Menu

“అము” (2005): ఒక పరిచయం

బోస్ సినిమా చూసాక, లక్ష్మీ సెహగల్ గురించి చదువుతూ, వాళ్ళ అమ్మాయి “అము” అనే సినిమాలో నటించిందని చదివాక, ఆ సినిమా ఏమిటా అని ఆరా తీస్తే, అందులో బృందా కారత్ కూడా ప్రధాన పాత్రధారి అని తెలిసేసరికి కుతూహలం కలిగి, చూడ్డం మొదలుపెట్టాను. ఈ సినిమా ౧౯౮౪ సిక్కుల ఊచకోత నేపథ్యంలో జరిగే ఆధునిక జీవితాల కథ. ప్రధాన పాత్రధారులు: కొంకనసేన్ శర్మ, బృందా కారత్, అంకూర్ ఖన్నా, యశ్పాల్ శర్మ తదితరులు. కథ, నిర్మాణం, దర్శకత్వం అన్నీ సోనాలీ బోస్. ఆవిడ రాసిన నవల (ఇదే పేరు-అము!) ఆధారంగానే ఈ సినిమా తీసారు. ఈ సినిమాకి తొలి సినిమా దర్శకులకి ఇచ్చే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుతో పాటు పలు అవార్డులు లభించాయి దర్శకురాలికి. వివిధ అంతర్జాతీయ ఫిలం ఫెస్టివల్ లలో కూడా ప్రదర్శింపబడింది.
కథాంశం: కాజు (కొంకనసేన్ శర్మ) అమెరికాలో పెరిగిన ఇండియన్ అమ్మాయి. చదువు అయ్యాక, కొన్నాళ్ళు ఇండియా వచ్చి తన బంధువులతో గడుపుదాం అని వస్తుంది. అసలైన భారతదేశం ఏమిటో చూడాలన్న కుతూహలంతో ఆమె బస్తీల్లోకి వెళ్ళడం, “సామాన్య”జనాలతో సంభాషించడం వంటివి చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఆమె కజిన్ ద్వారా కబీర్ అనే అబ్బాయి పరిచయమౌతాడు. అతగాడికి ఇలా “రియల్ ఇండియా” అని చూడాలి అని వచ్చే ఎన్నారైలు అంటే చిన్నచూపు. కొన్నాళ్ళకి, ఈమె “షో” కోసం తిరగట్లేదనీ, పాపం నిజం కుతూహలం కొద్దీనే తిరుగుతోందనీ అర్థమవుతుంది. కాజు తల్లి ఆమెని ఏదో అనాథ శరణాలయం నుంచి దత్తత తీస్కున్నానని, ఆమె తల్లిదండ్రులు ఏదో బస్తీకి చెందిన వారనీ చెప్పి ఉంటుంది ఆమెకి. కాజుకి ఇలా తిరుగుతున్నప్పుడు ఒక బస్తీలో అది తనకి బాగా పరిచయం ఉన్న స్థలంలా అనిపించడం మొదలౌతుంది. కాసేపటికి కాజు కి తన పుట్టుక గురించిన నిజమూ, ౧౯౮౪ నాటి సిక్కుల ఊచకోతలో కాజు, కబీర్ ల తల్లి దండ్రుల పాత్రా…వంటివన్నీ నెమ్మదిగా తెలియడం మొదలవుతాయి. టూకీగా ఇదీ కథ.

నటీనటులు: ఆ అంకూర్ ఖన్నా మరీ కన్ప్యూజ్ద్ గా అనిపించాడు కానీ, మిగితా అంతా బానే చేసారు. బృందా కారత్ ఉండటం నాకు ఈ సినిమాలో ఆశ్చర్యం కలిగించిన అంశం. మొదటి సినిమాకి బాగా చేసారనే అనాలి. అయితే, ఎందుకోగానీ, నాపై అంత గాఢమైన ప్రభావం కలిగించిన నటులేవ్వరూ లేరు, కథ తప్ప!

ఇందాక చెప్పినట్లు, ఈ సినిమాలో నటులెవ్వరూ నాపై అంత ప్రభావం చూపకపోయినా నాకు సినిమా నచ్చింది అంటే, దానికి కారణం కథా, కథనమూనూ.  ఇటీవలి కాలంలో నా కంటబడ్డ సినిమాల్లో సమకాలీనంగా ఉంటూనే, గతం తాలూకా ప్రభావాలను గురించి చర్చించిన సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో “అము” చూడ్డం ఒక మంచి అనుభవం అనే చెప్పాలి. దర్శకులు తామే రాసుకున్న నవలల/కథల ఆధారంగా సినిమా తీస్తే, వాటికి ఏమిటో ఒక నిండుదనం వంటిది వస్తుందనుకుంటాను (ఈ మధ్యే సత్యజిత్ రాయ్ తీసిన ఫెలూదా సినిమాలు రెండు చూసాను, బెంగాలీ సినిమాలు-ఆంగ్ల సబ్టైటిల్స్ తో. ఒక్కోచోట, నవల కంటే కూడా సినిమా బాగా నచ్చింది నాకు!). అసలుకి నాకు ఈ దర్శకులు ఎవర్ని చూసినా అబ్బురమే – అలా ఎలా ఊహకి రూపాన్ని ఇస్తారో అని. కాజు కి తన గతం లీలగా గుర్తు రావడం, తను నడుస్తున్న ప్రాంతం తనకి బాగా పరిచయమైనది గా అనిపించడం – ఆ దృశ్యాలు బాగా తీసారు అనిపించింది నాకు.  అలాగే, ఈ దాడుల గురించి వివిధ నేపథ్యాలకి చెందిన వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు కూడా నాకు బాగా నచ్చాయి – వివిధ దృక్పథాల్లో ఉన్న తేడా కొంతవరకు అర్థమైంది.

నేను చరిత్రకు దూరమైన నాబోటి వారి కోణంలో “ఎందుకు ఈ సినిమా చూడాలి?” అన్న ప్రశ్నకు జవాబు చెప్పుకుంటాను. అందరూ ఇదే కోణంలో ఆలోచించాలి అనేం లేదు. నేను గమనించినంతలో ఇప్పుడు వస్తున్నా సినిమాలు చాలా మట్టుకు బుర్ర ఇంట్లో వదిలేసి చూసే రకానివే ఉంటున్నాయి. ఉన్నదానికి తోడూ, హిందీ వాళ్ళు కూడా మన స్టైల్ సినిమాలు తీస్తున్నారు. అటువంటప్పుడు, ఆలోచింపజేసే సినిమాలు కరువైపోతున్నప్పుడు ఇలాంటి సినిమా ఒకటి కనిపిస్తే, తప్పక చూడాలి అనిపిస్తుంది నాకు. చుట్టుపక్కల జరిగేదానికి ఒక్కోసారి గతం కూడా కారణమౌతుంది. మరి మనకి గతం కూడా తెలియాలి కదా? ఇదివరలో సిక్కుల ఊచకోత గురించి పుస్తకాల్లో చదవడమే కానీ, ఇలా విజువల్ గా చూడలేదు. నా మట్టుకు నాకు ఇలా చరిత్రలో జరిగిన వాటి గురించి సామాన్యుల కోణంలో కథనాలు (హిస్టారికల్ ఫిక్షన్ అనుకోవచ్చేమో వీటిని కూడా) రావడం, వాటిని చూడ్డం ఎంతైనా అవసరం అనిపిస్తుంది. “నిజమైన మనుష్యులకు అసలు చరిత్రే లేదు వారికి గతమూ లేదు , అనాగతమూ లేదు ” అంటారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన “చరిత్ర చోరులు” కథలో. ఇదిగో, ఇలాంటి సినిమాలు చూసాకే, ఉందిగా! అని అరవాలి అనిపిస్తుంది 🙂

” ప్రతి మనిషీ ఒకే గుండెలో ఒక ముక్క. కాలం ఎక్కడెక్కడో విసిరేస్తుంది , ఈ ముక్కల్ని. జీవితం తరుముకు వస్తూ ఉంతే జీవనాన్ని తరుముకుంటూ, ఎవరికి వారు ఒకరికొకరు దూరంగా ….” – అన్న సిరివెన్నెల గారి వాక్యం (ఎన్నోరంగుల తెల్లకిరణం కథ) మాత్రం ఇలాంటి కథలు చూసినప్పుడు నిజం అనిపిస్తుంది. 

మరి చూడబోతే, ఈ దర్శకురాలు తరువాత ఏ సినిమానూ తీసినట్లు లేరు.