Menu

Bose: The Forgotten hero (2005)

౨౦౦౪-౦౫ ప్రాంతంలో నాంపల్లి లోని గృహకల్ప కాంప్లెక్స్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఎగ్జిబిషన్లో సుభాష్ చంద్రబోసు గురించి శిశిర్ కుమార్ బోస్ రాసిన జీవితచరిత్ర పుస్తకం ఒకటి కొన్నాను. అప్పట్లోనే శ్యాం బెనెగల్ తీసిన “నేతాజీ సుబాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో” సినిమా గురించి కూడా తెలిసింది. నా ఖర్మ కొద్దీ బాగా కత్తిరించిన డీవీడీ దొరికి, గంటన్నర నిడివి ఉన్న సినిమా చూసి, అదే సినిమా అనుకుంటున్నప్పుడు చివరకి శిశిర్ బాబు రాసిన పుస్తకం చదవడం మొదలుపెట్టాను. ఈ పుస్తకం చదివాకే నేను సినిమాలో ఏమీ చూడలేదని అర్థమైంది. తర్వాత ఈ సినిమా డీవీడీ కోసం ప్రయత్నించాను కానీ దొరకలేదు. చాలా రోజులు ఆన్లైన్ లో చూసేందుకు కూడా దొరకలేదు. ఎట్టకేలకు, ఇప్పుడు చూడగలిగాను.

కథ: సుభాష్ బోసు గాంధి తో విభేదించి కాంగ్రెస్ నుండి బయటకు రావడంతో కథ మొదలవుతుంది.  బోస్ మరణించాడు అనుకుంటున్న విమాన ప్రమాదం వద్ద కథ ముగుస్తుంది. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తరువాత, ఆయన రష్యా సాయంతో ఒక సైన్యం నిర్మించి, బ్రిటిషు వారిపై దాడి చేయాలనీ నిర్ణయించుకుని, మారు పేర్లతో బ్రిటీషు వారి కన్నుగప్పి దేశం దాటతాడు. అనుకోని పరిణామాల మధ్య, రష్యన్లు సహకరించరు. ముందు జర్మన్ల వద్దకు, ఆపై ఇటాలియన్ల వద్దకూ వెళ్లి, వారి సాయంతో మరో మారుపేరుతో జర్మనీ చేరుకుంటాడు. ఇక్కడ సాయానికి జర్మన్లను ఒప్పిస్తూ, అక్కడ ఉన్న భారతీయ యుద్ధ ఖైదీల సాయంతో సైన్యం నిర్మిస్తూనే, రష్యా మీదుగా ఇండియా చేరాలని వ్యూహం వేస్తూ ఉండగా, జర్మనీ రష్యాపై దాడి చేస్తుంది. దానితో రెండు సబ్మెరైన్లు మారి జపాన్ చేరుకొని, అక్కడి సానుభూతి పరుల సాయంతో, రాసబిహారీ బోసు, మోహన్ సింగ్ తదితరుల నేతృత్వంలో  స్థాపించబడి దెబ్బతిన్న ఐ.ఎన్.ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) పగ్గాలు చేపడతాడు. జపాన్ సాయంతో సింగపోర్ వగైరా ప్రాంతాల నుండి సైన్యాన్ని నిర్మించి, భారత్ వైపుకి ప్రయాణం కడతారు అందరూ.  విజయవంతంగా సాగుతూ ఉండగా, జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి అమెరికాకి సరెండర్ అవడంతో, నిస్సహాయ స్థితిలో బోస్ తన ఐ.ఎన్.ఏ ని నిర్వీర్యం చేసి, విదేశాలకు వెళ్లేందుకు తన సహచరుడితో కలిసి విమానం ఎక్కుతాడు. ఆ విమానం సాంకేతిక ప్రమాదం వల్ల కూలిపోతుంది.

నటన: బోస్ గా వేసినది సచిన్ ఖేడేకర్. నిజంగా బోస్ లాగే ఉన్నాడు! ఫోటోలలో చూసిన బోస్ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు మనిషి! అలాగే, కథలో భిన్న జాతులకు చెందిన మనుషులు, భాషలు, యాసలు కనిపిస్తాయి. ఎక్కడికక్కడ అందరూ అతికినట్లు సరిపోయారు అనిపించింది. అందరిని మించి ఖేడేకర్ స్క్రీన్ ప్రేజెంస్ అద్భుతం.

కథనం: కథ చరిత్ర పుస్తకాల్లో కనిపించేదే కానీ, సినిమా చూపుతున్నప్పుడు మూడుగంటల వ్యవధిలో కొన్ని నెలల, ఏళ్ల చరిత్ర చెప్పాలి కనుక, నా ఉద్దేశ్యంలో అది కష్టసాధ్యమైన పనే. అంతేకాదు, చరిత్రలో జరిగిన కథ కనుక, చాలా జాగ్రత్తగా చెప్పాలి. నా మట్టుకు నాకు డైలాగుల విషయంలో కానీ, దృశ్య క్రమంలో గానీ, ఆ చారిత్రక వాతావరణం సృష్టించడంలో కానీ, దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు అనిపించింది. ముఖ్యంగా, బోస్ లోని మానవీయకోణం కూడా చూపడానికి (తన సహచరులతో సరదా సంభాషణలు, అతని ప్రేమ-పెళ్లి వగైరాలలో) కూడా ప్రయత్నించడం నాకు నచ్చింది. బోస్ పెళ్లి దృశ్యం నాకు మహా సరదాగా అనిపించింది. సంస్కృతం తెలిసిన జర్మన్ మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే, కన్యాదాత పాత్రలో ఉన్న కమ్యూనిస్టు బ్రాహ్మడు ఆ మంత్రాలను రిపీట్ చేయడం నాకు చాలా నవ్వు తెప్పించింది. ఇంతకీ నిజంగా పెళ్లి ఇలాగే జరిగిందో ఏమిటో!

ఇందాక అన్నట్లు, కొన్ని వందల పేజీల చరిత్ర పుస్తకంగా ఉండదగ్గ దానిని ఒక సినిమాలో పట్టించారు. దీనివల్ల, మన కథలో బోలెడు పాత్రలు, బోలెడు నేపథ్య గాథలు, బోలెడు ఈక్వేశన్లూ వస్తాయి. కానీ, ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏమిటి అంటే, ఇన్ని ఉపకతలు ఉన్నా కూడా, ఎక్కడా అయోమయం కలిగించకపోవడం 🙂

సంగీతం: నా మట్టుకు నాకు సంగీతం చాలా నచ్చింది. రిలీజ్ అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా పాటలు నేను తరుచుగా వింటూనే ఉంటాను. ఎప్పుడూ నాకు బోరు కొట్టవు. నేపథ్యంలో వచ్చే సంగీతం, పాటలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. సినిమా మూడ్ ని సంగీతంలో చక్కగా పలికించారు. అలాగే, సందర్భానుసారంగా బెంగాలి, సూఫీ పాటలు రావడం కూడా నాకు చాలా నచ్చింది (అర్థం కాకపోయినా కూడా!)

బెనెగల్ సినిమాలంటూ ఇప్పటిదాకా నేను చూసినవి మూడే. ౧)మేకింగ్ ఆఫ్ ది మహాత్మా ౨)వెల్కం టు సజ్జన్పూర్ ౩)వెల్ డన్ అబ్బా ఆయన గురించి విన్నదానికీ, చదివిన దానికీ – చివరి రెండు సినిమాలకీ, అసలు పోలికే లేదు. ఈ నేపథ్యంలో, బోస్ సినిమా ఆద్యంతమూ చూసాక, ఆయన గురించి అందరూ ఎందుకు అంత గొప్పగా చెబుతూ ఉంటారో అర్థమైంది. ప్రస్తుతం ఆయన ఇతర చిత్రాలు చూసే ప్రయత్నంలో ఉన్నాను. “భూమిక”, “మమ్మో” అయ్యాయి.

