Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న సినిమాలను సాధారణంగా అవార్డు సినిమాలని అంటుంటారు. అలాంటి అవార్డు సినిమాలనగానే మనకి గుర్తుకొచ్చేవి బెంగాలీ లేదా మళయాళీ సినిమాలే. గత కొన్ని రోజులుగా మనం జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే గత 58 ఏళ్ళగా కొనసాగుతూ వస్తున్న ఈ పురస్కారాల్లో 22 బెంగాలీ సినిమాలు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడ్డాయంటే బెంగాలీ సినిమాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హీరాలాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ చలనచిత్రం తర్వాత అతి కొద్ది కాలంలోనే రుస్తోంజీ ధోతీవాలా దర్శకత్వంలో మొట్టమొదటి పూర్తి నిడివి బెంగాలీ చలనచిత్రం రూపొందించబడింది. ఈ సినిమా పేరు “బిల్వ మంగళ్”.

ఆ తర్వాత అన్ని సినిమా పరిశ్రమల్లాగే ఎన్నో మార్పులు చేర్పులకు గురైన బెంగాలీ చలనచిత్ర పరిశ్రమ చాలా కొద్ది కాలంలోనే భారతదేశం గర్వించదగ్గ సినిమాలు మరియు దర్శకులను అందించింది.

మూడవ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సత్యజితే రే దర్శకత్వంలో వచ్చిన “పథేర్ పాంచాలీ” సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కాకముందే పలు బెంగాలీ సినిమాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులు గెలుచుకుని ఉన్నాయి.

సత్యజిత్ రే రూపొందించిన “పథేర్ పాంచాలీ” ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడడం ఒక విశేషమైతే ఈ సినిమా బెంగాల్ లో కమర్షియల్ గా కూడా భారీ విజయం సాధించడంతో అక్కడి చలనచిత్ర నిర్మాతలకు ఒక కొత్త ఉత్తేజాన్ని అందించింది.

సాధారణంగా అవార్డు సినిమాలంటే కమర్షియల్ గా విజయం సాధించవు అనే భావన ఈ సినిమాతో పటాపంచలైంది. ఈ ఉత్సాహంతోనే సత్యజిత్ రే ఎన్నో ఉత్తమ చిత్రాలను రూపొందించారు. 58 ఏళ్ళ జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలో 30 కి పైగానే అవార్డులు అందుకున్నారు.

“పథేర్ పాంచాలీ” తర్వాత “జల్సాఘర్”, “చారులత”, “ప్రతిధ్వంది”, “సీమబద్ధ”, “సద్గతి” మరియు “అగంతుక్” లాంటి ఎన్నో చిత్రాలకు ఆయన ఈ అవార్డులు అందుకున్నారు.
సత్యజిత్ రే సమకాలీకుడైన మృణాల్ సేన్ కూడా ఎన్నో అత్యుత్తమ చిత్రాలను నిర్మించి జాతీయ చలనచిత్ర పురస్కారాలే కాకుండా పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

మృణాళ్ సేన్ రూపొందించిన చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోతగింది “భువన్ శోమ్”. 1969 లో ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైన ఈ చిత్రం అప్పట్లో భారత సినీ పరిశ్రమలో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు మనం సమాంతర సినిమాగా వ్యవహరిస్తున్న “ఇండియన్ ఆర్ట్ సినిమా లేదా ప్యారలల్ సినిమా” కు నాంది పలికింది ఈ సినిమానే.గతంలో సత్యజిత్ రే రూపొందించిన చాలా సినిమాల్లానే ఈ సినిమాలో కూడా పెద్ద కథేమీ ఉండదు. మన దైనందిన జీవితంలో తారసపడే పాత్రలూ సంఘటనలతో కూడా సినిమాలు నిర్మించి వాటిని కేవలం అవార్డులకే పరిమితం చేయకుండా ప్రేక్షకుల మన్ననలు పొందగలవని నిరూపించిన సినిమా ఇది.ఈ సినిమా తర్వాతే భారతదేశంలో అప్పటి కమర్షియల్ సినిమాకి సమాంతరంగా వాస్తవిక దృక్పధంతో సినిమాలు రావడం మొదలయ్యాయి.ఈ సినిమా తర్వాత మృణాల్ సేన్ మరో ఆరు సినిమాలకు ఉత్తమ దర్శకునిగా మరియు స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు.

సత్యజిత్ రే మరియు మృణాల్ సేన్ ల సమకాలీనులైన తపన్ సిన్హా మరియు బుద్ధదేబ్ దాస్ గుప్తాలు కూడా ఎన్నో ఉత్తమ చలనచిత్రాలను నిర్మించి జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు.ముఖ్యంగా రవీంద్ర నాద్ ఠాగోర్ రచించిన కాబూలీ వాలా అధారంగా నిర్మించిన కాబూలీ వాలా సినిమాకు తపన్ సిన్హా తన మొట్టమొదటి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తపన్ సిన్హా హిందీ లో నిర్మించిన “ఏక్ డాక్టర్ కి మౌత్” సినిమాకి కూడా రెండవ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్నారు. తపన్ సిన్హా రూపొందిన చిత్రాలకి గాను వివిధ విభాగాల్లో మొత్తం 19 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందచేయబడ్డాయి.

తపన్ సిన్హా లాగే బుద్ధదేబ్ దాస్ గుప్తా కూడా బెంగాల్ అందించిన అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. “బాగ్ బహుదూర్” చిత్రంతో ఈయన తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మరో నాలుగు సినిమాలకు తపన్ సిన్హా ఉత్తమ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. అందులో ఈ మధ్యనే “కాల్ పురుష్” సినిమా కూడా ఉంది.

నేటికీ అపర్ణా సేన్, రితూ పర్ణో ఘోశ్, గౌతమ్ ఘోశ్, అనిరుద్ధా రాయ్ చౌదరి లాంటి దర్శకులు బెంగాలీ లో కళాత్మక చిత్రాలను నిర్మిస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *