Menu

ఒరు చెరు పుంచిరి – నా అభిప్రాయాలు

ఈ సినిమా గురించి ఇదివరలోనే నవతరంగంలో రెండుసార్లు రాసారు. కానీ, నేను చెప్పుకోవాల్సింది కూడా కొంత ఉందని… ఈ సినిమా మన తెలుగు కథ “మిథునం” ఆధారంగా తీసారు. ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకుడు. మిథునం కథ నేను చదివి కొన్నాళ్ళైంది. కనుక, వాక్యాలు అవీ యథాతథంగా గుర్తు లేవు. దాని వల్లనే కాబోలు, ఏ విధమైన ప్రిజుడిస్ లేకుండా ఈ సినిమా చూడగలిగాను అని నాకు అనిపించింది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నవతరంగం తెరిచి ఈ సినిమా గురించి వచ్చిన వ్యాసాలు చూసాను. వాటి కింద వచ్చిన వ్యాఖ్యలు కూడా చూసాను. మళయాళ చిత్రం చూసాక దాని గురించి బ్లాగుల్లో మలయాళీలు రాసుకున్న ఆంగ్ల రీవ్యూలు కూడా కొన్ని చదివాను. అంతా అయ్యాక, నాకు అనిపించినది ఇదీ.

౧) ఈ సినిమా ని ఒక సినిమాగా చూడాలనీ, మిథునం కథ తో పోలిస్తే కొంచెం నిరాశ పడతారనీ. మనం మిథునం లో నుడికారం, సంభాషణలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సినిమా చూస్తే, సినిమా మనకి చప్పగా అనిపిస్తుంది(obviously!). ఇక్కడ దర్శకుడు మిథునం కథని తీసుకుని, మళయాళ జీవితాలకి అనుగుణంగా మార్చడమే కాక, ఒక సినిమా అంత నిడివి వచ్చేలా చేసేందుకు కొన్ని దృశ్యాలు అవీ జోడించాడు అన్న విషయం మనం గమనించుకోవాలి అన్న విషయం అనిపించింది.

౨) నాకు మలయాళం రాదు. ఈ సినిమాకి యూట్యూబ్ వీడియోల్లో సబ్-టైటిల్స్ సరిగా పెట్టలేదు. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ, ఆ డైలాగులూ అవీ రాసిన పద్ధతి ఎంతో నేటివిటీ ఉన్నట్లు తోచింది. అందునా, ఆంగ్ల పదాల వాడుక చాలా తక్కువగా ఉన్నందుకేమో, నాకు అర్థం కాకపోయినా, ఆ డైలాగులు వింటూ ఉండడం మహా ముచ్చటేసింది. సమయం గడిచే కొద్దీ, కొంచెం శాతం మాటలు అర్థమయ్యాయి (వాక్యాలు కావు!).  ఇల్లు, మనుషులు, మాటలు, వంటలు (అవును, ఇందులోనూ వంటలే! హీహీ) అన్నింటిలోనూ ప్రస్ఫుటంగా కనబడ్డ ఈ మళయాళ నేటివిటీ నాకు ఈ సినిమాలో అన్నింటికంటే నచ్చిన అంశం.

౩) నటులు: ప్రధాన పాత్రధారులిద్దరూ ఆట్టే శ్రమపడకుండా ఆయా పాత్రలకి జీవం పోశారు అనిపించింది. అలాగే, ఒక్కోచోట వీళ్ళని క్లోజ్-అప్ లో చూపించినపుడు, ముఖ్యంగా అమ్మాల్కుట్టీ గారి కళ్ళలో కురుప్పు గారిపై (అవి రెండూ పాత్రల పేర్లు!) ఎంత అభిమానం పలికిన్దనుకున్నారూ! నాకైతే నిజంగానే నేనక్కడ ఆ కణ్ణన్ అనే పిల్లవాడి స్థానంలో ఉంది వాళ్ళిద్దర్నీ చూస్తున్నట్లు అనిపించింది. ఆవిడ ఆయన కొబ్బరి తినేస్తాడని పైకి ఎక్కించేసి, నిచ్చెన తీసేసిన సన్నివేశంలో ఆయన భలే చేసాడు. 🙂 అదోక్కటని కాదు కానీ, మామూలుగానే నాకు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చింది.

౪) నేను ఇలాగే, దాదాపు ఇలాగే ఉండే వృద్ధ దంపతులని చాలా దగ్గరగా చూసాను. కనుక, వీళ్ళని చూస్తున్నంతసేపు నాకు అర్జెంటుగా వాళ్లకి కాల్ చేయాలి అనిపిస్తూ ఉండింది (అంత అర్థరాత్రి పూట ఎలా కాల్ చేస్తాం? అన్న విచక్షణ నన్ను ఆపింది). అంతలా నన్ను ప్రభావితం చేసింది అంటే, నా దృష్టిలో ఇది మంచి సినిమానే.

౫) కురుప్పు గారు పర్ఫెక్ట్ మనిషి అన్నట్లు చూపించారు….అది నాక్కాస్త అసహజంగా అనిపించింది. ముఖ్యంగా, ఆ మనవరాలి పెళ్లి కథ ఆయన పాత్ర ఎలివేట్ చేసేందుకే చేర్చారు అని అనుమానం కలిగింది. అంటే, మనుషులన్నాక ఏదో ఒక లోపం ఉండాలి కదా. ఇలా వాళ్ళెం చేసినా సరిగ్గానే చేస్తారు అన్నట్లు చూపిస్తే ఎలా? అని నాలోని అనుమానపు ప్రాణికి సందేహం కలగానే కలిగింది కానీ, ఇది బయోపిక్ కాదు కనుక, నేను ఇంత అలోచిన్చనక్కర్లేదేమో.  🙂

నేనాట్టే మళయాళ సినిమాలు చూడలేదు కానీ, మామూలుగా, సినిమాగా చూసేందుకు నాకు ఈ సినిమా చాలా బాగుంది. ఇందాకే అన్నట్లు, ఇలాంటి దంపతులని దగ్గరగా చూసినందుకేమో, డైలాగులు అవీ కూడా చాలా సహజంగా అనిపించాయి నాకు. ఎక్కువ మెలోడ్రామా అదీ లేకుండా, సింపుల్ గా బాగుంది. కనుక – నా అభిప్రాయంలో, ఒక మళయాళ సినిమాగా చూస్తె, ఈ సినిమా సహజంగా, పూర్తి మలయాళీ నేటివిటీ తో, చక్కగా ఉంది అనిపించింది. ఒక తెలుగు కథను తీసుకుని, ఇంత చక్కగా మలయాళం కథగా మలుచుకున్నందుకు నాకు వాసుదేవన్ నాయర్ గారిపై కుతూహలం కలిగింది. ఆయన తక్కిన సినిమాలు ఎవన్నా దొరికితే చూడాలి అనుకుంటున్నాను.

2 Comments
  1. naresh nunna September 18, 2011 /
  2. రవి September 21, 2011 /