Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

మన దేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో చలనచిత్రాలు నిర్మించే భాషల్లో తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సంఖ్య కలిపితే ప్రపంచం లోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే ప్రాంతంగా దక్షిణ భారతదేశాన్ని పేర్కొనవచ్చు.
1954 లో మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు అందచేసినప్పటినుంచీ 1966 వరకూ దక్షిణ భారతదేశానికి చెందిన కథాచిత్రాలేవీ స్వర్ణ కమలం గెలుచుకోలేదు. డాక్యుమెంటరీ మరియు ఇతర విభాగాల్లో స్వర్ణ కమలం అవార్డులు గెలుచుకున్నప్పటికీ మొదటిసారిగా దక్షిణాదికి చెందిన సినిమా స్వర్ణ కమలం గెలుచుకుంది మాత్రం 1966 లోనే. ప్రముఖ మలయాళీ రచయిత తక్కాళి శివశింకర్ పిళ్ళై రచించిన నవల “చెమ్మీన్” అధారంగా రాము కారియత్ దర్శకత్వంలో వచ్చిన “చెమ్మీన్” అనే సినిమాతో ఈ అవార్డు అందచేయబడింది.

దక్షిణ భారత సినిమా అవార్డుల ప్రస్థానం కాస్తా ఆలస్యంగా మొదలయినప్పటికీ ఆ తర్వాత కాలంలో దాదాపు ఇరవై కి పైగా అవార్డులు దక్షిణాది సినిమాలకు దక్కాయి.
గత యాభై ఎనిమిది ఏళ్ళగా ఉత్తమ చిత్రానికి గానూ అందచేసిన స్వర్ణ కమలం అవార్డులను విశ్లేషిస్తే అందులో అధిక శాతం అంటే 21 సినిమాలు బెంగాలీవి. ఆ తర్వాత స్థానం హిందీ మరియు మళయాళం భాషల సినిమాలకు దక్కుతాయి. హిందీ భాషలో నిర్మించిన 11 సినిమాలు ఇప్పటివరకూ స్వర్ణ కమలం అవార్డును దక్కించుకున్నాయి. అలాగే మళయాళం వచ్చిన 11 సినిమాలు. ఈ మూడు భాషల్లో కాకుండా తమిళం, కన్నడ, అస్సామీస్, సంస్కృతం, మరాఠీ భాషల్లో వచ్చిన చిత్రాలకు మాత్రమే ఇంతవరకూ స్వర్ణకమలం అవార్డులు దక్కాయి. ఇప్పుడు మనం దక్షిణ భారత ప్రాంతానికి చెందిన సినిమాలు అవి గెలుచుకున్న అవార్డుల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం అన్ని దక్షిణాది భాషలు కలిపితే సంవత్సరానికి ఏడు వందలకు పైగానే సినిమాలు నిర్మింపబడుతున్నాయి. సంఖ్యాపరంగా ఇంత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతీయ సినిమాకు అంతే ఎక్కువగా జాతీయ సినిమా పురస్కారాలు కూడా అందుకున్నాయి. “చెమ్మీన్” చిత్రంతో మొదటి అవార్డు గెలుచుకున్నప్పటినుంచీ దాదాపు ప్రతి సంవత్సరం అన్ని ముఖ్య విభాగాల్లో దక్షిణాది సినిమాలు అవార్డులు గెలుచుకుంటూనే ఉన్నాయి.

ముఖ్యంగా పదకొండు స్వర్ణ కమలాలు అందుకున్న మళయాళం సినిమాల గురించి తెలుసుకుంటే బెంగాలీ సినిమా ద్వారా భారతదేశపు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించు తెచ్చిన సత్యజిత్ రే లాగే కేరళలో అదూర్ గోపాల్ కృష్ణన్ తన సినిమాల ద్వారా ఎంతో కృషి చేశారు. సత్యజిత్ రే లాగే అదూర్ కూడా తన మొదటి సినిమా “స్వయంవరం” తోనే ఉత్తమ చలనచిత్రం అవార్డు అందుకొన్నారు. బెంగాలీ లో మృణాళ్ సేన్ నిర్మించిన “భువన్ సోమ్” సినిమా లాగే “స్వయంవరం” సినిమా కూడా అక్కడి చలనచిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే అక్కడ కూడా సమాంతర సినిమా ఉద్యమం మొదలైంది అని చెప్పవచ్చు.

“స్వయంవరం” తర్వాత అదూర్ గోపాల్ కృష్ణన్ రూపొందించిన ప్రతి చలనచిత్రం కూడా ఏదో ఒక జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందడమో లేక అంతర్జాతీయ అవార్డు పొందడమో జరుగుతూ వస్తుంది. ఈయన తీసిన పదకొండు సినిమాలకు గానూ వివిధ విభాగాల్లో మొత్తం 16 జాతీయ చలనచిత్ర పురస్కాలు అందచేయబడ్డాయి. అదూర్ గోపాల్ కృష్ణన్ తో మొదలయిన మళయాళీ సమాంతర సినిమా ఉద్యమం తో ఉత్తేజితులై దర్శకులైన MT వాసుదేవన్ నాయర్, షాజి కరుణ్ మరియు అరవిందన్ లాంటి దర్శకులు నిర్మించిన వివిధ మళయాళీ చిత్రాలకు కూడా స్వర్ణకమలం పురస్కారాలు అందచేయబడ్డాయి.

కేరళ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు నిర్మించిన రాష్ట్రం గా కర్నాటక రాష్ట్రాన్ని గుర్తించవచ్చు. తెలుగు, తమిళంలోలాగే కన్నడ సినిమాల్లో అధిక శాతం కమర్షియల్ సినిమాలే నిర్మితమైనప్పటికీ ఆ రాష్ట్రంలో కూడా కొంత మంది దర్శకుల కృషి వల్ల కళాత్మక విలువలు, సామాజిక స్పృహ కలిగిన సినిమాలు ప్రతి సంవత్సరం నిర్మితమవుతూనే ఉన్నాయి. కన్నడ దర్శకులైన గిరీశ్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు స్వర్ణ కమలం అవార్డు గెలుచుకున్నాయి. చాలా ఏళ్ళుగా తమిళ్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు రానప్పటికీ 1991 లో కె ఎస్ సేతుమాధవన్ దర్శకత్వంలో వచ్చిన “మరుపక్కం” సినిమాతో తమిళ సినిమాకి మొదటి జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన “కాంచీ పురం” అనే సినిమా తో తమిళ సినిమాకి రెండో సారి ఈఅవార్డు లభించింది

తెలుగులో వచ్చిన ఏ సినిమా కూడా ఇంతవరకూ ఈ అవార్డు దక్కించుకోలేకపోవడం మన దురదృష్టం. కానీ తెలుగు భాషలో నిర్మితమైన సినిమాలకు స్వర్ణ కమలం అవార్డు అయితే దక్కలేదు కానీ మిగత ఎన్నో విభాగాల్లో తెలుగు వారు అవార్డులు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ వివరాలన్నీ మరో సారి చర్చించుకుందాం.

5 Comments
  1. Sowmya September 2, 2011 / Reply
    • వెంకట్ September 2, 2011 / Reply
      • Sowmya September 2, 2011 /
  2. వెంకట్ September 2, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *