Menu

రేపటి సినిమా మాండలిక సినిమా

తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్‌వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్‌పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్‌పై సృష్టిస్తున్నాయి.

సినిమా: ఒరియరొదరి అసల్
సంవత్సరం: 2011
దర్శకుడు: విజయ్‌కుమార్ కొడిమాల్ బెయిల్
భాష: తుళు

ఈ సినిమా కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ‘జ్యోతిటాకీస్’లో గత 120 రోజులుగా ప్రదర్శితమవుతోంది. అత్యధిక రోజులు నడిచిన సినిమాగా అది ఓ రికార్డు. కన్నడ, తమిళ భాషల్లోని భారీ హైటెక్ సినిమాల దాడిని తట్టుకుని ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. తుళు భాషా ప్రజల స్వీయ ఆత్మను మెయిన్‌వూస్టీమ్ కన్నడ సినీ పరిక్షిశమ(శాండల్‌వుడ్ అంటారు)గుర్తించేలా చేసింది.

కాలం: ఫిబ్రవరి మాసం 2011వ సంవత్సరం
స్థలం: పాట్నా, బీహార్ రాష్ట్ర రాజధాని
వేడుకలు: భోజ్‌పురి సినిమా స్వర్ణోత్సవాలు

బాలీవుడ్ హిందీ సినిమాలకు పెద్ద మార్కెట్ బీహార్. ప్రధాన భాష హిందీనే కానీ ఇక్కడి గ్రామీణ స్థానిక ప్రజల భాష-యాస మాత్రం భోజ్‌పురి. రాజ్యాంగం గుర్తించని ప్రజల భాష. ఇది ప్రజల భాష కనుకే మెయిన్ స్ట్రీమ్ హిందీ మర్రిచెట్టు కింద సైతం భోజ్‌పురి భాష-సంస్కృతి- సినిమాలు గత యాభై ఏళ్లుగా నిర్మాణమవుతున్నాయి. అందుకే ఇది బాలీవుడ్ బడా సినిమాలకు ధీటుగా సామాన్య ప్రజలు తమ మాండలిక భాషా సినిమాలని సెలవూబేట్ చేసుకున్న సందర్భం.

సినిమా: జై బోలో తెలంగాణ
దర్శకుడు: ఎన్. శంకర్
విడుదల తేదీ: 2011 ఫిబ్రవరి 4
భాష: తెలంగాణ

భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న రెండవ పెద్ద సినీ పరిక్షిశమ తెలుగు సినీ రంగం. 1956లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి నైజాం ప్రాంతం అనబడే తెలంగాణ ప్రజలు తమదైన ఉనికి, అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. 1969లో ఉవ్వెత్తున ఎగసిన ఈ ఉద్యమం ఇప్పుడు సునామీగా మారింది. అదే సమయంలో కళలు, సాహిత్యం, సినిమా కూడా తెలంగాణ ప్రజల అస్తిత్వ వేదనకు అద్దం పట్టే కళారూపాలను సృష్టించాయి. అలా మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు సమాంతరంగా తెలంగాణ భాషలో సమకాలీన వాస్తవిక కథాంశంతో వచ్చిన ఈ సినిమా తెలంగాణ ప్రజల నీరాజనాలందుకుంది.

భారతీయ సినిమా పరిణామకమం

భారతీయ సినిమా మరో రెండేళ్లలో నూరు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోబోతోంది(1913లో తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ విడుదలయింది). ఈ వందేళ్లలో మనదేశంలో సినిమా పరిణామ క్రమాన్ని ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే అది మూడు దశలుగా జరిగిందని అర్థమవుతుంది. సినిమా విస్తరించే క్రమంలో ‘మెయిన్‌వూస్టీమ్ సినిమా’ అనేది మొదటి దశగానూ, ‘రీజనల్ సినిమా’ రెండో దశ కాగా, మూడో దశ ‘మాండలిక సినిమా’ అని చెప్పాలి. ఆ లెక్కన హిందీ సినిమా మొదటి దశకు, తెలుగు సినిమా రెండో దశకు, తెలంగాణ సినిమా మూడో దశకు ప్రతినిధులన్నమాట. ఈ నేపథ్యంలోంచి ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచంలో బలమైన ముద్రను వేస్తున్న భోజ్‌పురి, తుళు, మైథిలి, తెలంగాణ…ఇతర మాండలిక భాషా చిత్రాలలోని ప్రత్యేకతలను- విశిష్టతలను వాటి గమనంలో ప్రముఖమైన ఘట్టాలను అవలోకించడం అవసరమవుతోంది.

భోజ్‌పురి సినిమా

ఉత్తర భారతదేశంలోని బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్, నేపాల్‌లోని తెరాయ్ ప్రాంతంలో గ్రామీణ స్థానిక ప్రజలు మాట్లాడే భాష ఇది. ఈ ప్రాంతాలల్లో పుట్టి పెరిగిన ప్రజలు కొందరు విదేశాలకు వలస వెళ్లడంతో భోజ్‌పురి భాషా చిత్రాలకు ‘ఓవర్సీస్’లో కూడా మంచి మార్కెట్ ఉంది. అలా బ్రెజిల్, ఫిజీ, మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాలు భోజ్‌పురి భాషా చిత్రాలకు ఇప్పుడు కేంద్రాలుగా మారాయి.

అయితే భోజ్‌పురి భాషలో సినిమాలు తీయాలనే ఆలోచన రావడం వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మన దేశ తొలి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ బీహారీ. ఆయన ఓ ఫిల్మ్ అవార్డుల ఫంక్షన్‌లో అప్పటి బాలీవుడ్ నిర్మాత అయిన నాసిర్ హుస్సేన్‌ని సన్మానించారు. ఆ సందర్భంలో రాష్ట్రపతి తమ ప్రాంతీయ భాష అయిన భోజ్‌పురిలో సినిమా తీయాలని నాసిర్‌కు సూచించారు. దానికి వెంటనే స్పందించిన నాసిర్ భోజ్‌పురి భాషలో తొలి సినిమాను నిర్మించాడు. ఆ సినిమానే ‘గంగా మైయ్యా తోహే పియారీ చడై బో’(గంగమ్మ తల్లీ నీకో పచ్చ చీరనిస్తా). ఈ సినిమాకి కుందన్‌కుమార్ దర్శకత్వం వహించగా 1962లో విడుదలయింది. ఈ సినిమా జనాదరణ పొందడంతో ఆ తర్వాత బిదేషియా(1963), గంగ(1965) వంటి సినిమాలు వచ్చాయి. కానీ అప్పటికే బాలీవుడ్ హిందీ సినిమాలు మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా రావడం మొదపూట్టాయి. అలా హిందీ సినిమాల వెల్లువలో భోజ్‌పురి సినిమాలు వెనక్కితగ్గాయి.

మళ్లీ 1980 దశకంలో భోజ్‌పురి సినిమాల వెల్లువ మొదలైంది. ఈ సారి బాలీవుడ్ హిందీ వంటి మెయిన్‌వూస్టీమ్ సినిమాలా కాకుండా లోకల్ నేటివ్ కల్చర్- కథలతో సినిమాలను తీయడం మొదలు పెట్టారు. అలా 1982లో వచ్చిన ‘నదియా కె పార్’ సినిమా భోజ్‌పురి ప్రజలనే కాకుండా హిందీ పాలిత రాష్ట్రాలలో కూడా విడుదలై సూపర్‌హిట్ అయింది. అదే వరుసలో ‘హమర్ భావ్‌జీ’(1983), ‘మాయ’(1989)వంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. కానీ 1990 దశకంలో వెల్లు మెయిన్‌వూస్టీమ్ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల దండయావూతలో భోజ్‌పురి సినిమాలు ఆగిపోయాయి. బాలీవుడ్ హిందీ సినిమాలు రెండుసార్లు భోజ్‌పురి మాండలిక సినిమాలని కబళించి వేసినప్పటికీ భోజ్‌పురి సినిమా కనుమరుగైపోలేదు. ప్రజల్లో భోజ్‌పురి భాష- సంస్కృతి ఉన్నప్పుడు కళారూపమైన సినిమా మాత్రం ఎంతకాలం అదృశ్యమై ఉండిపోతుంది? అందుకే మళ్లీ 2001లో భోజ్‌పురి సినిమా ‘సైయ్యా హమర్ (నా ప్రేయసి)’, కొత్త హంగులను సంతరించుకుని రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా సూపర్‌హిట్ అవడంతో భోజ్‌పురి సినిమా మళ్లీ జీవం పోసుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన రవికిషన్ భోజ్‌పురి సూపర్‌స్టార్ అయ్యాడు. అలాగే ‘ససురా బడా పైస్వాలా’(2005) సినిమాతో మనోజ్ తివారీ మరో సూపర్‌స్టార్‌గా మారాడు. నగ్మా, రంభ వంటి ఇతర భాషా నటీమణుపూంతోమంది భోజ్‌పురి సినిమాలవైపు దృష్టి మళ్లించారు. ఆఖరికి భోజ్‌పురి సినిమా ఏ స్థాయికి వెళ్లిందంటే అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాల్లో నటించేంత! రోజు రోజుకీ భోజ్‌పురి సినిమాలకు పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా మిథున్ చక్రవర్తి కూడా ‘భోలే శంకర్’ (2008) సినిమాలో నటించారు.

తుళు సినిమా

ప్రపంచంలోని ప్రాచీన భాషలలో తుళు భాష ఒకటి. ఆది ద్రవిడ భాషగానూ, తమిళం కన్నా ప్రాచీనత కలిగిన భాషగానూ ప్రసిద్ధి. తుళు భాష సంస్కృతి ప్రస్తుతం కర్ణాటక పశ్చిమ తీరం, దక్షిణ తీరంలోనూ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోనూ వ్యాప్తిలో ఉంది. ప్రస్తుతం ఈ భాష మాట్లాడే ప్రజల సంఖ్య పందొమ్మిన్నర లక్షలు.

కన్నడ, తమిళ భాషా సంస్కృతుల దాడిలో అణగారిపోయిన తుళు భాష గత కొన్ని దశాబ్దాలుగా తనదైన స్వరాన్ని వినిపించే ప్రయత్నాలను బలంగా చేస్తోంది. ఆ దిశగా చేసిన కృషిలో తొలి అడుగు 1971లో ‘ఎన్న తంగడి’ అనే సినిమాతో మొదలైందని చెప్పాలి. ఈ భాషలో ఇప్పటి వరకూ ‘దేవేర్’, ‘కంచిల్దె బాలె’ వంటి 37 సినిమాలు వచ్చాయి. వీటిలో రామచంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘శుద్ధ’ (2005) సినిమా డిజిటల్ ఫార్మాట్‌లో తీసిన తొలి తుళు సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేగాక, ఈ సినిమా 2006లో జరిగిన ‘ఓసియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా అవార్డును సాధించడంతో అంతర్జాతీయంగా తుళు సినిమాలపై దృష్టి పడింది.

కాగా, ‘బంగార్ పట్లేర్’(1994), ఇటీవలి ‘ఒరియకొదరి అసల్’ సినిమాలు కమర్షియల్‌గా కూడా హిట్ అవడంతో మెయిన్‌వూస్టీమ్ కన్నడ నిర్మాతల దృష్టి తుళు సినిమాలపై పడింది. అయినా తుళు సినీ పరిక్షిశమ ఇంకా వ్యవస్థీకృతం కాలేదు. నిర్మాణం- ప్రదర్శనం- పంపిణీ… వంటి విషయాల్లో ఇంకా వెనకబడే ఉంది. పైగా ఈ సినిమా మార్కెట్ కర్ణాటకలోని దక్షిణ కన్నాడ్, ఉడుపి, కేరళలోని కాసర్‌గడ్ తాలుకాలలోకి మాత్రమే పరిమితం. ఐనప్పటికీ తుళు సినిమా కర్ణాటక సముద్ర తీరవూపాంతంలోని కోస్తా ప్రజల విశిష్ట సంస్కృతిని ప్రతిబింబించడంలో, స్థానిక ప్రజలు ఐడెంటిఫై చేస్కోవడంలో ముందుంటూ వస్తోంది. తాజాగా తుళు సినీ ప్రముఖులు కొందరు కన్నడ సినీ పరిక్షిశమ నుంచి విడిపోయి ప్రత్యేకంగా ‘తుళు ఫిల్మ్ చాంబర్’ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఆరంభించారు. ఇది తుళు సినీ పరిక్షిశమ ఎదగడానికి దోహదపడే దిశగా సాగిన తొలి చర్యగా అభివర్ణించారు. మెయిన్‌వూస్టీమ్ కన్నడ పరిక్షిశమ ఈ చర్యను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న తుళు స్వరం ముందు తలవంచక తప్పడం లేదు.

మాండలిక సినిమా అంటే..

ప్రపంచంలో ఎక్కడైనా ప్రధాన స్రవంతి భాషలు- సంస్కృతులకు సమాంతరంగా ఉప భాషలు- ఉప సంస్కృతులు, సాహిత్యం, కళలు, కూడా తమదైన ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఉప సంస్కృతులను హైలైట్ చేసే సినిమానే మాండలిక సినిమా. ఇంకా చెప్పాలంటే నిర్ణీత ప్రాంతానికి సంబంధించిన ప్రజల నిర్దిష్ట జీవన శైలిని ప్రతిబింబించే సినిమా. వారి భాష-యాస-గోసలను తెరపై చూపించే సినిమా. ఈ సినిమాలకి నెటివిటీనే జీవం. స్థానిక మూలాలు- విశ్వాసాలే స్ఫూర్తి. గ్లోబలైజేషన్ వెల్లువలో కొట్టుకుపోతున్న మెయిన్‌వూస్టీమ్ సినిమా నుంచి మనదైన సొంత సినిమాను రక్షించే సాంస్కృతిక రూపం మాండలిక సినిమా.

