Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీతం ,సాహిత్యం, శిల్పం మరియు ఇతర లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. చలనచిత్రానికి దర్శకుడు ముఖ్యమే కానీ ఒక చలనచిత్ర నిర్మాణం కేవలం దర్శకుడి ఒక్కడి వల్లే కాదు. నిజానికి చలనచిత్రం లోని అన్ని విభాగాల నిపుణుల చేత తనకు కావలసినట్టుగా పని చేయించుకోగలిగేవాడే దర్శకుడు. చలనచిత్ర కళలో చివరిగా మనకి తెరమీద కనిపించేది నటీనటులే అయినప్పటికీ తెర వెనుక దర్శకుడితో పాటు ఎందరో సాంకేతిక నిపుణులు సమిష్టిగా కృషి చేస్తే గానీ చలనచిత్రం పూర్తవదు.

ప్రస్తుతం చలనచిత్ర నిర్మాణంలో ప్రతి విభాగానికి ఒక ప్రత్యేకత ఉంది. మొదట్లో నిశబ్ద చిత్రాల రోజుల్లో కేవలం సినిమాటోగ్రఫీ విభాగానికి మాత్రమే అత్యంత ప్రాముఖ్యత ఉండేది. రాను రానూ చలనచిత్రాల్లో ఎడిటింగ్ యొక్క ప్రత్యేకత ఎక్కువైంది. ఆ తర్వాత మూకీ చిత్రాలు పోయి టాకీ చిత్రాలొచ్చినప్పుడు శబ్దగ్రహణానికి ప్రాముఖ్యత పెరిగింది. సంగీత ప్రాధాన్యమైన చిత్రాల నిర్మాణం పెరిగే కొద్దీ సంగీత దర్శకులు, నేపధ్య గాయకుల ప్రాముఖ్యత పెరిగింది.

తర్వాత కంప్యూటర్ జెనెరటేడ్ చిత్రాలతో నిర్మించిన యానిమేషన్ సినిమాల నిర్మాణం పెరగడంతో గ్రాఫిక్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఈ విధంగా చలనచిత్రం కళగా అబివృద్ధి చెందుతున్న కొద్దీ నూతన సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమకు అవసరమయ్యారు. వీరందరికి కృషి ఫలితంగానే మనం థియేటర్లో హాయిగా కూర్చుని చూసే చలనచిత్రాలు చూడగలుగుతున్నాము. చలనచిత్ర నిర్మాణంలోని ఈ మార్పులు జరుగుతున్నట్టే జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందచేయడంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

చలనచిత్ర నిర్మాణంలో భాగమైన ప్రతి శాఖకూ సంబంధించిన సాంకేతిక నిపుణులు మరియు కళాకారులని గుర్తిస్తూ భారత ప్రభుత్వం జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందచేస్తుంది. స్క్రీన్ ప్లే , సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, అర్ట్  డైరెక్షన్, మేకప్, కాస్ట్యూం డిజైన్, సంగీతం, పాటలు, నేపధ్య సంగీతం, కొరియోగ్రఫీ, ఆడియోగ్రఫీ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు రజత కమలం అవార్డులను అందచేస్తుంది.

తన సినిమాలకు సొంతంగా స్క్రీన్ ప్లే రచనలు చేసుకునే దర్శకుల్లో ప్రముఖులైన సత్యజిత్ రే, మృణాళ్ సేన్, అదూర్ గోపాల్ కృష్ణన్ లు ఉత్తమ దర్శకులుగానే కాకుండా ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితలుగా కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకొన్నారు. ఈ అవార్డు అందుకొన్న వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది MT వాసుదేవన్ నాయర్ గురించి. ప్రముఖ మళయాళీ రచయిత అయిన వాసుదేవన్ నాయర్ ఈ అవార్డుని నాలుగు సార్లు గెలుచుకున్నారు. ఈయన రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా కొన్ని అవార్డులు అందుకొన్నారు. స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు అందుకొన్నవారిలో విశేషంగా చెప్పుకోవాల్సింది అరుంధతీ రాయ్ గురించి. “గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్” అనే నవలతో ఆమె అందరికీ పరిచయమయినప్పటికీ “ఇన్ విచ్ ఆనీ గివ్స్ ఇట్ థోజ్ వన్స్” అనే ఆంగ్ల చిత్రానికి ఆమె స్క్రీన్ ప్లే రచించడమే కాకుండా 1989 లో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు కూడా అందుకున్నారు.

ఎడిటింగ్ విభాగంలో అత్యధికంగా అవార్డులు అందుకొన్నవారిలో ప్రముఖులుగా రేణు సలూజా, శ్రీకర్ ప్రసాద్ మరియు గంగాధర్ నస్కర్ లను పేర్కొనవచ్చు. ఉత్తమ ఎడిటర్ గా మొట్టమొదటి జాతీయ పురస్కారం అందుకుంది మన తెలుగు వాడే. “సిరిసిరిమువ్వ” చిత్రానికి గానూ కె.బాబూరావు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన “సితార” సినిమాకి ఎడిటర్ గా వ్యవహరించిన అనిల్ మల్నాడ్ కూడా ఈ అవార్డుని గెలుచుకున్నారు.

సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ వాడడం అనేది అప్పటి విఠలాచార్య సినిమాలనుంచి ఉన్నప్పటికీ రాను రాను జానపద కథలతో సినిమాల నిర్మాణం తగ్గడంతో స్పెషల్ ఎఫెక్ట్స్ వినియోగం కూడా తగ్గిపోయింది.కానీ మామూలు సినిమాల్లో కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ వినియోగించడం అనేది గత ఇరవై సంవత్సరాలుగానే జరుగుతోంది. ప్రస్తుతం స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది చలనచిత్ర పరిశ్రమలో ఒక కీలక విభాగంగా ఏర్పడింది.  1995 నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ రూపొందించే కళాకారులకు కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించబడింది.  భారతదేశంలో అందరికంటే దక్షిణాది సినిమాల్లోనే స్పెషల్ ఎఫెక్ట్స్ వాడకం ఎక్కువగా ఉండడం మూలాన ఈ అవార్డ్ పొందిన వారిలో అధిక శాతం తెలుగు మరియు తమిళం వారే ఉన్నారు. ఈ సంవత్సరం ఈ విభాగంలో అవార్డు అందుకోబోతున్న సినిమా “ఎందిరన్”. గత సంవత్సరం ఈ అవార్డు అందుకొన్న సినిమా “మగధీర”.

ఈ విధంగా చలనచిత్రాల్లోని అన్ని శాఖలను గుర్తిస్తూ ఆయా కళాకారులకు, సాంకేతిక నిపుణులకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందచేయడం ద్వారా ప్రభుత్వం చలనచిత్ర కళ అబివృద్ధికి ఎంతో సాయపడుతున్నట్టే!