Menu

కనుడు … కనుడు రామాయణగాథ

శ్రీరామరాజ్యం’…

ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే వినిపిస్తోంది. బాపు-రమణల కాంబినేషన్‌లో చివరి చిత్రం కావడం, బాలకృష్ణ-నయనతార సీతారాములుగా నటించడం…ఇళయరాజా స్వరాలందిస్తున్న తొలి పౌరాణిక సినిమా కావడం వంటి ఎన్నో కారణాలు ఈ సినిమాను ఇప్పుడు హాట్ టాపిక్‌గా మార్చాయి. అంతకన్నా మించి తెలుగులో దాదాపు 15 ఏళ్ల తర్వాత 1996 నాటి శ్రీకృష్ణార్జున విజయం తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రంగా కూడా ఈ సినిమా ఆసక్తిని సృష్టిస్తోంది.

ఇదే సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో ఈ సెప్టెంబర్ 15తో 80 ఏళ్లు నిండినాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఆ కోణంనుంచి ఆలోచిస్తే ఎనిమిది దశాబ్దాల తెలుగు సినీ ప్రస్థానానికి, లవకుశల కథతో కూడిన ఉత్తరరామ చరిత్రకి ఎంతో అవినాభావ సంబంధం ఉందని అర్ధం అవుతుంది. కాకతాళీయంగా అయినా ఈ కథ తెలుగు సినిమా గమనంలో కీలకమైన మలుపులకు కారణమైన స్టోరీగా అనిపిస్తుంది. ఆ లెక్కన ఇప్పటివరకు ‘లవకుశ’ కథతో మన తెలుగులో నాలుగు సినిమాలు నిర్మాణమయ్యాయి. అవే లవకుశ (1934), సీత అనబడే లవకుశ (1960), లవకుశ (1963), శ్రీరామరాజ్యం! ఈ నాలుగు సినిమాలు తెలుగు సినిమా 80 ఏళ్ల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన సినిమాలుగా కొంచెం తరచి చూస్తే అవగతం కాకమానదు. అదెలాగో చూద్దాం…

లవకుశ 1934…

తెలుగు సినిమా 1931లో విడుదలైన ‘్భక్తప్రహ్లాద’తో ఊపిరి పోసుకుంది. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు నాటకం-తోలుబొమ్మలాట వంటి సంప్రదాయ వినోద సాధనాలకు అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. అంతేకాక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నిత్య జీవితంలో విడదీయరాని అంతర్భాగం అయింది. ‘గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్’ అన్నట్లు, తొలిసినిమా జనాలకు నచ్చింది కనుకే ఇనే్నళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ భారతదేశంలో రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా గుర్తింపు సాధించింది.

అలా పౌరాణికాలు, ఇతిహాస గాధలతో సినిమాలు నిర్మాణమవుతున్న తొలినాళ్లలో భక్తప్రహ్లాద తర్వాత మూడేళ్లకు విడుదలైన సినిమా ‘లవకుశ’! 1934 ఫిబ్రవరి 9న వచ్చిన ఈ సినిమాని ఈస్టిండియా ఫిలిం కంపెనీ బ్యానర్‌పై తెలుగేతరుడైన ఉత్తరాది నిర్మాత మోతీలాల్ చమ్రియా నిర్మించడం విశేషం! అప్పట్లో కె.సుబ్రహ్మణ్య శాస్ర్తీ రాసిన ‘లవకుశ’ నాటకం ఆధారంగా సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈ సినిమాను తీశారు. అయితే ఒక హిందీ నిర్మాత తెలుగులో సినిమాని తీయడం అనే ధోరణికి ఇదే బలమైన పునాదులను వేసింది. దీనివెనక ఒక కథ ఉంది. అదేంటంటే చమ్రియా మొదట హిందీలో ‘సీత’ టైటిల్‌తో లవకుశల కథను తెరకెక్కించారు. పృధ్వీరాజ్ కపూర్ శ్రీరాముడిగా, దుర్గ్భాటే సీతగా (తర్వాత ఇద్దరూ దాదాఫాల్కే అవార్డు సాధించారు) నటించిన ఈ సినిమా హిందీలో సూపర్‌హిట్ అయింది. ఇదే సినిమాని ఆయనే తెలుగులో ఇక్కడి తారాగణంతో పునర్నిర్మించారు. ఓ భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంత ట్రెండ్‌గా మారిన ఈ ‘రీమేక్ కల్చర్’కు ‘ట్రెండ్ సెట్టర్’గా ఈ సినిమా కొత్తదారులను తెరిచింది. కాగా ఈ సినిమాలో శ్రీరాముడిగా పారుపల్లి సుబ్బారావు, సీతగా శ్రీరంజని, లవుడిగా మాస్టర్ భీమారావు, కుశుడిగా మాస్టర్ మల్లేశ్వర్‌రావు నటించారు. ఈసినిమా మరెన్నో విధాలుగా కూడా తెలుగు సినిమా గమనాన్ని ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాలోని పాటలు పద్యాలను రికార్డులుగా విడుదల చేశారు. వాటికి అపూర్వ ప్రజాదరణ లభించడంతో ఆ తర్వాత సినిమా పాటలను ఎల్‌పి రికార్డులుగా రిలీజ్ చేయడమనే సంప్రదాయం ఊపందుకుంది. అంటే ఇప్పటి ఆడియో రైట్స్ విధానానికి తొలి పునాది ఇక్కడే పడిందన్నమాట!
అలాగే సినిమా హిట్ యొక్క తీవ్రతని తెలియజేయడానికి మన సినీ పరిభాషలో ఓ వాక్యం ఉంది- ‘సినిమాకు బండ్లు కట్టుకుని వచ్చారు’ అనేది! ఈ వాక్యంను తొలిసారి చేసి చూపించిన సినిమా ఈ లవకుశ! దాంతో అప్పటివరకు వేర్వేరు వ్యాపారాలలో వున్న చాలామంది బడా వ్యాపారుల దృష్టి సినీరంగంవైపు మళ్లింది. అలా సినిమాలకు వ్యాపార విలువలు కూడా బాగానే ఉంటుందనే ఇన్‌స్పిరేషన్‌ను ఇచ్చిన సినిమా ఇది.

