Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

నేషనల్ ఫిల్మ్ ఆవార్డ్స్ లేదా జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా పిలువబడే ఈ అవార్డులు మొట్టమొదట 1954 లో ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నేడు ఇవ్వనున్న 58 వ పురస్కారాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో కొన్ని ముఖ్య సంగతులను మనం చలనచిత్ర అవార్డుల పరిణామ క్రమం లో తెలుసుకున్నాము.

కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు అనగానే మనకి గుర్తొచ్చేవి కొన్నే.ఉత్తమ చిత్రం,ఉత్తమ నటీ నటులు, ఉత్తమ దర్శకుల అవార్డులు మాత్రమే మనకి ఎక్కువగా గుర్తుంటాయి. కానీ చలనచిత్రాలంటే కేవలం కథా చిత్రాలే కాదు. కథా చిత్రాలతో పాటు డాక్యుమెంటరీ చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు, ప్రబోధాత్మాక చిత్రాలు, విద్యా చిత్రాలు ఇలా ఎన్నో రకాల చిత్రాలు కూడా చలనచిత్రాలగానే పరిగణించాలి. వీటిల్లో చాలా శాతం థియేటర్లలో విడుదలు కానివే ఉంటాయి. అందులోనూ వీటన్నింటిలో కొన్ని పూర్తి నిడివి చిత్రాలు ఉండవచ్చు కొన్ని లఘు చిత్రాలు ఉండవచ్చు. ఇన్ని రకాల చలనచిత్రాలుండే అవకాశం ఉన్నందున జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా రకరకాలైన ఈ చలనచిత్రాలను గుర్తిస్తూ కొన్ని పురస్కారాలు అందచేస్తుంది.

సామాజిక అంశాల మీద చిత్రించిన ఉత్తమ సినిమాకు “బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూస్” అవార్డు, వ్యాపర ప్రకటనల నిమిత్తం తీసే సినిమాలకు “బెస్ట్ ప్రమోషనల్ ఫిల్మ్”, సైన్స్ కి సంబంధించిన సినిమాలకు “బెస్ట్ సైంటిఫిక్ ఫిల్మ్” అవార్డులను అందచేస్తున్నారు. అలాగే బయోగ్రఫీ, ఆంథ్రపోలజీ, ఎథినోగ్రఫీ, కళలు మరియు సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, యానిమేషన్, అడ్వెంచర్, ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో నిర్మించిన ఉత్తమ చలనచిత్రాలకు కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందచేయబడుతున్నాయి.

అంతే కాదు నాన్-ఫీచర్ ఫిల్మ్స్ గా పిలవబడే ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడికి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కి, ఉత్తమ సంగీత దర్శకునికి, ఉత్తమ ఎడిటర్ కి మరియు ఉత్తమ ఆడియోగ్రాఫర్ కి కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందచేయబడుతున్నాయి.

ఈ విధంగా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా చలనచిత్ర కళలోని అన్ని విభాగాలను గుర్తిస్తూ అన్ని కోణాలనూ స్పృశిస్తూ అందచేసే ఈ పురస్కారాలంటే చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవం. చలనచిత్ర కళను ఎంతగానో గుర్తిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది.

ఈ కార్యక్రమంలో ఇదే చివరి రోజు. గత పదమూడు రోజులుగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు గురించి మనం తెలుసుకున్నాం. ఈ చివరిరోజున ఈ సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న వారి వివరాలు తెలుసుకుందాం.

ఈ యేడు ఉత్తమ చిత్రంగా మళయాళం సినిమా “అడమింటే మకాన్ అబు” చిత్రం ఎన్నికకాగా ఉత్తమ దర్శకునిగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఎంపికయ్యారు. కోడి పందేల నేపథ్యంలో రూపొందిన “ఆడు కళం” సినిమాకు గానూ వెట్రిమారన్ ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా సల్మాన్ ఖాన్ నటించిన “దబాంగ్” ఎన్నికకాగా ఉత్తమ నూతన దర్శకుడిగా మరాఠీ సినిమా “బాబూ బాండ్ బాజా” కి దర్శకత్వం వహించిన రాజేష్ పింజానీ గెలుచుకున్నారు.

ఉత్తమ నటులుగా తమిళ నటుడు ధనుష్ మరియు మళయాళ నటుడు సలీం అవార్డు పంచుకోగా మరాఠీ నటి మిథాలీ మరియు తమిళ నటి శరణ్య ఉత్తమ నటి అవార్డును పంచుకొన్నారు.

2009 లో కరీంనగర్ చలనచిత్రోత్సవం లో “నవతరంగం” అవార్డు గెలుచుకున్న “లోహా గరమ్ హై” సినిమాకు ఈ సంవత్సరం “best environmental film” గా అవార్డు ప్రధానం చేయనున్నారని తెలియచేస్తున్నందుకు గర్వకారణంగా ఉంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ చూడండి.

ఈ సంవత్సరం తెలుగు సినిమాకి వచ్చిన ఏకైక అవార్డ్ ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో కె విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ”అద్వైతం” సినిమాని వరించింది. “బెస్ట్ ఎడ్యుకేషనల్/మోటివేషనల్ ఫిల్మ్” విభాగంలో “అద్వైతం” కి ఈ పురస్కారం ఇవ్వబడుతుంది.

ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం విభాగంలో తెలుగు సినిమాల కోసం ఒక అవార్డు కేటాయించినప్పటికీ సరైన సినిమాలు లేక గత మూడు నాలుగు సంవత్సరాలుగా మన సినిమాలకు ఈ అవార్డ్ రావటం లేదు. రానున్న రోజుల్లో నైనా తెలుగులో అత్యుత్తమ సినిమాలు నిర్మింపబడి అవి కేవలం ప్రాంతీయ భాషా విభాగంలోనే కాకుండా ఇంతవరకూ మనం అందుకోలేకపోతున్న ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో సైతం జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకుంటాయని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను.