Menu

కె.విశ్వనాథుని చల్లని సినీ వెన్నెల-సిరివెన్నెల

ప్రపంచంలో ఎక్కడైన సరే మనిషిలో ఉన్న నిజమైన జీవ కళ బయటికి రావాలంటే ముందుగా యోగం అంటూ వుండాలి ఆ తరువాత దానికి తగ్గట్టుగానే ఆ కళ ను బయటికి తీసుకురావడానికి సరైన స్పందన కలగాలి.చాలా సార్లు ఆ స్పందన కలిగించే వస్తువు ప్రకృతిగాని, ఆ ప్రకృతికి పర్యాయమైన స్త్రీ గాని అవుతూవుంటుంది.వీటిచేత స్పందన కలిగిన హృదయంతో తమలోని కళని బయటికి తీసురాగలిగిన వాళ్ళు సృస్టి రహస్యం తెలుసుకున్నవారై ప్రకృతిలో ఐక్యమవుతూ వారి జన్మని సార్ధకం చేసుకుంటారు మనబోటిగాళ్ళ జీవితాన్ని సార్ధకం చేస్తారు.ఆటువంటి ఒక వ్యక్తి కథే ఈ సిరివెన్నెల.

కె.విశ్వనాథ్ సినిమాల్లో చాలమందికి సంగీత ,నాట్యపరమైన విషయాలే ఎక్కువగా కనబడుతూ వుంటయి.నాకు మాత్రం చాల చిత్రాల్లో అద్భుతమైన ప్రేమ కథే కనబడుతుంది.ఫ్రేమ అనె పాపనాశినిలో తడిసి పునీతమైన జీవితాలే కనబడతాయి. అది ఒక సిరివెన్నెల కావచ్చు,ఒక స్వర్ణకమలం కావచ్చు లేదా ఒక సాగర సంగమం కావచ్చు.అటువంటి కథలు మన మనసుల్ని స్పృశిస్తాయి, తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రాన నిలబెడతాయి.

కథ విషయానికి వస్తే హరిప్రసాద్ అనే ప్రముఖ సంగీత విద్వాంసుడు అతని స్నేహితుడి వివాహానికి తన సొంత వూరు రావడంతో మొదలవుతుంది.అప్పుడే అతనికి సుభాషిని అనే ఆమె పరిచయమవుతుంది.ఇతను రూపం లేని వేణుగానమైతే ఆమె పలుకు లేని చిత్తరువు.ఆ మౌన హృదయంతో ఈ విద్వాంసుణ్ణి,చూపులు లేని అతని నేత్రాలని సూర్యచంద్రులుగా,ఉచ్వాస నిస్వాసల్ని ఓంకారనాదం గా ఙ్ఞా ననేత్రం కలిగిన యోగిలా ఆరాధిస్తూవుంటుంది. కాని అతని మనస్సు వేరు.అతని చీకటి కళ్ళకి వెలుగు నిచ్చిన జ్యోతి వేరు.ఇతని గాలి పాటని గాంధర్వ గానం చేసి,ఈ నేల రాలిన పువ్వుని తన ఒడిలోనికి తీసుకుని పూజపుష్పం చేసిన దేవత వేరొకరు.ఆమె జ్యొతిర్మయి.ఇతని రాగం తానం ,పల్లవి మొత్తానికి ఇతని జీవితం.ఇతని దృష్టిలో ఆమెది “మనసునకొలువై మమతల నెలవై వెలసిన దేవత రూపం,గుడిలో దేవత ప్రతిరూపం” అటువంటి దేవత అతని జీవితాంతం అతనిపక్కనేవుంటే…..అతని కోరిక కూడా అదే.అతని కోరిక సుభాషిణి ద్వార ఆమెకు తెలుస్తుంది. కాని నాగురించి నా కులగోత్రాలగురించి,నా పుట్టుపూర్వోత్తరాలగురించి నీకేమి తెలుసని ప్రశ్నిస్తుంది.కోయిల గొంతు పెగలడానికి కారణమైన వసంతపు కులగోత్రాలు కోయిలకు అవసరం లేదు,మేఘం పుట్టుపూర్వోత్తరాలు నెమలికి అవసరం లేదు వాటిది జన్మతః యేర్పడిన బంధం అంటాడు.తిరుగులేని సమాధానం.కాని తనని ఇంతలా ఆరాధించే వ్యక్తితో జీవితం పంచుకోవడానికి తనకున్న అర్హతేమిటి,తను అతను అనుకుంటున్నట్టు దేవత కాదు,కనీసం మామూలు స్త్రీ కూడా కాదు,ఇతరుల సుఖం కోసం తన శరీర్ ఆన్ని పరిచే వేశ్య.ఈ విషయం ఆమెని తొలుస్తూవుంటుంది. కాని అతనితో నేను పూజగదిలోని దైవత్వాన్ని కాదు,పడకగదిలోని నగ్నత్వాన్ని అని చెప్పలేదు,అలా అని అతనిని మోసం చేయనూలేదు.మనసులోదైవత్వం వున్నప్పుడ్డు శరీర మలినాలు ఆత్మని మలినపరచలేవు.చివరి ఆమె తనకి తానే తన కథకి ముగింపు రాసుకుంటుంది.ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం హరిప్రసాద్ కి తెలియకూడదని,తను పెళ్ళై అత్తవారింటికి వెళ్తున్నట్టుగానే అతను భావించాలని దానికి అందరూ సహకరించాలని కోరుతుంది.అందరూ అలాగే ప్రయత్నిస్తారు కాని చూపులేని అతనికి మనోనేత్రన్ని ప్రసాదించిన దేవత దైవలోకాలకి తరలిపోతుంటే అతని మనసు ఎందుకు గుడ్డిదవుతుంది?చివరకు తనకి పెళ్ళిలో ఇచ్చిన అక్షతలని స్మశానలో ఆమె చితి పై వేసి,సుభాషిణితో అక్కడ నుండి నిష్క్రమించడంతో చిత్రం ముగుస్తుంది.