‘లవకుశ’ సినిమా టెక్నికల్‌గా కూడా తెలుగు సినీ గమనాన్ని ఓ మలుపు తిప్పిందని చెప్పాలి. రీ రికార్డింగ్, డబ్బింగ్ వంటి ప్రయోగాలను మొదటిసారిగా ఈ సినిమాతోనే ఆరంభించారు. ‘సహజ మానవ స్వరమును పోలియుండు మృదు మధుర ధ్వని’ అని ఈ సినిమా పోస్టర్స్‌లో అప్పుడు ప్రచారం చేసుకున్నారు కూడా! ఆ లెక్కన నేటి సినిమాటిక్ ఆడియోగ్రఫీకి, రీరికార్డింగ్ ప్రక్రియలకు తొలిసోపానాన్ని వేసిన సినిమా ఇదే! అంతేకాక సినిమా ధియేటర్ల పరంగాను, ప్రదర్శనపరంగాను కూడా లవకుశ కొత్తదనాన్ని పరిచయం చేసింది..సినిమా హాల్స్‌లో ‘సింగ్‌స్టార్ సింప్లెక్స్ ప్రొజెక్టర్ సిస్టమ్’ ఈ సినిమాతోనే మొదలైంది. ప్రస్తుతం సినిమా డిజిటలైజేషన్ దిశగా వెడుతోంది. కానీ ఇటీవలి కాలం వరకు థియేటర్లలో ఇదే విధానం. దీనికి అనుకూలంగానే సినిమా రీళ్ల ప్రింట్స్ వంటివి అమల్లో ఉన్నాయి. పైగా తెలుగు సినిమా చరిత్రలోనే 365 రోజులు ఆడిన తొలి సినిమా కూడా లవకుశ. జనాదరణ పొందిన సినిమాకున్న స్టామినాను నిరూమించి మిగతా సినిమాలకు ఓ ‘ల్యాండ్‌మార్క్’ను సృష్టించింది.

‘సీత’ అనబడే లవకుశ 1960

తెలుగులో డబ్బింగ్ సినిమాలు 1955 నాటి ‘ఆహుతి’ సినిమాతో మొదలయ్యాయి. అప్పటినుంచీ ఈ 80 ఏళ్ల కాలంలో తెలుగులో స్ట్రయిట్ సినిమాలతోపాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఓ ప్రధానాంశంగా మారాయి. ఇలా డబ్బింగ్ సినిమా ప్రభంజనాలకు తొలి ‘గాలివాన’గా నిలిచిన సినిమా ‘సీత’!

ఈ సినిమాని ఉదయ్ స్ట్టూడియోస్ బ్యానర్‌పై ఎం.కుంచాకో దర్శకత్వంలో తీశారు. మలయాళంలో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో మాటలు పాటలను అనిశెట్టి అందించగా ప్రేమ్‌నజీర్ శ్రీరాముడిగా, కుచలకుమారి సీతగా నటించారు. ఈ సినిమా టైటిల్‌పరంగా రెండు టైటిల్‌ల విధానాన్ని పరిచయం చేసింది. ఐతే ఈ సినిమా ఎన్టీఆర్ లవకుశ సమయంలోనే తమిళ మలయాళ భాషల్లో నిర్మాణాన్ని ప్రారంభించుకుంది. తెలుగు లవకుశ నిర్మాణ జాప్యంవల్ల ఈ డబ్బింగ్ లవకుశ ముందు రిలీజ్ అయింది.

