Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

1954 లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడానికి ముందే తెలుగు చలనచిత్రమయిన “పాతాళ భైరవి” భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది.ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”. ఈ సినిమా బీజింగ్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్‌ సబ్‌ టైటిల్స్‌ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. ఈ విధంగా 1953 కంటే ముందే కొన్ని తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించాయి. 1954 లో మొట్టమొదటి పురస్కారాలు అందించినప్పటినుంచీ ఇప్పటివరకూ తెలుగు వారు అనేక మంది వివిధ విభాగాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకొన్నారు.

ఈ అవార్డులు ప్రకటించిన మొదటి సంవత్సరంలో మూడు విభాగాల్లో మాత్రమే అవార్డులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సంవత్సరంలో ప్రాంతీయ భాషల్లో వచ్చిన ఉత్తమ చిత్రాలను సైతం గుర్తించాలనే ఆలోచనతో బెంగాలీ, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, తమిళం మరియు హిందీ భాషల్లో వచ్చిన చిత్రాలకు రజత పతకాల్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ విధంగా 1955 లో ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో “మీర్జా గాలిబ్” అనే హిందీ చిత్రం స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా కేవి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “పెద్ద మనుషులు” సినిమా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకుంది. ఇదే సంవత్సరం సర్టిఫెకెట్ ఆఫ్ మెరిట్ అవార్డులు గెలుచుకున్న మరో రెండు తెలుగు చిత్రాలు “విప్ర నారాయణ” మరియు “తోడు దొంగలు”. ఈ విధంగా జాతీయ చలన చిత్ర పురస్కారాలు పొందిన తొలి తెలుగు సినిమాలుగా “పెద్ద మనుషులు”, “విప్రనారాయణ” మరియు “తోడు దొంగలు” చిత్రాల్ని పేర్కొనవచ్చు.

ఆ తర్వాత 1967 వరకూ ప్రతి సంవత్సరం రెండు లేదా మూడు తెలుగు సినిమాలకు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలుగా అవార్డులు అందుకున్నాయి. 1964 ప్రాంత్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమాల్లో అత్యుత్తమైన చిత్రాలను ఎంపిక చేసి వాటికి నంది అవార్డులు ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలు కావడంతో 1967 నుంచి జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ప్రాంతీయ భాషా చిత్రాలకిచ్చే అవార్డులను మూడు అవార్డులనుంచి ఒక అవార్డుకే పరిమితం చేశారు.

1967 వరకూ అవార్డులు అందుకున్న తెలుగు చిత్రాల్లో బి.యన్.రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన “బంగారు పాప”, కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “పెళ్ళి నాటి ప్రమాణాలు”, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన “నమ్మిన బంటు”, “డాక్టర్ చక్రవర్తి” సినిమాలు ఉన్నాయి.

ఆ తర్వాత కాలంలో తెలుగులో ఉత్తమ దర్శకులనదగిన బాపు, కె విశ్వనాథ్, వంశీ, బి.నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన  “సాగర సంగమం”,”శంకరాభరణం”, “సితార”, “స్వాతి ముత్యం”, “సూత్రధారులు”, “ముత్యాల ముగ్గు”, “మిస్టర్ పెళ్ళాం” , “దాసి”, “మట్టి మనుషులు” వంటి పలు సినిమాలకు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డులు అందచేశారు.

ఎన్నో ఉత్తమ బెంగాలీ సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్న మృణాళ్ సేన్ తెలుగులో చేసిన ఏకైక సినిమా “ఒక ఊరి కథ” సినిమాకు 1978లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే తమిళంలో ఎన్నో మంచి సినిమాలు నిర్మించిన భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా “సీతాకోక చిలుక” కూడా 1982 లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.

అలాగే ఉత్తమ వినోదాత్మక చిత్రానికి ఇచ్చే “బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సం ఎంటర్టైన్మెంట్” అనే విభాగంలో “శంకరాభరణం” మరియు “గీతాంజలి” సినిమాలు జాతీయ పురస్కారాలు అందుకొన్నాయి. ఉత్తమ నూతన దర్శకుడికి ఇచ్చే ఇందిరాగాంధీ అవార్డు ను మన తెలుగు వారు ఇప్పటి వరకూ మూడు సార్లు కైవసం చేసుకున్నారు. “డాలర్ డ్రీమ్స్” చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల, “తిలాదానం” చిత్రం ద్వారా కె.యన్.టి శాస్త్రి, “గ్రహణం” చిత్రం ద్వారా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ పురస్కారాలను అందుకొన్నారు.

ఈ మధ్య కాలంలో ప్రకాశ్ కోవెల మూడి దర్శకత్వంలో వచ్చిన “బొమ్మలాట”, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన “ఐతే”, నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన “షో” , కె.ఎన్.టి శాస్త్రి దర్శకత్వంలో వచ్చిన “కమ్లి” సినిమాలు ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకొన్నాయి.కానీ గత మూడు నాలుగేళ్ళుగా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా కూడా ఏ తెలుగు సినిమా ఎంపిక కాకపోవడం మన దురదృష్టం. ఈ విషయం గురించి వివిధ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ వేర్వేరు విభాగాల్లో తెలుగువారు ప్రతి ఏడూ జాతీయ అవార్డులు పొందుతూనే ఉన్నారు.