మైథిలి సినిమా కూడా…

హిందీ భాషకు సమాంతరంగా బీహార్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాట్లాడే మాతృభాష- మైథిలి. ఈ భాష మాట్లాడే ప్రజలు ఉత్తర భారతదేశంలో మొత్తం ఏడు కోట్ల మంది ఉంటారని అంచనా. ప్రజల నాల్కలమీద, ప్రజల గుండెల్లో నడయాడుతున్న ఈ భాష మంచి సాహిత్యాన్నే అందించింది. ‘మధుబని’ వంటి చిత్రకళని ఇంకా కాపాడుకుంటూ వస్తోంది. అదే దిశగా సినిమాకళని కూడా మైథిలి భాష ఆవిష్కరించింది.

మొత్తం మీద మైథిలి భాషా చిత్రాలకు 46 ఏళ్ల చరిత్ర ఉంది. ఫణి మజుందార్ డైరెక్షన్‌లో 1965లో వచ్చిన ‘కన్యాదాన్’ సినిమా మైథిలి భాషలో తొలి సినిమా. ఆ తర్వాత వచ్చిన ‘మమతా గావే గోవ్’ (1984), ‘సస్తా జినగై మహాగ్ సినార్’ (1999) ‘కఖన్ హర్బ్ దుఖ్ మోర్’(మైథిలీ కవి విద్యాపతి జీవితం ఆధారంగా వచ్చిన సినిమా), ‘భావ్‌జీ మాయ్’ వంటి సినిమాలు ప్రజాదరణ పొందాయి. బాలీవుడ్ హిందీ మెయిన్‌వూస్టీమ్ సినిమాల దాడిని తిప్పికొడుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నాయి.

మన ఆత్మ.. మన జీవం… మాండలిక సినిమా

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు, గ్లోబలైజేషన్ వంటి కారణాల వల్ల రోజురోజుకీ మనం పరాయీకరణలో కూరుకుపోతున్నాం. దీనికి తోడు మన అంతర్గతంగా ఉన్న ప్రధాన స్రవంతి సంస్కృతి కూడా ఆధిపత్య ధోరణితో, రకరకాల మాధ్యమాల ద్వారా తెలంగాణ వంటి సబ్‌కల్చర్‌ని అణగదొక్కుతోంది. టీవీల్లో, పత్రికల్లో, సినిమాల్లో ఉపయోగించే భాష, కథా వస్తువుల ద్వారా రోజురోజుకీ మనదైన భాషనీ, సంస్కృతినీ, పండగలనీ మనకు తెలియకుండానే మనం మర్చిపోతున్నాం. సినిమాల్లో కనిపించేదే తెలుగు సంస్కతి అనీ, వినిపించేదే తెలుగు భాష అనీ మెస్మరైజ్ చేయబడుతున్నాం. మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. మన తెలంగాణ భాష-యాసలో ఉన్న అందం, అమ్మతనం, ఆత్మీయత, సొగసులను మనం కోల్పోతున్నాం. మన దసరాని, మన బతుకుమ్మని భావితరాలకు అందించాలి. ఆ దిశగా తెలంగాణ మాండలిక సాహిత్యమే కాదు. ఇప్పుడు తెలంగాణ సినిమా రావాలి.

– ఎన్. శంకర్, దర్శకుడు.

రేపటి సినిమా

సంస్కృతి- సాహిత్యం- కళలు అనేవి మహా వృక్షం లాంటివి. మర్రిచెట్టు వాటి ప్రధాన స్రవంతి సంస్కృతులు ఊడలు దిగే స్థాయిలో విస్తరిస్తున్నప్పటికీ అదే నేలపై మొలకెత్తిన ఉప సంస్కృతులు కూడా తమదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తుంటాయి. అనివార్యంగా జరిగే ఈ సామాజిక- సాంస్కృతిక పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి సినిమా పరిణామాన్ని విశ్లేషించడమంత మంచి ఉదాహరణ మరోటి ఉండదు. ప్రజలంతా ముక్తకం ప్రత్యేక స్వరాలను, అస్తిత్వ వేదనలను దేశవ్యాప్తంగా వెల్లడిస్తున్న కాలం ఇది. తమదైన ఉనికి కోసం ఉద్యమిస్తున్న పోరాట సమయమిది. ఆ దిశగా రేపటి సినిమా అంటే ఖచ్చితంగా ‘మాండలిక సినిమా’నే అని నినదిస్తున్న తరుణమిది. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ సినిమా విస్తృతంగా రావాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు.