Menu

మాస్‌మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం – “దూకుడు”

శ్రీనువైట్ల తీసిన “ఢీ”, “రెఢీ” వంటి సినిమాలు గుర్తుంటే ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు “పోకిరి” పవర్, “అతిధి” కామిడి కలగలిపితే ఇంక చెప్పేదేమీ లేదు. అయితే ఈ రెండింటిని కలిపితే వచ్చే మాస్‌మసాలా కామెడీ ఏక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రమే – “దూకుడు”

అజయ్ అని ఒక హీరోగారు. సగటు తెలుగు సినిమా హీరో లాగానే వంటి చేత్తో వందమందిని మట్టి కరిపించగల మహా శక్తిమంతుడు. “మైండ్లో ఒక సారి” మాఫియా డాన్ నాయక్‌ని అతని సామ్రాజ్యాన్ని రూపుమాపాలని “ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా” వెళ్ళిపోతుంటాడు.

అజయ్ అని ఒక హీరోగారు. అనుకోకుండా తారసపడిన ఒక అమ్మాయిని ఇష్టపడి కేవలం టైమింగ్ సరిగా లేని తొందరపాటు, “నోటి దూల” కారణంగా ఆ అమ్మాయి చేత నో చెప్పించుకోని మళ్ళీ “యస్” చెప్పించుకుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి టైమింగ్ సరిగా లేకుండా హీరోకి అడ్డం పడిపోతుంటుంది.

అజయ్ అని ఒక హీరోగారు. ఆయన తండ్రి శంకర్ నారాయణ పద్నాలుగేళ్ళ క్రితం కోమాలోకి వెళ్ళి ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఆయనకి ఎలాంటి షాక్ తగలకూడదని, పద్నాలుగేళ్ళ క్రితం ఆయన ఏం కోరుకున్నాడో సరిగ్గా అదే జరుగుతున్నట్లు “సృష్టించి” ఆయన్ని సంతోషపెడుతుంటాడు హీరో. అందుకోసం అవసరమైతే ఎమ్మెల్యే అవతారం ఎత్తగలడు, నందమూరి తారకరామారావుగారిని ప్రధాన మంత్రిని చేసి ఎర్రకోటపై నుంచి తెలుగులో స్వతంత్ర దినోత్సవ ప్రసంగం చేయించగలడు. ఆఖరుకు విలన్లని తండ్రికి తెలియకుండానే తండ్రి చేతే చంపించగలడు.

అజయ్ అని ఒక హీరోగారు. విలన్ పైన పగ సాధించడానికి ఎం.ఎస్.నారాయణని, తండ్రిని సంతోషంగా వుంచడానికి బ్రహ్మానందాన్ని బకరా చేయగల సమర్థుడు. ఒకరికి సినిమా దర్శకుడినని చెప్పి, మరొకరికి రియాలిటీ షో తీస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తుంటాడు. మరో పక్క విలన్ల దగ్గర బళ్ళారి బాబుగా వచ్చి వాళ్ళ పతనానికి కారణం అవుతాడు.

మొదట చెప్పిన కథ ఏక్షన్, రెండొవది రొమాన్స్, తరువాతది ఫ్యామిలీ, ఆఖరుది కామెడీ. ఈ నాలుగు కథల కలగాపులగం మిక్చెరే దూకుడు. అయితే ఈ నాలుగు కథలలో “శ్రీను వైట్ల” మార్కు కామెడీనే బాగా పండిందని చెప్పవచ్చు. అందుకు కారణం సగం ఎమ్మెస్, బ్రహ్మానందం అయితే మిగతా సగానికి కారణం మహేష్ బాబు. ఆ మహేష్ బాబు లేకుంటే ఈ సినిమా గురించి చెప్పుకోడానికి కూడా ఏమీ వుండేది కాదు. ఆ రకంగా (అంత పొడవైన) సినిమా మొత్తాన్ని మహేష్ బాబు భుజాన వేసుకోని నడిపించాడు.

ఒకరి మనసులో ఒక కథని సృష్టించి ఆ కథని నిజమనిపించేలా చేస్తూ నవ్వులు కురిపించడం శ్రీను వైట్ల ఇంతకుముందే చేశాడు. అదే రకమైన మూడు కథలని కలపడం, అందులో ఒకటి సెంటిమెంట్‌కి వాడటం ఈ సినిమాలో సంభవించిన కొత్త మార్పు. అయితే ఒక శ్రీను వైట్ల సినిమాలో ఒక కమెడియన్ మరో ప్రపంచం సృష్టించి అందులోని ఇరుక్కుపోయి బయటి రాలేకపోయినట్లు, శ్రీను వైట్ల సృష్టించి చాలా నాటకాలకి ముగింపు ఎలా ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ద్వితీయార్థంలో స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలియగానే పూర్తి ఏక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేయడంతో ఏదో విధంగా సినిమా అయ్యిందిలే అనిపిస్తుంది.