ఎందుకు ఈ సినిమా అందరూ చూడాలి? :
౧) రాన్రానూ మన యువతకి (నాతో సహా) బొత్తిగా ఒక “చారిత్రిక స్పృహ” లేకుండా పోతోంది అని నాకీమధ్య మా చెడ్డ చిరాకు పెరుగుతోంది. ఆమధ్య ఒక విదేశీ ప్రొఫెసర్ నేనూ, ఇంకో యూనివర్సిటీకి చెందిన ఒక తమిళ యువకుడూ : ముగ్గురం కూర్చుని ఉండగా, మేము అప్పుడే ఒక ఉప్పు తయారీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చినందువల్ల ఆయన “ఇండియాలో కూడా ఉప్పు గురించి ఉద్యమం అయ్యిందంట కదా” అన్నారు. మేము ఏదో టూకీగా, ఎందుకు అయ్యింది? అన్నది చెప్పాము. తరువాత చెప్పేందుకు మాకేమన్నా తెలిస్తే కదా! ఈ నేపథ్యంలో నాకు ఇలాంటి సినిమాలు రావడం, ఇప్పటి యువత, రేపటి యువత కూడా వాటిని చూడ్డం (కనీసం ప్రాథమిక అవగాహన కన్నా!) అవసరం అనిపించింది.

౨)సినిమా చూడగానే, నేను అబిద్ హసన్, లక్ష్మీ సెహగల్, రాస బిహారీ బోసు వగైరా పోరాట వీరుల గురించి చదవడం మొదలుపెట్టాను. ఈ విధంగా నాలో కనీసం ఆమాత్రం చలనం కలిగించింది కనుక, ఇలా మిగితా వాళ్ళలో కూడా (కనీసం కొందరిలో)…కలిగించవచ్చు అని నేను నమ్ముతున్నాను కనుకా, అందరూ చూడాలి అంటున్నాను.

౩) ఈ మహానుభావుల యుగంలో, పాపులర్ హిస్టరీలోకి ఎక్కని వీరులు కూడా కొందరు ఉంటారు. అబిద్ హసన్ వంటి వారు (ఉదాహరణకి!). అలాంటి వారికి కూడా తగినంత స్క్రీన్ స్పేస్ ఇచ్చి తీసినందుకు ఈ సినిమా తప్పక చూడాలి.

౪) బోస్ ఇండియా నుంచి బైట పడ్డం మొదలుకుని ఐ.ఎన్.ఏ ఇండియాలోకి రాబోవడం దాకా జరిగినంత డ్రామా ఏ థ్రిల్లర్ సినిమాకీ, ఏ సూపర్ హీరో సినిమాకి తీసిపోదు. కనుక, కథాపరంగా, ఇది ఏ కమర్షియల్ సినిమాకీ తక్కువేం కాదు.

వెరసి, అదనమాట నా హృదయ ఘోష….ఈ సినిమా గురించి. దయచేసి మీరు ఇప్పటి వరకూ చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. బయోపిక్ అంటే ఇలా తీయాలేమో అనిపించింది (చరిత్ర ఆధారంగా తీసిన కాల్పనిక గాథ – అనుకున్నా కూడా!).

9 Comments
  1. SHAFI October 9, 2011 /
  2. SHAFI October 9, 2011 /
  3. M.V.Ramanarao October 9, 2011 /
  4. sreeram October 13, 2011 /
  5. Sowmya October 13, 2011 /
    • sreeram October 13, 2011 /
  6. praveen October 14, 2011 /
  7. C V R Mohan October 17, 2011 /
  8. murali November 20, 2011 /