ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది సైలెన్స్”

p15silence

(ఇది సమీక్ష కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు వచ్చిన రకరకాల ఆలోచనలను, సందేహాలను, బహిరంగ పరుస్తున్నాను. అంతే!)
Movie: The Silence
Year: 1963
Language: Swedish
Director: Ingmar Bergman
Cast: Ingrid Thulin, Gunnel Lindbolm, Jörgen Lindström
కథా సారాంశం : సినిమా లో ప్రధానంగా మూడు పాత్రలు. ఒక అక్క, ఆమె చెల్లెలు, చెల్లెలి కొడుకు. వీరు ముగ్గురూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఊరిలోని ఒక హోటల్లో దిగుతారు. అక్కకి ఏదో జబ్బు. ఆవిడ వ్రుత్తి రిత్యా అనువాదకురాలు. చెల్లి అభిప్రాయంలో – తనపై అజమాయిషీ చెలాయించే వ్యక్తి. అక్క మీకు క్రానిక్ డిప్రెషన్ పేషంట్ లా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకో గానీ, ఈ అక్క చెల్లెళ్ళ మధ్య మరీ అంత సఖ్యత ఉండదు. సరే, అక్కకి ఆరోగ్య సమస్యలు కదా, కనుక, చాలా మట్టుకు మంచం మీదే ఉన్నా, ఓపికున్నప్పుడు రాస్కుంటూ ఉంటుంది. ఆ పిల్లవాడు మామూలుగా ఆ ఈడు వారి లాగానే, అటూ ఇటూ తిరుగుతూ, ఆడుకుంటూ ఉంటాడు. చెల్లెలు కాలక్షేపానికి అని బయటకి వెళ్లి, ఒక ఆగంతకుడితో “వన్ నైట్ స్టాండ్” లోకి వెళ్తుంది. అక్క అది గ్రహించి వారించేందుకు ప్రయత్నిస్తే, తనలో అప్పటి దాక అక్కపై పెరుగుతూ వచ్చిన ద్వేషమంతా కట్టలు తెంచుకుని బయటపెడుతుంది. దిగులుగా అక్క మంచం పడితే, కొడుకును తీసుకుని చెల్లి తమ ఊరికి ప్రయాణం కడుతుంది. అక్క అక్కడ ఒంటరిగా మరణించినట్లు మనం భావించేలా దర్శకుడు చేస్తాడు. స్థూలంగా ఇదీ కథ.
ఇక, నేను గమనించిన (నచ్చిన, నచ్చని) కొన్ని అంశాలు :

౧) భరించలేనంత విశృంఖలత్వం – అనవసరమైన చోట్ల..అది కూడా.
* ఉదాహరణకి, చెల్లెలి పాత్రా, ఆమె కొడుకు నిద్రపోతున్న దృశ్యం – ఎంత వేడిగా ఉన్నా, బట్టలు విప్పేసి పడుకోవడం విడ్డూరం. పడుకుంటే పడుకున్నారు గానీ, మనకి నిజంగానే వాళ్ళు అలా ఉన్నట్లు అన్నిసార్లు చూపడం అనవసరం అనిపించింది.
* అలాగే, చెల్లెలి పాత్ర స్నానం చేసే దృశ్యం గానీ, అక్క పాత్ర నిద్రపోయే ముందు చేసే పనులు గానీ – ఇలాంటివెన్నో దృశ్యాలు అంత విడమర్చి చూపడం అనవసరం కాదా? అనిపించింది.

బహుసా, నేను పెరిగిన వాతావరణం వల్లనేమో కానీ, ఒక పట్టాన ఈ చిత్రీకరణను అంగీకరించలేకపోయాను. కథకి అవసరమైతే ఎలాగో నచ్చజేప్పుకోవచ్చు కానీ, ఆ దృశ్యాలు లేకపోయినా మనకి కథాగమనంలో నష్టం లేదు అనిపిస్తే, మరి విశృంఖలత్వం ఎందుకు? ఇంతకీ, ఈ దృశ్యాల ద్వారా కూడా ఏదన్నా ప్రతీకలని చూపిస్తున్నదేమో దర్శకుడు – అది నాకు అర్థం కాలేదు. అసలీ సినిమాలకి అప్పటి ప్రజల స్పందన ఎలా ఉండింది? అన్న సందేహం కూడా ఉంది నాకు. అందుకే వికీ పేజీ చూసాక విషయం అర్థమైంది. నేను చూసినది సెన్సార్ కత్తిరింపులు లేని వర్షన్ లాగుంది. ఎందుకంటే, మొదటిసారి స్వీడెన్లో చూపిన వర్షన్ చాలా వివాదాస్పదమైతే దాని తర్వాత కొన్ని దృశ్యాలు కత్తిరించి విడుదల చేసారంట బయట. కానీ, కత్తిరించినవి అని రాసిన దృశ్యాలు నేను చూసిన వర్షన్ లో ఉన్నాయి మరి! అయితే, ఈ విశృంఖలత ని… బెర్గ్మాన్ “ఓపెన్ నెస్” అన్నారట. కాబోలు!

