Menu

గుల్జార్ కవిత్వం సెల్యులాయిడ్ పై: ఇజాజత్

ముందుగా కొన్ని disclaimers

  • ఇది గుల్జార్ సాబ్ రాసి, తీసిన సినిమా ’ఇజాజత్’ గురించి నా ఆలోచనల వ్యాసం. సమీక్ష కాదు.
  • నాకు సినిమాలంటే అట్టే ఇష్టం ఉండవు. మా కాల్విన్‍గాడు అన్నట్టు, Happiness is not enough for me. I need euphoria. సమిష్టి వ్యవసాయమైన సినిమారంగంలో ఒక అత్యద్భుతమైన ఉత్పత్తి రావాలంటే ఎందరో కల్సి పనిచేయాలి. ఇంకెన్నో కల్సి రావాలి. ఇలా అరుదుగా జరుగుతుంది. అలా జరక్కపోతే సినిమా ఎక్కదు నాకు. అలా జరిగితే ఆ సినిమా నన్ను ’వాస్తవం’ కన్నా ఎక్కువగా వెంటాడుతుంది. అందుకే సినిమాలంటే నిరాసక్తి. భయం.
  • ఈ సినిమాపై నా అభిప్రాయాలతో మీరు అంగీకరించనవసరం లేదు. ’పాపం, ఎవరో అమాయకులు. వెర్రి ఆవేశం.’ అని అనుకొని పక్కకు తప్పుకున్న యెడల నాకు కొన్ని వేల పొగడ్తలతో ముంచెత్తిన భావోద్వేగం కలుగుతుంది.
  • నాకు సినిమాల పై ఎలాంటి విశేష పరిజ్ఞానం లేదు. ఒక టికెట్టు కొనుక్కునేంత డబ్బు, ఒక మూడు గంటల సమయం, కాస్తో కూస్తో మనసు, అడ్డంగా వాదించే మెదడు మాత్రమే ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకునే రాస్తున్నాను.
  • ముఖ్యాతి ముఖ్యమైన గమనిక: అవును. నేను గుల్జార్ ఫంకాను. ఇది మాత్రం అచ్చంగా, ముమ్మాటికీ ’భజన’ వ్యాసమే. మీ జాగ్రత్తల్లో మీరుండమని మనవి.

*****************************

దృశ్యమాధ్యమానికి నాకూ పేచీలెక్కువ. అందుకని సినిమా పాటలు బాగా విన్నా, ఎప్పుడూ వాటి తాలూకు విడియోలు చూడను. ’ఆ.. ఆ మాత్రం ఇమాజినేషన్ మాకూ ఉందోయ్’ అన్న పొగరు కొంచెం. అద్భుతమైన కవిత్వాలకు అతి నీరసమైన చిత్రీకరణను చూడ్డం వల్ల తగిలిన వగరు కొంచెం. మొన్న శుక్రవారం పూట “నీ కోసమే” అంటూ ఓ సహృదయం “మేరా కుచ్ సామాన్” అన్న గుల్జార్ పాటను గుల్‍దస్తాలా నాకు అందిస్తే యూ ట్యూబ్ లింక్ చూసాను, కళ్ళు మూసుకొని.

అలా పాటను కొన్ని పదుల సార్లు విన్నాక ఎందుకో ఆ టాబ్‍లోకి తొంగిచూస్తే ఇదే సినిమాలో ఒక క్లిపింగ్ “సబ్ కుచ్ ..” అన్న టైటిల్‍తో సశీరుద్దీన్ షా మొహంతో కనిపించింది. బహుశా, ఏదైనా గుల్జార్ కవితై ఉంటుందని తెరిచాను. రేఖా-నశీర్ ఒక గదిలో కూర్చుని కబుర్లాడేసుకుంటున్నారు. మామూలుగా. మనకు మల్లే. సీన్ అయ్యిపోవస్తోంది, ఇంకా కవితదేదీ మొదలవ్వలేదు. రేఖ “ఇంకా ఆ ఇంట్లోనేనా?” అంటుంది. దానికి సమాధానంగా “సబ్ కుచ్ వహీ..” అనబోయి గొంతుక్కేద్దో అడ్డుపడింది మింగడానికని ఒక క్షణం తీసుకొని అప్పుడు డైలాగ్ పూర్తి చేస్తాడు నశీర్. అక్కడ నేను పడిపోయాను. లేవకుండానే సినిమా చూడ్డం మొదలెట్టాను. ఇంకా కూరుకుపోయాను. అదీ పూర్వరంగం.