కథ వ్రాసుకోవడంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదని అర్థం అవుతూనే వున్నా మహేష్ బాబు, ఇతర కమీడియన్లు ఆ సంగతి అర్థం కాకుండా ప్రతిభావంతంగా మేనేజ్ చేసారు. బ్రహ్మానందం, ఎమ్మెస్, వెన్నెల కిషోర్లు ఇతోధికంగా నవ్వులు కురిపించారు. మిగతా భారీ తారాగణం అంతా అవసరార్థం కనిపిస్తూ వెళ్టుంటారు. విలన్ అంటే కామెడీ చేసేవాడు లేదా హీరో చేతిలో అమాయకంగా బలైయ్యేవాడు అనే రొటీన్ విలన్ పాత్రలో సోనూసూద్ బోరుకొట్టిస్టాడు. హీరోయిన్ వుండాలి కాబట్టి సమంతాకి పని దొరికింది. “అయిటం బాంబ్” పార్వతీ మెల్టన్ ఆట పాట అలరిస్తుంది.

తమన్ సంగీతం ఫర్వాలేదనిపిస్తున్నా “గురువారం” పాట పార్వతీ మెల్టన్ పాట గుర్తుంటాయి. గుహన్ కెమెరా చాలా చోట్ల (ముఖ్యంగా ఇస్థాంబుల్లో) కనువిందు చేసింది. ఏడిటర్ కత్తెరకి ఇంకొంచం పని పెట్టి వుంటే బాగుండేది.

కొసమెరుపు: హీరో పోలీస్ అయినా సస్పెండ్ అయినా హీరోతో పాటు నలుగు వుంటారు. వీళ్ళంతా కలిసి హీరో గారిని సపోర్ట్ చేస్తూ వుంటారు. అవసరమైన్ ప్రతిసారివాళ్ళే హీరో హీరోయిన్ ట్రాక్‌లో సహాయపడతారు (కానీ విలన్ల విషయంలో పోలీసులు హెల్ప్ చెయ్యరు). ఆ తరువాత అదే పోలీస్ గ్యాంగ్ హీరో ఆడే డైరెక్టర్ నాటకం, ఎమ్మెల్యే నాటకం తదితర నాటకాలన్నింటి దగ్గర ఇతోధికంగా వేషాలు వేసుకోని సహాయపడతారు. ముఖ్యంగా శివారెడ్డి (బాగా చేశాడు) న్యూస్ రీడర్‌గా, చనిపోయిన విలన్లకి కొడుకులా, మిమిక్రి ఆర్టిస్టుగా, కాజా ఆంటీగా వేషాలు వేసుకోని హీరో డ్రామాలకి సహకరిస్తాడు.

పోలీసులేంటి? ఈ నాటకాలేమిటి? లాంటి ఇంటలిజెంట్ ప్రశ్నలు అడగకుండా వుంటే సినిమాలో అక్కడక్కడ మనకి కావాల్సినవి మాత్రం ఏరుకుంటే సినిమా అయ్యేసరికి ఏముందో చెప్పలేం కానీ బాగానే వుంది అని అనిపించే అవకాశం వుంది. మహేష్ ఫ్యాన్స్‌కి మాత్రం మహేష్ బాబు తప్ప సినిమాలో ఇంకేమీ కనిపించే అవకాశం లేదు కాబట్టి కన్నుల పండుగ.

సినిమా: దూకుడు
నటీ నటులు: మహేష్ బాబు, సమంతా, సోనూ సూద్, కోట శ్రీనివాస రావు, సాయాజిషిండే, వెన్నెల కిషోర్, ఆజయ్, నాజర్, తనికెళ్ళా భరణి, చంద్ర మోహాన్… ఇంకా చాలా మంది.
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫి: ఎం.వి. గుహన్
మాటలు: కోన వెంకట్
కథ: గోపీ మోహన్
ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ
నిర్మాతలు: రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
దర్శకత్వం: శ్రీను వైట్ల

17 Comments
 1. Aravind October 1, 2011 /
 2. sankar October 6, 2011 /
 3. హరి చరణ prasad October 9, 2011 /
 4. Bhargav October 10, 2011 /
 5. ఆ.సౌమ్య October 12, 2011 /
  • karunakar October 14, 2011 /
   • ravi October 14, 2011 /
  • chowdary October 19, 2011 /
 6. Aravind October 16, 2011 /
 7. అబ్రకదబ్ర October 19, 2011 /
  • అరిపిరాల October 20, 2011 /
   • శుభకరుడు October 28, 2011 /
   • శుభకరుడు October 28, 2011 /
 8. VENKAT October 26, 2011 /
 9. VENKAT October 26, 2011 /
 10. shree October 27, 2011 /