పోస్టర్ లో ఏముంది…!

పోస్టర్ ని చూసి సినిమా కథ చెప్పేరకాలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ కీ ఖచ్చితంగా ఒకడుండేవాడు ఒకప్పుడు. నిజానికి ఒక్కోసారి సినిమా కంటే ఈ కథలల్లేవాళ్ళ కథకుల కథలే బాగుండేవి. కానీ ఇప్పుడూ! పోస్టర్ చూస్తే కథకాదుకదా కనీసం సినిమా దేని గురించో కూడా తెలియట్లేదు. రాంగోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడు జె.డి.చక్రవర్తిని ఎవరో మీడియా వాళ్ళు అడిగారట “సినిమాలో హీరోవి నువ్వేకదా, నువ్వు లేకుందా పోస్టరేంటి?” అని. దానికి జె.డి. వర్మ మార్కు కాపీస్టైల్ లో “సినిమా టైటిలే దెయ్యం. ఇందులో నేను హీరోకావడమేంటి? ఈ సినిమాలో నేనున్నాను. కానీ సినిమా దెయ్యానిది” అన్నాడట. వెటకారంగా అన్నా ఇందులోనే అసలైన కిటుకు ఉంది.

హాలీవుడ్ లో సినిమా కథని సింగిల్ లైన్ లో చెప్పే సాంప్రదాయం ఒకటుంది. స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివే అందరికీ బహుశా ఈ విషయం తెలుసు. ‘కథ ఎవరి గురించి? ఆ ప్రధానపాత్ర సమస్య ఏమిటి? దానికి సమాధానం ఎలా దొరికింది?’ అనే విషయాలు గనక చెప్పగలిగితే కథ దేనిగురించి అనే “థీం” తెలిసిపోతుంది. దీన్నే పోస్టర్ థీం అనికూడా వ్యవహరిస్తారు. ఇలాంటి థీం పోస్టర్ ప్రతి సినిమాకీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ తరువాత ఎన్ని పోస్టర్ లు వచ్చినా, మొదటి పోస్టర్ మాత్రం అదే అయ్యుంటుంది.  ఉదాహరణకి, “ఆడామగా సంబంధాలు నానాటికీ క్లిష్టంగా తయారవుతున్న ఈ మాడ్రన్ ప్రపంచంలో ఏ బాదరబందీ లేకుండే, ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ అవసరం లేకుండా కేవలం సెక్స్ కోసం ఫ్రెండ్స్ గా ఎందుకుండకూడదు అనే ఒక ఆడా-మగా జంట కథ”  Friends with Benefits (2011) అనే హాలీవుడ్ సినిమా కథ. పోస్టర్ ని, సినిమా టైటిల్ ని ఒక్క క్షణం నిశితంగా గమనిస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది.

 

చాలా వరకూ హాలీవుడ్ సినిమాలు ఇప్పటికీ ఈ “థీం పోస్టర్” ప్రిన్సిపల్ ని అనుసరిస్తాయి. ఏదో రూల్ ఉందని ఫాలో అవడం కాదు. నిజానికి అలా చెయ్యడం వల్ల మన సినిమా ఎవరికోసం, మనం ఆశిస్తున్న ప్రేక్షకుడి ప్రొఫైల్ ఏంటి, దాని మార్కెట్ సైజ్ ఏంత వంటి ఎన్నో విషయాల్ని ఈ ఒక్క థీం ఐడెంటిఫై చేసి “ప్యాకేజ్ అన్డ్ ప్రోమోట్” చెయ్యడం లో చూపించగలిగే నిపుణత ఈ విధానానికి ఆయువుపట్టు అనేది మనం తెలుసుకోవాలి.

 

ఈ మధ్యకాలంలో ఈ హాలీవుడ్ పంధాని బాలీవుడ్ చక్కగానే అనుసరిస్తున్నాయి. తాజా ఉదాహరణ “మేరే బ్రదర్ కి దుల్హన్”. మనదగ్గర ఇంత ఆలోచన, ప్లానింగ్ లేకపోవచ్చుగాక అంతమాత్రానా ఇలా తలా తోకాలేని పోస్టర్లు కావాలా!? అనేది ఒక ప్రశ్న అయితే, అసలు మనదగ్గర పోస్టర్ డిజైనింగ్ లో చూపిస్తున్న అతివైవిధ్యానికి రేషనల్ ఏమిటి అనేది సమాధానం దొరకని మరో ప్రశ్న.

 

రాంగోపాల్ వర్మ “రాత్రి” ఆ సినిమా పబ్లిసిటీ డిజైన్స్ లో యాక్టర్లు ఎవరూ ఉండరు. ఒక నల్లటి పోస్టర్ మీద కింద ఒక మూల నలుపూ ఎరుపూ కలిసిన రంగులో  ‘రాత్రి’ అని రాసుంటుంది.  ఏదో ఇంటర్వ్యూలో రేవతి, ఓంపురి, చిన్నా లాంటి పాప్యులర్ నటుల్ని పెట్టుకుని ఆ పోస్టరేంటని ఎవరో అడిగితే వర్మ సింగిల్ లైన్లో ఇచ్చిన సమాధానం “పోస్టర్ థీంని చెప్పాలి, టీజర్ సినిమా ఫీల్ ని తెలియజెప్పాలి. ఎవరు యాక్టర్లు, ఎవరు లేరు అనేది కాదు” అని. అన్నీ బేసిక్సూ మర్చిపోయినట్లే మన సినిమా ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా మర్చిపోయింది. అందుకే ‘ఊసరవెల్లి’ కలరేంటో, ‘దూకుడు’ దేనికోసమో తెలీని పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వర్మ మాత్రం తన రీసెంట్ ఫిల్మ్ “Not a love story” సినిమాలో కూడా తన పోస్టర్ ఫిలాసఫీని ఎంచక్కా చూపించి సక్సెస్ సాధించాడు.