౨) పిల్లాడితో పెద్ద పాత్రల సంబంధాలు: ఆ కాలంలో స్వీడెన్ వంటి దేశాల్లో పిల్లలను పట్టించుకోకుండా తిరగడం మామూలు సంగతా? అని ఒక సందేహం. సినిమా మొత్తంలో చాలా చోట్ల, వీళ్ళ ధోరణి లో వీళ్ళు ఉన్నారు గానీ, పిల్లవాడిని గురించి పట్టించుకోరేం? అనిపించింది నాకు. చెల్లెలు బయటకు వెళ్తుంది-అక్క పడుకుని ఉంటుంది. ఎవరూ పిల్లవాడికి వాళ్ళ అమ్మ బయటికి వెళ్తోంది అన్న సూచన ఇవ్వరు. అలాగే, వాళ్ళ అమ్మ బట్టలు తీసేసి పడుకుని ఉంటుంది. వీడికి మెలుకువ రాగానే, వీడు బట్టలేస్కుని తలుపు తీస్కుని, హోటల్లో కారిడార్లలో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడా ఆ తల్లి లేచాక కూడా, పిల్లాడు ఎక్కడ? అని అనుకున్నట్లు చూపించరు. ఒక పక్క పిల్లవాడు అక్కడే ఉండగానే, అదే హోటల్లో మరో గదిలో వాళ్ళమ్మ మరొకతనితో గడుపుతుంది. అది వాడు చూసాడు అన్న విషయం ఆమెకి తెలియదు. కొంతలో కొంత అక్కకి-ఆ అబ్బాయికే మాములు సంబంధాలు ఉన్నట్లు అనిపించింది. నాకు ఇదంతా కాస్త కొత్తగా అనిపించింది. వీటి దేనికీ సమాధానం లేకపోవడమే – “సైలెన్స్” కాబోలు!
౩)ఇంగ్రిడ్ తులిన్: ఈ కథలో అక్క పాత్రధారి. అబ్బ! నాకు నిజంగానే ఆ మనిషికి క్రానిక్ డిప్రెషన్ వంటిది ఏదైనా ఉందేమో అనిపించింది. అద్భుతంగా నటించింది. ఇంతలా నన్ను ఒక మనిషి నటన కట్టిపడేసిన దాఖలాలు లేవు కనీసం గత రెండు మూడేళ్ళలో. అసలుకి ఏ సినిమానీ చూడ్డం లేదు ఈమధ్య. అలాంటిది, పైన చెప్పిన విశృంఖలతతో కూడా సినిమా పూర్తిగా చూసానంటే, బెర్గ్మాన్ తో పాటు తులిన్ కూడా ప్రధాన కారణం. అంత సహజంగా ఆవిడ భావోద్వేగాలు మారుతూ ఉంటే, “స్పెల్బౌండ్” అవడం అంటే ఏమిటో, తెలిసొచ్చింది.౪) బెర్గ్మాన్ ఎంచుకునే (రాసుకునే) కథలంటే నాకు చాలా కుతూహలం. ఎందుకంటే, ఇప్పటికి చూసిన మూడు సినిమాలు (ఇది కాకుండా) కూడా, నా దృష్టిలో దృశ్యీకరణ చేసి చూపడానికి చాలా క్లిష్టమైనవి. మానవోద్వేగాల, మానసిక స్థితుల మధ్య సంఘర్షణ – ఇప్పటివరకు చూసిన ఇతని సినిమాల్లో ప్రధానాంశం పోషించాయి. అంత అద్భుతంగా చూపడానికి బెర్గ్మాన్ కు ప్రతిసారీ మంచి నటులు దొరికారు – అది బహుసా మన అదృష్టం ఏమో. సినిమా అంటే – కథ, కథనం, నటన – మూడింటి మధ్యా ఉండే ఈక్వేషన్ ఏదో అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. బెర్గ్మాన్ సినిమా చూస్తె, అదే నిజం అనిపిస్తుంది.
౫) ఫోటోగ్రఫీ, నేపథ్యం లో అక్కడక్కడా వినిపించే సంగీతం, బోలెడు చోట్ల “వినబడే” మౌనం…అద్భుతంగా ఉన్నాయి.కానీ, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి : రెండోసారి చూసే సాహసం చేయలేనేమో. మొదటగా – ఈయన సినిమా చూడాలంటే, ఓపిక కావాలి. ఆపై ఆ తీవ్రత తట్టుకునే శక్తి ఉండాలి అని అర్థమయ్యాక, మళ్ళీ మళ్ళీ చూసే సాహసం ఎలా చెయ్యగలను? పైగా, సినిమా మొత్తం లో రకరకాల భాషలు వచ్చి పోతూ ఉంటాయి. ప్రధాన పాత్రలు మాట్లాడుకునే భాష ఒకటి. హోటల్ లో ఉండే మరుగుజ్జులు మాట్లాడే భాష ఒకటి. హోటల్ రూం సర్వీస్ అయన ఇంకోటి మాట్లాడుతున్నాడు లాగుంది. మధ్యలో ఇంగ్లీషులో ఒకట్రెండు వాక్యాలు, సైగలతో సంభాషణలు : ఇలా ఇన్ని రకాల సంభాషణలు తట్టుకునే ఓపిక కూడా ఉండాలి (అర్థం కూడా కాదు – సబ్టైటిల్స్ లేవు ఆ ఇతర భాష సంభాషణలకి!)మొత్తానికి, చూసినంత సేపు, కట్టిపడేసిన సినిమా. చూసాక కూడా, వెంటాడే తరహా సినిమా. మీకు ఓపిక ఉంది అని నమ్మితే, తప్పకుండా చూడండి.బెర్గ్మాన్ రాసిన కథలు గానీ, ఆయన సినిమాలకి రాస్కున్న స్క్రిప్టులు గానీ ఆన్లైన్ లో ఎక్కడన్నా దొరికే వీలుంటే ఇక్కడో వ్యాఖ్య రాయండి.

మూడేళ్ళ క్రితం నవతరంగం లోనే మూడు బెర్గ్మాన్ సినిమాల గురించి నేను రాసిన వ్యాసం:http://navatarangam.com/2008/09/3-bergman-movies/

ఈ “సైలెన్స్” లో దృశ్యాల గురించి, వాటిలోని ప్రతీకల గురించి కొంతవరకు వికీ పేజీలో రాసారు. :http://en.wikipedia.org/wiki/The_Silence_%281963_film%29

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

4 Comments to “ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది సైలెన్స్””

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories