్ స్వర ఖజానాలో బోలెడు. తుమ్ నహి గమ్ నహి గజల్ ట్యూన్ నే తెలుగు సినిమా మంచు పల్లకిలో మేఘమా దేహమా పాటగా స్వరపరిచారు. గులాం అలీ, మెహది అసన్ లాంటి పాకిస్తానీ సింగర్లు మాత్రమే పట్టు సాధించిన గజల్ గాన ప్రపంచంలో అతనో అచ్చమైన భారతీయ ముద్ర. అతని అడుగు జాడల్లోనే పంకజ్ ఉదాస్, తలత్ అజీజ్ లాంటి సింగర్లు మనకు మొదలయ్యారు. గుల్జార్, వాజ్ పేయి లాంటి వారి కవిత్వానికి స్వరరూపం ఇవ్వాలంటే అతనే దిక్కు. అతనే దిక్సూచి.. శాంతి,మనసుకు స్వాంతన కరువైనపుడు .. అతని పాటను ఆన్ చేసుకుంటే కలిగేది కాదు ప్రపంచం నుంచి శాంతి లభిస్తుంది. కానీ అతని జీవితానికి శాంతి కరువైంది. ఒక్క గానొక్క కొడుకు వివేక్ సింగ్ యవ్వన ప్రాయంలోనే హఠాన్మరణం చెందాక ఆయన గొంతు మూగవోయింది. పాటలు గజల్స్ దాదాపుగా పాడటం మానేశారు. అతని గుండె గాయం మానలేదు కానీ ఎన్నో గుండెల గాయాలకు అతని గజల్ మర్హంపట్టీ.
…………………………..

జ్ఞాపకాలంటే కొందరు పాత ఫొటోలు చూస్తారు. కొందరు డైరీలో పాతపేజీలు తిరగేస్తారు. చదివిన పుస్తకాలని, విన్న పాటలని మళ్ళీ వినే వారు మళ్ళీ రివైండ్ చేసుకనే ఒక పాట జగ్జీత్. భారత ఉపఖండంలో అతని గజల్ అల్బంలు అమ్ముడుపోయినంతగా మరెవ్వరివీ అమ్ముడు పోలేదు. ఇంకా అమ్మడు పోతూనే ఉన్నాయి. అతనే లేకపోతే గజల్ ఒక అరిస్టో క్రాటిక్ కళ గా మాత్రమే మిగిలిపోయేదంటే అతిశయోక్తి కాదు. గజల్ గానాన్ని, కంపోజింగ్ ను సాధారణ ప్రజల ముంగిటకు ఒక వెండి వెన్నెలలా కురిపించింది అతనే. గజల్ తో ఇంద్రజాలం చేసేసి వెళ్ళిపోయింది అతనే..
………………………………..
ఏడెనిమిది సంవత్సరాల క్రితం… హైదరాబాద్ లో..
ఒక లైవ్ షో జరుగుతోంది. జగ్జీత్ సింగ్ అభిమానులంతా వెళ్ళారు. అతని గొంతు మనసును అలా వానలా తడిపేస్తుంటే ఎక్కడ ఆ వాన అనుభూతి దూరమైపోతుందోనని ఒక జర్నలిస్టు మిత్రుడు మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఒంటరిగా వెళ్ళినా అనుభూతి గింగరాలు పెడుతూనే ఉంది.
ఒక కవితలో చెప్పినట్లు ఒక కలతతో , కలలతో మనం ఎటో చూస్తున్నపుడు దారిపై రాలిన పూలను
పూలపై రాలిన వానను వానలో దాగిన మోమునూ ఏరుకుని మనకు మోసుకు వచ్చే ఒక తోటమాలి అతను. ఇపుడు అతను లేడు కానీ అతను పెంచి పోషించిన పాటల పూదోట ఉంది. తుమ్ చలే జావోగే తో సోచేంగే హమ్ నే క్యా ఖోయో క్యా పాయా అని జగ్జీత్ – చిత్ర కలిసి ఒక పాట పాడారు. నువ్వెళ్లి పోతే నేనేం పోగొట్టుకున్నానో. నేనేం పొందానో తెలుసుకుంటా అని ఆ పాటకు అర్ధం. జగ్జీత్ వెళ్ళిపోతే తాము ఏం పోగొట్టుకున్నామో , ఏం పొందామో ఆయన అభిమానులకే తెలుసు. పొందిన దాన్నే పదే పదే గుర్తు చేసుకోవడమే ఆయనకు సరైన నివాళి
– శ్రీబాల

3 Comments
  1. హెర్క్యులెస్ October 11, 2011 /
  2. rajkumare October 11, 2011 /
  3. రమణ మూర్తి October 12, 2011 /