లవకుశ 1963…

1970 దశకం తెలుగు సినీ చరిత్రలో స్వర్ణ యుగానికి కడపటి భాగం! మరో మాటలో చెప్పాలంటే ఓ సంధియుగం. 1931నుండి 1961 వరకు 30 ఏళ్ల కాలం లో వచ్చిన సినిమాల ఫార్ములాలకు ధోరణులకు ఆ తర్వాత వచ్చన సోషల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ సినిమాలకూ మధ్య ఓ ట్రాన్సిషన్ పీరియడ్! ఆ సమయంలో పాత సంప్రదాయాలను కొనసాగిస్తునే నవ్య ఆలోచనలకు, నూతనధోరణులకు ఆహ్వానం పలకాల్సిన చారిత్రక సందర్భం అది! ఇలా రెండు భిన్న టర్నింగ్ పాయింట్‌లకు ‘కనెక్టింగ్ లింగ్’ని ఏర్పరిచి, కథలో సంప్రదాయకతను (పౌరాణిక కథ ద్వారా), టెక్నిక్‌లో ఆధునికత (రంగుల సినిమా)ను మేళవించి అటు పాత తరాన్ని, ఇటు కొత్త తరాన్ని థియేటర్లకు రప్పించిన సినిమాగా లవకుశ ఓ మైల్‌స్టోన్‌ను ఏర్పరిచింది.

లలితా శివజ్యోతి ఫిలింస్ పతాకంపై శంకర్‌రెడ్డి నిర్మాణంలో సదాశివబ్రహ్మం మాటలతో, ఘంటసాల సంగీతంతో వచ్చిన ఈ సినిమా, తెలుగు సినీ చరిత్రలో ‘ఆల్’టైమ్ మాస్టర్‌పీస్‌గా నిలిచింది. గ్రామాల్లోంచి బండ్లు కట్టుకు రావడమనే ప్రజాస్పందనని ఓ ఉద్యమంలా నిజం చేసి చూపించింది. అంతేకాక సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో తెరముందు పూజలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం అనే అనూహ్య అద్భుతానికి సాక్షిగా నిలిచిన సినిమాగా ఓ బెంచ్‌మార్కును నిర్దేశించింది.

తెలుగులో పూర్తిగా కలర్‌లో వచ్చిన తొలి సినిమాగా తెలుగు సినిమా టెక్నిక్‌లో ఆ తర్వాత వచ్చిన సినిమా స్కోప్, డిటిఎస్ వంటి మరెన్నో కొత్త టెక్నాలజీల పరిచయానికి శ్రీకారం చుట్టంది. అప్పుడే కాకుండా ఇప్పటికీ ఏదైనా కొత్త టెక్నిక్‌ను పరిచయం చేయాలంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఒకటికి, పదిసార్లు ఆలోచించి మళ్లీ రిస్కు ఎందుకనే అనుకుని మూస ఫార్ములాతోనే వెళ్లే ధోరణి మన తెలుగు సినిమాది! అలా బ్లాక్ అండ్ వైట్ 35 ఎంఎం అనే మూసని బ్రేక్‌చేయడం అప్పట్లో ఓ సాహసమే! ఆ సాహసాన్ని లవకుశతో చేయగలిగారు. కనుకే ఇప్పటికీ కొత్త ప్రయోగాలు చేయడానికి ఒకింత ఆశ కలుగుతోంది.

కాగా ఎన్టీఆర్-శ్రీరాముడిగా, అంజలీదేవి సీతగా, కాంతారావు లక్ష్మణుడిగా నటించిన ఈ సినిమా, ఆ తర్వాత కొనే్నళ్లపాటు ఎన్టీఆర్-అంజలీదేవి ఎక్కడకు వెళ్లినా వారిని శ్రీ సీతారాములుగా ప్రజలు పూజించడం కొనసాగింది. హీరోవర్షిప్, ఇమేజ్ అని ఇప్పుడు మనం అంటున్న మాటలు. అన్నింటికీ పరాకాష్టస్థాయిని లవకుశ సినిమా తన నటీనటులకు అందించింది. కాగా ఈ సినిమాలో మాస్టర్ సుబ్రహ్మణ్యం లవుడిగా, మాస్టర్ నాగరాజు కుశుడిగా నటించి బాలనటులకు స్టార్ క్రేజ్‌ని తెచ్చారు.