ఈ సినిమా గురించి మొదలెట్టే ముందు కొంచెం ఆవేశపడిపోతాను. అంటే మరీ నేను భజన బాపతు కాదు, అప్పుడప్పుడూ బాండ్ కూడా వాయిస్తానని నిరూపణ మాట.
మొన్నో ఆదివారం అర్థరాత్రి ఇంట్లో జనాలను లేపి మరీ (సోమవారం సెలవులే), ’సిల్‍సిలా డివిడి తెచ్చాను. చూస్తారా? నేను చూసి చెప్పనా?” అని అడగ్గానే రెండో ఆఫ్షన్‍కు భయపడి.. అందరం కల్సి చూసాం. ఆ సినిమాలో లేనివి ఏంటసలు? ఒక రేఖ. ఒక అమితాబ్. వాళ్ళిద్దరి మధ్య sizzling hot chemistry. అది చాలదన్నట్టు, ఒక కాశ్మీర్. ఒక జావేద్ అఖ్తర్. ఒక ప్రేమ. రెండు పెళ్ళిళ్ళు. పెనవేసుకుపోతున్న అనురాగాలు. ఛిన్నాభిన్నం అవుతున్న జీవితాలు. ఓహ్… ఎంత గొప్ప సినిమా అనుకునే లోపు క్లైమాక్స్. ఇంతకీ సినిమాలో లేనిదని నాకనిపించింది: నిజాయితి.

మనసొకరికి ఇచ్చాక, మనువు మరొకరితో జరిగాక పరిస్థితి ఏమిటి? అన్న అంశంపై వచ్చిన సినిమాలేవో నేను బానే చూసినట్టున్నాను. ఒక సిల్‍సిలా, ఒక దేవత, ఒక కార్తీక దీపం లాంటివెన్నో. అన్నింటిలోనూ, “ప్రజలారా! ముప్ఫై రూపాయలెట్టి టికెట్టు కొన్నందుగ్గాను ఓ రెండు గంటల సేపు మీరు ఒక పక్క ’హవ్వ.. పెళ్ళాయ్యాక ఇవేం పాడు పనులూ!’ అనుకుంటుంటూనే కళ్ళార్పకుండా ఉండేంత వినోదసరసాలను అందింపజేసి, చివర అరగంట మాత్రం సమాజంలో అత్యధికులు ఆమోదించే ’భారతీయ వివాహ వ్యవస్థ దృఢమైనది. ఒక మూడు ముళ్ళు వల్ల ఏ వలపు దయ్యం అయినా వదిలిపోవాలంతే!’ అన్న ముగింపునే ఇస్తున్నాం. చిత్తగించండి.” అన్నట్టు ఉంటాయి. అప్పటిదాకా ఎంతగోల అయినా అవ్వన్నీ, ఇద్దరి మధ్య శారీరిక, మానసిక దూరాలు ఎంతగానైనా ఉండనీ, చివర్న మాత్రం ’నా మెడలోనున్న తాళికోసం కాకపోయినా నా కడుపులో ఉన్న మీ నలుసు కోసమైనా..’ అని ఒక ఆడకూతురు కన్నీళ్ళెట్టుకోగానే సదురు హిరో ఇన్‍స్టెంట్ సకలగుణాభిరాముడై పోతాడు. (ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏవో ఇంటర్వెల్ టైంకే వచ్చేసుంటే ఓ గంట కలిసొస్తుందిగా అని నా అసహనం.)

ఆడవాళ్ళను చూపించడంలో మనవాళ్ళు చాలా అలక్ష్యంగా వ్యవహరిస్తారని నా అనుమానం. అసహనం. సిల్‍సిల్‍‍లాలో జయా బచ్చన్ కారెక్టర్ ఎవరో ఒకరి మీద ఆధారపడితే గానీ బతకటం చేతకాని జీవి. ’తీగకు పందిరి కావెలె గానీ, తెలుసా నీవె పందిరని?’ అన్నదానికి సమాధానం తెలీకుండా అమితాబ్ ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. పాపం, రేఖ అతడినే మానసా వాచా కర్మనా ప్ర్రేమిస్తుంది. అతడితో పాటే సర్వస్వం అనుకొని తెగిస్తుంది. కానీ క్లైమాక్స్ లో ఏమవుతుంది? భర్త ఉన్న ప్లేన్‍కు క్రాష్.. అందుకని ఈమెలో మార్పు! ఎలా? నాకర్థం కాదు!