హరిప్రసాద్ గా సర్వదమన్ బెనర్జీ,జ్యొతిర్మయి గా మున్ మున్ సేన్,సుభాషిణి గా సుహాసిని నటించారు.కె.వి.మహదెవన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మరో ప్లస్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం.ఆకెళ్ళ-సాయినాథ్ మాటలు బాగున్నాయి(స్వర్ణకమలానికి కూడా వీరే మాటలు, కె.విశ్వనాథ్ సినిమాలకి కాకుండా వీరు వేరే యే ఇతర చిత్రాలకైనా పనిచేసారేమో నాకు తెలియదు).ఇంక సాహిత్యం గురించి చెప్పలంటే, ఈ సినిమాలో పాటల సాహిత్యాన్ని విశ్లేషించే అర్హత నాకు లేదు.సిరివెన్నెల సీతారామశాస్త్రి విరించి అయి విరచించిన పాటలు కావ్యస్తయిలో వున్నయి.ఆయనకున్న ప్రత్యేక శైలిలో సందర్భానికితగ్గట్టుగా ప్రకృతిని పాటల్లో ప్రతిష్టిస్తూ జీవంతో సాగుతాయి.

మచ్చుకి కొన్ని :
1.చలువ చందనము పూయ చందమామ రావే
జాజి పూల తావి నీయ జాబిల్లి రావే
కలువ చెలియ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోన గోగు పూలు తేవే

2.మనసున కొలువై మమతలనెలవై
వెలసిన దేవత దేరూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతి రూపం నీ రూపం అపురూపం.
3.తీపి రాగాల కొకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేమి కోరెది
కరకు గర్జనలమేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేమి అడిగేది?
ఇలా చెప్పుకుంటూపోతే మళ్ళీ ఇంకొ పెద్దవ్యాసం అవుతుంది(అవకాశం వుంటే తప్పకుండా రాస్తాను,సిరివెన్నెల రాసిన ప్రేమ గీతాల మీద కూడా వ్యాసాలు రాద్దమనుకుంటున్నను,చూద్దాం!)
కె.విశ్వనాథ్ తెలుగు సినిమా మెళ్ళొవెసిన మరో మణిహారం ఈ సినిమా,అందరూ చూసి డివిడి లైబ్రరిలో దాచుకోవల్సిన చిత్రం

-జ్వాల

3 Comments
  1. jwaala September 11, 2011 /
  2. శ్రీరామ్ వేలమూరి September 12, 2011 /