లవకుశ సినిమా దర్శకత్వపరంగా కూడా రికార్డులు సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమాకి దర్శకుడిగా సి.పుల్లయ్య (1934 నాటి తొలి లవకుశకు కూడా ఆయనే) ఒకే కథతో నిర్మాణమైన రెండు సినిమాలకూ దర్శకుడిగా రికార్డు సృష్టించారు. కాగా ఈ సినిమా తండ్రీకొడుకులిద్దరూ దర్శకత్వం చేసిన తొలిసినిమాగా దర్శకత్వ రంగం వంటి క్రియేటివ్ రంగంలో సైతం ‘వారసత్వ సూత్రాన్ని’ ప్రూవ్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. సి.పుల్లయ్య కొడుకైన సి.ఎస్.రావు ఈ సిన్మాలో మేజర్‌పార్టుకి దర్శకత్వం చేశారు.

అలాగే 1959 ఫిబ్రవరి 5న షూటింగ్‌ని మొదలుపెట్టిన ఈ సినిమా సుదీర్ఘ కాలంపాటు నిర్మాణం జరుపుకున్న సినిమాగా మిగిలిపోయింది. నిర్మాతకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులవల్లను, దర్శకుడి అనారోగ్య కారణాల రీత్యాను షూటింగ్‌లు వాయిదాలు పడిపడి చివరికి 1963 మార్చి 29న విడుదలైంది. ఆ తర్వాత లవకుశ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి 500రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా మిగతా సినిమాలకు అందనంత ఎత్తుకు ఎదిగింది. తెలుగు సినిమా 81వ ఏట అడుగుపెడుతున్న ఈ సమయంలో శత దినోత్సవాలనేమాటే కరువైపోయే పరిస్థితి వచ్చింది.

ఈ కథలో అంతగా ఏముంది?

ఎన్ని చెప్పినా ఈ 8 దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా కథల తీరు తెన్నులను గమనిస్తే భారతీయ ఆత్మను, జీవన విలువలను, కుటుంబ అనుబంధాలను హైలెట్ చేసే సినిమాలే జనాదరణ పొందాయని అర్ధమవుతుంది. ఈ కథలన్నింటికీ మూలాలు రామాయణం, మహాభారత కథల్లోనే ఉన్నాయనేది నిర్వివాదాంశం. కాగా లవకుశ వంటి కథలలో దాంపత్యంలోని గొప్పదనం, స్ర్తి పురుష సంబంధాలలోని ఔన్నత్యం, తల్లిదండ్రులు-పిల్లల మధ్య అనుబంధంలోని ఆదర్శం వంటి భావోద్వేగాలెన్నో ఉన్నాయి. వీటికి తోడు విరహం-వేదనలతోపాటు చైల్డ్ సెంటిమెంట్, కరుణరసం కూడా ఉన్నాయి. అందుకే లవకుశ కథతో తెలుగులో ‘ముత్యాలముగ్గు’, దేవుళ్లు వంటి ఎన్నో సోషల్ ఫ్యామిలీ డ్రామాలు కూడా వచ్చి సక్సెస్ అయ్యాయి.
ఇలా తెలుగు సినీ గమనంలో ఎనె్నన్నో మలుపులకు కారణంగా నిలిచిన లవకుశ కథ అదే మ్యూజిక్‌ని ‘శ్రీరామరాజ్యం’లో కూడా రిపీట్ చేస్తుందా అనేది త్వరలోనే తేలిపోతుంది.

కొసమెరుపు

జానపదాన్ని చరిత్రనీ మిక్స్ చేసి వచ్చిన సినిమా ‘మల్లీశ్వరి’! ఈ సినిమా హిట్ అయిన తరువాత విజయ బ్యానర్‌లోనే ‘లవకుశ’ను తీయాలని నాగిరెడ్డి ఆలోచించారు. దర్శకుడు బి.ఎన్.రెడ్డిని దర్శకత్వానికి ఒప్పించడమే కాక కథా రచనను పాలగుమ్మి పద్మరాజుతో పూర్తి చేయించారు కూడా. కానీ ఈ సినిమా తెరకెక్కలేదు. ఆ స్క్రిప్ట్ నాగిరెడ్డి మిత్రుడైన చక్రపాణికి అంతగా నచ్చలేదు. ఒకవేళ అన్నీ కుదిరి ఈ ‘లవకుశ’ కూడా వస్తే మరే వెలుగులు సృష్టించేదో!

2 Comments
  1. Dev Mannemela September 24, 2011 /
  2. రామ September 30, 2011 /