సరే.. ప్రస్తుత సినిమాకొద్దాం. (అనగా భజన.)

అనుభవంలోకి వచ్చే సమస్యే లేని అందాలను, ఆనందాలను మధురోహల డేరాల వేసి మనల్ని అనుభూతి అనే దేశంలో బంజారాలుగా మార్చేయడమే కవులు పనికాదు. మనల్ని, మన జీవితాలనీ ఒక్కసారి తరచిచూసుకొనేలా చేసి, మనం ఉల్లిక్కిపడ్డా, భయపడ్డా చివరకు మెరుగైన జీవితం వైపుకు పయనమయ్యేలా చేయడం కూడా కవుల పనే. అందుకే ’మనసొకరికి, మనవొకరితో’ అన్న రొడ్డుకొట్టుడు అంశాన్ని ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలుస్తూనే కథను వాస్తవికంగానే చెప్పడం కవియైన గుల్జార్‍కు మాత్రమే సాధ్యం అయ్యిందని నా (లేని) కవిహృదయం అంటోంది.

ఒకొనాక రాత్రి. హోరున వర్షం. అప్పుడే స్టేషన్‍లో ఆగిన రైలు. అందులోంచి దిగిన హీరో. వెయిటింగ్ రూంలో వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటికే ఒక కుటుంబం, ఒక మహిళ. ఇతడు సూట్‍కేస్ తాళం పోగొట్టుకుంటాడు. వేరే వాళ్ళ తాళంతో ప్రయత్నిద్దామని అడుగుతాడు అక్కడున్నవారిని. అంతకు ముందే అతణ్ణి చూసిన ఆ ఒంటరి మహిళ బయటకు వెళ్ళిపోతుంది. అది తెల్సుకున్న ఇతడూ గది నుండి బయటకు వస్తాడు. ఆమె ఎదురుపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు.

వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఒకప్పుడు. విడిపోతారు. అప్పటికే ఐదేళ్ళు. – ఇదంతా సినిమా మొదలైన మొదటి ఐదు నిముషాల్లోనే. మొన్నే చదివాను, గొప్ప కథ లక్షణం ముగింపుకు దగ్గరే మొదలవ్వడమట. ఎందుకు విడిపోయారు? అసలేమయ్యింది? ఇప్పుడేమవుతుంది? అన్న విషయాలు నేను చెప్పి పాపం అంటించుకోలేను. చూడాలనుకున్న వారి ఆనందాన్ని పాడుచేయలేను.

సినిమాను చూస్తున్నప్పుడు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఒకసారి అలా మదిలో కదిలారు. వీరికి పొద్దస్తమానం ’భావుకత్వం’, ’కవిత్వం’ అంటూ ఊహల్లోనే తేలుతూ అనుభవించకుండా అనుభూతించడానికే సమయం వెచ్చించేవాళ్ళంటే చిరాకని చదివాను. ఆయన ఒకట్రెండు కథలు కూడా రాసారు ఆ అంశంతో. ఈ సినిమా ఎంచుమించుగా ఆ పంథాలోనే కొనసాగుతుంది.

ఒక అమ్మాయి అందమైన కవితలు రాస్తుంది. అందంగానూ ఉంటుంది. కానీ ఎక్కడా ఎప్పుడూ ఒక అవగాహన ఉన్నట్టు, ఒక బాధ్యతతో ప్రవర్తించినట్టూ ఉండదు. అలాంటి అమ్మాయిని ప్రేమించిన యువకుడు కారణాంతరాల వల్ల వేరొకరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్ళికి ముందే కాబోయే భార్యకు అన్ని విషయాలూ వివరంగా చెప్తాడు. కానీ పెళ్ళయ్యాక ప్రియురాలి మర్చిపోలేకపోవడం, ఆమె చేసే చేష్టలను విసుక్కుంటూనే ఆమె వదల్లేకపోవటం గమనించిన భార్య అతడి దారి నుండి తప్పుకుంటుంది. గాల్లో పెట్టిన దీపానికి వీలైతే చేతులు అడ్డుపెట్టి ఆరిపోకుండా చూసుకోవాలి. లేకపోతే ఊరుకోవాలి. ఒక క్షణం చేతులు మరీ దగ్గరకు పెట్టేసి, చేయి కాలగానే వెనక్కి తీసుకుంటుంటే ఆ దీపం ఏదో క్షణాన కొండెక్కిపోతుంది. చీకటే మిగులుతుంది.

