Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అతి ముఖ్యమైన అవార్డులుగా భావించే వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలుగులో నిర్మించిన ఏ చలనచిత్రం కూడా ఉత్తమ చలన చిత్రం గా జాతీయ అవార్డు పొందలేదు. అలాగే ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు విభాగాల్లో కూడా మన వాళ్ళకి ఇంతవరకూ అవార్డులు దక్కలేదు. హిందీ తర్వాత అంత పెద్ద చలనచిత్ర పరిశ్రమగా పిలువబడే మన తెలుగు సినిమాకి ఇంకా జాతీయ స్థాయిలో అంత గుర్తింపు రాకపోవడం వెనుక చాలానే కారణాలు ఉండి ఉంటాయి. కానీ ఉత్తమ నటి విభాగంలో మాత్రం మన పరిస్థితి చెప్పుకోదగినట్టుగానే ఉంది. ప్రముఖ తెలుగు నటి శారద 1969 లో జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. కానీ ఈ అవార్డు ఆమెకు “తులాభారం” అనే మళయాళం సినిమాలో నటించినందుకు వచ్చింది. అలాగే “స్వయంవరం” అనే మరో మళయాళం సినిమాలో నటించినందుకు గాను ఆమె 1973 లో మరో సారి ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. కానీ 1979 లో ముచ్చటగా మూడవసారి శారద ఈ పురస్కారాన్ని అందుకొన్నది మాత్రం మన తెలుగు సినిమా “నిమజ్జనం” లో నటించినందుకే.

శారద తర్వాత ఈ అవార్డు పొందిన తెలుగు నటీమణుల్లో విజయశాంతి మరియు అర్చన ఉన్నారు. 1991 లో కర్తవ్యం సినిమాలో ప్రదర్శించిన అధ్బుత నటనకు విజయశాంతి ఈ అవార్డు గెలుచుకోగా, 1988 లో దాసి సినిమాలో నటించినందుకు గాను అర్చన ఈ అవార్డు గెలుచుకొన్నారు. తెలుగు వారైన టబు మరియు వహీదా రెహమాన్ లు ఈ అవార్డు గెలుచుకున్నప్పటికీ వారికి ఈ అవార్డు లభించింది హిందీ సినిమాల ద్వారానే. శారద, అర్చన మరియు విజయశాంతిల తర్వాత ఉత్తమ సహాయనటుడు విభాగంలో “యజ్ఞం” చిత్రానికి గానూ పి.యల్.నారాయణ, ఉత్తమ బాల నటుడు విభాగంలో “బొమ్మలాట” లో నటించిన సాయి, “లిటిల్ సోల్జర్స్” లో నటించిన కావ్య, “భద్రం కొడుకో” లో నటించిన సంతోష్ లు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకొన్నారు. అలాగే “అన్నమయ్య” గా నటించిన నాగార్జున, “అంత:పురం” లో నటించిన ప్రకాశ్ రాజ్, “మయూరి” సినిమాలో నటించిన సుధాచంద్రన్, స్త్రీ సినిమాలో నటించిన రోహిణి లు జాతీయ అచలనచిత్ర పురస్కారాల్లో స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కించుకొన్నారు.

నటీ నటుల తర్వాత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇతర కళాకారులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను చూస్తే ముఖ్యంగా ప్రముఖ తెలుగు దర్శకుడు నీలకంఠ  గురించి ప్రస్తావించుకోవాలి. కేవలం రెండు ప్రధాన పాత్రలతో అతి తక్కువ బడ్జెట్ లో ఒకే ఒక్క లొకేషన్ లో నీలకంఠ తీసిన చిత్రం “షో”. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన నీలకంఠ కి ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో 2002 లో జాతీయా చలనచిత్ర పురస్కారాన్ని అందచేశారు. ఇంతవరకూ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్న ఏకైక తెలుగు సినిమా “షో”. స్క్రీన్ ప్లే తో పాటు మిగతా విభాగాల్లోనూ తెలుగు సినిమాలకు అవార్డు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో “ముత్యాల ముగ్గు” సినిమా ద్వారా ఇషాన్ ఆర్య మరియు “దాసి” సినిమా ద్వారా ఎకేబీర్ ఈ అవార్డు సాధించారు.

ఉత్తమ ఎడిటర్ గా మొట్టమొదటి జాతీయ పురస్కారం అందుకుంది మన తెలుగు వాడే. “సిరిసిరిమువ్వ” చిత్రానికి కె.బాబూరావు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన “సితార” సినిమాకి ఎడిటర్ గా వ్యవహరించిన అనిల్ మల్నాడ్ కూడా ఈ అవార్డుని గెలుచుకున్నారు.

ఎం.ఎం.కీరవాణి, రమేష్ నాయుడు, ఇళయరాజా, విద్యాసాగర్, కెవిమహదేవన్ లాంటి తెలుగు సంగీత దర్శకులు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. నేపథ్య గాయకులైన ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, వాణి జయరాం, జేసుదాస్ లు కూడా తెలుగు సినిమాల్లో పాడిన పాటలకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకొన్నారు. ఉత్తమ పాటల రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకొన్నవారిలో శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తి మరియు సుద్దాల అశోక్ తేజ ఉన్నారు. ఇవి కాకుండా మగధీర సినిమాలో పాటలకు నృత్యాలు సమకూర్చిన శివశంకర్ కి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డ్ అందుకొన్నారు.”మగధీర” మరియు “అంజి” సినిమాలు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డులు గెలుచుకున్నాయి. అలాగే ఈ మధ్యనే “హోప్” సినిమా ద్వారా సతీష్ కాసెట్టి మరియు “అద్వైతం” సినిమా ద్వారా ప్రదీప్ మాడుగల, యానిమేషన్ కేటగిరిలో “కిట్టు” చిత్రానికి భార్గవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న తెలుగు వారి జాబితాలో చేరారు.

వీరు కాకుండా దాదా సాహెబ్ అవార్డు గ్రహీతల్లో   చాలామంది తెలుగు వారు ఉండడం మన గర్వకారణం. డి.రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు, ఎల్వీ ప్రసాద్, బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి మరియు బొమ్మిరెడ్డి నాగి రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలు గుర్తించి వారిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ తో పురస్కరించారు. వీరు మాత్రమే కాకుండా ఈ అవార్డు పొందిన తొలి సినిమాటోగ్రాఫర్ అయిన వికే మూర్తి తెలుగు వాడే. అలాగే 1980 లో ఈ అవార్డు అందుకొన్న నటుడు పైడి జయరాజ్ కూడా మన తెలుగు వాడే. ఇవండీ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా విశేషాలు.

One Response