ఇందులో కథను నడిపించిన తీరు అద్భుతం. ఒక రాత్రి వెయిటింగ్ రూం‍లో గడిపేయండంతో సినిమా ముగిసిపోతుంది. ప్రస్తుతంలో అన్న మాటేదో జ్ఞాపకాన్ని తట్టి లేపి, మళ్ళీ ప్రస్తుతంలో ఏదో అలికిడికి ఆ జ్ఞాపకం తెగి, మళ్ళీ ఏదో అనటం, చేయటం వల్ల మళ్ళీ జ్ఞాపకాల్లోకి జారి, ఇలా ముందూ వెనక్కూ వెళ్ళొస్తున్నా ప్రేక్షకునికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూపించటంలో దర్శకుని ప్రతిభ తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ గుర్తుతెచ్చుకోవటం ఒకటి. గుర్తుతెచ్చుకోవటంతోనే మనకు కథ చెప్పేయటం మరోటి. ఆ తర్వాత వాళ్ళ మాటల్లోకి ఆ జ్ఞాపకాలు జొరబడినప్పుడు ప్రేక్షకులుగా (కథ కొంచెం కొంచెంగా తెల్సిపోవడం వల్ల) మనమూ కనెక్ట్ అవుతాం.

సంభాషణలను గుల్జారే రాసినట్టున్నారు. ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని ఒకరి చెంపలు ఒకళ్ళు వాయించుకునేటప్పుడు కూడా అంత శబ్దం రాదేమో. కొన్ని డైలాగులున్నాయి మరీ! గుండె మీద లాగికొట్టిన లెంపకాయలవి. బైరాగి మాటలు అరువు తెచ్చుకోవాలంటే ’తరంగాల తాడనలా అర్థోద్ధతి సహించాను.’ అలానే సున్నితమైన హాస్యం కూడా బాగా పండించారు. కొన్ని ఏకవాక్య కవితలు దొరుకుతాయేమో శ్రద్ధగా వింటే, అంత బాగున్నాయి కొన్ని లైన్లు.

సంగీతం – ఆర్డీ బర్మన్. పీరియడ్.
పాటలు: ఆశా భోంస్లే మాత్రమే పాడారు, నాలుగున్నూ. నశీర్‍కు పాటలే లేవు!
పాటల చిత్రీకరణ: ’మేరా కుచ్ సామాన్’ మామూలుగానే అనిపించింది. ఈ పాటను గురించే ఒక వ్యాసం రాయొచ్చు. ఇద్దరి మధ్య శారిరక అనుబంధాన్ని వివరించాల్సి రావడం సినిమాల్లో తప్పనిసరి. కానీ ఇలా “ఏక్ సౌ సోలా చాంద్‍కి రాతే.. ఏక్ తుమ్హారా ఖాందేకా తిల్..” అన్నంత గుంభనంగా, అందంగా చెప్పటం గుల్జార్‍కు మాత్రమే సొంతం. అలాగే సినిమాలో రేఖ మోకాలికి దెబ్బ తగిలినప్పుడు, నశీర్ దానికి మందేయడానికి పూనుకున్నప్పుడు గదిలో ఉన్న చీకటిని ఉపయోగించి ఆమె కాలు మనకి కనపడకుండా చేయడంలోనూ కనిపిస్తుంది.

“ఖత్రా ఖత్రా మిల్తీ హై..” పాట నదీ తీరాన తీసారు. పకృతి సౌందర్యం అంత బాగా చూపించారో. ఇక్కడ చూడండి.

http://www.youtube.com/watch?v=csyAUXs7IHU&feature=related

ఇహ రేఖ పై చిత్రించిన “ఖాళీ హాత్ ష్యాం అయీ హై.. ఖాళీ హాత్ జాయేగీ” పాటలో విరహాన్ని, వేదననూ చూపించిన విధానం నా మస్తిష్కంలో తిష్ట వేసేట్టు ఉంది. ఇందులో లైటింగ్ ఉపయోగించిన విధానం ’వావ్’. అసలే రేఖ అంతటి అందం. చీకట్లో కొవ్వొత్తును రేఖ తీసుకొస్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ లో pause చేస్తే పేటింగ్‍లా అనిపిస్తుంది. అంత అందమైన చిత్రీకరణ.

http://www.youtube.com/watch?v=ulMogSV3eE0&feature=related

గుల్జార్ ఇచ్చిన ఒక ఇంటర్య్వూలో అన్నారు, సినిమా అంటే అరవైనాలుగు కళలనూ వాడుకునే వీలుండే గొప్ప అవకాశం. ఇంకెందులోనూ ఇన్ని కళల సమాహారం ఉండదు కదా! అని. అలా అన్ని కళలనూ అవసరం మేరకు వాడుకుంటే అది కనులకూ, వీనులకూ మనసుకూ ఎంత ఆనందాతిశయాలను కలిగిస్తుందో చూపించే చిత్రం ఇది. తుఫాను రాత్రి రైల్వే స్టేషన్‍లో శబ్ధాలను కథనానికి తగ్గట్టుగా వాడుకోవడంలో అసమాన ప్రతిభ కనబరిచారు. చాన్నాళ్ళ తర్వాత ఇద్దరు ఎదురెదురు పడ్డ క్షణాన పక్కనుండి దూసుకుపోతున్న రైలు నుండి వచ్చే ధ్వనులనే కాకుండా, ఆ రైలు వేగంగా పోతుండడం వల్ల ఒక క్షణం చీకటి, ఒక క్షణం మసక వెలుతురు వాళ్ళిద్దరి మొహాల మీదా పడుతున్నప్పుడు కలిగే impact చూస్తే తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించాలే గానీ ప్రతి ఫ్రేం‍లో అబ్బురపరిచే విషయాలేవో ఉంటూనే ఉంటాయి.

నశీరుద్దీన్ నటన గురించి నేనేం చెప్పగలను? గుల్జార్ ఆయన మీద ఒక కవిత రాసారు. నాకా కవితలో రెండు లైన్ల అర్థం అలా బుర్రలో పాతుకుపోయింది. ’పాత్రలైనతే దుస్తులుగా సునాయాసంగా ధరిస్తావు గానీ వాటిని వదిలేసేటప్పుడు కొన్ని మరకలు నీ ఆత్మకు అంటుకునే ఉంటాయింకా” అని. అంటే ఆయన పాత్రలను అంతగా తన సొంతం చేసుకుంటారని. అంతకన్నా గొప్పగా చెప్పగలిగిందెవరు? నటించగలిగిందెవరు?

రేఖ కన్నా ఆమె పోషించిన పాత్ర ’సుధా’ ఎక్కువ నచ్చింది ఈ సినిమాలో. ఆమె వ్యక్తిత్వం. ఆమె మనోబలం. నిర్ణయాలు తీసుకొని వాటికి కట్టుబడే తీరు. నాతో నిలిచిపోయే స్త్రీపాత్రగా అనిపిస్తుంది.

చెప్పీ చెప్పకుండా కథలోని కొన్నింటిని వివరించటం గుల్జార్ చూపించారనటానికి ఒక మచ్చుతునక: భర్తకు మరో స్త్రీతో శారీరక సంబంధం ఉందని, నిరూపణగా అతడి చొక్కాల మీద లిప్‍స్టిక్, లేక చెవిపోగులు దొరకడంతో భార్య అతడితో తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోతుంది. చాన్నాళ్ళ తర్వాత కలిసాక గతాన్ని తవ్వటం ఇష్టం లేక మిన్నకుండిపోతుంది. తెల్లవారాక రాత్రి తనకి కప్పిన ఆమె శాలువాను ఆమెకు తిరిగిచ్చేస్తూ గతం గురించి చెప్పుకొస్తాడు మాజీ-భర్త. ప్రియురాలికి ప్రాణం మీదకు రావటంతో ఆమెను కనిపెట్టుకుని ఉండాల్సి వచ్చిందని, అది తన బాధ్యత అనుకున్నాననీ చెప్తూ, “ఆ పిచ్చి పిల్ల కాసేపు ఏడ్చేది. కాసేపు కోపగించుకునేది. అల్లుకుపోయేది. అలాంటప్పుడే ఆమె చెవిపోగులు నా బట్టల పోగుల్లో ఇరుక్కునేవి.. ఇదో చూడు, ఇప్పుడు నువ్వు కప్పిన శాలువాలో నీ చెవిపోగు ఉన్నట్టు.” అని చూపిస్తాడు. “ఆ అమ్మాయిని కనిపెట్టుకొని ఉన్నానే గానీ, నేనే పాడుపనీ చేయలేదు..” అని సూటిగా చెప్తే ఎలా ఉంటుంది? ఇలా చెప్తే ఎలా ఉంటుంది? ఓ పక్క వివరణ ఇస్తూనే మరో పక్క అనుమానించినందుకు కొట్టినట్టు లేదూ ఆ సమాధానం?

ఇలాంటి చిన్నచిన్నవే ఒక మూమూలు కథను కొత్త స్థాయికి తీసుకెళ్ళి వదిలేస్తాయి. ఈ సినిమా ముగింపు కూడా అపురూపమైంది. ఊహాలోకాల్లో విహరించేవాళ్ళకి నచ్చకపోవచ్చునేమో గానీ జీవితాలను చూసిన అనుభవం ఉన్నవారు ఎవరైనా ఒప్పుకోక తప్పని ముగింపు. ఆ చివరాఖరున శశి కపూర్ నవ్వు ఉంటుందీ.. ఆ ఒక్కటీ కవిత్వం. ఎంత తోడుకుంటే అన్ని భావాలున్నాయి ఆ ఒక్క నవ్వులో.

అన్నట్టు ఈ సినిమా పేరు నచ్చలేదు. అదొక్కటే కంప్లెంట్. ఇంకా సరిపడా పేరు పెట్టాల్సింది.

ఇందులో నశీర్‍కు కోపం వచ్చినప్పుడల్లా ’హెల్” అంటాడు. అటా?-ఇటా? అన్న మీమాంశ మనిషికి ప్రతీ మలుపులోనూ ఎదురవుతుంది. ఏదో ఒకటని తెగించి ముందుకెళ్ళక, ముందుకెళ్ళినా వెనక్కే చూస్తున్న వాళ్ళ జీవితాలు నరకాలేగా! అందానికో, అందమైన ఊహాలోకానికో బానిసలై వాస్తవికతను విస్మరించేవాళ్ళ జీవితాలూ నరకాలేగా! ఓ వర్షం పడుతున్న రాత్రి అద్భుతోప్సరస వచ్చి వానలో ఆడిపాడించి మైమరపించి సొంతమవటం సినిమాల్లో, కథల్లో బాగానే ఉంటుందిగానీ, మన మనుగడకు అవసరమైంది వానలో తడుస్తుంటే గొడుకు పట్టుకొని ఎదురొచ్చే తోడు, ఆనక తలతుడిచి విక్స్ రాసే సహచర్యం. అది లేకపోతే నరకమే కదా! కాకపోతే నరకాలను ఇంత అందంగా, హృద్యంగా చూపించగలరని నాకింతకు ముందు తెలీదు.

ఈ సినిమాకు summaryగా గుల్జార్ ఒకానొక కవితలో పంక్తులు:

దిల్ కి బాతే నా పూఛో
దిల్ తొ ఆతా రహేగా
దిల్ బెహక్‍తా రహా హై
దిల్ బెహక్‍తే రహేగా
దిల్ కో తుమ్ హీ కుచ్ సమ్‍ఝాయా హోతా

ఇంత మంచి సినిమాలో పాటను నాకు పంపి, ఈ సినిమా చూసేలా చేసినవారికి సభాముఖంగా ధన్యవాదాలు.

–పూర్ణిమ తమ్మిరెడ్డి

4 Comments
  1. పద్మవల్లి October 4, 2011 /
  2. డి.రామచంద్రరాజు October 5, 2011 /
  3. Rajesh Devabhaktuni October 12, 2011 /
  4. SHAFI October 13, 2011 /